సబ్ ఫీచర్

‘నల్లమల’ను నాశనం చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ ప్రాంతం కమనీయ దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పుట్టినిల్లులా దర్శనమిస్తుంది. దేశంలోనే పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. గతంలో ‘నాగార్జునసాగర్ పులుల అభయారణ్య ప్రాంతం’గా పిలవబడినప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంగా మార్పు చెందింది. వన్యప్రాణుల స్వేచ్ఛా జీవనానికి, అరుదైన వనమూలికలకు ఈ ప్రాంతం పేరుపొందింది. ఇక్కడి ఆదివాసీలు అటవీ సంపదపైనే ఆధారపడి జీవిస్తూ వుంటారు.
కాగా, గతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ ప్రాంతంలో ఓ ప్రైవేటు సంస్థ భారీ యంత్రాలతో దాదాపు 50కి పైగా బోర్లువేసి, భూమిపొరల్లోని మట్టిని సేకరించి, పరిశోధనలు చేశాక ఇక్కడ విలువైన ఖనిజ సంపద ఉందని కనుగొన్నారు. అటవీప్రాంత ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం గాకుండా హెలికాప్టర్లలో తిరుగుతూ సర్వేలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,611 చ.కి.మీ. పరిధిలో నల్లమల అడవులు విస్తరించగా, అందులో 9 కి.మీ పరిధిలో మాత్రమే తవ్వకాలు జరుపుతామని ప్రైవేటు సంస్థ వారు ప్రకటించారు. ఈ ప్రాంతంలో అత్యంత విలువైన యురేనియం ఖనిజం ఉందని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన యురేనియం ఇక్కడ ఉందని చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే, యురేనియం తవ్వకాలను అనుమతించే ప్రసక్తే లేదని రాజకీయ నేతలు, ప్రజాసంఘాలు, గిరిజనులు మేధావులు ఒక్క తాటిపైకి వచ్చి పోరాటాలు చేశారు. తవ్వకాలను తాత్కాలికంగా ఆపడంలో ఉద్యమ నేతలు విజయం సాధించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన నాణ్యమైన యురేనియం నిల్వలున్న ఈ ప్రాంతాన్ని దృష్టిలో వుంచుకొని, ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా క్రమక్రమంగా తవ్వకాలను విస్తరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే అటవీశాఖ సలహామండలి నుండి అనుమతి లభించడానికి, వారు ఎలాంటి యంత్రాలను వాడతారు? వన్యప్రాణులకు, పర్యావరణానికి కలిగే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారో వంటి అంశాలపై నివేదిక సమర్పిస్తే అనుమతులిస్తామని కేంద్రం చెబుతున్నా ఇదంతా నామమాత్రమే అని స్థానికులు అనుమానిస్తున్నారు. ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవుండదు’ అన్నట్టు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 1995 సంవత్సరంలోనే ‘యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా’ను దేవరకొండ డివిజన్ పరిధిలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమైన పెద్దగుట్ట వద్ద అటవీ ప్రాంతంలో అనే్వషణలు జరిపి 18వేల టన్నుల వరకు నిక్షేపాలు ఉన్నట్లు కేంద్రానికి సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు మేధావులు అప్రమత్తం చేయడంతో స్థానికులు అడ్డుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టర్ 8 ఆగస్టు 2003న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా బడుగువర్గాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. 2005 సంవత్సరంలో కొంతమంది ఆదివాసీలను ఝార్ఖండ్‌కు తీసుకెళ్లి, యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి అనర్థాలు జరగవని ఒప్పించే ప్రయత్నం జరిగింది. ప్రజావ్యతిరేకతను గ్రహించిన ప్రభుత్వం అప్పట్లో కాస్త వెనక్కి తగ్గి, 2008 సంవత్సరం నుండి తిరిగి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వం చెప్పే విషయాలు ఇవీ...
* యురేనియం సంపదను సద్వినియోగం చేసుకుంటే దేశంలో అణువిద్యుత్ శక్తి సామర్థ్యాన్ని వచ్చే పదేళ్ళలో 40వేల మెగావాట్లకు పెంచవచ్చని, ప్రతి పల్లెను వెలుగుల మయం చేయవచ్చునని, ఆర్థికంగా దేశం ముందంజలో పయనిస్తుందని కేంద్రం చెబుతోంది.
* తవ్వకాల వల్ల ఎలాంటి అనర్థాలు జరగవని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా లభిస్తాయని చెప్పడం.
* వన్యప్రాణుల మనుగడకు అంతరాయం కలుగకుండా, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రచారం చేయడం. తవ్వకాలపై ప్రజా వ్యతిరేకత రాకుండా పలు చర్యలు చేపట్టడం.
పర్యావరణ శాస్తవ్రేత్తలు చెబుతున్న అంశాలను పరిశీలిస్తే.. నల్లమల అడవుల్లో తవ్వకాలు చేపడితే వన్యప్రాణుల మనుగడకు ఆటంకం కలుగుతుంది. తవ్వకాలు చేపడితే ఉమామహేశ్వరం, సలేశ్వరం, లొద్దిమల్లయ్య, గోరాపురం భ్రమరాంభ మల్లిఖార్జున దేవాలయం, మద్దిమడుగు ఆంజనేయస్వామీ దేవాలయం, మల్లెల తీర్థం లాంటి పుణ్య క్షేత్రాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వనమూలికలకు నిలయమైన ఈ ప్రాంతం కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న దాదాపు 120 గూడేలలో 11వేల మంది కోయ జాతులు, చెంచులను మైదాన ప్రాంతంలోకి తరలించాల్సిందే.
యురేనియం ఖనిజాన్ని శుద్ధిచేసే యంత్రాలను కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలలో నెలకొల్పాలి. భారీ యంత్రాల నుంచి వెలువడే వ్యర్థాలతో నదీజలాలు కలుషితమవుతాయి. వ్యర్థ జలాలు, విష వాయువుల ప్రభావంతో ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఇన్ని రకాలుగా కష్టనష్టాలను తెచ్చిపెట్టేలా తవ్వకాలను ఎందుకు అనుమతించాలని ఈ ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నల్లమల ప్రాంతంలో యురేనియం నిక్షేపాలపై పరిశీలన కోసం ఉడిమిళ్ల ప్రాంతంలో గగనతలం నుంచి ఫొటోలు తీసే పరికరాలు పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తవ్వకాల పేరుతో నల్లమలను నాశనం చేయవద్దని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

-డా. పోలం సైదులు 94419 30361