సబ్ ఫీచర్

ఎటు చూసినా.. మద్యం పరవళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా సందుసందునా బెల్టుషాపులు ఎల్లవేళలా మందుబాబులకు స్వాగతం పలకడానికి తెరుచుకొని ఉంటాయి. ఒకప్పుడు ఒక వ్యక్తి పొద్దంతా పనిచేసి అలసిపోయి, సాయంత్రం అయ్యే సరికి ఒక గ్లాసు మద్యం తాగి, బుక్కెడు బువ్వ తిని నిద్రబోయేవాడు. ఇరవై ముప్పయి సంవత్సరాల వయసొచ్చిన వ్యక్తులెవ్వరైనా ఒకప్పుడు మద్యం సేవించాలనుకుంటే ఎంతో భయపడేవారు. మద్యం దుకాణం వద్ద తెలిసిన వారెవరైనా వున్నారా? అని చూసుకుంటూ, భయపడుతూ తమ పనిగావించుకునేవారు.
కానీ కాలానుసారంగా ఎన్నో మార్పులు సంభవించాయి. మొదట్లో పండుగలకు, పబ్బాలకు మద్యం సేవిస్తే తర్వాత అదికాస్తా వారానికొకసారికి మారింది. తర్వాత రోజుకొకసారిగామారి, ఇప్పుడది వీలైనప్పుడల్లా, రోజంతా అదే పని అన్నట్టు మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా, నిర్భయంగా, సమయంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ కావల్సినంతగా తాగేస్తున్నారు. వివిధ సర్వేల ఫలితాలను చూస్తుంటే ఈ విషయం సులువుగా అర్థమవుతుంది.
‘వైజ్ గాయ్ రిపోర్టు’ మేరకు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, చండీగఢ్, ముంబయి, పూణె, కోల్‌కత, బెంగళూరులలో 1000 మందిని సర్వేచేస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటికొచ్చాయి. నగరాల్లో కొందరు మహిళలు సైతం వైన్ వంటి ఖరీదైన మద్యాన్ని తీసుకుంటున్నారు. తాగేందుకు మంచినీరు లభించకపోయినా, మారుమూల గ్రామాల్లో సైతం మద్యం అందుబాటులో ఉంటోంది.
ప్రభుత్వాలు మద్యం విక్రయాలకు విచ్చలవిడిగా స్వేచ్ఛనిస్తే ఖజానాకు డబ్బులొస్తాయేమోగానీ, మూడునాలుగు సంవత్సరాలు దాటితే మద్యం ప్రియులు అనారోగ్యం పాలుకావడం ఖాయం. ఎంతోమంది మద్యానికి బానిసలు కావడంతో మానసిక, ఆర్థిక ఇబ్బందులతో రోడ్డునపడే పరిస్థితులు దాపురించాయి. ఉత్పాదిత రంగమంతా నాశనమై దేశం ఆర్థిక పతనానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు ఏ విధంగానున్నాయో ఈమధ్య ‘ఇండియన్ ఆల్కహాల్ కంజంప్షన్ ది చేంజింగ్ బిహేవియర్’ పేరిట వైజ్‌గాయ్ రిపోర్ట్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ నివేదికలోని అంశాలు ఎవరికైనా ఒకింత కలవరానికి గురిచేయక మానవు. ప్రపంచంలోనే మద్యం వినియోగంలో భారతదేశం ప్రథమస్థానంలో నిలిచింది. దేశంలో 2022 నాటికి మద్యం అమ్మకాలు ఏటా 1680 కోట్ల లీటర్లు ఉండవచ్చని అంచనా. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కంటే మద్యం వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, ద్వితీయ స్థానంలో తెలంగాణ ఉండడం గమనార్హం. మద్యం ఏరులైపారుతున్న దృశ్యాలు మన కళ్లకు గోచరిస్తాయి. కేరళ, కర్నాటక, సిక్కిం, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు కూడా మద్యం విక్రయాల్లో ముందు వరసలో నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2015-16 సంవత్సరంలో ఎక్సయిజ్ ఆదాయం 12,474 కోట్లు ఉండగా, 2018-19 నాటికది 17,340 కోట్లకు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 2018 సంవత్సరం ఎక్సయిజ్ ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలకు చేరుకున్నది. 2017 సంవత్సరంతో పోలిస్తే 3,404 కోట్లు అదనంగా మద్యం విక్రయాలపై ఆదాయం సమకూరింది.
2005 సంవత్సరంలో ఒక వ్యక్తి తలసరి మద్యం వినియోగం 2.4 లీటర్ల ఉండగా, 2010 నాటికది రెండు రెట్లు పెరిగి 4.3 లీటర్లకు చేరుకొంది. 2016 నాటికి ఒక వ్యక్తి తలసరి వినియోగం 5.7 లీటర్లకు చేరుకుందంటే ఆశ్చర్యం గాక తప్పదు. మద్యం వినియోగం రానురానూ పెరిగిపోవడంతో శాంతిభద్రతల సమస్య, నేరాల సంఖ్య విషమంగా మారుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించకపోతే భవిష్యత్‌ను తలుచుకుంటే భయం వేయక మానదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో విడుదల చేసిన ‘ఆల్కహాల్ అండ్ హెల్త్ ఆన్ గ్లోబల్ స్టేట్ రిపోర్టు’ ప్రకారం భారత దేశంలో 2016 సంవత్సరంలో మద్యానికి అలవాటుపడి అనారోగ్యం పాలుగావడం, మద్యం సేవించిన మైకంలో ప్రమాదాల బారినబడి 30 లక్షల మంది చనిపోవడం ఆందోళనకరం. మృతుల్లో 23 లక్షల మంది పురుషులు కావడం గమనార్హం. మద్యం మత్తులో గొడవలకు దిగి, హింసలు చెలరేగి 28 శాతం, మద్యపాన కారణంగా కాలేయం చెడి అనారోగ్యం పాలై 21 శాతం, గుండె సంబంధిత వ్యాధులతో 19 శాతం మంది చనిపోయారని నివేదికలు వెల్లడించాయి. తొలుత సరదా కోసమో, కాలక్షేపం కోసమో అలవాటుపడిన మద్యం ప్రియులు, దానికి బానిసలై తమ జీవితాలను కోల్పోతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలను రోడ్డున పడేసిన సందర్భాలు కన్పిస్తున్నాయి.
మద్యం వ్యాపారాన్ని మన దేశం ఎందుకు అదుపులో పెట్టలేకపోతున్నది? ఎందుకు ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు? ఖజానాలోకి డబ్బురాదనా? ప్రభుత్వాల మనుగడ కష్టమవుతుందనా? ఎందుకు ప్రజల అనారోగ్యాలకు కారకులవుతున్నారు?
ఈమధ్యన తెలంగాణ రాష్ట్రంలో బీర్లు దొరకడం లేదని ఒక వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాయడం, అదికాస్తా వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుగొట్టడం చూశాం. మద్యం వ్యాపారం, వినియోగం ఇలాగే కొనసాగితే భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇప్పటికే మిజోరం, కేరళ, గుజరాత్, బిహార్, నాగాలాండ్‌లలో మద్యనిషేధం అమలులో ఉంది. మద్యం విక్రయాలను అరికట్టడానికి ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు కృషిచేశాయి. ఈమధ్యనే మిజోరం అసెంబ్లీలో మద్యపాన నిషేధ బిల్లు-2019ను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
2009 సంవత్సరంనుండి గుజరాత్‌లో మద్యాన్ని ఇళ్ళల్లో తయారుచేస్తే కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించారు. 2015లో బిహార్ రాష్ట్రం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువైన ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా బెల్టుషాపులను రద్దుచేస్తూ ఉత్తర్వుల జారీచేసింది. ఒకేసారి గాకుండా విడుతలవారీగా చర్యలు చేపట్టి మద్యపాన నిషేధంగావించాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది. ఈ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు సైతం మద్యపాన నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
తెలంగాణలో మరొకసారి అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ ఆకర్షణీయమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వివిధ వర్గాల ప్రశంసలు అందుకొంది. అలాగే మద్యపాన నిషేధం విధించేందుకు చర్యలు తీసుకొంటే తెలంగాణ రాష్ట్రం ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ఖజానాకొచ్చే డబ్బు సంగతి చూడకుండా, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, నేరాల నియంత్రం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన సమయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. వచ్చే రెండు మూడు సంవత్సరాలలోనైనా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా మద్యపాన నిషేధం విధించాలి.

-డా. పోలం సైదులు