సబ్ ఫీచర్

నేను కాదు.. పాత్రలే కనిపించేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడిగా ఒదగడం -గొప్ప ఆనందం. సహాధ్యాయుడు -ఆకాశానికెదగడం అనిర్వచనీయ ఆనందం. ఇది -వందలో ఏ ఒక్కరికో లభించే అనుభవం. ఆ ఒక్కడు -గుళ్లాపల్లి నారాయణరావు.

నటుడిగా నారాయణరావు పాసయ్యాడు. తనతోబాటు కెరీర్ మొదలెట్టిన స్నేహితులు మాత్రం ఫస్ట్ ర్యాంకర్లయ్యారు. ఇనే్నళ్ల నా జీవితంలో నేను సాధించినదానికంటే, స్నేహితులు సాధించిన విజయాలు గుర్తుకొచ్చినపుడు మనసు పొంగిపోతుంటుంది. వాళ్లకు నేను స్నేహితుడినని చెప్పుకోవడమే గర్వంగా ఉంటుంది -అని నిజాయితీగా చెప్పే నారాయణరావు ఈవారం వెనె్నల ముచ్చట్లకు అతిథి. ఆయన నట ప్రయాణంలోని కొన్ని ఘట్టాలు, వాటిలో పదిలమైన జ్ఞాపకాలను వెనె్నల పాఠకుల కోసం నారాయణరావు గుర్తు చేసుకున్నారు.

నారాయణరావు చెప్పే స్నేహితులు ఎవరో కాదు. ఒకరు టాలీవుడ్‌లో మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి. మరొకరు కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ అనిపించుకున్న రజనీకాంత్.
జ్ఞాపకాల్లోకి వెళ్దాం..

నాతోపాటు మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సహాధ్యాయులు చిరంజీవి, రజనీకాంత్. వాళ్ల విజయాలను పక్కనుంచి చూసిన స్నేహం నాది. వాళ్లు గొప్ప నటులు. అంతకుమించి -నాతోటి విద్యార్థులు అని చెప్పుకోవడం నాకెంతో గర్వంగా ఉంటుంది’ అంటాడు నారాయణరావు.
దాదాపు 50 చిత్రాల్లో హీరో పాత్రలు చేసిన నారాయణరావు సినీ ప్రస్థానం సామాన్యమైనదేం కాదు. సినిమా కుటుంబంలో పుట్టి సినిమానే శ్వాసిస్తూ నటనను ఆరాధిస్తూ పెరిగాడు. 1953లో గుంతకల్లులో పుట్టాడు నారాయణ రావు. తండ్రి జిడి ప్రసాదరావు, తల్లి దమయంతి.
1947 -దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది. ఆ ఏడాదిలోనే ‘నవయువ ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ప్రారంభించారు ప్రసాదరావు. ఏఎన్నార్ చిత్రాలతోపాటు రాజ్‌కపూర్ సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే అప్పట్లో గుర్తుకొచ్చేది నవయుగవే. రాయలసీమ ప్రాంత పంపిణీదారుగా గుంతకల్లులో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. అక్కడ ఆఫీసు పెట్టడంవల్ల గుంతకల్లులోనే నివాసం. అక్కడే పుట్టిన నారాయణ రావు ఎనిమిదో తరగతి వరకూ సొంతూళ్లోనే చదివాడు. -‘అప్పుడు నాకు 11వ ఏడు. హైస్కూల్లో శకుంతల నాటకం వేశాం. చూడచక్కగా ఉన్నానని నాకు మేనక పాత్ర ఇచ్చారు దర్శకులు. బాగా చేశానన్న ప్రశంసలు అందాయి. అది మొదలు రంగస్థలంపై నృత్యాలు, నాటకాల ప్రదర్శన మొదలైంది’ అంటూ ప్రారంభాన్ని గుర్తు చేసుకున్నాడు నారాయణ రావు. తరువాత జంధ్యాల రచించిన ‘ఏక్‌దిన్‌కా సుల్తాన్’, చో రామస్వామి విరచితమైన ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’ ప్రదర్శనలిచ్చాడు నారాయణ రావు. పొలిటికల్ సెటైర్‌గా ప్రదర్శించే మహమ్మద్ బీన్ తుగ్లక్‌లో నటనకు అనేక రివార్డులు వచ్చాయి ఆయనకు. ‘నాటకరంగం స్ఫూర్తిగా మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో అడుగుపెట్టాను. అక్కడ శిక్షణ పూర్తయ్యింది. అదే టైంలో తమిళంలో విజయవంతమైన ‘అవళ్ ఒరు తొడర్‌కదై’ చిత్రాన్ని నిర్మాత రామా అరంగణల్ తెలుగులో రూపొందిస్తున్నారు. దర్శకుడు బాలచందర్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు వచ్చి అందర్నీ పరిశీలించి రజనీకాంత్, ప్రదీప్‌శక్తితోపాటుగా నన్నూ ఎంపిక చేసుకున్నారు -అంతులేని కథ చిత్రంకోసం. ఆ సినిమాలో వికటకవిగా ప్రేక్షకులకు పరిచయమయ్యాను’ అని చెప్పుకొచ్చారు. అలా స్క్రీన్‌కు పరిచయమైన నారాయణరావు తన విధ్వత్తుతో సులువుగానే రివార్డులు, ప్రభుత్వం అందించే నంది అవార్డులు కైవసం చేసుకున్నారు.
-‘అంతులేని కధ చిత్రం హైదరాబాద్ దీపక్ థియేటర్‌లో విడుదలైంది. సామాన్య ప్రేక్షకుడిలా వెళ్లాను సగం సినిమా పూరె్తైంది. అంతలో కరెంటు పోయింది. దాదాపు ఐదు గంటలైనా రాలేదు. జనరేటర్ లేకపోవడంతో ప్రదర్శన ఆలస్యమైంది. కరెంటు వచ్చేదాకా ప్రేక్షకులు ఒక్కరూ బైటికెళ్లలేదు. సగం సినిమా చూసిన ప్రేక్షకుడు మిగతా సగం చూడకుండా బైటికి వెళ్లకూదడని నిశ్చయించుకుని ఉంటారు. ఎంత సమయమైనా అక్కడే కూర్చున్నారు. కథాబలమో, సినిమా ప్రభావమోగాని, మీడియం అంత బలంగా ఉంటుందా? అన్న విషయం నాకు తొలిసారి అనుభవంలోకి వచ్చింది’ అంటూ గుర్తు చేసుకున్నారు నారాయణ రావు. ‘నా అభిప్రాయం మాత్రం కథ, కథనాలకు ప్రేక్షకుడు బందీ అయిపోయి ఉంటాడు’ అంటారు చిర్నవ్వుతో. అది ఆర్టిస్టుల గొప్పతనం కాదని, కేవలం బాలచందర్ సృష్టించిన పాత్రల మధ్య సంఘర్షణే ఆయువుపట్టని గుర్తు చేసుకున్నారు. తొలి సినిమా హిట్టవ్వడంతో -అవకాశాలు వెతుక్కుంటూనే వచ్చాయి. జయసుధ హీరోయిన్‌గా నారాయణరావు నటించిన మరో వైవిధ్యమైన ప్రేమ కథ -ముత్యాలపల్లకి. మల్లెమాల రాసిన పాటలన్నీ హిట్టే. ‘సన్నజాజికి గున్నామావికి పెళ్లి కుదిరింది’ పాటలో జంటగా నటించిన నారాయణరావు, జయసుధల కాంబినేషన్ ప్రేక్షకులకు నచ్చింది. ఆ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన రోజారమణికి, ఆమె భర్త చక్రపాణి ఈ చిత్రంతోనే పరిచయమయ్యారని, ఆ తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు వచ్చేసిన టైంలో -సారథి స్టూడియోను తండ్రి ప్రసాదరావు తీసుకున్నారు. ఆ సమయంలో దాదాపు రెండేళ్లపాటు సారథి స్టూడియోలోనే మకాం ఉండటంతో అనేకమంది గొప్ప నటులను దగ్గరనుండి చూసి అనేక విషయాలను నేర్చుకున్నానంటారు నారాయణ రావు. ఆత్మీయులు, తోటరాముడు, మైనర్‌బాబు, అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే లాంటి చిత్రాలను ప్రసాదరావు రూపొందించారు. అయితే తానెప్పుడూ తండ్రి రూపొందించిన చిత్రాల్లో నటించలేదని నవ్వేశారు ఆయన. బావగారు త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై దాదాపు 12 చిత్రాలను రూపొందించారు. అన్న జి రవీంద్రనాథ్ మాభూమి, రంగులకల చిత్రాలను నరసింగరావు భాగస్వామ్యంతో రూపొందించారు. టోటల్‌గా మాదంతా సినిమా కుటుంబమే అంటూ వివరించారు. నారాయణరావు హీరోగా నటించిన చివరి సినిమా -సుబ్బారావుకు కోపమొచ్చింది. తరువాత మంచి పాత్రలు ఏవి వచ్చినా వదల్లేదాయన. చట్టానికి కళ్లులేవు చిత్రంలో దగాపడిన అభాగ్యుడిగా టైటిల్ సాంగ్ పాడుతూ నటించారు. అదే చిత్రాన్ని అంధాకానూన్‌గా హిందీలో రూపొందించారు. ఆ సినిమాలో ‘గొప్పనటుడు అమితాబచ్చన్‌ను హీరోగా చేయమన్నారు. కానీ నేను వేసిన పాత్రను చూసి, ఆ పాత్ర అయితేనే చేస్తానని అమితాబ్ చెప్పారట. అది గుర్తుకొచ్చే ప్రతిసారీ నాకు గొప్పగా, ఆనందంగా అనిపిస్తుంది’ అంటున్నారు నారాయణ రావు. ‘నా కెరీర్‌లో అనేకమైన మరచిపోలేని సంఘటనలు ఉన్నాయి. బాగా బాధపడిన విషయం -నా 18వ ఏటే అమ్మ దూరమవ్వడం. బాగా సంతోషించే విషయం -గొప్ప గొప్పవాళ్లయిన నటులు నా స్నేహితులు కావడం’ అంటారాయన. ముఖ్యంగా గొప్ప ప్రతిభవున్న గురువులు దొరకడం తన అదృష్టమంటారు. దేవదాస్ కనకాల, దేశిరాజు హనుమంతరావులాంటి గురువుల ప్రోత్సాహంతో తాను ఇంత ఉన్నతంగా ఎదిగానంటారాయన. జంధ్యాల, తనికెళ్ల భరణి, యండమూరి వీరేంద్రనాథ్‌వంటి గొప్పవారికీ ఆయన గురువు. ఆయనే నాకు రంగస్థలంపై ప్రతిభ చూపడానికి ఎన్నో మెళకువలు నేర్పారంటూ గుర్తు చేసుకున్నారు. ‘ఇక సినిమా పరిశ్రమకు వస్తే కె బాలచందర్, ఈరంకి శర్మ, వి మధుసూదన్‌రావు, దాసరి నారాయణరావులాంటి గొప్ప దర్శకులు మంచి మంచి పాత్రలిచ్చారు. నేనెప్పుడూ ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుండాలనే ప్రయత్నించాను కానీ, నేను గుర్తుండాలని ఆశించలేదు. మొదటినుంచీ పాత్రల విషయంలో సెలెక్టివ్‌గానే ఉన్నా. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. అన్నట్లుగా నా కెరీర్ సాగింది. ప్రేక్షకులెప్పుడూ నన్ను పాత్రగానే చూశారు. నటుడిగా ననె్నవ్వరూ గుర్తుపట్టలేదు. నా పాత్రలే గుర్తుంటాయి. మా గురువులు కూడా అదే చెప్పారు. నీ పాత్ర స్క్రీన్‌పై కనిపించాలి కానీ నువ్వు కనిపించకూడదు అన్నారు. అలాగే నా కెరీర్‌ను ప్లాన్ చేసుకున్నా. నేను బయటికి కనపడాలని ఎప్పుడూ అనుకోను. ప్రస్తుతం విజయవాడలో మంచిపేరున్న బాబాయ్ హోటల్ నేపథ్యంలో రూపొందిస్తున్న సీరియల్‌లో నటిస్తున్నాను. తోలుబొమ్మలాట అనే మరో చిత్రం కూడా త్వరలో రాబోతోంది’ అని వివరించారాయన. నచ్చిన నటులంటే ఏఎన్నార్‌తోపాటుగా నా మిత్రులు కూడా ఉంటారంటారాయన. చార్లీచాప్లిన్, రాజ్‌కపూర్ వంటి మహానటులు కూడా చాలా ఇష్టం నారాయణరావుకు. తొలి చిత్రంతోనే నంది అవార్డుతోపాటుగా మళ్లీ తెల్లవారింది అనే సీరియల్‌కు కూడా నంది అందుకున్నారు. ఒక ఊరి కథ చిత్రానికి జెకొస్లొవేకియాలో జ్యూరీ అవార్డు నారాయణరావును వరించింది. ఆయన హాజరైనన్ని ఫిలిం ఫెస్టివల్స్‌కు మరెవరూ హాజరుకాలేదేమో. ‘ఒక ఊరి కథలో నటించడం చాలా ఆనందదాయకం. ఓ వైపు బాధ కూడా వుంది’ అంటారాయన. ఎందుకంటే ఆర్ట్ సినిమాల నటుడు అన్న ముద్ర పడడం. నారాయణరావుకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కొడుకు కోడలు హైదరాబాద్‌లో వుంటారు. పాప, అల్లుడు లండన్‌లో ఉన్నారు. ‘నా జీవితంలో బాగా ఆనందంగా వున్నది ఎప్పుడూ అంటే, అంతులేని కథ సినిమా రూపొందించే సమయంలో రోజు రోజుకూ కొత్త అనుభవాలు ఎదురయ్యేవి. ఒక్కో షాట్‌కు ఒక్కో రోజు ఇరవై ముప్ఫై టేకులయ్యేవి. బాధంతా స్క్రీన్‌పై చూశాక పోయేది’ అంటారు. తమిళంలోనూ నారాయణరావు నటించారు. ‘గుమ్మడి, ఏఎన్నార్, సూర్యకాంతం లాంటి నటులతో కలిసి నటించడం మర్చిపోలేని విషయం’ అంటూ ముగించారు నారాయణ రావు.

-సరయు శేఖర్, 9676247000