సబ్ ఫీచర్

తల్లిపాలు అమృతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో తల్లిపాలు అందక ప్రతిఏటా లక్షా ఇరవై వేలమంది నవజాత శిశువులు మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది గంటల్లోనే ఆ తల్లి తన బిడ్డకు ‘ముర్రుపాలు’ పట్టడం ఎంతో అవసరం. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు మొదలెట్టాలి. ఈ సమయంలో వచ్చే ముర్రుపాలను ఒకరకంగా తొలి టీకా అనుకోవచ్చు. తల్లి యొక్క మొదటి పాలు బిడ్డకు జీర్ణవ్యవస్థకు సిద్ధం చేస్తాయి. వాటిలో జింక్, కాల్షియం, విటమిన్స్ ఉంటాయి. బిడ్డ ఆరు నెలల వయసుకు చేరుకునేవరకూ తల్లిపాలు తప్ప మరే ప్రత్యామ్నాయం అవసరంలేదు. తల్లి బిడ్డకూ పాలివ్వడం ద్వారా బిడ్డ ఆకలి తీరుతుంది. కాబట్టి బిడ్డకు మాత్రమే ఉపయోగకరం అనుకుంటే పొరపాటు. పాలివ్వడం తల్లికీ ఉపయోగమే. కాన్పు అయిన మొదటిరోజునుంచి నాలుగు రోజులవరకూ వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రమ్) అమృతంతో సమానం. పగటి పూట మాత్రమే కాదు, రాత్రిపూటా బిడ్డకు తప్పనిసరిగా పాలు పడుతూండాలి. పాలు తయారైనంతకాలం బిడ్డకు పాలివ్వడంవల్ల తల్లులకు భవిష్యత్తులో రొమ్ము, ఒవేరియన్ కాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బిడ్డకు పాలిచ్చినంతకాలం కొన్ని నెలలపాటు తల్లుల్లో ప్రొలాక్టిన్ హార్మోన్ తయారవుతూ వుంటుంది. ఇది తల్లిలో అండాలు విడుదలయ్యే క్రమాన్ని విరామ దశలో ఉంచుతుంది. తద్వారా అవాంఛిత గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.
కల్తీ లేనివి
మాతృత్వం మహిళకు దేవుడిచ్చిన వరం. మాతృమూర్తిగా మారాకే స్ర్తి పరిపూర్ణత సంతరించుకుంటుంది. అందుకే అమ్మపాలు అమృతం అంటారు. మారిన వాతావరణ పరిస్థితులవల్ల, ఇంగ్లీషు మందుల వాడకం, రసాయన ఆహార పదార్థాలవల్ల తల్లి పాలు 50 శాతం తగ్గిపోయాయి. తల్లి పాలు పెరగాలంటే తల్లి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. పాపాయికి పాలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఉత్పత్తి జరుగుతుంది. బాలింతలకు మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. కల్తీలేనిది, కల్తీ చేయనిది ఏదైనా ఉందంటే అది తల్లిపాలే. అమృతంలాంటి చనుబాలను అందుకోవడం చిన్నారుల జన్మహక్కు. వారికి ఆ హక్కును అందిద్దాం. ఇప్పుడిప్పుడే మన దేశంలో హ్యూమన్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. బిడ్డను కోల్పోయిన తల్లులనుండి ముర్రుపాలు సేకరించి వాటిని తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేసి ఉంచుతారు. ఈ పాలను మూడు నెలల వరకూ భద్రపరచవచ్చు. ఆసుపత్రుల్లో స్ట్ఫానర్సులు, ఏఎన్‌ఎమ్‌లు బిడ్డలు పుట్టిన గంటలోపే పాలు పట్టేలా తల్లులను ప్రోత్సహించాలి. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం గణనీయంగా పెరగడం ముదావహం.
తొలిపాలే రక్షణ..
తెలంగాణలో ప్రతి వెయ్యి జననాల్లో 21 శిశువులు పుట్టిన తొలి 28 రోజుల్లోనే చనిపోతున్నారట. తల్లిపాలు పట్టడం ఎంత ఆలస్యమయితే శిశు మరణాల రేటు అంత ఎక్కువయ్యే అవకాశముందని వైద్యులంటున్నారు. తల్లి బిడ్డకు పట్టే తొలి పాలు అతి ముఖ్యమైన యాంటీ బాడీస్‌ని కలిగి వుంటాయి. వైరస్‌లు, బాక్టీరియాతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ పెంపుదల విషయంలో బిడ్డకు ఇవి చాలా అవసరం. పైగా తల్లి పాలు పట్టడం అనేది ఐక్యూని మూడు పాయింట్లు అదనంగా పెంచుతుందట. వయసుకు తగ్గ బరువు వుండేలా చూడటంలోనూ తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. చనుబాలు పట్టడంవల్ల నిద్ర కూడా హాయిగా పడుతుంది. పాలు పట్టడంవల్ల మధుమేహం, రక్తపోటు బారినపడే అవకాశం తగ్గుతుంది.
తల్లిపాలు అనేవి అన్ని రకాల పోషక విలువల లేమిని నిరోధిస్తాయి. పిల్లల ఆహార భద్రతకు, మంచి ఆరోగ్యానికి తల్లి పాలు అత్యంత శ్రేయస్కరమైనవని నిపుణులు అంటున్నారు. తల్లిపాలు జీవితం మొత్తానికి మూలాధారం వంటిదట. పిల్లల్లో పసి వయసులోనే మొదలయ్యే ఉబ్బసం వ్యాధివచ్చే అవకాశాలు తగ్గుతాయి. మనలాంటి దేశంలో కేవలం 37 శాతం మంది పిల్లలే ఆరు నెలల వరకూ పూర్తిగా తల్లిపాలు తాగుతున్నారు. చనుబాల గొప్పతనం తెలియకపోవడమో, బయట పనులకు వెళ్ళడమో, బిగువు తగ్గుతుందని అనుకోవటమో.. కారణమేదైనా చాలామంది శిశువులు తల్లిపాలకు నోచుకోవడంలేదు. నిజానికి చనుబాలే శిశువులకు ప్రత్యేక ఔషధంగా చెప్పుకోవచ్చని వైద్యుల సలహా..
ఆరు నెలల తర్వాత బిడ్డకు ఘనాహారం ఇవ్వాలి. అలాగని పాలు పట్టడం మానెయ్యరాదు. రెండేళ్ళవరకూ తల్లిపాలు కొనసాగించాలి. వీలైతే ఆ తర్వాత కూడా ఇవ్వచ్చు. అందుకే ఈ సంవత్సరం తల్లిపాల వారోత్సవ సందేశం ‘ఎంపవర్ పేరెంట్స్, ఎనెబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ నౌ అండ్ ఫర్ ఫ్యూచర్’ అని పిలుపునిచ్చింది.
‘శిశువుకు తల్లిపాలు శ్రేష్ఠం’. తల్లి పాలు కేవలం ఆకలి తీర్చే పాలు కాదు, బిడ్డకు దీర్ఘాయుష్షునిచ్చే అమృతధారలు. ప్రతి బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయి. బిడ్డ పుట్టిన గంటలోపు కేవలం 42 శాతం మంది తల్లి పాలు ఇస్తున్నారు. కేవలం 55 శాతంమంది మాత్రమే ఆరు నెలలపాటు తల్లిపాలు ఇస్తున్నారు. చాలామంది తల్లులు పిల్లలకు డబ్బాపాలు పట్టిస్తున్నారు. ప్రకృతి సహజమైన తల్లిపాల వలన వాతావరణ కాలుష్య సమస్య లేదు. తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడంలేదని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా వరల్డ్ అలయెన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (వాబా) అనే సంస్థను 1991లో ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 176 దేశాల్లో ఏటా తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో జరిగిన అధ్యయనం ఆధారంగా జూలై 31వ తేదీన ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం 2017వ సంవత్సరంలో సుమారు 7కోట్ల 80 లక్షలమంది శిశువులకు పుట్టిన గంటలోనే తల్లిపాలు అందలేదని, అందుకే తల్లిపాల వారోత్సవాలకు తగు ప్రచారం కల్పిద్దాం. పిల్లల్ని సంతోషంగా ఎదగనిద్దాం.

- కె.రామ్మోహన్‌రావు 9441435912