సబ్ ఫీచర్

‘జమిలి’ భ్రమలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే నినాదం ఇటీవల ఊపందుకుంది. చట్టసభలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వాదనను ప్రధాని మోదీ మళ్లీ వినిపించడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో లోక్‌సభకు, అన్ని శాసనసభలకూ ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరగడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపితే నిజంగానే ప్రయోజనం ఉంటుందా? తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువవుతోందని, దీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటున్నందున అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని కొందరు అంటున్నారు. ఇలాంటివారు ప్రజాస్వామ్యానికి ఉండే విశిష్టతను మరచిపోతున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ముందుగా జరిగి, మరికొన్ని రాష్ట్రాల్లో ఆ తర్వాత జరిగితే ఫలితాల ప్రభావం జాతీయ పార్టీలపైనే ఎక్కువగా ఉంటుంది. సానుకూల ఫలితాలు వుంటే పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. లేనట్లయితే అది అన్ని రాష్ట్రాలలోకూడా ప్రభావం చూపి కేంద్రంలో పాలనా వ్యవస్థపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. గత అయిదేళ్ల కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అధికార భాజపా క్లీన్‌స్వీప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలన్నింటిలో వోటింగ్ యంత్రాల (ఈవీఎంలు) వల్లే ఓడిపోతున్నామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం లెక్కచేయని ప్రభుత్వం అది వారి అసమర్థత అని కొట్టిపారేస్తుంటే, ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంల్లో టాంపరింగ్‌ను రుజువు చేయాలని సవాల్ చేస్తోంది.
జమిలి ఎన్నికలు సాధ్యమేనా? ఆ వ్యవస్థ నిలబడుతుందా? అంటే- భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల చరిత్ర తెలిసినవారు ఇది అసాధ్యం అనే చెబుతారు. 1970 నుండి దేశంలో సంకీర్ణాలు మొదలయ్యాయి. ఇక అడపాదడపా మినహాయిస్తే ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. రాజీవ్ గాంధీ మరణం అనంతరం 2014 దాకా సాగింది సంకీర్ణ సంగమమే. వాజపేయి ప్రభుత్వం సంకీర్ణ రాజకీయాల వల్ల ఏమయ్యిందో అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలలో ఎన్‌డీఏ పూర్తి మెజారిటీ సాధించినా నడిచింది ఎన్డీయే సంకీర్ణమే. భాజపా మిత్రపక్షాల మద్దతు కోల్పోయినా ప్రభుత్వం నిలబడగలుగుతుంది కానీ రాజ్యసభలో మాత్రం మొండి చెయ్యే మిగులుతుంది. బహుశా ఆ అంశమే ఇంకా ఎన్డీయే కూటమిగా కొనసాగడానికి కారణం. బిల్లులు, చట్టాలు ఆమోదం పొందడానికి ఉభయ సభల సమ్మతి కావాలి కాబట్టి అనేక నిర్ణయాలు ఆగిపోయే అవకాశముంది. ఒకవేళ జమిలి ఎన్నికల తర్వాత కూడా సంకీర్ణమే ఏర్పడితే అప్పుడు ప్రభుత్వాలు మధ్యలో కూలిపోతే, రాజ్యాంగ సంక్షోభం తలెత్తితే ఏంటి పరిస్థితి?.
జమిలి ఎన్నికలలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో ఐదేళ్ళు సాగుతాయని రాజ్యాంగ సవరణ చేయలేరుగా. అది ప్రజాస్వామ్య విరుద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తలెత్తిన సంక్షోభం అందరికీ తెలిసిందే. అటువంటి తిరుగుబాట్లు భవిష్యత్తులో మరే రాష్ట్రంలో కూడా రావని చెప్పగలమా? మినీ ఇండియాగా పిలవబడే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం అధిక కాలం రాష్టప్రతి పాలనలో ఉంది. రాజ్యాంగ సంక్షోభం కారణంగా అనే విషయం తెలియనిదెవరికి? జయలలిత మరణం అనంతరం తమిళనాడులో జరిగిన సంఘటనలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీయలేదా? మన దేశ రాజకీయం ఎప్పుడూ ఎత్తులు పైఎత్తులు, అవకాశం ఉంటే ప్రభుత్వాలను పడగొట్టే పొత్తులతోనే సాగుతుంది. కాబట్టి ఇంత సంక్లిష్టత ఉన్న అంశమైన జమిలి ఎన్నికలు మన దేశానికి ఉపయోగపడని అంశం. ఒకేసారి ఎన్నికల కోసం రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమతి పెంచడం, తగ్గించడం రాజ్యాంగం హక్కులను భంగపరచడమే అవుతుంది.
మన దేశంలో జరగాల్సిన ఎన్నికల సంస్కరణలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఫిరాయింపుల రాజకీయం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ పెచ్చుమీరిపోయింది. ఫిరాయింపులకు బహుమానం ఏకంగా మంత్రి పదవులదాకా వెళ్ళింది. పార్టీ ఫిరాయించడమే ప్రజాస్వామ్యమయితే, ఆ పదాన్ని నిషేధించడమే మేలు. అంతర్గతంగా జరుగుతున్నదీ ఇదే. అధికారం సుస్థిరం చేసుకొనేందుకు ఫిరాయింపులను అధికార పార్టీలు ప్రోత్సహిస్తుంటే, అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు చాలామంది నేతలు వింతవాదాన్ని వినిపిస్తున్నారు. నేటి మన రాజకీయ నాయకుల ప్రవర్తన ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. అసలు ఉన్నత న్యాయస్థానాలు కూడా వారిని ఏమీచేయలేక పోతున్నాయి అంటే బాధాకరం. దీనిపై ఇప్పుడు సంస్కరణలు రావాలి. ఫిరాయింపులను సమూలంగా నివారించే చట్టాలు రావాలి. ఉన్న చట్టాల్లో లొసుగులే ఈ దుస్థితికి కారణం. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు ప్రతిపక్షాలు ఉండవు. ఆ నియంతృత్వాన్ని భరించగలిగే శక్తి మనకు ఉందా?
ఎన్నికలలో జరగాల్సిన సంస్కరణలు చాలానే ఉన్నాయి. కొన్ని విదేశాల్లో మాదరి ఎన్నికలు దామాషా పద్ధతిలో పెట్టాలి. కేవలం కొన్ని వోట్లు ఎక్కువ వచ్చినవారు విజేతలుగా నిర్ణయించబడుతున్న మూసధోరణి ఎన్నికల పట్ల ఏమాత్రం ఆసక్తిని పెంచలేకపోతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా, తెదేపా, జనసేన పార్టీలకు తప్పితే మరో పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం లేదు. వేల సంఖ్యలో ఓట్లుసాధించుకుంటున్న పార్టీలు ఊసులో లేకుండాపోతున్నాయి. ఈ పద్ధతి మారే ఆలోచన లేని ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రతి ఎన్నికల్లో గణనీయమైన ఓట్లుసాధించే పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ వారెవరికీ ప్రాతినిధ్యం ఉండదు. కొందరికి ప్రాతినిధ్యం అసలే ఉండదు. వీటిలో ప్రధాన ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీలే. వారికి ఓట్లువస్తాయి కానీ సీట్లుండవు. గతంలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో 22 శాతం ఓట్లు సాధించిన బీఎస్పీ 19 సీట్లే సాధించడం ఎంత వింతగా అనిపిస్తుందో? 2009లో ప్రతిపక్షంగా బీజేపీకి వచ్చిన ఓట్లుశాతం 18.80 కానీ వారు గెలుపొందిన సీట్లు 116. కానీ 2014లో 19.3 శాతం ఓట్లుసాధించిన కాంగ్రెస్ 44 సీట్లు మాత్రమే సాధించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేక పోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 4 శాతం ఓట్లు సాధించిన బీఎస్పీ ఒక్క సీటుకూడా సాధించలేకపోయింది. కానీ 3.4 శాతం ఓట్లు సాధించిన సమాజ్‌వాదీ 6 సీట్లు సాధించగలిగింది. విచిత్రమేమిటంటే ఇదే ఎన్నికల్లో 3.3 శాతం ఓట్లు అన్నాడీఎంకే 37 సీట్లు సాధించింది. 3.3 శాతం ఓట్లతో కమ్యూనిస్టుపార్టీ 9 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఇంతకంటే అసంబద్ధ విధానం మరొకటి ఉండదని ఈ ఫలితాలు చూసినవారికి యిట్టే అర్థమవుతుంది. 2004 ఎన్నికల్లో 1.81 శాతం మాత్రమే ఓట్లుసాధించిన డిఎంకే 16 స్థానాలు సాధిస్తే అదే ఓటు శాతంతో శివసేన 12 సీట్లు సాధించింది. అదే ఎన్నికల్లో 2 శాతంకి పైగా ఓట్లుసాధించిన ఎన్సీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుపొందింది. 3.4 శాతం ఓట్లుసాధించిన తెలుగుదేశం కేవలం 5 సీట్లే సాధించింది. ఇదెలా ప్రజాభిప్రాయానికి విలువిస్తున్న విధానం? ఎక్కువ ఓట్లువచ్చినవారికి ఒక్కసీటు కూడా పార్లమెంట్ లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఓటుశాతం బాగా వచ్చిన వారికి సీట్లు ఎక్కువ రాకపోవడం తక్కువ ఓట్లుఉన్నవారికి పార్లమెంట్‌లో పదుల సంఖ్యలో ఎంపీలు ఉండటం ఏ విధంగా ప్రజాస్వామ్యం? ఇందువల్లనే ప్రజల్లో ఓట్లపట్ల ఆసక్తిపెరగడం లేదు. ప్రజలలో ఎన్నికల పట్ల ఆసక్తి పెరగాలంటే, అందరికీ ప్రాతినిధ్యం కావాలంటే సాధించిన ఓట్ల శాతాన్నిబట్టి సీట్లు నిర్ణయించాల్సిందే. ఇప్పుడు దేశంలో కావాల్సిన సంస్కరణ ఇదే. జమిలి ఎన్నికలో మరొకటో కాదు.
దేశాన్ని ఏకం చేయాలంటే ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఫిరాయింపులు నిర్ధాక్షిణ్యంగా నిరోధించడం, ఓట్ల శాతాన్నిబట్టి సీట్లు నిర్ణయించడం ద్వారా కేవలం పార్టీలే కాకుండా సామాన్య వ్యక్తులు, ప్రజా సంఘాలు కూడా ప్రాతినిధ్యం పొందవచ్చు అని నిరూపించడం ఒక్కటే మార్గం. ఇలాచేసిన రోజున మనం ప్రపంచానికే ఎన్నికల వ్యవస్థలో ఆదర్శమవుతాం. మన దేశ రాజకీయాల పరిస్థితి ఇప్పుడు- ‘ఇచట నైతికత సంచరించుటకు తావే లేదు’అన్నట్లుగా ఉంది. మద్యం, ధనం, రాయితీలు, ఉచిత పథకాలే ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. ఈ మూస ఎన్నికలను మోసపూరిత ఎన్నికలు అంటే అతిశయోక్తి కాదు.
ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ప్రజల అభిప్రాయం బ్రతకాలి. ప్రజల అభిప్రాయం బ్రతకాలంటే వారు బలపరుస్తున్నవారి ప్రాతినిధ్యం బ్రతకాలి. ఇప్పుడు అందుకనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసిన పార్టీల ప్రతినిధులు చట్టసభల్లో లేకుంటే ఆ ఎన్నిక విధానమే దండగ. ఆ సంస్కరణలు జరగనంత కాలం జమిలి ఆలోచనే ఓ భ్రమ.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కాదు నేటి మన నినాదం. మన దేశం మార్పుకి దోహదమవ్వాలి.. జనాభిప్రాయం ప్రతిఫలించాలి.. అన్నదే జన నినాదం కావాలి. సాంకేతిక భారతం కంటే- ముందు మనకు కావాల్సింది సామాజిక భారతం.

-పచ్చల రాజేష్ 83318 23086