సబ్ ఫీచర్

మోదీ చేయాల్సిన పనులెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత దక్షిణ భారతంలోని గురవాయూర్ శ్రీకృష్ణుణ్ణి, తిరుమల వేంకటేశ్వరుణ్ణి సందర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ భాజపా దూసుకుపోవాలన్న ఆకాంక్షతో మోదీ ఇప్పటికే పావులు కదుపుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం కేరళలో వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేరళ ఓటర్లు ఒకసారి వామపక్ష ఫ్రంట్‌కు, ఇంకోసారి కాంగ్రెస్ కూటమికి అధికారం కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కేరళ జనాభాలో యాభై ఎనిమిది శాతం మంది హిందువులు ఉన్నారు. తక్కినవారు క్రైస్తవులు, ముస్లిములు, హిందువులలో సమైక్యత లేదు. వీరిలో మళ్లీ పెద్దసంఖ్యలో ‘కమ్యూనిస్టు మతస్థులు’ ఉన్నారు. ఈ కారణంగా ఇక్కడ భాజపా ప్రభుత్వం సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు. కాకుంటే ‘కమల దళాని’కి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అవతరించి అప్రతిహతంగా నాలుగు దశాబ్దాలు తన ప్రభావాన్ని చూపింది. ఐతే అళియరామరాయలు విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైనట్లు ఆంధ్రలో కూడా అళియనాయుడు తెలుగుదేశం పార్టీకి భరతవాక్యం పలికాడు. (అళియ అంటే కన్నడ భాషలో అల్లుడు అని అర్థం) ఏపీలో కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అదృశ్యమైనాయి. భాజపా ఇంకా తన ఖాతా తెరవలేదు. ఈ దశలో రాజకీయ శూన్యాన్ని వైకాపా అధినేత వైఎస్ జగన్ పూరించారు. కేంద్రంపై తిరుగుబాటు చేస్తానని చంద్రబాబు మాదిరి జగన్ అనడం లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే తగినన్ని నిధులు పొందే అవకాశం ఉంటుంది. ఆమధ్య విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యా ప్రయత్నం జరిగినప్పుడు సానుభూతి ప్రకటించకపోగా, ఆ ఉదంతాన్ని ‘కోడికత్తి డ్రామా’ అంటూ తెలుగుదేశం పార్టీవారు పరిహసించారు. ఈ మానసిక బాధ నుండి జగన్మోహన్‌రెడ్డి ఇంకా బయటపడలేదు. కాబట్టి త్వరలో ప్రతీకార చర్యలు మొదలుకావటం సహజం. ఓ వర్గం మీడియా పట్ల తాను కోపంగా ఉన్నట్లు జగన్ బహిరంగంగానే ప్రకటించారు. ఆయన అధికారంలోకి రాగానే రైతులకు, మహిళలకు, ఇతర వర్గాలకు రాయితీలు కురిపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఏపీలో సీబీఐ అధికారుల ప్రవేశంపై చంద్రబాబు విధించిన ఆంక్షలను జగన్ ఎత్తివేశారు. అంటే సీఎం రమేశ్, కుటుంబరావు, నటుడు శివాజీ, సుజనాచౌదరి వంటి వ్యక్తులపైన మాత్రమే కాదు చంద్రబాబు నాయుడి ఆర్థిక మూలాలపై కూడా విచారణ జరుగబోతున్నది.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో భాజపా ఎలా పుంజుకొంటున్నది పెద్ద ప్రశే్న! ఏపీ ప్రజల మనసు గెలవాలంటే నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా నిర్మించే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. ఇవి చేసినపుడే ఏపీ ప్రజలకు ఊరట కలుగుతుంది. అవసరమైతే ప్రత్యేక హోదా విషయంలో రాజ్యాంగ సవరణ చేసి ఆదుకొంటేనే ఆంధ్ర ప్రాంతంలో భాజపా మనుగడ సాగించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం కేంద్రంలో మోదీకి ఎవరి మద్దతు అవసరం లేకపోయినప్పటికీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా వైకాపాను ఎన్‌డీఏలో చేర్చుకోవటం ఉభయ తారకంగా ఉంటుంది. వింధ్య పర్వతాలకు దిగువ భాగంలోని రాష్ట్రాల్లో భాజపాకు తెలంగాణ, కర్నాటకల్లో మాత్రమే అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భాజపా కనీసం ప్రతిపక్ష హోదా అయినా సాధించాలి. బలమైన కమ్మ-కాపు సామాజిక వర్గాలకు ఆ పార్టీ చేరువ కావాలి. తెలుగుదేశం పార్టీ వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చేందుకు భాజపా ఇప్పటినుండే ప్రయత్నిస్తే ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
***
తమిళులు ఎందుకు ఇతరులతో ఇమడలేకపోతున్నారు? గతంలో మద్రాసు నుండి ఆంధ్రులను తరిమికొట్టారు. దాదాపు లక్ష మంది సింహళీయులను ఎల్‌టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ హత్య చేయించాడు. విఘ్నేశ్వరన్ అనే శ్రీలంక మాజీ మంత్రి తాజాగా ఒక ప్రకటన చేస్తూ ఈస్టర్ పర్వదినం నాడు వందలాది క్రైస్తవులను హత మార్చిన జిహాదీలకు బహిరంగంగా మద్దతు ప్రకటించటం దారుణం. డీఎంకే అధినేత స్టాలిన్‌కు, వేలుపిళ్లై ప్రభాకరన్‌కు, విఘ్నేశ్వరన్‌కు జిహాదీలంటే ఎందుకింత వ్యామోహం? నేషనల్ తౌహీద్ జమాత్ అనే శ్రీలంకలోని ఉగ్రవాద సంస్థను అక్కడి ప్రభుత్వం నిషేధించటం అన్యాయం అని సి.వి.విఘ్నేశ్వరన్ ఎందుకు వాదిస్తున్నాడు? జాఫ్నా వంటి తమిళుల ఆధిపత్య ప్రాంతాల్లో తొమ్మిది శాతం తమిళ ముస్లిములు ఉంటున్నారు. కేవలం వీరి ఓట్ల కోసం విఘ్నేశ్వరన్ ఉగ్రవాదానికి మద్దతుగా శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ మాట్లాడుతున్నాడనేది సుస్పష్టం. ఈ ధోరణి తమిళులకు ఆత్మహత్యా సదృశమవుతుంది.
పెచ్చుమీరిన హింసావాదంతో శ్రీలంక నాలుగు దశాబ్దాలుగా మరుభూమిని తలపిస్తున్నది. శ్రీలంకపై ఆధిపత్యం సాదించాలని చైనా చేస్తున్న ప్రయత్నాలు జగద్విదితం. ఈ దశలో తమిళులు ఇటు న్యూఢిల్లీకి, అటు కొలంబోకు మద్దతు ప్రకటించకపోతే వారి అస్తిత్వం చరిత్రలో ప్రశ్నార్థకంగా మారిపోతుందని తమిళ ఈలం నాయకులు గ్రహించాలి. దేశమంతా వీస్తున్న భాజపా ప్రభంజనానికి తమిళనాడులో తాము అడ్డుకట్టవేయగలిగామని స్టాలిన్ చెప్పుకోవటం తమిళ ప్రజలకు తీరని అపకారం చేస్తున్నది. భారత ప్రధాన జీవన స్రవంతిలో కలియని ఏ రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో అస్తిత్వం ఉండదు. ఈ విషయాన్ని మన ఫెడరలిస్టులు గుర్తించటం మంచిది.
***
దెబ్బతిన్న పాము ఎప్పుడైనా అదను చూసి కరవక మానదు. రాజకీయంగా భంగపాటు చెందిన నాయకులు చేతుల ముడుచుకొని కూర్చుంటారని అనుకోవటం పొరపాటు. అమరావతిలో జగన్‌ను ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తాడని అంతగా రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్లకు కూడా తెలుసు. అలాగే ఢిల్లీలో మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయడానికి చైనా, పాకిస్తాన్, అమెరికాలు నిస్సందేహంగా ప్రయత్నిస్తాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం వచ్చింది. బెంగాల్‌లో రాష్టప్రతి పాలన విధించి, అక్కడ తిష్టవేసిన రెండు కోట్ల మంది బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపాలన్న వాదన నానాటికీ బలపడుతోంది. అస్సాంలోని మయన్మార్ చొరబాటుదారులను కూడా వారి స్వదేశానికి పంపాలి. ఆక్రమిత కశ్మీర్‌కు విముక్తి కల్పించాలి. ఆర్టికల్ 370- 36-ఎ రద్దుచేసి భారత రాజ్యాంగం కశ్మీర్‌లోనూ వర్తించేటట్లు చూడాలి. బ్యాంక్ ఆఫ్ కశ్మీరును ఎస్.బి.ఐలో విలీనం చేయాలి. అందులో ఎందరో ఉగ్రవాదులకు ఖాతాలున్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కేసు సందర్భంగా మైఖేల్ ఇచ్చిన వాంగ్మూలాలు ఏమైనట్లు? నల్లధనం కూడబెట్టుకున్న బడాబాబులపై, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులపై చర్యలు ఎప్పుడు తీసుకొంటారు? హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐసిస్ రిక్రూట్‌మెంటు సెంటర్లు ఉన్న సంగతి పాలకులకు తెలిసిందే. ఈ విషయంపై మోదీ ఎలా వ్యవహరిస్తారు?
***
అందలాలు అందుకోవాలనే ఆశ ఎందరికో ఉండవచ్చు. అవకాశాలు మాత్రం కొందరికే లభిస్తాయి. ముఖ్యమంత్రి కావాలని, ప్రధానమంత్రి కావాలని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆశపడవచ్చు. ఒక ఛాయ్‌వాలా భారత ప్రధానిగా మారి అందలాలు అందుకోవటం ప్రజాస్వామ్యం బలాన్ని సూచిస్తున్నది. గింజ నాటగానే వెంటనే ఫలితాలు ఆశించకూడదు. ఒక్కోసారి జీవితమంతా ఎదురుచూచినా మనం ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటుగా రావచ్చు. అందుకని షార్ట్‌కట్స్ అవలంబిస్తే చేటు తప్పదు. వాపు అనేది బలం కాదు. సినీనటులంతా ఎంజీఆర్‌లు, ఎన్‌టీఆర్‌లు కాలేరు. కృష్ణలు, పవన్‌కల్యాణ్‌లు, చిరంజీవులు, బాబూమోహన్‌లు ఎందరో ఉన్నారు. స్మృతి ఇరానీ గతంలో టీవీ నటి. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి మోదీ మంత్రివర్గంలో పదవిని దక్కించుకున్నారు. ఆమె చేతిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎలా ఓడిపోయారు? జయప్రద, శత్రుఘ్న సిన్హా, ప్రకాశ్‌రాజ్ ఎన్నికల్లో ఎందుకు భంగపడ్డారు? వోట్ల కోసం మతం మారినవారు, పార్టీలు మారినవారు ఎన్నికల్లో గెలవలేక పోయారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. బంగారం లాంటి ఆలిండియా రేడియో ఉద్యోగం మానుకొని సినీ వ్యామోహంతో మద్రాసు చేరిన ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య చివరి దశలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చాలామందికి తెలుసు. సినిమా రంగం అనేది మాయ జలతారు. రంగుల వల, అందని కల. అన్నింటికీ సిద్ధపడిన వారు మాత్రమే రాజకీయాల్లోకి, చలనచిత్ర రంగంలోకి అడుగుపెడతారు. అక్కడి నూతులు గోతులూ చూచిన తర్వాత గత జల సేతుబంధనం అవుతుంది.
***
హైదరాబాద్‌లో జి.కిషన్‌రెడ్డి ప్రతిఫలాపేక్ష లేని సామాజిక కార్యకర్త. ఆయన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఐనా కుంగిపోలేదు. అతనికి భాజపా అధినాయకత్వం సికిందరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్టు ఇచ్చింది. ఎంపీగా ఘన విజయం సాధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినాడు. ఇది సిన్సియారిటీకి, సహనానికి ప్రతిఫలం. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నట్లు ‘అధికారం ఇన్‌స్టాంట్ కాఫీ’ కాదు. ఈ తెలివిడి పవన్ కల్యాణ్‌కు లేదు, ప్రకాశ్‌రాజ్‌కూ లేదు. ప్రధాని పీఠం అధిరోహించాలని అర్జున్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీ, జగజ్జీవన్ రాం, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ, అజిత్ సింగ్, మమతాబెనర్జీ, ములాయం సింగ్ వంటి ఎందరెందరో నేతలు ఆశలు పెట్టుకున్నారు. అర్హతకు, అవకాశానికి చాలా అంతరం ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తిస్తే మన నేతలకు ప్రధాని పదవి రాకపోయినా కనీసం మనశ్శాంతి లభిస్తుంది.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్