సబ్ ఫీచర్

విరిసినదీ.. వసంతగానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంతాన్ని కోయిల ఆస్వాదించాలంటే -అంతకుముందొచ్చే వేసవిని భరించాలి.
ఒక్కోసారి కోయిలకు నీళ్లు దొరకవు. కన్నీరు తాగి బతకాలి. ఎందుకంటే, వసంతంలో తన తియ్యనైన స్వరాన్ని పదిమందికీ వినిపించాలి కనుక.
కాదు కాదు.. తన తియ్యనైన గాత్రంతో వసంతానికి సార్థకత చేకూర్చాలి కనుక.
**
గాయని వసంత -కోయిలే. ఆమె జీవితం కూడా పైకథకు భిన్నం కాదు. బాల్యంలోనే గ్రీష్మాన్ని, శిశిరాన్ని చవిచూసింది. ఎంతో కష్టంతో భరించింది. వసంతం కోసం
వేయికళ్లతో ఎదురుచూసింది. -తన గాత్రంతో పరిశ్రమను పరిపుష్టం చేసేందుకు
ఎంతో ఓపికతో ఎదురు చూసింది. ఏదీ సులువుగా రాదు. కష్టపడితే దక్కకుండా పోదు. రెండు పంక్తుల్లో చెప్పుకుంటే -వసంతమ్మ కథ ఇదే.
ఆ కథను ఆమె జ్ఞాపకాల నుంచే విందాం.

1944లో బొడ్డుపల్లి రవీంద్రనాథ్, కనకదుర్గల ప్రథమ సంతానం గాయని బాల వసంత. ఆమెకు కళ్యాణి, రాధ, రాజ్యలక్ష్మి, సావిత్రి చెల్లెళ్లతోపాటు రామచంద్రమూర్తి అనే తమ్ముడూ ఉన్నాడు. చిన్న చెల్లెలు జన్మించిన రెండేళ్లకే తల్లి కన్నుమూశారు. తండ్రి ఆ బాధతో ఊళ్లు పట్టుకుని వెళ్లిపోయారు. అందరికీ పెద్దదైన వసంతపైనే కుటుంబ భారం పడింది. పిల్లలకు వండి వార్చటం, స్నానపానాదులు, జడలు వేయడం.. ఒకటి కాదు మొత్తంగా తోబుట్టువులకు తల్లి అయ్యింది. ఆలనా పాలనా భుజానికెత్తుకుంది. అలా పదేళ్ల బాలవసంత రెండేళ్లపాటు ఉక్కిరిబిక్కిరయ్యింది.
సంకల్పానికి భగవంతుడిని భయపెట్టే బలం ఉంటుంది. వసంత కష్టాలకు -వాటిని పుట్టించిన దేవుడు కూడా కరిగాడు. ఆమె భారాన్ని పక్కనున్నవాళ్లకూ పంచాడు. అలా -ఇంటిపక్కనే ఉండే పెదతండ్రి పార్థసారథి ఆదరణ కరవైన ఆ పిల్లలకు భోజనాల ఏర్పాట్లు చూశాడు. కాస్త కుదుటపడిన తండ్రి మరో వివాహం చేసుకుని మారు తల్లిని తీసుకొచ్చాడు. ఆమె కనకదుర్గ. తల్లిని పోలిన తల్లిలా పిల్లలను ఆదరించింది. 1954లో భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి వచ్చినపుడు ప్రార్థనాగీతం ఆలపించింది పదేళ్ల వసంత. ఈ కళ ఎలా అబ్బిందంటే -మూడో ఏటనుంచే కళాకారుడైన తండ్రి రవీంద్రనాథ్ కంపోజ్ చేసే బాణీలను పుక్కిటపట్టి తిరిగి పాడి వినిపించేది. తండ్రి మర్చిపోయిన వరుసలను గుర్తు చేసి మరీ వినిపించేదట. అలాంటి సందర్భాల్లోనే -వసంతలోని కళామతల్లిని గుర్తించారు. చదువుకునే సమయంలో ఎక్కడ ఆర్కెస్ట్రా పాటలు పెడితే, అక్కడికెళ్లి పాటలు పాడి పదో పరకో సంపాదించేవారు తన కుటుంబం కోసం. అప్పట్లో గుంటూరు వినోద్ ఆర్కెస్ట్రాలో సంగీత దర్శకుడు చక్రవర్తి పాటలు పాడేవారు. ఆ ఆర్కెస్ట్రాలో చక్రవర్తితో కలిసి అనేక పాటలు పాడారామె. తనకున్న గాత్ర కళతో శ్రోతలను మైమరిపించి, ఆ సంపాదనతో కుటుంబాన్ని ఆదుకోవాలన్న సదుద్దేశం ఆమెది. ఇన్ని బాధ్యతలు మోస్తూనే -చదువు ఆపకుండా బిఎస్సీ పూర్తి చేశారు వసంత.
‘మా తండ్రిగారు కూడా అప్పట్లో ‘్భలే పెళ్లి -తారుమారు’ అనే చిత్రంలో నటించి, సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే -అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం రావడం, ఇంటికి వచ్చేయమని అమ్మ కనకదుర్గ చెప్పడంతో ఆయన తిరిగి గుంటూరు వచ్చేశారు’ అని గుర్తు చేసుకున్నారు వసంత. వసంత తండ్రి రవీంద్రనాథ్‌కు గుంటూరు అరండల్‌పేటలో రవి స్టూడియో ఉండేది. అక్కడ వచ్చిన ఆదాయంతోనే కుటుంబ పోషణ సాగేది. తరువాత వసంతతోపాటు అంతర్గతంగావున్న కళామతల్లి కూడా పెరిగి పెద్దదవడంతో -అది గుర్తించిన తండ్రి ఆమెను మద్రాసు తీసుకెళ్లారు.
గుంటూరు- విజయవాడలలో ఎప్పుడు ఏ సినిమా వేడుకలు జరిగినా.. అక్కడ వసంత పాట ఉండాల్సిందే. అలాంటి సందర్భంలోనే పరిచయమయ్యారు పింగళి. అప్పటికి ఎస్ జానకి సినిమాలలో పాడేందుకు రాలేదు. ఆమె మామగారు మోనో యాక్టింగ్ చేస్తూ ప్రదర్శనలిచ్చేవారు. ఆ ప్రదర్శనల్లో జానకి మధ్యమధ్యలో పాటలు పాడేవారు. ‘జానకి గాత్రం చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని. నేను ఇంకా బాగా పాడాలన్న నా కోరికను ఆమెకు చెప్పేదాన్ని. అందుకు జానకి ఎంతో ప్రోత్సహించారు’ అంటూ గుర్తు చేసుకున్నారు వసంత.
సినిమాల్లో పాడాలన్న కోరికతో మద్రాస్ వెళ్లిన వసంతకు -పింగళివారింట్లో చోటు దొరికింది. తరువాత జిబిబి తిలక్ ఇంట్లో ఇంకొన్నాళ్లు ఉన్నారు. అన్నిచోట్లా ఆడిషన్లు ఇచ్చినా, ఎక్కడా ఎలాంటి అవకాశమూ దక్కలేదు. తన అదృష్టం ఇంతేననుకుంటూ -గుంటూరుకు తిరుగుముఖం పట్టారు. గుంటూరు వచ్చేసిన రెండు నెలల తరువాత -ఆత్రేయ రూపొందిస్తున్న వాగ్దానం చిత్రంలో పాట పాడేందుకు రమ్మంటూ టెలిగ్రామ్ వచ్చింది. ఆశ్చర్యపోయిన తండ్రీ కూతుళ్లు వెళ్లి ఆత్రేయను కలిశారు. అలా వాగ్దానం చిత్రంలో ఓ పాట పాడారు వసంత. ‘అప్పటికి ప్రపంచాన్ని ఇంకా పూర్తిగా చూడని పసి అమాయకత్వంలో నాలో ఉండేది. పాట పాడిన వెంటనే స్టూడియోనుంచి బయటికి వచ్చి మా నాన్నను అడిగాను. రికార్డు ఏది నాన్నా అని. ఆయన పగలబడి నవ్వారు. కోల్‌కతాలో రికార్డు ముద్రించి, నెల తరువాత పంపుతారన్నారు. ఆ రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది’ అంటారు వసంత. అలా మొదలైన ప్రస్థానం.. తమిళం, మలయాళం, కన్నడ భాషలతోపాటు.. తుళు, సింహళ, హిందీ, సంస్కృతం భాషల్లో అప్రతిహతంగా సాగింది. మలయాళ సంగీతాభిమానులు తమ ‘చేచి’గా భావిస్తారు వసంతను. మలయాళంలో వసంత పాడిన అనేక హిట్ సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. జగదేకవీరుని కథ చిత్రాన్ని కన్నడంలో అనువదిస్తే, అందులో ఆమెతో పాటలు పాడించారు పెండ్యాల. ఎన్‌ఏటి సంస్థ రూపొందించిన గులేబకావళి కథ చిత్రంలో ‘ఉన్నది చెబుతా వింటారా’ పాటను పాడారు వసంత. తిలక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈడు జోడు’లో ‘సూర్యుడి చుట్టూ తిరుగుతుంది భూగోళం’ గీతాన్ని ఆలపించారు. మలయాళంలో ఎలా పాడేవారు? అనడిగితే.. ఒక్క పదం కూడా తప్పుపోకుండా వారు ఎలా పాడుతున్నారో గమనించి పాడేదాన్ని. ఎన్నో పాటలు పాడిన నాకు ఇప్పటివరకూ ఏ ఒక్కసారీ ఫలానా మలయాళ పదం తప్పుపాడారు అన్న మాట వినపడలేదు’ అని గర్వంగా చెబుతారు వసంత. ఆసై వందై ఎన్నై, తాయ్ ఉనక్కాగ, కుల్‌చుమ్ కుమరి తదితర తమిళ చిత్రాల్లో ఆమె పాటలకు మంచి పేరొచ్చింది. ‘రికార్డింగ్ లేకపోతే వెంటనే బైబిల్ ఇనిస్టిట్యూట్ గీతాలు పాడటానికి వెళ్లిపోయేదాన్ని. రోజుకి అక్కడ 20 పాటలు పాడేదాన్ని. వెయ్యి రూపాయలు వచ్చేది’ అంటూ సంతోషపడతారు గాయని వసంత. ‘ఆ డబ్బుతోనే చెల్లెళ్లకు ఫీజులు కట్టేదాన్ని. ఎక్కడైనా సరే పనిచేయాలి.. డబ్బు సంపాదించాలి అన్న ధ్యాసలోనే ఇన్ని పాటలు పాడేశానేమో అంటారు వసంత. ఇప్పటి వరకూ అన్ని భాషలు కలిపి 8వేల పైచిలుకు పాటలను పాడారామె. మలయాళంలో అనేకమంది గొప్ప సంగీత దర్శకులు వసంతే తమ పాటలకు న్యాయం చేయగలదని నమ్మేవారు.
కెవి మహదేవన్ ఓసారి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికిగాను సుశీల, జానకి, వసంతలతో ‘తుళ్లి తుళ్లిపడుతోంది తొలకరి వయసు’ పాటను రికార్డ్ చేస్తున్నారు. జానకికి ఓ వౌత్ ఇచ్చారు. సుశీల, వసంతలకు కలిపి ఓ వౌత్ ఇచ్చారు. పాట పాడుతుంటే ఇంజనీర్ వసంత గొంతే వినపడుతోందని అరవడంతో, సుశీల నాకు మరో వౌత్‌ను బయటపెట్టండి అని హాస్యంగా అన్నారట. ‘ఆ సన్నివేశం గుర్తుకొచ్చినపుడు నాలో నాకే ఆనందం వేస్తుంది’ అంటారామె.
ఒక ఊరి కథ -చిత్రంలో అల్లు రామలింగయ్య కోసం ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాట పాడుతున్నారు. ‘ఆడించు ఆడించు జోరుగా’ అంటూ పాట రికార్డవుతుంది. బాలు గొంతు మార్చి హాస్యంగా పాడుతుంటే, నేను నవ్వలేక ఇబ్బంది పడ్డాను. ఓరకంగా ఆరోజు పాటను కూడా సరిగా పాడలేకపోయాను. అంతగా నవ్వించేవాడు బాలు’ అంటూ గుర్తు చేసుకున్నారామె. ‘ఇలా ఎలా పాడేస్తారండీ అని ఎవరైనా అడిగితే, అలాగే పాడేస్తానండీ’ అంటూ చమత్కరించేవాడని గుర్తు చేసుకున్నారు.
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ చిత్రానికి సంబంధించి ఐదు పాటలు పాడారు వసంత. ఆ రికార్డింగ్‌లో ఓ ముచ్చటను గుర్తు చేసుకున్నారు. ‘దర్శకుడు పెండ్యాల, సుశీల- నాతో ‘ఓ సుమ బాల’ పాట రికార్డు చేస్తున్నారు. దాదాపు 32 టేకులు తీసుకున్నారు. అప్పుడు సుశీల ‘వడదెబ్బ తగిలినట్టు మన కళ్లు చూడు ఎలా అయిపోయాయో’ అంటు వసంతతో హాస్యమాడారట. అయినాకానీ పట్టువదలని పెండ్యాల 32 టేకుల్లో ఒక్కదానే్న ఓకె చేశారు. ఘంటసాలతో అనేక పాటలు పాడటంతోపాటు, ఆయన సంగీత దర్శకత్వంలోనూ అనేక గీతాలు ఆలపించారు వసంత. ఇదాలోకంలో ‘నిత్యసుమంగళి నీవమ్మా..’, మాతృదేవతలో ‘పెళ్లిమాట వింటేనే తుళ్ళితుళ్ళిపడుతుంది’, అడుగుజాడలులో ‘తూలి సోకెను తూరుపుగాలి’, చిక్కడు దొరకడు, దేశద్రోహులు, జమీందారు చిత్రాల్లో ఘంటసాలతో పాడిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. భర్త సుధాకర్ వసంతకు తగినవారు. ఆమె భావాలను గౌరవించి కుటుంబానికి ఆసరాగా మారారు. తమ్ముడు, చెల్లెళ్లంతా వాళ్ల జీవితాలలో స్థిరపడేలా చేశారు. చివరి చెల్లెలు సావిత్రి కొడుకే ప్రస్తుత సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్.
వసంతకు ఇద్దరు అమ్మాయిలు, ఒకబ్బాయి. అమెరికాలో స్థిరపడ్డారు. కన్నడంలో రాజనర్తకి రహస్య, మంచికి స్థానం లేదు అనే తెలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు వసంత. పిల్లలు వారివారి జీవితాల్లో స్థిరపడి తల్లిదండ్రులను కన్నబిడ్డల్లా చూడాలి. ఆ అదృష్టం నాకు దక్కింది. అందుకు నేను చాలా సంతోషిస్తాను. పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారు. వారిని చూసుకుంటూ, నా తమ్ముడు, చెల్లెళ్లను చూసుకుంటూ గర్విస్తుంటాను అంటూ ముగించారు వసంత.

-సరయు శేఖర్, 9676247000