సబ్ ఫీచర్

జాతినిష్ఠకు జాతీయ భాష ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖండ భారత్‌లో అనాది భాష సంస్కృతం. అనాది సాహిత్యం సంస్కృత భాషలోనిదే. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు సంస్కృతంలోనే లిఖించబడినవి. వాల్మీకి రచించిన రామాయణం ఇరవై నాలుగవ త్రేతాయుగం లోనిది. వ్యాసుడు-కృష్ణద్వైపాయణుడు రచించిన మహాభారతం ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగం లోనిది. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం రాసిన పతంజలి ఇరవై ఎనిమిదవ కలియుగం 1844- క్రీస్తుపూర్వం 1258కి చెందినవాడు. సమ్రాట్ విక్రముని ఆస్థానంలోని నవరత్నములనబడే ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుడు, వేతాలభట్టు, ఘటకర్పరుడు, వరహమిహిరుడు, వరరుచి రచించిన గ్రంథాలు, కాళిదాసు రచనలు సంస్కృతంలోనే ఉన్నాయి. భట్టోతల్పుడి ఖగోళ శాస్త్రం, భాస్కరాచార్యుడి గణితశాస్త్రం, నలంద విశ్వవిద్యాలయాలలో బోధించబడిన శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక, ఆయుర్వేద, రాజనీతి, ఆర్థిక శాస్త్రాలన్నీ సంస్కృత భాషలోనివే! ఈ గ్రంథాలు విద్యావంతులకు పరిమితం కాలేదు. ఆనాడు సామాన్య ప్రజలు మాట్లాడే భాష సంస్కృతమే. మానవ కల్యాణానికి తోడ్పడిన గ్రంథాలన్నీ సంస్కృత భాషలో వెలువడినవే. దేశదేశాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి- విక్రమశిల, తక్షశిల విశ్వవిద్యాలయాల ద్వారా జ్ఞానభిక్ష పెట్టిన ఘనత మన దేశానిది. అందుకే మన దేశం జగద్గురువుగా భాసిల్లినది. అలాంటి విశిష్ఠత కలిగిన మన దేశం నుంచి ఈనాడు ఎంతోమంది విద్యార్థులు ఉన్నతవిద్య కోసం విదేశాలకు పరుగెడుతున్నారు. దేశభక్తి, జాతీయనిష్ఠ కోల్పోవడం వల్ల విదేశీ భావజాలాన్ని పుణికిపుచ్చుకొన్న నాయకుల అసమర్థ పాలననే ఇందుకు కారణం.
టిబెట్ రాజధాని లాసా నగరంలోని తాళపత్ర గ్రంథాలయం సంచాలకుడు- డైరెక్టర్ ‘సెనాంగ్ జిగ్మే’ తమ గ్రంథాలయంలో సంస్కృత భాషాసాహిత్యాలకు సంబంధించిన యాభైవేల తాళపత్ర గ్రంథాలు భద్రంగా ఉన్నాయని 2015లో వెల్లడించాడు. విదేశీయుల దురాక్రమణలు, రాజకీయ ఘర్షణలు, మతవిద్వేష చర్యల వల్ల లక్షల సంఖ్యలో సంస్కృత గ్రంథాలు దగ్ధమైపోయాయని సెవాంగ్ జిగ్మే చెప్పిన విషయాలన్నీ భారతీయ సాహిత్యాభిమానులు, మేధావులు, పరిశోధనాశీలురు గుర్తించాలి. ఋషులు మనకందించిన వేదాల ద్వారా శాస్తస్రాంకేతిక, వైజ్ఞానిక వివిధ రకాలైన శాస్త్రాలు సంస్కృత భాషలోనే ఉండేవి. జర్మనీ వాసి మాక్స్‌ముల్లర్ వేదాలలోని విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన దేశానికి వచ్చి సంస్కృత భాషను అభ్యసించి విశ్వవ్యాప్తంగా పేరుగడించినాడు. తన దేశం అన్ని రంగాలలో పరుగెత్తడానికి కారణభూతుడైనాడు. మాతృభూమి సేవలో తరించిన నిష్ఠాగరిష్టుడైనాడు. వేదాలలోని విజ్ఞానాన్ని వెలికితీసి వాటి ఆధారంగా పరిశోధనలు జరుపుతూ జపాన్, జర్మనీ, అమెరికా దేశాలు వివిధ రంగాలలో దూసుకెళ్తున్నారు. వారి దేశాలలో సంస్కృత భాషా విశ్వవిద్యాలయాలను నెలకొల్పి భాషాభివృద్ధికి తోడ్పడుతున్నారు.
భారత రాజ్యాంగ నిర్ణయ సభ అధికార భాష గూర్చి చర్చిస్తున్న సమయంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ సంస్కృత భాష జాతీయ అధికార భాష కావాలని చేసిన ప్రతిపాదనపై ఆనాటి విదేశాంగశాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ కేస్కర్, నిజాముద్దీన్ అహ్మద్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎల్.కె.మైత్రా, మద్రాస్‌కు చెందిన టి.టి.కృష్ణకుమారి, వి.కె.మునుస్వామి పిళ్ళై, డాక్టర్ వి.సుబ్రహ్మణ్యం, దుర్గాబాయ్, దాక్షాయణి, వేలాయుధన్, పుదుక్కోటి, త్రిపుర, మణిపూర్, కూర్గులకు చెందిన మరికొందరు ప్రముఖులు అంగీకారం తెలిపారు.
మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు టి.బి.మెకాలే రూపొందించిన విద్యా విధానాన్ని ఆంగ్లభాషా మాధ్యమంలో ప్రవేశపెట్టడంలో ఆంగ్లేయులు సఫలీకృతులైనారు. ఆంగ్లేయుల కుట్రలకు మోసపోయి విదేశీ భావజాలానికి బానిసలైన ఆనాటి కొంతమంది పెద్దమనుషులు ఆంగ్లేయుల మానసపుత్రులుగా పనిచేయడానికి అలవాటుపడి సంస్కృత భాషకు ప్రాధాన్యతనీయలేదు. సంస్కృతాన్ని జాతీయ అధికార భాషగా కొనసాగించాలనే వత్తిడిని తగ్గించాలని మోసపూరితంగా 310/ఎ నంబర్‌గల అధికరణలో భారత ప్రభుత్వం అధికార భాషగా ఆంగ్లభాష ఉండాలని కోరుతూ, పదిహేను సంవత్సరాలపాటు మాత్రం అన్ని అధికార కార్యకలాపాలకు ఆంగ్లభాషను వినియోగిస్తూ అదనంగా సంస్కృత భాషను అన్ని సందర్భాల్లో తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. సంస్కృత భాషను జాతీయ అధికార భాషగా ప్రకటించే విషయంలో తీవ్రమైన చర్చలు జరిపి చివరకు భేదాభిప్రాయాలతో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది.
సంస్కృతాన్ని జాతీయ అధికార భాషగా ప్రకటించే విషయంలో డాక్టర్ అంబేడ్కర్ మాత్రం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాడు. ఋషులు మనకందించిన విజ్ఞాన సారస్వం మొత్తం సంస్కృత భాషలోనే వున్నది. సంస్కృత భాషను జాతీయ అధికార భాషగా ప్రకటించుకొంటేనే దేశ ప్రజలందరూ సంస్కృత భాషను నేర్చుకుంటారు. అప్పుడే సంస్కృత భాషలో వున్న వివిధ శాస్త్రాలలోని పరిజ్ఞానం అందరికీ అందుతుంది. దీనివల్ల దేశాన్ని వేగవంతంగా అభివృద్ధిపథంలోకి తేవచ్చును. మన దేశంలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అన్ని భాషలలోను సంస్కృత భాష మూలాలు ఉన్నాయి. కాబట్టి సంస్కృత భాషను అభివృద్ధిపరచినట్లైతే వివిధ భాషలు మాట్లాడే ప్రజలను కలిపి ఉంచగలం. వేరువేరు భాషలు మాట్లాడే ప్రజలందరికీ జాతీయ అధికార భాష సంస్కృతమైనందున భాషలకతీతంగా ఒకే జాతీయులుగా మనుగడ సాధిస్తారు. అప్పుడే ప్రపంచంలో భారత వాణిని వినిపించగల శక్తివస్తుందన్నదే తన ప్రగాఢ విశ్వాసం అని డాక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు.
డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశం స్వపరిపాలనలో అనేక రంగాలలో అభివృద్ధి చెందిందని గొప్పల చెప్పుకోవడానికే పరిమితమైన రాజకీయ నాయకులు వారి పిల్లలను విదేశాలలో చదివించుకోవటం, వైద్యం కోసం విదేశాలకు వెళ్ళడం, విదేశీ బ్యాంకులలో డబ్బుదాచుకోవడమే దేశాభివృద్ధిగా భావిస్తున్నారు. భారతీయ భాషలలో నిర్వహిస్తున్న పాఠశాలలకు స్థానం లేకుండా ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకరావడానికి దోహదపడుతున్నారు. స్వాభిమానం ఉన్నా, దేశభక్తి ఉన్నా, ధర్మనిష్ఠ ఉన్నా బతుకుతెరువుకై విదేశాలలో ఉద్యోగం నిమిత్తం ఆంగ్ల మాధ్యమంలో పిల్లలను చదివించడం అనివార్యమైంది. ఆంగ్ల మాధ్యమం ఉద్యోగాలకు పనికొస్తుందేమో తప్ప, నైతిక విలువలను, మన సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయదు. జాతీయ నిష్ఠకరువై ‘సెక్యులర్’ ముసుగులో భాషల వారీగా, కులాల వారీగా ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడపడం రాజకీయ నాయకుల వ్యాపకమైనది. వీటన్నిటికీ మూలం జాతీయ భాష, జాతీయ విద్యావిధానం లేకపోవడం. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల మెజారిటీ ప్రజలు జాతీయ స్పృహ కోల్పోయినారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన ప్రతిపాదనలు అమలుపర్చటం జాతీయనిష్ఠకు చిహ్నాలు. అంబేడ్కర్ ప్రతిపాదనలు అమలు జరిగి ఉంటే- డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఇప్పటికీ జగద్గురువుగా భాసిల్లేది. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని అంబేడ్కర్ ప్రతిపాదనను అమలుపర్చినట్లైతే దేశ సమగ్రతను కాపాడవచ్చు. దేశాన్ని, ప్రజలను సర్వాంగీణ వికాసంతో పరిగెత్తించవచ్చు.

-బలుసా జగతయ్య 90004 43379