సబ్ ఫీచర్

పిల్లల్లో హుషారు లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు హుషారుగా లేరా? పరధ్యానంగా ఉంటున్నారా? అయితే ఇది ఆలోచించాల్సి విషయమే.. ఇంట్లో పెద్దలు ఏదైనా విషయం చెబుతుంటే ఇక చాలన్నట్లు, విననట్లు ఉండటం.. క్లాస్‌లో కూడా టీచర్ చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్లే కనిపించడం.. కానీ టీచర్ చెప్పిన పాఠం గురించి ప్రశ్నిస్తే తెల్లమొహం వేయడం.. ఇవన్నీ పరధ్యానంగా ఉండే పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు. ఏదైనా విషయాన్ని లేక సంఘటనను గురించి లోతుగా ఆలోచించడం, అప్పటి ఘటనతో తాదాత్మ్యత చెందినప్పుడు ఎవరైనా కాస్తంత ఏమరుపాటుగా ఉండటం సహజమే.. అయితే ఈ పరిస్థితి రోజువారీ వ్యవహారంగా మారి ఎప్పుడూ మనిషి ఒకచోట, మనసు ఒకచోట ఉన్నట్లు ఉంటే దాన్ని పరధ్యానం అంటారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. ఇలా పరధ్యానంగా ఉన్నవారు దేనిపైనా దృష్టిని కేంద్రీకరించలేరు. హుషారుగా ఉండలేరు. పెరిగే పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. కేవలం లక్షణాలను బట్టి పరధ్యానాన్ని మానసిక వ్యాధిగా పరిగణించలేము. అయితే ఇది కొన్ని రకాల మానసిక సమస్యల లక్షణం కావచ్చు. నిజానికి గొప్ప తెలివితేటలున్నవారే అప్పుడప్పుడూ పరధ్యానంగా కనిపిస్తారనే విషయాన్ని కూడా పరిశోధకులు చెబుతున్నారు.
లక్షణాలు
* ఇతర పిల్లల మాదిరిగా పరధ్యానంగా ఉండే పిల్లలకు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రతా ఉండదు. వీరు సున్నిత స్వభావులు. ఎప్పుడూ ఊహల్లో ఉంటారు. భవిష్యత్తును పలు కోణాల్లో ఊహిస్తూ ఉంటారు.
* చదువు పట్ల ఆసక్తిని ప్రదర్శించడం, కష్టపడి చదవడం ఉండవు. వేషధారణ, అవసరాల గురించి అంత ఆసక్తిని కనబరచరు. హుషారుగా కనిపించరు.
* ఎప్పుడూ ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం చేస్తారు. ఒక్కోసారి ఎదురుగా మనిషి ఉన్నా పట్టనట్లు, ఉదాసీనంగా ఉంటారు.
* అవకాశం వచ్చినా ప్రతిభను చాటుకునేందుకు ఉత్సాహం చూపరు. ఏదైనా విషయం అడిగితే క్లుప్తంగా, అనాసక్తిగా జవాబు చెబుతారు.
* ఎప్పుడూ ప్రశాంతతను కోరుకునే వీరు ఉత్సాహంగా, గందరగోళంగా ఉండే వాతావరణానికి దూరంగా ఉంటారు.
* ప్రతి చిన్న పనికీ ఇతరులపై ఆధారపడతారు.
* పనిచేస్తూనే ఉంటారుకానీ ఏ పని చేస్తున్నావని పెద్దలు అడిగితే వెంటనే జవాబు చెప్పలేరు.
* ఇచ్చిన మాటను నిలుపుకోలేరు. అదేమని ప్రశ్నిస్తే బిక్కమొహం వేస్తారు.
* కళ్లముందు కనిపించే వస్తువును కూడా గుర్తించలేక వెతుకుతూ ఉంటారు.
* తోటి పిల్లలతో కలవరు కనుక వీరికి ఎక్కువమంది స్నేహితులు ఉండరు.
కారణాలు
* ఇంట్లో పెద్దవారి నమ్మకాన్ని పొందలేకపోవడం. పెద్దలు, పిల్లలను నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా పిల్లలు ఈ స్థితిని పొందుతారు.
* పెద్దలు అతిగారాబం చేసి పిల్లలను స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇవ్వలేకపోవడం.
* పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు..
* ఏ ఇతర వ్యాధులకైనా మందులు వాడినప్పుడు..
* ఒక్కోసారి ఇది వంశపారంపర్యంగా వస్తుంది.
తీసుకోవాల్సిన చర్యలు
* పరధ్యానంగా ఎందుకున్నారో పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని అడగాలి.
* ఇంట్లో వారికి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే సమస్యకు సులువైన పరిష్కారం దొరుకుతుంది.
* తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల కోసం తగినంత సమయం కేటాయించాలి. వారితో స్నేహంగా మసలుకోవాలి.
* పిల్లలకు ఇష్టమైన వ్యాపకాలను గుర్తించి వారితో కలిసి పెద్దలూ వాటిని చేయాలి. పిల్లలు బాగా చేసినప్పుడు వారిని మెచ్చుకోవాలి.
* ఉదయం మొదలు రాత్రి వరకు పిల్లలు చేసిన పనులన్నీ ఒక డైరీలో వరుస క్రమంలో రాసేలా అలవాటు చేయాలి. పనిని, సమయాన్ని సమన్వయం చేసుకోవడం గురించి వారికి వివరించాలి.
* పిల్లలకు ఏకాగ్రత కుదిరేందుకు సంగీతం, సాహిత్యం చదవడం, చిత్రలేఖనం వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి.
* ఏది జరిగినా మంచికే అనే భావనను పిల్లల్లో కలిగించి, వారిలో ఉన్న అనవసరమైన ఆందోళనలను దూరం చేయాలి.
* సమయానుకూలంగా పనిని విభజించి దానికి తగినట్లుగా పిల్లలు పనులు చేసేలా ప్రోత్సహించాలి.
* పిల్లల ఏకాగ్రత పెరిగేందుకు ఉపయోగపడే పొడుపు కథలు, పజిల్స్ సాధన, చెస్ వంటి వాటిని అలవాటు చేయాలి.
* ఇంకా కూడా పిల్లలు డిప్రెషన్ ఉన్నట్లు కనిపించినా, వారిలో మానసిక రుగ్మత ఉన్నట్లు అనిపిస్తే వారిని వెంటనే మనస్తత్వ నిపుణులకు చూపించి తగు చికిత్సను ఇప్పించాలి.