సబ్ ఫీచర్

రుతుపవనాల జాడ ఏదీ? ఎక్కడ??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈఏడాది నైరుతి రుతుపవనాలు మందగమనంతో ప్రవేశిస్తున్నాయి. గత సంవత్సరం కంటే 10 రోజులు ఆలస్యం కావచ్చునని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మన దేశంలో ఏటా రుతుపవనాలు కేరళను తొలుత తాకి, ఆ తరువాత మిగిలిన రాష్ట్రాలను అనుగ్రహించటం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక ప్రకృతి ధర్మంగా మారింది. దేశ వ్యాప్తంగా రైతన్నలు తొలకరి చినుకుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా ఎక్కడా ఊరట లేదు. వడగాడ్పులతో అధిక ఉష్ణోగ్రతలు జూన్ రెండోవారంలోనూ కొనసాగుతున్నాయి.
ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి వేసవి వేడిమి కొత్తకాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గత పదేళ్లలో లేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ వేసవిలో నమోదు కావడం విశేషం. రెక్కాడితే కాని డొక్కాడని పేద ప్రజానీకం మండుటెండల్లో, వేడిగాలుల్లో బతుకుతెరువుకోసం సతమతమవక తప్పడం లేదు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 40 డిగ్రీలకు పైబడి- 45 డిగ్రీలు దాటిన ఈ దశాబ్దపు అత్యధిక ఉష్ణోగ్రతలు వృద్ధులు, పిల్లల పట్ల ప్రాణాంతకంగా పరిణమించాయి. ఎండ వేడిమికి వడదెబ్బకు గురై ఎందరు మృత్యువాత పడినదీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్ధారించవలసి వుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జనం దాహార్తి తీర్చేందుకు తాగునీరు, విద్యుచ్ఛక్తి సరఫరాలో తీసుకొన్న ముందుజాగ్రత్తచర్యలు కొంత సత్ఫలితాన్ని ఇచ్చాయి. కాని ప్రకృతి వైపరీత్యాలలో వర్షాభావ వికృత దుస్థితి కారణంగా 2019లో కరువు రాక్షసి విలయ తాండవం చేసే దృశ్యం తెలుగు రాష్ట్రాల్లో పొంచివుంది.
నైరుతి ఎప్పుడు?
గత సంవత్సరం మే 29న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది జూన్ 8వ తేదీ నాటికి కేరళకు రుతుపవనాలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రెండు రోజులు అటూ యిటూగా 13వ తేదీకి ప్రవేశించవచ్చునని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖాధికారులు అంచనా వేశారు. కాని వాటి జాడ కానరావడం లేదు. అధిక ఉష్ణోగ్రతలతోపాటు అక్కడక్కడ ‘క్యుములోనింబస్’ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, గాలులతో ఒక మాదిరిగా వర్షాలుపడే సూచనలు ప్రస్తుతం స్పష్టమవుతున్నాయి. కాని వాటి వల్ల ప్రయోజనం అంతంతమాత్రంగానే వుంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో గాలుల మందగమనం, సెంట్రల్ ఈస్ట్రన్ పసిఫిక్ ప్రాంతంలోని సైక్లిక్ వార్మింగ్ ‘ఎల్‌నినో’ ప్రభావం ఫలితంగా నైరుతి రుతుపవనాల మందగమనం, బలహీనపడటానికి కారణమవుతుండటం ప్రకృతి నిర్దేశించిన వాతావరణ ప్రక్రియ. అతివృష్టి, అనావృష్టి, కరువుకాటకాలు, వరద బీభత్సాలు, తుఫాన్‌లు ఏ ప్రకృతి వైపరీత్యమైనా- వాటిని ముందు పసికట్టడం, ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించే జాగరూక చర్యలు తప్ప ఎంత అధునాతన నాగరికత సాధించినా మానవుడు నిస్సహాయంగా ప్రకృతికి తలవంచవలసినదే.
ప్రకృతి వైపరీత్యాలలో వడదెబ్బగా మనం పేర్కొనే ఈ విపత్తుకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు అంతగా లేదు. ఉత్తర భారతంలో చలిగాలుల కారణంగా మరణాలు సహజమైనట్టే, వడదెబ్బల వల్ల తెలుగు రాష్ట్రాలలో వడదెబ్బకు గురైన ఎందరో అభాగ్యులు సకాలంలో తక్షణ వైద్య సహాయం లభించక ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధుల నుండి స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ చలిగాలులకు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి రు.1.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆపద్బంధు పథకంలో రు.1లక్ష సహాయం అందేది. చలిగాలుల కారణంగా మరణించినా, వడదెబ్బ తాకిడికి ప్రాణాలు పోయినా బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా న్యాయబద్ధంగా సహాయం వుండాలి.
సామాన్యుల ఇక్కట్లు
ఒకప్పుడు బెజవాడను ‘బ్లేజ్‌వాడ’గా పిలుచుకొనేవాళ్లు. ప్రస్తుత వాతావరణ దుష్పరిణామాలలో తెలుగు రాష్ట్రాలు రెండింటా వేసవి ఉగ్రరూపం దాల్చింది. సంపన్న కుటుంబాలే కాదు మధ్యతరగతి ప్రజ ఏసీలను ఆశ్రయించక తప్పడం దు. ఫ్యాన్‌లు వాడినా వేడిగాలితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంచినీటి వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఏసీ కోచ్‌ల రైళ్లు కిక్కిరిసి నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొన్నిచోట్ల ఏసీ బస్టాప్‌లు ఏర్పాటుచేసింది. నిరుపేద, సామాన్య, వెనుకబడిన కుటుంబాలలో రోజుకూలీ సంపాదన కోసం ఎండలలో శ్రమించేవారు వడదెబ్బకు గురిఅవుతున్నారు. ఎండవేళ కూలిపనికి వెళ్లే కూలీల్లో కొందరు ఆసుపత్రుల్లో సకాలంలో సరియైన వైద్య సహాయం అందక మృత్యువాత పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు చేసుకొని బతికే నిరుపేద రైతుకూలీలు అస్వస్థతకు గురి అయితే తక్షణ వైద్య సహాయం అందేలోగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రథమ చికిత్స కూడా పల్లెల్లో లభించటం లేదు. వడదెబ్బ నుండి సాంత్వన పొందే అవకాశం పల్లెల్లో లేదు. వేసవి తీవ్రత నుంచి కొంతవరకైనా తప్పించుకోగల అవకాశాలు నగర జీవనంలో వుండటంతో రోడ్లు నిర్మానుష్యం అవుతున్నాయి. శీతల పానీయాలు, కొబ్బరి నీళ్ళు, నిమ్మ, సోడాలు, చల్లటి నీడ యిచ్చే చెట్లు కొంతవరకు ఆదుకొంటున్నాయి. తొలకరి చినుకుల కోసం ఎదురుచూసే రైతాంగం, దుక్కిదున్ని విత్తువేసే సమయం అదునుగా ఎర్రటి ఎండలో, బీటలు వేసిన నేలను చినుకుల స్పర్శతో మొలకలెత్తించాలనే తాపత్రయంతో మండు వేసవిలో తల్లడిల్లుతున్నారు.

-జయసూర్య సెల్- 9440664610