సబ్ ఫీచర్

‘మనీ’సాక్షిగా మనస్సాక్షి గల్లంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ధనమూల మిదం జగత్’’ అన్న ఒక్క అమృత వాక్కుతో మానవుడు జీవితానందానికి కావాల్సిన నిజమైన రహస్యాన్ని తెలుసుకున్నవాడై పరమశించిపోతూ, ఆ ధనానికై అనుక్షణం తాపత్రయ పడుతూ, ఎన్ని తప్పుడు పనులు చేయడానికైనా, తప్పించుకు తిరగడానికైనా ఏ మాత్రం వెనుకాడడం లేదు.
అంతేకాదు.. ఈ సృష్టిలోని అందాలను ఆకళింపు చేసుకొని, అన్నివేళలా అనుభవించే అదృష్టం మనసున్న మనిషికే సొంతమవుతుందని కూడా తెలుసు. అయితే ఈ మనసులోనే చిక్కు వున్నది. ఈ మనసు తలకాయ లోపల పదిలంగా వుంటుంది. అదే గనుక ఇతని ముఖంలోనో, చేతిపైనో లేదా చెవి దగ్గరో వుంటే ఒహో! ఇతగాడి మనసు వంకర టింకరగా వుందని ముందుగానే అంచనా వేసుకొని, ఆ వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగువేసే అవకాశం వుండేది. అలా లేనందున ఎవడి లక్షణం ఎలాంటిదో తెలుసుకోవాలంటే, ఎన్ని లక్షలు ఖర్చుపెట్టినా తెలుసుకోవడం కష్టం. ఇది మామూలు విషయం కాదు. దీని వల్లనే అనేక అపార్థాలూ, అనర్థాలూ జరుగుతున్నయ్. బాల్యం నుండీ వృద్ధాప్యం దాకా ఇలా వెన్నంటి నట్టేట ముంచుతున్నయ్ వివిధ రకాలైన ఈ అవస్థలన్నీ.
అక్షరాభ్యాసం మటుకు గుళ్ళో అయ్యవారి చేత చేయిస్తారు. ఆ తర్వాత నుండి కానె్వంటులోకి నెట్టడానికి, అక్కడకు వెళ్ళి ఆ ఫీజుల్ని చూసి కొయ్యబారిపోతుంటారు. అయ్యో.. ఇంకా సరిగా మాటలే రాని ఆ పసి కూనలకు అంతంత ఫీజులా? అని ఆ విద్యాసంస్థ యాజమాన్యానికీ అనిపించదు. ఆ తల్లిదండ్రులకూ అనిపించదు. అనిపించినా ఏం చేయగలరు? మరో మార్గం కనిపించదు. ఎందుకంటే తమ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి, విదేశాలకు వెళ్ళి విరివిగా సంపాదించి, ఆ కోట్లన్నీ తమ వాకిట్లో పోయాలనీ, తాము వెనె్నట్లో విహరించాలనీ తలపోస్తారు.
ఆ తర్వాత జరిగే విషయాలు అందుకు భిన్నంగా వుంటయ్. ఈ కూనలే పెద్దయి, కాలేజీలో చేరిన తర్వాత యవ్వనం అంకురించి, యథేచ్ఛగా తమ ఆలోచనల అలజడిలో అల్లకల్లోలమై పోతుంటారు. స్నేహాలు పెంచుకొని, రకరకాల అలవాట్లకు బానిసలై, దాహాలు తీర్చుకోవాలనుకుంటారేగానీ, దీనివల్ల తమ తల్లిదండ్రులనూ, ఇరుకుపొరుగువారినీ, ఇబ్బంది పెడుతున్నామన్న ఆలోచనే వాళ్ళకుండదు. ఏదో రకంగా తెగ సంపాదించాలనీ, జల్సా చేస్తుండాలనీ ఉవ్విళ్ళూరుతుంటారు. దానికోసం ఎంతటి నీచానికైనా వెనుకాడరు. పర్యవసానంగా మానభంగాలూ, హత్యలూ, ఆత్మహత్యలూ, సమాజంలో అలజడులు వంటివాటికి సిద్ధమవుతారు. ఇవన్నీ సమర్ధనీయం కావని తెలిసినా, ఆ డబ్బు జబ్బు నుంచి తప్పించుకోలేరు. అందరినీ గబ్బుపట్టించకుండా వుండలేరు.
వీళ్ళ విషయం ఇలా తగలడితే- ఇక పెద్దలు సరేసరి. అత్యాశకు లోనై లంచం వంటి అనేకానేక అక్రమ సంపాదనలకు లోనై, ఆ సంపాదనంతా ఎలా ఖర్చుపెట్టాలో తెలియక దుర్వ్యసనశీలురై, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. పోనీ, ఈ ఆర్జననంతా తమ అంతిమ ఘడియలలో, లారీలలో లోడుచేసుకొని, తమ వెంట తీసుకెళ్తారా? అంటే అదీ లేదు. పోనీ తమ సంతానానికి అప్పగించి వెళ్తే- సుఖం మాత్రమే తెలిసి, కాయకష్టం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, దానిని విచ్చలవిడిగా పబ్‌లకనీ, పానీయాలకనీ, ఇతర సుఖాలకనీ తగలేస్తారు. ధర్మ కార్యాలకు వినియోగించాలన్న ఆలోచన రానే రాదు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణాన్నిబట్టే వాళ్ళ పర్యావరణం వాళ్ళ ఆవరణలో ప్రవేవిస్తుంటుంది. ఎవరుకాదన్నా అవునన్నా ఇది సత్యం!
రాజకీయాలు గురించి మాట్లాడకుండా వౌనంగా వుండడం ఆరోగ్యకరం! ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడంతోనే సరి. వాళ్ళ మధ్య ఎప్పుడు చూసినా ఎసరు కాగుతూనే వుంటుంది. ప్రజావసరాలను తీర్చడానికి మాత్రమే తామాపదవులలోకి వచ్చామని పాతతరం నాయకులు భావిస్తూ ఆ దిశగా తమ బాధ్యతను నిర్వహిస్తుండేవాళ్ళు. అలాగని ఇప్పుడు లేరని కాదు. సంఖ్యాపరంగా చూస్తే ఏ కొద్దిమందో వుంటారు. వాళ్ళెవరన్న సంగతి ఎప్పటికప్పుడు ప్రజలు పసిగడుతూనే వున్నారు. కానీ, చాలామంది ఈరోజులలో ప్రజాతీర్పునిచ్చి, కూర్చోబెట్టే ఆ కుర్చీలో మరెవరూ కూర్చోకుండా, ముందుగానే తమతమ ఖర్చ్ఫీలను వేసుకోవడానికి పోటీపడుతుంటారు. సీటుకోసం బస్సుల్లో, రైళ్ళలో ఖర్చ్ఫీలను వేస్తున్న చందంగా!
ప్రతి మనిషికీ మనస్సాక్షి అనేది వున్నదన్న సంగతి అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు అందుబాటులో వుండి హెచ్చరిస్తూనే వుంటుంది. దానిని తుపాను హెచ్చరికల కేంద్రంగా ఎప్పుడూ భావించరు. దానిని అస్సలు పట్టించుకోరు. ఏదో ఎప్పుడూ అలాగే ఏడుస్తుంటుందిలే అని సరిపెట్టుకొని, దులబరించుకొని పోతుంటారు. ఈ నిర్లక్ష్యం అనేదే ఎప్పుడో అప్పుడు కొంపముంచుతుందన్న సంగతిని ఏమాత్రం గ్రహించలేరు.
ఒకనాటి మనుషులు చాలావరకు తమ మనస్సాక్షికి భిన్నంగా నడుచుకొనే వారు కాదు. గనుకనే మనశ్శాంతిగా వుండగలిగేవారు. ఇది కలియుగం కాదు. కలగాపులగంగా అందరూ కలిసిపోయిన యుగం. గుంపులు గుంపులుగా చేరి భిన్నభిన్న భావజాలాలలో చిక్కుకొని, గిలగిలా తన్నుకొంటున్నారు. ప్రశాంత వాతావరణానికి అర్థం తెలియక, ఒకరి జుట్టు ఒకరు పీక్కుంటున్నారు. అందుకే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు- కేవలం మనీ సాక్షిగా లేచిపోయిందేమో ఈ మనస్సాక్షి అని. మనస్సాక్షికి సాక్షులు ఎవరూ అక్కర్లేదు.

-షణ్ముఖశ్రీ 88978 53339