సబ్ ఫీచర్

సాయుధపోరు కన్నా సాధికారత మిన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానున్న రోజుల్లో అంతరిక్షంలో ప్రత్యేకంగా సొంత కేంద్రం (స్పేస్ స్టేషన్)ను ఏర్పాటు చేయనున్నామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ ఇటీవల ప్రకటించారు. ఆ కేంద్రంలో వ్యోమగాములు 15నుంచి 20 రోజులు గడిపేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రత్యేక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడం ఏ రకంగా చూసినా ఓ అద్భుత ముందడుగు. ఈ ప్రకటన వెలువడిన మరుసటిరోజు అంటే జూన్ 14న మావోయిస్టులు ఝార్ఖండ్- పశ్చిమబంగ సరిహద్దు ప్రాంతంలోని సరాయ్ కేలా-ఖర్సానా జిల్లా తిరుల్ది పోలీసుస్టేషన్ పరిధిలో గస్తీ తిరుగుతున్న పోలీసులపై క్రూరంగా దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. మరికొందరిని గాయపరిచారు. వారి ఆయుధాలు ఎత్తుకెళ్ళారని సమాచారం.
పై రెండు విషయాలను పరిశీలిస్తే ఏది పురోగమనమో, ఏది తిరోగమనమో బోధపడుతుంది. మావోయిస్టులు భద్రతా సిబ్బందిని హతమార్చడం ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు. కాని ఈ చర్యలు ఏ విధంగా ప్రయోజనకరమైనవో అందరూ ఆలోచించాల్సిన అవసరమున్నది.
ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో 90 సంవత్సరాల నుంచి భారత కమ్యూనిస్టులు కలలు కంటూనే ఉన్నారు. చివరికి వారి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆ కుదురులోంచి వచ్చిన మావోయిస్టులు గత 50 సంవత్సరాలుగా సాయుధ పద్ధతుల్లో పోరాడుతున్నా దట్టమైన దండకారణ్యానికే పరిమితం అయ్యారు. భారత కమ్యూనిస్టులు వదిలేసిన లక్ష్యాన్ని తాము సాధిస్తామని మావోలు గొప్పలుపోయినా వాస్తవ పరిస్థితులేమిటో పరిశీలించిన- పరిశీలిస్తున్న పాపాన పోవడం లేదు. మరి ఇది ఏ రకంగా ఆహ్వానించదగ్గ అంశమవుతుంది?
మావోయిస్టుల ‘మాడ్యూల్’ పూర్తిగా మసక బారిందని తెలిసినా ‘మూ ర్ఖం’గా ముందుకు కదలడంలో ఏమాత్రం అర్థం లేదు. విజయం సాధిస్తామన్న విశ్వాసముందని తమకితాము భావిస్తే ఎలా? లక్షలాది.. కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ముడిపడిన విషయంపై సరైన దృష్టికోణం, సమకాలీన సమాజ విశే్లషణపై సరైన పత్రం- వ్యూహం లేకుండానే రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ముందు పొరుగు దేశమైన చైనాలో మావో అనుసరించిన వ్యూహాన్ని.. భారతదేశం చంద్రయాన్, మంగళయాన్ యాత్రలు చేస్తున్న సందర్భంలో రోదసీలో ప్రత్యేకంగా మనకంటూ ఒక స్టేషన్‌ను ఏర్పాటుచేయబోతున్న తరుణంలో- పాశ్చాత్య దేశాలతోపాటు చైనా ఒకే ‘పాలసీ’ని అనుసరిస్తూ తమ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, వారి ఆకాంక్షలకనుగుణంగా ఇతర గ్రహాలపై ‘కాలనీలు’ నిర్మించే పనిలో నిమగ్నమవుతున్న సందర్భంలో- తమ వ్యూహాన్ని అమలుజరుపుతామని మావోలు చెప్పడం హాస్యాస్పదం గాక ఏమవుతుంది?
ఏ దేశపు (చైనా) నాయకుడిని, అక్కడ జరిగిన ‘లాంగ్ మార్చ్’ను స్ఫూర్తిగా తీసుకుని మావోయిస్టులు దండకారణ్యంలో దండు నిర్మిస్తున్నారో ఆ దేశం ఇప్పుడు ఏ ‘దిశ’ను అనుసరిస్తున్నదో పరిశీలించాలి కదా? గత ‘మార్గం’- వర్తమానంలో పనికిరాదని ఆ దేశ అత్యున్నత నాయకత్వం దశాబ్దాల క్రితమే బహిరంగంగా ప్రకటించింది. వర్తమానంలో జీవించాలని, సమకాలీన పరిస్థితులకనుగుణంగా వ్యవహరించాలని గట్టిగా బోధించినా పట్టించుకోకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ దశాబ్దాల పాటు నినదిస్తూ మావోలు సాయుధ పోరాటం పేర వేల మంది సొంత ప్రజలను, భద్రతా సిబ్బందిని కడతేరుస్తూపోతే ఏమిటి ప్రయోజనం?
ఎక్కడ కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకుందో ఇప్పుడు ఆ సమాజాలన్నీ ప్రజాస్వామ్యం వెలుగులో, సాంకేతిక పరిజ్ఞానం ఇరుసుగా చేసుకుని, పెద్దపెద్ద అంగలు వేస్తూ ముందుకు కదులుతున్నాయి. ఈ విషయాలన్నీ చిటికెలో ప్రపంచమంతటికీ తెలిసిపోతున్న సందర్భంలో వాటిని పట్టించుకోకుండా, పరిశీలించకుండా, అధ్యయనం చేయకుండా ఇంకా పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, అవాస్తవిక కలలు కంటూ ప్రజలకు కన్నీళ్లు మిగిలిస్తూపోతే ఏమిటి అర్థం?
తాము ‘త్యాగాలు’ చేస్తున్నాం.. ఆ త్యాగాల పునాదులపై కొత్త సమాజం నిర్మిస్తాం అని ఎంత పునఃప్రకటించినా ఆ మాట పాతబడిందని, ఆ భావజాలం భాగ్యవంతమైనది కాదని తేటతెల్లమై దశాబ్దాలు గడుస్తున్నా, సాక్షాత్తూ ఆ సమాజాలకు నాయకత్వం వహించినవారే విఫల విషయాన్ని ప్రకటించినా, అక్కడి ప్రజల తిరస్కారానికి ఆ భావజాలం గురైనా గుర్తించకపోవడం దారుణం గాక ఏమవుతుంది? ఇప్పుడు మావోయిస్టులు ఏం చెబుతున్నారో రెండవ ప్రపంచ యుద్ధకాలానికి ముందు భారత కమ్యూనిస్టులు సైతం అదే చెప్పారు. ఇంతకన్నా ఎక్కువ నిబద్ధత-నిమగ్నతతో, అంకితభావంతో పనిచేస్తూ ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆయా దేశాలు స్వాతంత్య్రాన్ని పొందడంతో, సరికొత్త గాలి వీచడంతో ప్రపంచ పరిణామంలో భాగంగా కోట్లాది మంది ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందారు. కమ్యూనిస్టులు కోరుకున్నది వారి ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. దాంతో వారి ప్రాసంగికత లేకుండాపోయింది.
వర్తమానంలో సరికొత్త సాంకేతిక విప్లవం, నాల్గవ పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన పరిణామాలు ప్రజల్ని మరింత సాధికారత దిశగా నడిపిస్తున్నాయి. అర్ధ శతాబ్దం క్రితం స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభిస్తే ప్రస్తుతం మావోల ప్రమేయం లేకుండా ప్రజలు సాధికారత వైపు కదులుతున్నారు. ప్రపంచమంతటా ప్రజలు కోరుకుంటున్నది ఇదే... ఎలాంటి సాయుధ విప్లవాల అవసరం లేకుండానే ప్రజలు సాధికారితను సాధిస్తున్నప్పుడు- సాధికారత నెపంతో, స్వావలంబన సాకుతో మావోలు సాయుధ పోరాటం, ధ్వంస రచన చేస్తామంటే దానికి మాన్యత ఉంటుందా? ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, సాధికారిత కేవలం తమవల్లనే దక్కుతాయని మావోయిస్టులు ‘గోబెల్స్’ ప్రచారం చేస్తూ వుంటారు. అందులో ‘పస’లేదని ఎప్పుడో తేలిపోయింది.
ప్రజలకు అవసరమైన సాధికారత, అభివృద్ధి, నైపుణ్యాలు, నవ నవోనే్మషణమైన ప్రయోగాలు మార్క్సిస్టు భావజాల సమాజాలు, ఆ సిద్ధాంతం ఆధారంగా పరిపాలించిన ప్రభుత్వాలు చేయలేవని, ఇవ్వలేవని రుజువైంది. అయినా ఇంకా ఇంకా ప్రయోగాల పేర, కాలం చెల్లిన సిద్ధాంతం పేర, అటకెక్కిన ఆలోచనల సాయంతో ప్రజలను తిరోగమన దారిలోకి మళ్లిస్తామని ప్రతిజ్ఞలు చేస్తే ఎలా? ప్రజల్ని ప్రేమించేవారు చేయాల్సిన పనేనా ఇది? మావోయిస్టులు పునరాలోచన చేయాల్సిన సమయం ఇది తప్ప సాయుధ దాడులు చేసి ప్రజల్ని, భద్రతా సిబ్బందిని హతమార్చేకాలం కానే కాదు! ప్రజల్ని సాధికారత వైపు సమాయత్తం చేయడం చైతన్యం గల ప్రతి ఒక్కరి కర్తవ్యం.. మావోయిస్టులు సహా.

-వుప్పల నరసింహం 99857 81799