సబ్ ఫీచర్

నాన్నంటే.. ఓ నేస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలు పట్టుకుని నడక నేర్పించినా.. గాల్లోకి ఎగరేసి, పడకుండా పట్టుకున్నా..
‘అమ్మడూ.. అమ్ములూ..’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెప్పినా..
గాయం తగిలి, ఏడుస్తున్నప్పుడు.. దగ్గరకు తీసుకుని గడపని ‘ఆయ్..’ అంటూ బెదిరిస్తూ కొట్టినా..
అమ్మకు తెలియకుండా ఐస్‌క్రీమ్ తినిపించినా.. అమ్మకు తెలియకుండా పాకెట్ మనీ ఇచ్చినా..
ధైర్యంగా బైక్ కీ ఇచ్చి నడుపు.. అంటూ వెనకాల కూర్చున్నా..
ఇలాంటివన్నీ.. ఆలోచించకుండా చేయగల ఒకే ఒక వ్యక్తి నాన్న. అమ్మ కనిపించే దైవం అయితే.. నాన్న కనిపించకుండా, నడిపించే దైవం.. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్.. ఆయన మనసు అర్థం కాని అంతరిక్షం. ఆయన హృదయం తెలుసుకోలేనంత అనంత సాగరం. నాన్నకు అన్నీ ఎక్కువే.. ప్రేమ, సహనం, ఓపిక, ఆశ.. ఇలా.. ఎల్లప్పుడూ నీడలా వెంటాడే ఒకే ఒక వ్యక్తి నాన్న. ఒకప్పుడు నాన్నంటే నాన్నలా గంభీరంగా ఉండేవాడు. కానీ నేడు నాన్న మారిపోయాడు. ఆడపిల్లను దగ్గరుండి చదివిస్తున్నాడు. ధైర్యంగా చదువులకు, ఉద్యోగాలకు విదేశాలకు పంపుతున్నాడు. అమ్మకు ఆలంబనగా మారుతున్నాడు. భార్యకు భరోసానిస్తున్నాడు. కూతురికి భద్రతను కల్పిస్తూ ధైర్యంగా, ప్రేమగా, ఓ స్నేహితుడిలా ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి నాన్న నేడు మరింత ప్రేమగా తయారయ్యాడు. అలాంటి నాన్న గురించి మరికొన్ని విశేషాలు..
* భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తలు ఇరవై శాతం వరకూ బరువు పెరిగే అవకాశం ఉందని ‘బయాలజీ లెటర్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. తండ్రి కాబోయే ముందు ఆడవాళ్ల మాదిరిగానే అరవై శాతం మంది మగవాళ్ల బరువులోనూ తేడా కనిపిస్తుంది. దీన్ని సింపథిటిక్ ప్రెగ్నెన్సీ సింప్టమ్ అంటారు. వీటికి తోడు అలసట, తలనొప్పి, గాభరా, వెన్నునొప్పి వంటి లక్షణాలు కూడా తోడవ్వచ్చు. తండ్రి కావడానికి తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకునే సమయంలో చోటుచేసుకునే హార్మోన్ల సర్దుబాటు వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇదే ఈ అధ్యయన సారాంశం. అంటే అమ్మకొచ్చే ఆరోగ్య సమస్యల్లో కొన్ని నాన్నకూ తప్పవు.
* పిల్లల్ని పెంచడం మొదలుపెట్టాక తండ్రుల మెదడు కూడా తల్లిలానే ఆలోచించడం మొదలుపెడుతుందని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైనె్సస్’ పరిశోధనలో తేలింది.
* పిల్లలతో అనుబంధం పెరిగేకొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగ్గి ‘లవ్ హార్మోన్’గా పిలిచే ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి. దానివల్ల ఎక్కువ ప్రేమగా ఉండటానికి తండ్రులు ప్రయత్నిస్తారు. పిల్లలు కూడా ఈ హార్మోన్ ప్రభావంతోనే తండ్రులకు దగ్గరవుతారని తేలింది.
* పిల్లల గొంతును గుర్తుపట్టే శక్తి తల్లులతో సమానంగా తండ్రులకూ ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొంతమంది పసిపిల్లల ఏడుపుని రికార్డు చేసి వినిపించినప్పుడు వాటిలో తమ పిల్లల ఏడుపుని తొంభై శాతం మంది తండ్రులు గుర్తించగలిగారు.
* తొలిసారి తండ్రి అయిన వాళ్ల మెదడులో కొత్త నాడీ కణాలు వృద్ధి చెందుతాయట. అది మగవాళ్ల జ్ఞాపకశక్తిపై సానుకూల ప్రభావం చూపుతుందన్నది పరిశోధకుల ఉవాచ.
* పిల్లలు పుట్టాక తల్లుల హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు రావడం సహజం. కానీ పిల్లలకు దగ్గరయ్యే కొద్దీ తండ్రుల్లోనూ ఆ మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్తల అధ్యయనంలో తేలింది. ఈస్ట్రోజెన్, ప్రొలాక్టిన్, గ్లూకోకార్టికాయిడ్స్ వంటి హార్మోన్లు పెరగడంతో తండ్రులు మునుపటితో పోలిస్తే కాస్త ప్రశాంతంగా కనిపిస్తారట. పిల్లలతో చనువుగా ఉండే తండ్రుల్లోనే ఈ మార్పులు చోటుచేసుకుంటాయి.
ఉత్తమ తండ్రులు
పిల్లల పెంపకంలో భాగస్వాములయ్యే తండ్రులపైన యూకేకి చెందిన ‘్ఫదర్‌హుడ్ ఇన్‌స్టిట్యూట్’ అనే సంస్థ సర్వే నిర్వహించింది. దేశాల సంగతి పక్కన పెడితే ఆఫ్రికాలోని పెద్ద తెగల్లో ఒకటైన ‘అకా’ అనే తెగలోని మగవాళ్లు మాత్రం పిల్లల పెంపకం విషయంలో తండ్రులందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచంలోనే ‘బెస్ట్ డాడ్స్’ అనిపించుకుంటున్నారు. పుట్టిన తొలి ఏడాదిలో అక్కడి పిల్లలెవరూ నేలపై పాదం మోపరట. రోజు మొత్తంలో వారు 53 శాతం తల్లి పొత్తిళ్లలో గడిపితే, 47 శాతం సమయాన్ని తండ్రి ఒళ్లో గడుపుతారట. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తారు. అందుకే పిల్లల బాధ్యతని వారు సమానంగా పంచుకుంటారు. రోజులో కనీసం పద్దెనిమిది గంటలపాటు తండ్రులు పిల్లలకు అందుబాటులో ఉంటారు.
నాన్నంటే..

నీలాకాశంలాంటి
తన దేహాన్ని నీ కోసం
గొడుగుగా మార్చి
నీడను ఇచ్చువాడు
‘నాన్న’

నీ జీవిత రథానికి
తన భుజాలను
చక్రాలుగా చేసేవాడు
‘నాన్న’

నీ పాదాలకు
తన చేతులను
చెప్పులుగా తొడిగేవాడు
‘నాన్న’

నీ బతుకు పాటకు
తన నరాలను
తీగలుగా మలచి
నేపథ్య సంగీతంగా
అందించేవాడు
‘నాన్న’

నిన్ను
కనురెప్పలా కాస్తూ
నీ కంటికి
కనిపించని కవచమే
‘నాన్న’

- సురేంద్ర రొడ్డ 94915 23570