సబ్ ఫీచర్

మానవాళికి మహాశాపం జల సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలమే జీవనాధారం అన్నది నానుడి. కానీ మన దేశంలో నీటి సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరం అవడం, రానున్న కాలంలో త్రాగడానికి గుక్కెడు నీళ్ళుదొరుకుతాయా? అన్న ప్రశ్నకు ‘కాదు’ అనే సమాధానం వస్తోంది. 2040 సంవత్సరానికల్లా త్రాగునీటికి తీవ్ర కరువు ఏర్పడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలకు త్రాగునీటిని అందించడానికి పెనుభారాన్ని మోస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు వెలువరించిన నివేదికలో- ప్రపంచ జనాభాలో 18 శాతం కలిగివున్న భారత్‌లో జలవనరులు నాలుగు శాతం మాత్రమే ఉన్నట్టు, 133 మంది కోట్ల భారతీయులలో 78 శాతం మందికి ప్రభుత్వం సరైన త్రాగునీరు అందించలేకపోతోందనే చేదు నిజాలు వెల్లడించింది. వర్షాభావం, సరైన ప్రణాళికలు లేకపోవడడం, రోజురోజుకూ అనూహ్యంగా పెరిగిపోతున్న జనాభా, జల సంరక్షణ పట్ల బాధ్యతా రాహిత్యంతో నీటి వనరులను ఎడాపెడా వాడెయ్యడం, పట్టణాలలో నియంత్రణ లేకుండా భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడెయ్యడం, ‘వాల్టా’ చట్టానికి తూట్లు పొడిచి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ బోర్లను వేసెయ్యడంతో నీటి ఎద్దడి ఎక్కువౌతోంది.
పర్యావరణానికి హాని కలిగేలా అడవులను విచక్షణారహితంగా నరికెయ్యడం, అభివృద్ధి పేరిట పచ్చదనాన్ని హరించివెయ్యడం వలన వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించి సరిగ్గా వర్షాలు పడడం లేదు. తత్ఫలితంగా ఉపరితల జలవనరులు అయిన నదులు, చెరువులు ఎండిపోవడంతో ప్రజలు త్రాగునీటి కోసం భూగర్భ జలాలను ఆశ్రయించక తప్పడం లేదు. ఎడాపెడా తోడెయ్యడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదకర పరిస్థితులు రావడం నిస్సందేహంగా మానవ తప్పిదమే అని చెప్పవచ్చు. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో దాదాపు అరవై కోట్లమంది కర్షకులు రుతుపవనాల మీద ఆధారపడుతున్నారు. సమయానికి వర్షాలు పడకపోవడం, నీటిని పొదుపుగా వాడుకొని గరిష్ట దిగుబడులను సాధించడం ఎలాగో తెలియకపోవడం, భూగర్భ జలవనరులు అడుగంటిపోవడంతో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. పంటలు పండక, అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరం. గోరుచుట్టుపై రోకలి పోటులా పారిశ్రామిక, గృహవ్యర్థాలతో జలవనరులు కలుషితమై ఉపయోగానికి పనికిరాకుండా పోవడం, కాలుష్య నియంత్రణ మండలి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎంతో విలువైన మంచినీరు వ్యర్థమైపోతోంది.
మన దేశంలో విద్యుత్ ఉత్పాదన చేస్తున్న 400 థర్మల్ విద్యుత్ కేంద్రాలలో 40 శాతం యూనిట్లు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో విద్యుత్ ఉత్పాదనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2030 సంవత్సరానికల్లా 40శాతం విద్యుత్‌ను సౌర, పవన విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పాదన చేస్తామని, దాని ద్వారా వాయు, నీటి కాలుష్యాలను అధిగమిస్తామన్న ప్రభుత్వ ఆశయాలు మాటలకే పరిమితమవడం దురదృష్టకరం. మన దేశంలో భూగర్భ జల నీటిమట్టాలు అసాధారణ స్థాయికి పడిపోవడంతో కొన్ని రాష్ట్రాలలో ప్రజలు త్రాగునీటి కోసం మైళ్ళదూరం నడిచి తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ప్రభుత్వాలలో చలనం కనిపించకపోవడం ప్రజల దౌర్భాగ్యం. ప్రభుత్వాల అలసత్వం, ప్రజలలో జలవనరుల సంరక్షణ పట్ల ధ్యాస, జవాబుదారీతనం లోపించడం చూస్తున్నాం. నదులను, చెరువులను కలుషితం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్న కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంతో మానవాళికి అచిరకాలంలోనే నీటికొరత అనే తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.

-సిహెచ్.ప్రతాప్