సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

713. బూరుగచెట్టు విత్తనములు దానిక్రింద బడవు. అవి గాలిలో కొట్టుకొనిపోయి ఎక్కడనోపడి మొలచును. అటులనే మహాత్ముని బోధలు వాని స్వస్థానమునగాక, దూర దేశమున వ్యక్తమై ప్రకాశించును; దూర దేశీయులే వానిని కీర్తింతురు.
714. దీపము క్రింద నుండునది క్రీనీడయేకాని దీప కాంతిచే చుట్టునున్న వస్తువులు ప్రకాశించుచుండును. అట్లే మహనీయుడైన యాచార్యునకు అతి సమీపముననున్న వారు వాని బోధలను వ్యక్తిత్వమును గ్రహింపజాలరు. దూరముననున్నవారు వాని ప్రభావమును అమానుషశక్తిని జూచి సమ్మోహితులగుచుందురు.
715. వెలుపలి కోఱలు, లోపలి దంతములునని యేనుగునకు రెండువిధములైన పండ్లు ఉండురీతినే శ్రీకృష్ణుడు మొదలగు నవతారమూర్తులు బాహ్యమునకు సామాన్య జనులవలెనే వర్తించుచుండియు, సమస్త కర్మాతీతులై అంతరంగమున బ్రహ్మానందమయులై వెల్గొందుచుందురు.
అవతారములు: భగవంతుడు
716. భగవంతుడు అనంతుడు, అపరిచ్ఛిన్నుడు, సర్వశక్తిమంతుడు. ప్రేమమూలమున తన దివ్యత్వము స్థూలశరీరమును దాల్చి యవతారమూర్తియై మన నడుమ మెలగునటుల ఆతడు నియమింపగలడు. అపుడు భగవదవతారమునుండి ప్రేమ వెల్లువలై ప్రవహించి మనల నావరించును. భగవదవతారము యథార్థమగు సంఘటనము. దీనిని మాటలచే విశదీకరించుట దుర్లభము. ఇయ్యది సాక్షాత్కారమునకు సంబంధించిన సంగతి, జ్ఞాననేత్రముతో అవలోకింపవలసిన విషయము. ఈ తత్త్వము ఋజువుకావలయుననిన, భగవత్సాక్షాత్కారము నొందవలయును, వేఱుమార్గము లేదు. ఉపమానముల మూలమున విషయము కేవలము చూచాయగా దెలుపనగును. ఎవ్వడైనను ఆవుకొమ్ములనో, పాదములనో, తోకనో, పొదుగునో తాకుననుకొనుడు. అది ఆవును తాకుట కాదా? ఐనను మానవులమగు మనకు అందలి ముఖ్యవిషయము పొదుగునుండి లభించు పాలు,- మిగిలిన వానితో మనకు నిమిత్తము లేదు. మనకు గావలసిన భక్తియను పాలు భగవదవతారమూర్తులయొద్ద పుష్కలముగా లభించును.
717. భగవంతుని (తత్త్వమును) పూర్తిగా ఎవరు గ్రహింపగలరు? అందులకు మనము నోచుకొనను లేదు, అది మన విధియునుగాదు. మనము వాని దర్శనభాగ్యము నొందగల్గినచో జాలను,- భగవంతుడొక్కడే సత్యమని స్వానుభవముచే గ్రహింపగల్గిన జాలును. పావన గంగానదికి వచ్చి యొకడు అందలి జలమును తాకుననుకొనుడు. అపుడాతడు తాను గోముఖినుండి గంగాసారము (మూలమునుండి సాగర సంగమము) వఱకును గంగాదర్శన లాభమును గంగాస్పర్శన భాగ్యమును బొందితినని పలుకును గదా!
718. నీవు నారాయణుని వెదకజూచెదవా? నరునందు వెదకుము. మఱియే యితర వుస్తవునందుకంటెను నరునందు వాని దివ్యత్వము ఎక్కువగా వ్యక్తమగుచుండును. ఎవ్వని మానస సరోవరము భగవత్ప్రేమామృతముతో వెల్లివిరియుచుండునో, ఎవ్వడు భగవంతుని యందు నెలకొని వానియందే చర్చించుచు రమించుచుండునో, ఎవ్వడు భగవత్ప్రేమోన్మత్తుడై యొప్పుచుండునో- అట్టివానిని వెదకుము. ఆతడే భగవత్స్వరూపుడు!
719. ఆతడే అవ్యయుడు. శుద్ధబ్రహ్మము; మఱియు నాతడే లీలారూపుడు. వానిలీల ఈశ్వర లీల, దేవలీల, జగల్లీల, నర లీలయునని నాలుగు విధములుగా ప్రకాశించుచున్నది. నరలీలయందే భగవదవతారము సంఘటిల్లగలదు. నరలీల యెట్టిదో తెలియునా? పెద్దమేడ డాబానుండి విరివైన తూముగుండా కడువేగమున నీరు ప్రవహించుట వంటిది.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి