సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపభారముచే క్రుంగియున్న జనసమూహములను వారు భగవత్సన్నిధానమునకు గొనిపోగల్గుదురు.
725. సాధారణ ఋతువులందు నూతి నీరు ఎంతయో కష్టముమీద గాని చేచిక్కదు; వానకాలమున వఱదలు వచ్చినప్పుడో, శ్రమలేకయే ఎక్కడ పట్టిన అక్కడ నీరు లభించును. అటులనే సాధారణముగా భగవంతుడు జనులెంతయో శ్రమపడి జపతపముల నొనర్చిన పిమ్మట కాని ప్రత్యక్షముకాడు. కాని లోకములోనికి అవతారమను వఱద వచ్చునపుడు భగవానుడెల్లడలను దర్శనీయుడగును.
726. ఒక స్థలము చుట్టును చాలయెత్తగు గోడ కలదు. బైటనున్న వారికి అది యెట్టిదో తెలియదు. ఒకసారి నలుగురు నిచ్చెన వేసికొని లోపలనేమున్నదో కనుగొనగోరిరి. మొదటివాడు గోడ చివరకెక్కినంతనే, ‘‘ఆహా! ఆహాహా!!’’అని సంతోషము పట్టజాలక నవ్వుచు లోనికి దుమికెను. రెండవ వాడును గోడ నెక్కినంతనే మొదటివాని వలెనే మహానందముతో నవ్వుచు లోనికి దుమికినాడు. మూడవవాడును అటులనే చేసినాడు. ఇక నాల్గవవాడు గోడనెక్కుసరికి వానికి కట్టెదుట రకరకముల మధుర ఫలములతో నొప్పునొక దివ్య సుందర వనము కాన్పించెను. లోనికి దుమికి వానిననుభవింపవలయునని తీవ్రమైన కోరిక పుట్టినను ఆతడు నిగ్రహించుకొని నిచ్చెనమీదుగా దిగివచ్చి ఆ వన వైభవమును గూర్చి బైటనున్నవారికి దెల్పెను. బ్రహ్మమే ఈ గోడ కవ్వలనున్న దివ్యవనము. దానిని గాంచిన వారెల్ల తమ వ్యక్తిత్వమును మఱచి అందైక్యమొందుటకై గభాలున దుమికెదరు. మహాత్ములును ముక్తులును ఇట్టివారు. కాని బ్రహ్మమును దర్శించియు తమ అపరోక్షానుభూతిని- పరమానందమును- ఇతరులతో గూడ పంచుకొని యనుభవించుటకై నిర్వాణ మహావకాశమును నిరాకరించి సంసార సాగరమున దరిగానని మానవకోటికి తరణోపాయముజూపుటకై మనఃపూర్వకముగా జీవితభారమును వహించునట్టివారు లోక రక్షకులు.
727. బాణసంచున ఒక విధమైన చిచ్చుబుడ్డినుండి ముందు కొంత సేపటివఱకు ఒక విధమైన పూవులును తరువాత మఱియొక విధమైన పూవులును వెలువడుచు, ఇట్లు అనంతవిధమైన పూవులు అందున్నవా యనిపించును. అవతారమూర్తుల విషయము కూడ నిట్టిదే. బాణసంచులో మఱియొక విధమైన చిచ్చుబుడ్డి కొంచెముసేపు కాంతులను విరజిమ్మి అకస్మాత్తుగా ఆఱిపోవును. ఇటులనే సాధారణజీవులు దీర్ఘకాలము సాధనలనొనర్చి సమాధిస్థితిని బొంది మఱల రారు.
728. ప్రశ్న: భగవంతుడు నర రూపమున జన్మింపనేల?
ఉ.మానవకోటికి పరిపూర్ణ దివ్యత్వమును ప్రకటించుటకు. భగవదవతారముల మూలమున నరుడు భగవానునితో సంభాషించి వాని లీలలను ప్రత్యక్షముగా గాంచగలుగును. అవతారమున భగవంతుడు తన యలౌకిక మాధుర్యమును సంపూర్ణముగా అనుభవించునని చెప్పనొప్పును. నీవొక పూవునుబట్టి పీల్చిన యెడల అందు కొంచెము మధువు లభించును. అవతారములలో అంతయు మధువే-మాధుర్యమే- పరమానందమే.
729. అవతారమూర్తులకు అసాధ్యమగున దేమియులేదు. జీవితమందలి మహాకఠిన సమస్యలను- గూఢ విషయములను- సైతము అత్యంత సామాన్య విషయములవలెనే అవలీలగా వారు పసిపిల్లలకు గూడ బోధపడునట్లు పరిష్కరింపగలరు. అవతారమూర్తి జ్ఞాన భాస్కరుడు. వాని దివ్యతేజము తరతరములుగా నిలిచియున్న అజ్ఞానాంధకారమును పటాపంచలుచేసి వేయును.
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
- ఇంకాఉంది