సబ్ ఫీచర్

కరవు ఛాయలతో కలవరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢ మాసం ఆరంభమైనప్పటికీ ప్రస్తుత వర్షాకాలంలో చినుకు జాడ లేక తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి వానలు సమృద్ధిగా కురిసి ఖరీఫ్‌కు రైతాంగం సమాయత్తమయ్యే పరిస్థితి కానరావడం లేదు. వర్షాలను మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ఏటా జూన్ ప్రారంభం నాటికి కేరళ తీరానికి, ఆ తర్వాత కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో ప్రవేశించి, జూలై నాటికి దేశమంతటా వ్యాప్తి చెందాల్సి ఉంది. రుతుపవనాలు ప్రకృతి ధర్మంగా అనుగ్రహించవలసినదే. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో ఎల్‌నినో ముఖ్యమైనది. పెరూ తీరంలో ఏటా డిసెంబర్‌లో సాధారణంగా ఒక ఉష్ణ ప్రవాహంగా ఎల్‌నినో కదులుతుంది. దీనివల్ల భారత్, ఆగ్నేయాసియాలోని రుతుపవన వ్యవస్థ బలహీనపడి, ఇతర వాతావరణ దుష్పరిణమాలు కూడా తోడవటంతో వర్షాలు మొహం చాటేస్తాయి. ఈ ఏడాది కేరళ తీరాన్ని వారం రోజులు ఆలస్యంగా నైరుతి తాకినా- ‘వాన రాకడ ప్రాణం పోకడ’ అన్నట్టుగా దేశం మొత్తం వర్షాభావం నెలకొంది. ఒకవైపు చెన్నైలో తాగునీటికి కటకట ఏర్పడగా, మరోవైపు ముంబయి మహానగరం వరద ప్రవాహంతో అతలాకుతలమైంది.
ఏటా రుతుపవనాలు సకాలంలో ప్రవేశించాలని దేశం ఎదురుచూస్తూ వుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైనె్సస్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న భారత వాతావరణ విభాగం మే నెలలోనే- రానున్న కాలంలో వర్షాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ప్రకటిస్తుంది. ఒక్కొక్కసారి రుతుపవనాల రాకకు సంబంధించిన సమాచారం ప్రకటించిన విధంగా నిక్కచ్చిగా ఉండకపోవచ్చు. ఈ ఏడాది అరేబియన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ‘వాయు’ తుఫాన్ గుజరాత్ కోస్తా నుంచి దారిమళ్లినా, రుతుపవనాల తాకిడి ఆలస్యం కావడానికి కారణమైంది.
క్షీణిస్తున్న జలాశయాలు...
వర్షాలు కురవనందున వివిధ రాష్ట్రాల్లోని జలాశయాలలో నీటి మట్టాలు ఆందోళన కలిగించే రీతిలో దిగజారాయి. భూగర్భ జలాలు పాతాళాన్నంటుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులు, నిరుపేదలు దాహార్తితో అలమటించే స్థితి నెలకొంటోంది. మన దేశంలోని వ్యవసాయ భూములలో 60 శాతం వర్షాధారం కావటంతో- పంటలు పండకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంగిపోక తప్పదు. రైతుల ఆత్మహత్యలు పెరిగే విపత్కర పరిస్థితి పొంచి వుంది. బతుకుతెరువుకోసం పెద్ద సంఖ్యలో పేద రైతులు, వ్యవసాయ కార్మికులు నగరాలకు వలసపోయే పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లు తవ్వినా పొలాలకు సాగునీరు అందడం లేదు. జాతీయ స్థాయిలో ఆర్థిక వికాస ముఖచిత్రం జలవనరుల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. తాగునీరు లభించడం జీవన్మరణ సమస్యగా పరిణమిస్తోంది. మైళ్ళకు మైళ్ళు కడవలతో నడిచి, మంచినీటి కోసం అలమటించే గ్రామీణ మహిళల దీన దృశ్యాలు ఇప్పటికీ దర్శనం ఇస్తూనే వున్నాయి. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే, పిల్లలు స్కూలుకు వెళ్లకుండా- తాగునీటి కోసం రైల్వేస్టేషన్లు, ఇసుక తినె్నల వద్ద, పంట పొలాల్లో తిరిగే దృశ్యాలు బహుశా మన దేశంలోనే చూస్తాము.
2010లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ‘తాగునీరు, పారిశుద్ధ్యం అత్యంత ప్రాణపదమైన మానవ హక్కు’గా పరిగణించాలని సూచించింది. సంపన్న దేశాలు సురక్షిత మంచినీటి కోసం చట్టాలు అమలు చేస్తూ జలనరులను నిక్కచ్చిగా రక్షించుకొంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ప్రజలకు నీటి సరఫరాను ప్రధాన అంశంగా భావిస్తున్నాయి.
కంటికి కనపడని కరవు...
ప్రధాని నరేంద్ర మోదీ 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు జలశక్తి మంత్రిత్వ శాఖ 255 జిల్లాలను గుర్తించినట్లు ఇటీవల ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమైంది. ఆంధ్రప్రదేశ్ కూడా భూగర్భ జలాల నీటి మట్టాలు పెంచడంలో ప్రగతి సాధిస్తోంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు కరవుకాటకాలకు ఆస్కారం కలిగిస్తున్నాయి. అతివృష్టి లేదా అనావృష్టి ఏదైనా తీవ్ర దుర్భిక్ష వైపరీత్యాలను కలిగిస్తుంది. వాననీటిని పొదుపు చేసి భూగర్భ జలాలను పెంచటం, వాటర్ షెడ్ పథకాలు, మెట్ట ప్రాంతాల పంటలకు ప్రోత్సాహం, నీటి దుర్వినియోగంపై కఠిన చట్టాలు, పౌరులకు, రైతులకు నీటి వినియోగంపై అవగాహన, జలవనరులు కాలుష్యం కాకుండా చూడడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. నీతీ అయోగ్ జూన్‌లో ప్రకటించిన కాంపోజిట్ వాటర్ మేనేజిమెంట్ ఇండెక్స్ ప్రకారం 2020 నాటికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి 20 ప్రధాన మహానగరాలలో భూగర్భ జలాలు జీరో మట్టానికి చేరుకొనే విపత్కర పరిస్థితి పొంచి వుంది. ‘అసోచామ్’ అధ్యయనం ప్రకారం, రెండేళ్ళుగా సకాల వర్షాలు లేక దేశంలోని 256 జిల్లాల్లోని 33 కోట్ల మంది సామాన్య ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులలో చిక్కుకున్నారు. గతంలో స్వరాజ్ అభియాన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ- ‘రాష్ట్రాలు కరవు దుస్థితిపై స్పందించకపోయినా, కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించటం సామాజిక న్యాయానికి విఘాతమని జాతీయ ప్రణాళికలతో బాధితులను ఆదుకోవాలి..’ అని హెచ్చరించింది.

-జయసూర్య