సబ్ ఫీచర్

మావోల హత్యా రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ వైపు చందమామ పైకి ‘ఇస్రో’ రోవర్‌ను పంపేందుకు సర్వసన్నద్ధమవుతున్న వేళ.. ఇటు మావోయిస్టులు ప్రజలను కిరాతకంగా చంపుతూ హత్యా రాజకీయం చేస్తున్నారు. ఇదెంత విచిత్రం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరుకు చెందిన తెరాస పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 12న మావోలు దారుణంగా హత్యచేశారు. ఇన్‌ఫార్మర్ అయినందువల్లే నల్లూరిని చంపామని చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరిట వారు ఒక లేఖను మృతదేహం వద్ద వదిలివెళ్ళారు. దీంతో తెలంగాణలో చాలాకాలం తరువాత మావోలు మరణ మృదంగం మోగించారనిపిస్తోంది. గతంలో విశాఖ మన్యంలో ఒక శాసనసభ్యుడిని, మరో మాజీ శాసనసభ్యుడిని కాల్చి చంపినప్పుడు సైతం మావోలు ఇలాగే తమకు తోచిన ఆరోపణలు చేసి సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు. ఆ కారణాలేవీ ప్రాణాలు తీసేంత తీవ్రమైనవి కావని సాధారణ ప్రజలకు సైతం తెలిసింది. తాజాగా శ్రీనివాసరావు హత్య సైతం అలాంటిదే!
తమ దళాల గురించి సమాచారాన్ని శ్రీనివాసరావు పోలీసులకు చేరవేస్తున్నాడన్నది మావోల ప్రధాన ఆరోపణ. మావోయిస్టుల గెరిల్లా దళాలు దట్టమైన అటవీ ప్రాంతంలో తిరుగుతుంటాయి. రహస్యంగా సంచరిస్తూ ఉంటాయి. ఎంపీటీసీ సభ్యుడు ఉండేది మైదాన ప్రాంతం. మరి ఆయన దళాల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు ఎలా చేరవేశాడు? ఏదో నెపం పెట్టాలని ఒక ఆరోపణ చేసి ప్రజాప్రతినిధిని హత్యచేసి, తమ ప్రాబల్యాన్ని, పలుకుబడిని పెంచుకోవాలనే ‘ఎత్తుగడ’నే ఇక్కడ కనిపిస్తోంది తప్ప మరొకటి కాదు.
మావోయిస్టు పార్టీలో చాలాకాలం పనిచేసి లొంగిపోయిన కామ్రేడ్లు ఎందరో బయట ఉన్నారు. వారు లొంగిపోయినప్పుడు పోలీసులకు అందించిన సమాచారం కన్నా అతి కీలకమైన సమాచారం శ్రీనివాసరావు అందించి ఉంటాడా? ఆయన ఇచ్చిన సమాచారం వల్ల మావోయిస్టు పార్టీకి గాని, వారి దళాలకు గాని జరిగిన నష్టమేమిటో పేర్కొనాల్సింది కదా? అలా గాకుండా ‘పార్టీని నిర్మూలించేందుకు’ శ్రీనివాసరావు పనిచేస్తున్నాడని ఆరోపించడం, లేఖ ద్వారా ప్రజలకు ఆ విషయం చెప్పడం విడ్డూరం. ఎంత ఆరోపణ చేసినా అందులో కొంతైనా ‘వాస్తవికత’ కనిపించాలి కదా?
నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ ‘రహస్య పార్టీ’ని.. అందులో దండకారణ్యంలో ఆధునిక ఆయుధాలతో సంచరిస్తూ, ఆదివాసీలతో వివిధ సంఘాలు ఏర్పాటుచేసి కదం తొక్కుతున్న పార్టీని ఓ సాధారణ ఎంపీటీసి సభ్యుడు నిర్మూలించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తే వినే వారికే నవ్వొస్తుంది. ఇంత అమాయకంగా ఆరోపణలు చేయడం మావోలకే చెల్లుతుంది.
ఇటీవలే లోక్‌సభ మొదలు గ్రామ పంచాయితీల వరకు ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. వారంతా ప్రజలే తప్ప మరొకరుకారు. శ్రీనివాసరావు అందులో ఒక ప్రజాప్రతినిధి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాధికారులు. ‘ఆ నిర్ణయాధికారులనే కాల్చి చంపే స్తాం’ అని ఉన్మత్త చర్యకు పాల్పడి అసంబద్ధమైన రీతిలో ఆరోపణలు చేసి సమర్ధించుకుంటాం అంటే అదెలా సబబు?
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో గత నెలాఖరున ముగ్గురు గిరిజనుల్ని మావోలు అపహరించి అందులో ఒకరిని చంపేశారు. అక్కడా ఇదే ఆరోపణల పర్వం! ఆ సంఘటనకు రెండు రోజుల ముందు విశాఖ మన్యం పెదబయలు మండలం బోంగ్‌జంగి గ్రామానికి చెందిన కోర సత్తిబాబును కిరాతకంగా కాల్చి చంపినపుడు ఇవే ఆరోపణలు! ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మిర్తూర్ సంతలో మావోలు ఒక పోలీసును నరికి చంపారు. పోలీసులు సంతకు రావడం కూడా పాపమని మావోలు భావిస్తే ఎలా? అదే రాష్ట్రం సుకుమా జిల్లాలోని మారాయిగూడెం- అంగంపల్లి అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నిత్యావసర సరకులను తీసుకెళుతున్న ఆటోను అడ్డుకుని, అందులోని సరుకులు ఎత్తుకెళ్లి, ఆటోను దగ్ధం చేశారు. ఓ చేపల వ్యాపారి ద్విచక్ర వాహనాన్ని అపహరించుకుపోయారు. ఇలా ఒకటా? రెండా?? నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వున్నాయి. చిన్న వ్యాపారస్తులను చూసినా అనుమానమే, ఆటోలు తిరిగినా సహించలేరు, ద్విచక్రవాహనాలను అపహరించుకుపోతారు ఇది ఏ రకమైన రాజకీయం? తాము హతమారుస్తున్నది ప్రజలనే అని, వీరు సాధారణ పౌరులన్న విషయాన్ని మరిచి మావోలు వీరంగం సృష్టించడాన్ని సభ్య సమాజం స్వాగతించాలా?
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో ఇటీవల మావోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు కొన్ని ఆయుధాలు లభించాయి. అవి పాకిస్తాన్‌కు చెందినవని పోలీసు ఉభ్నతాధికారులు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐతో మావోలకు సంబంధాలున్నాయన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో, ముఠాలతో మావోలు స్నేహ సంబంధాలు నెరిపితే వారి ఆలోచనలన్నీ ఇట్లా హత్యలు- అరాచకాల చుట్టూనే తిరుగుతాయి. అప్పుడు ప్రజలెవరు? శత్రువులు ఎవరన్న విచక్షణా జ్ఞానం కోల్పోవడం సహజం. బహుశా మావోలు ప్రజల మేలు, మెరుగైన సమాజం గూర్చి గాక ఉగ్రవాదులు అనుసరించే ఎత్తుగడలు అనుసరించేందుకు సిద్ధమయ్యారనిపిస్తోంది.
గత నెల రెండవ వారంలో హైదరాబాద్ శివారులో కిరణ్‌కుమార్, నర్మద అనే మావోయిస్టు జంటను మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. వీరు కీలకమైన మావోయిస్టులని తెలుస్తోంది. వీరు పోలీసులకు ఎలాంటి సమాచారం అందించలేదని భావించాలా? అలాంటివారు అందించిన సమాచారం కన్నా కీలకమైన, ప్రమాదకరమైన సమాచారం శ్రీనివాసరావు అందించి ఉంటాడా? రూ.20 లక్షల చొప్పున రివార్డుగల మావోయిస్టుల జంట వెల్లడించిన వివరాలు మావోయిస్టు పార్టీ ‘నిర్మూలన’కు ఉపకరిస్తాయా? లేక శ్రీనివాసరావు పోలీసులకు చెప్పిన (ఇది ఆరోపణ మాత్రమే) సమాచారం ఆ పార్టీ నిర్మూలనకు సహకరించిందా?
ఇన్ని మాటలెందుకు? మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌కు కొరియర్‌గా పనిచేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం పి.జి. విద్యార్థి రంజిత్‌రావును గత నెలలో పోలీసులు అరెస్టుచేశారు. అతని నుంచి పెన్‌డ్రైవ్, సాయుధ దళాల సమాచారం, డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆ సమాచారం కన్నా శ్రీనివాసరావు చేరవేసిన సమాచారం కీలకమైనదా? సాయుధ దళాల కదలికలను, కీలక డాక్యుమెంట్లలోని సమాచారం కన్నా ఓ ఎంపీటీసీ సభ్యుడి దగ్గర భయంకరమైన సమాచారం అందుబాటులో ఉంటుందా? ఏ శబరి దళం శ్రీనివాసరావును చంపిందో ఆ శబరి ఏరియా మావోయిస్టు కమిటీ సభ్యుడు భీమయ్య కొన్ని రోజుల క్రితం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ సభ్యుడిచ్చిన సమాచారం కన్నా, శ్రీనివాసరావు ఎక్కువ ప్రమాదకరమైన వివరాలు పోలీసులకు చేరవేశాడని శబరి-చర్ల ఏరియా కమిటి భావిస్తోందా? ఇంత నిర్హేతుకంగా ఒకరి ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం ‘ప్రజాస్వామ్యం’లో ఎవరు హర్షిస్తారు? మావోయిస్టుల హక్కుల సంఘాలు, వారి ప్రజాసంఘాలు తప్ప! ప్రపంచమంతటా కమ్యూనిజం- మావోయిజం మటుమాటమవుతున్న వేళ... భారత పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం పూర్తిగా పడిపోయిన వేళ... ఇలా మావోయిస్టులు హత్యా రాజకీయాలు చెస్తే ఎవరు మెచ్చుతారు?... ఎవరు నచ్చుతారు?...

-వుప్పల నరసింహం 99857 81799