సబ్ ఫీచర్

‘బలవంతపు’ భూదానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాణాల విషయంలో పాటించవలసిన నిబంధనలను రూపొందించి 2017 మార్చి 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ జీవో క్రమసంఖ్య 119. ఈ ఉత్తర్వు నిడివి 248 పుటలు. 119 అధ్యాయాలు, 5 అనుబంధాలతో కూడిన ఈ ఉత్తర్వును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీచేసింది. డాక్టరేట్ పట్టా కోసం విశ్వవిద్యాలయాలకు దాఖలు చేసే సిద్ధాంత వ్యాసాల నిడివి కూడా ఈ ఉత్తర్వు నిడివి అంత ఉండడం లేదు. 248 పేజీలున్న ఈ జీవోను పూర్తిగా ఆకళింపు చేసుకోకల్గిన వారు గాని, అమలుచేయ కల్గినవారు గాని లేరంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగులకు, అధికారులకు సైతం పూర్తిగా అర్థం కాని దీనిని సామాన్య ప్రజలు అసలు అర్థం చేసుకోలేరు. ప్రభుత్వ ఉత్తర్వులకు, ఉద్యోగుల కరదీపికలకు గల తేడాను మరిచిపోయి 248 పేజీల ఉత్తర్వును రూపొందించినట్లు కన్పడుతున్నది.
ప్రభుత్వాల విధి విధానాలు, ఉత్తర్వులు, నియమ నిబంధనలు ప్రజలకు మేలుచేసేవిగా ఉండాలి తప్ప, వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేసేవిగా ఉండకూడదు. వ్యాపార సౌలభ్యం మీద దృష్టి తప్ప, సామాన్య ప్రజల సౌలభ్యం మీద దృష్టి లేదు. కఠినతరమైన నిబంధనలు రూపొందించటం వల్ల ఎవరికి లాభం? పైరవీకారులకు, ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న అవినీతిపరులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్న విషయం జగమెరిగిన సత్యం. ఇందువల్ల ప్రభుత్వ కార్యాలయాలు, ఈ-సేవా కేంద్రాల చుట్టూ ప్రజలకు తిరుగుడు ఎక్కువ అవటం తప్ప ఒరిగేదేమీ లేదు.
రాష్ట్రంలో ఇరుకు వీధులు, సందులు, గొందులు లేకుండా చెయ్యాలని ఏలినవారి ఆకాంక్ష! విశాలమైన వీధులలో ప్రతి పట్టణం, పల్లె సింగపూర్‌లా ఉండాలని వారు ఆశించటంలో తప్పేమీ లేదు. ప్రతి ఇంటికి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించటానికి వీలుగా ఇళ్ళు, భవన నిర్మాణాలు చేసినప్పుడు ఎంత జాగా ఖాళీగా వదలాలో ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. 30 అడుగులకు తక్కువ కాకుండా ప్రతి వీధి వెడల్పు ఉండాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిర్దేశించారు. సౌర విద్యుత్తు ఉత్పాదనకు, పర్యావరణ అనుకూల నిర్మాణాలకు ప్రోత్సాహకాలు పొందుపరిచారు. వర్షపునీరు వృథా కాకుండా ఎలా ఒడిసిపట్టాలో, పచ్చదనం పెంపునకు ప్రతి కిలోమీటరుకు ఎన్ని మొక్కలు నాటాలో పేర్కొన్నారు. ఏలికల దూరదృష్టి మెచ్చదగినదే. అయితే- కొత్త నిబంధనలను దృష్టిలో పెట్టుకొని, కనీసం కాగితం మీదైనా ఏ ఒక్క పట్టణానికైనా ప్రణాళికను తయారుచేశారా?
ఈ నిబంధనలు 2017 మార్చి తర్వాత చేపట్టే ప్రతి నిర్మాణానికి, ప్రతి లే-అవుట్‌కు వర్తింపచేశారు. అంతవరకు ఎవరికీ ఏ పేచీ లేదు. ఇళ్లు, భవనాలు నిర్మాణానికి సంబంధించి పాత ఉత్తర్వులు స్థానే ఈ సమగ్ర ఉత్తర్వు అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలను పాత ఇళ్ళకు, పాత లే-అవుట్లకు కూడా వర్తింపచేసే మార్గాన్ని తెలివిగల అధికారులు ఆవిష్కరించారు. అది ఎలాగో చూద్దాం..
ఒక వ్యక్తి 100 చదరపు గజాల స్థలంలో ఎన్నడో ఒక చిన్న యిల్లు కట్టుకొని ఉంటున్నాడనుకొందాం. తన యింటికి కావలసిన అన్ని అనుమతులు సంబంధిత అధికారుల వద్ద తీసుకొని, నిబంధనలు ప్రకారం నాల్గువైపులా ఎంత జాగా ఖాళీగా వదలాలో అంత వదలి, మిగిలిన స్థలంలో ఇల్లుకట్టుకొని ఉంటున్నాడనుకొందాం. సదరు యజమానికి ఇప్పుడు తన యింటి మీద మొదటి అంతస్తు నిర్మాణం చేయాలని అనుకొంటే అందుకు అనుమతి కోసం పురపాలక సంఘానికి వెళ్ళాలి. ఆ అనుమతి అంత తేలికగా రాదు. మొట్టమొదటి ప్రతిబంధకం ఆయన యింటిముందు ఉన్న వీధి వెడల్పు. మొదటి అంతస్తు నిర్మాణానికి వీధి వెడల్పుకు సంబంధం ఏమిటి? అని మనం అడగకూడదు. యింటి ముందు ఉన్న వీధి వెడల్పు 30 అడుగులు ఉంటేనే అనుమతి మంజూరుచేస్తారు. 30 అడుగులు కంటే తక్కువగా ఉంటే అనుమతి రాదు. పై ఉదాహరణలో పేర్కొన్న యజమాని ఉంటున్న వీధి వెడల్పు 10 అడుగులే ఉందనుకొందాం. 10 అడుగులు ఉంటే అనుమతి రాదు. 10 అడుగులు 30 అడుగులు చేస్తేనే అనుమతి వస్తుంది. 10 అడుగులు వెడల్పు ఉన్న వీధి 30 అడుగులకు ఎలా విస్తరిస్తుంది?
దానికి ఓ తేలికైన పరిష్కారాన్ని ప్రభుత్వ పెద్దలు కనిపెట్టారు. యింటి యజమాని తనకున్న స్థలం నుండి 20 అడుగులు ‘కానుక’గా పురపాలక సంఘానికి దానం చేస్తే ఆ యింటి ముందు వీధి వెడల్పు 30 అడుగులుగా పరిగణించి అనుమతి మంజూరుచేస్తారు. 30 అడుగుల వీధి కోసం కావలసిన కొలతలు ఆ వీధి మధ్యనుండి కొలవాలి. అంటే పై యజమాని తనకు ఉన్న స్థలంలో 25 అడుగులు తన యింటి నడిమిమేర పురపాలక సంఘానికి స్వంత ఖర్చుతో రిజిస్ట్రేషను చెయ్యాలి. ఒక యింటి యజమాని అవసరం కొద్దీ అందుకు ఒప్పుకొని తన స్థలంలో కొంత భాగాన్ని యిచ్చినంత మాత్రాన, ఇరుగుపొరుగు యిళ్ళవాళ్ళు యివ్వకపోతే వీధి వెడల్పు ఎలా పెరుగుతుందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. అనుమతి అవసరమైన పౌరుడు ‘స్వచ్ఛందంగా’ ఇస్తాడు. ఆ స్థలం ప్రభుత్వపరం అవుతుంది. భవిష్యత్తులో చేయబోయే వీధుల వెడల్పు కార్యక్రమానికి కావలసిన భూసేకరణకు ‘బోణీ’ ఇలా కొడ్తారన్న మాట! వీధి విస్తరణ చేపట్టినప్పుడు అనుమతికై భూమిని కోల్పోయిన యజమానికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించరు. కాని ఇతర ఇళ్ళ యజమానులకు తగిన పరిహారం చెల్లిస్తారు. పై అంతస్తు నిర్మాణానికి అనుమతి కావలసి వస్తే సర్వ ఖర్చులు పెట్టుకుని తన స్థలంలో కొంత భాగాన్ని పురపాలక సంఘానికి రిజిస్ట్రేషను చేస్తేనే కాగితాలు ముందుకు కదులుతాయి. పై అంతస్తు నిర్మాణానికి, ఇంటి ముందున్న వీధి వెడల్పుకు మధ్య ఉన్న సంబంధం అది.
ఈ సమస్య అంతటితో తీరిపోదు. పాత నిబంధనల మేరకు వదలిన స్థలం వీధి నిర్మాణానికి యివ్వవలసి రావటంతో కొత్త నిబంధనల మేరకు ఖాళీగా వదలి వేయవలసిన జాగా కోసం స్థలం ఎక్కడ నుండి వస్తుంది? పాత కట్టడాలకు కొత్త నిబంధనలను వర్తింపచేస్తే- ఇక ప్రతి నిర్మాణం చట్టవిరుద్ధం అవుతుంది. అంతులేని అవినీతికి అవకాశం ఏర్పడుతుంది. ‘అవినీతి సృష్టించడమే’ అసలు లక్ష్యం అయితే కొత్త నిబంధనలు రూపకల్పనకు అసలు తప్పుపట్టవలసిన పనిలేదు. ప్రతి పట్టణంలోనూ, నగరంలోనూ, గ్రామంలోనూ అనేక సందులు, గొం దులు ఉంటాయి. ప్రధాన వీధికి వారధిగా సందులు, గొందులు ఏర్పడ్డాయి. ఇరుకు సందుల్లోనూ, గొందుల్లోనూ జనం ఇళ్ళు కట్టుకొని తరతరాలుగా ఉంటున్నారు. సందులలో, గొందులలో 30 అడుగుల వెడల్పుగల వీధులు ఉండవు. కొన్నిచోట్ల 10 అగుగులు, మరికొన్ని చోట్ల నడవటానికి మాత్రమే వసతి ఉన్న సన్నటి సందులు ఉంటాయి. అన్నదమ్ములు భాగాలు పంచుకొన్నప్పుడు నడవటానికి వీలుగా ఇరుకైన దారులను ఏర్పాటుచేసుకొంటారు. మరికొన్నిచోట్ల సందుల్లో 2,3 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ సందుల ద్వారా ఇంకెటూ పోవటానికి వీలు ఉండదు. ఆ సందులలో, గొందులలో నివసిస్తున్నవారికి పురపాలక సంఘానికి దానం చేయటానికి వీలుగా స్థలాలు పెద్ద విస్తీర్ణం కలవి కావు. తమకున్న కొద్దిపాటి స్థలంలో చిన్నపాటి యిళ్ళు నిర్మించుకొని అక్కడ తరతరాలుగా ఉంటున్న వారిని అభివృద్ధి పేరుతో ఇబ్బంది పెట్టటం భావ్యమా?
ప్రజలను ఇబ్బందిపెట్టి అనుమతుల కోసం వచ్చినప్పుడు వారి స్థలాన్ని ‘స్వచ్ఛందం’గా ఇవ్వక తప్పని బలవంతపు పరిస్థితులలోకి నెట్టివేయటం సమంజసమా? కొత్త లే-అవుట్లకు కొత్త నిబంధనలు వర్తింపచేయటం సమంజసం. ఆధునిక పద్ధతులతో, పర్యావరణ అనుకూల కట్టడాలను నిర్మించాలని ఆదేశించటం అభిలషణీయం కూడా. 30 అడుగుల కంటె తక్కువ వెడల్పుగల వీధులలో- ఎప్పుడు చేస్తారో తెలియని వీధుల విస్తరణకు యిప్పటి నుండే ఉచితంగా భూసేకరణ జరపటం ఏలినవారి గడసరి తనానికి మచ్చుతునక. అన్నీ ‘ఆన్ లైన్’కాబట్టి అడిగినమేర స్థలం రాసి యిస్తేనే కంప్యూటర్ యంత్రం అంగీకరిస్తుంది. అన్నీ యంత్రానికి చెప్పి, మంత్రించి ఆడిస్తున్న మాయాజాలంలో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా సామాన్య పౌరులకు తెలియడం లేదు. స్థానిక ఉద్యోగులు కూడా యంత్రం అంగీకరించకపోతే- తామిక చేసేదేమీలేదని చెప్తున్నారు. యంత్రం ద్వారా పాలనను కేంద్రీకృతం చేస్తున్నారు. స్థానిక సమస్యలను స్థానికులే పరిష్కరించగలరు. ‘కేంద్రానికి ఇక్కడేం పని?’ అని అంటున్నవారు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం స్థానిక సంస్థల నిర్ణయాధికారంలో జోక్యం చేసుకొనే పని ఏముంది? అధికారం ఢిల్లీలో కేంద్రీకృతమైనా, అమరావతిలో కేందీకృతమైనా నష్టపోయేది సామాన్య పౌరుడే.
రాజకీయ నేతలు భావోద్వేగాలను రెచ్చగొడ్తుంటారు. ఆ విద్యలో వారు ఆరితేరారు. ప్రజలు కష్టనష్టలు గురించి వారు పట్టించుకోరు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అధికారాల గురించి చర్చలు పెడ్తున్నారు. నేతల అధికారాల గురించే కాదు, సామాన్యుల అవసరాల గురించి కనీసం అప్పుడప్పుడైనా చర్చలు అవసరం. అసలే ఇరుకు బ్రతుకులు. వారి ఇరుకు స్థలంలో కొంత భాగానిన్వకాశం చూసి కాజేయబూనటం అన్యాయం. 2017 ఉత్తర్వును కొత్తవాటికే తప్ప పాతవాటికి వర్తింపచేయకూడదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 119 ఉత్తర్వుకు తగిన సవరణలు చేయటానికి సిద్ధమైనవారికే ప్రజలు తమ మద్దతు తెలియచెయ్యాలి.

-డా. బి.సారంగపాణి