సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర విషయములనుండి మనస్సును మఱల్చుట నాకు కష్టమనిపించలేదు గాని కేవల చైతన్యసారమై, దేదీప్యమానమై యొప్పు శ్రీలోకేశ్వరి రూపము నాకు మిగుల చనవైన కారణమున ఆ దివ్య స్వరూపము నాకు సత్యస్వరూపమున ప్రత్యక్షమై నా మనస్సును నామరూప ప్రపంచమును దాటి పోనీయకుండెను. ఎన్నిసారులు అద్వైతముపై మనస్సును నిలుప బ్రయత్నించినను ప్రతి పర్యాయమును ఆ రూపము నాకు అడ్డువచ్చుచునే యుండెను. అప్పుడిక నిరాశుడవై, ‘ఇది నాకు సాధ్యము కాకున్నది. నా మనస్సును నిరుపాధిక స్థితికి గొనిపోయి ఆత్మను ‘ముఖాముఖిని దర్శింపజాలకున్నాను’అని దిగంబరునితో జెప్ప, నాతడొకించుక కోపదృష్టితో నిట్లు నిష్ఠురముగ బలికెను. ‘ఏమి నీకిది సాధ్యముకాకున్నదా? చూచెదను. నీకిది సాధ్యమైతీరవలెను!’ అంతలో నాతడేదియోయొక వస్తువుకొఱకు చుట్టుపట్ల పరికించి, యొక గాజుపెంకు గనబడ, దానిని గైకొని నాకనుబొమల నడుమ నొక్కి, ‘సూటిగా మనస్సును ఇక్కడ కేంద్రీకరింపుము’అని చెప్పెను. అంతట కృతనిశ్చయుడనై మఱల ధ్యానమునకు గూర్చుండి జగజ్జనని దివ్యరూపము కాన్పింపగనే వివేకమను ఖడ్గముతో ఆ రూపమును ఖండించితిని. ఇకనేమియు అంతరాయము లేకుండుటచే అయ్యది (మనస్సు) దృశ్య ప్రపంచమును దాటి రివ్వున పైకెగసిపోవ (నిర్వికల్ప) సమాధి నిమగ్నుడ నైతిని.’’
986. ఒక్కుమ్మడి ఆఱు నెలల వఱకు నేనాస్థితి (నిర్వికల్ప సమాధి)లో నుంటిని, సామాన్య మానవులు ఆ స్థితిని బొందినచో మఱల నందుండి వెలువడరు- మూడు వారములైన పిమ్మట శరీరము పండుటాకువలె రాలిపోవును. రేయింబవళ్ల ఎఱుకయే నాకులేకుండెను. శవమునందువలె నా నోటిలోను ముక్కు పుటములలోను ఈగలు దూరుచుండెడివి; కాని వానియెఱుకయే నాకు లేకుండెడిది. ధూళి ధూసరితములై తల వెండ్రుకలు జడలు కట్టెను. నాకు తెలియకుండగనే ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన మగుచుండెడిది. దైవ వశమున దక్షిణేశ్వరమున కపుడొక సాధువు వచ్చి నాకు పరిచర్యలుచేసి యుండని పక్షమున ఈ శరీరము నిశ్చయముగా నశించి యుండెడిది. ఆ సాధువు వెంటనే నా స్థితిని గుర్తించి రుూ శరీర మూలమున లోకేశ్వరి యింక ననేక కార్యములొనర్పవలసియున్నదని- ఈ శరీరము పరిరక్షింపబడినచో, అనేకులు శ్రేయస్సు నొందగలరని-గ్రహించెను. ఆతడు వేళకు ఏదియో కొంతయాహారము దీసికొనివచ్చి నాకు బాహ్యస్మృతి గలిగించుటకై అనేక విధముల బ్రయత్నించువాడు. తుదకు కఱ్ఱతో శరీరమును గట్టిగా గొట్టి నాకు కొంచెము స్మృతి వచ్చినట్లు కాన్పింపగనే ఆహారమును నోటిలో కూరువాడు. ఒకప్పుడు అందు బహుస్వల్పభాగము మాత్రమే కడుపులోనికి బోయెడిది; మఱియొకప్పుడు అదియుకూడ సాధ్యము కాకుండెడిది. ఈ విధముగ ఆరునెలలు గడిచినవి.
- ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి