సబ్ ఫీచర్

ఆర్భాటం కాదు .. ఆచరణ శీలత కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తత అంటే ఏమిటి? దత్తత అంటే నాది- నేను అనే అర్థం. దత్తత.. వ్యక్తి లేదా గ్రామాన్ని తన వారుగా తన కుటుంబ వ్యక్తిగా పరిగణించి, బాధ్యత వహించి ముందుకు నడిపించాలి. సంతానం లేని అభాగ్యులు బంధువుల పిల్లలనో, అనాథ శరణాలయాలనుండి తెచ్చుకున్న పిల్లలనో దత్తత చేసికోవడం, వారిని పెంచి, పోషించి, చదివించి, బ్రతుకుతెరువు చూపించి, వివాహం చేసి, తమ తదనంతరం వున్నదంతా దత్తు పిల్లలకు చెందులాగున పత్రం వ్రాసిపెట్టి దత్తతకు అర్థం వివరించారు. మరి ఈ దత్తత గ్రామాలకు అర్ధం ప్రయోజనం తృప్తి ఏమిటన్నది పరిశీలించి చూద్దాం. ఛోటా నాయకులు, సమాజసేవ ముసుగులోని దురాశాపరుల్లాంటి వారు నలుగురి దృష్టిలో మంచి వారుగా మెప్పుపొందాలనుకునే వారు గ్రామదత్తత విషయం మొదట మీడియా ముందుపెట్టి, పేపర్లలో వార్తలు, ఫొటోలు, బుల్లితెరపై ప్రసారం జరిగాక, తీరా ప్రభుత్వంనుండి ఇలాంటి కార్యక్రమాలకు నిధులు రావని తెలిసికొని పిదప వౌనం వహిస్తున్నారు. బుల్లితెరపై విషయం వీక్షించినవారు, పత్రికలో సమాచారం చదివినవారు మాత్రం నిధుల విషయం తెలియక ఆ మహానుభావులందరూ దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధిపరచారు, అభివృద్ధిచేస్తున్నారన్న భ్రమలో వుండిపోతున్నారు. అలా నిధులు వస్తే ఆరగించవచ్చునన్న యోచనతో కొందరు గ్రామాల దత్తత తీసికుంటున్నారు. ప్రభుత్వ పాలనలో కావలసినన్ని తమ కార్యాలు చక్కబెట్టుకోవచ్చు, ఆదాయ పన్నుకు కాకిలెక్కలు చూ పించవచ్చు. లాభమేగా..
పచ్చదనం నింపాలి, డ్రైనేజి మెరుగుపరచాలి. గ్రామ దత్తత అంటే ‘రోడ్లువేయించాలి. పాఠశాల-వైద్యశాలలు నిర్మించాలి. మంచినీరు, కరెంటు అందించగలగాలి. బ్రతుకుతెరువు చూపించగలగాలి. కుటీర పరిశ్రమలకు చేయూతనివ్వాలి. కుల మత భేదాలు- అంటరానితనం లాంటివి రూపుమాపాలి. గర్భిణీ స్ర్తిలకు- చిన్న పిల్లలకు పోషక పదార్థాలు అందించాలి. అలా ఎనె్నన్నో చేయగలగాలి. సినిమాలో నీతులు వల్లించినట్లు కాదు, సమాజ సేవకుల పాత్రలు పోషించినట్లు కాదు దత్తత కార్యం. ఉదయం లేచింది మొదలు ముఖాలకు రంగు వేసికోవడం ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరడం లేదా షూటింగులంటూ నెలల తరబడి విదేశాలలో తిరుగుతుంటే దత్తత గ్రామాలను ఎలా వృద్ధిచేస్తారు? తమ ప్రతినిధిగా మరెవరినో ఏర్పాటుచేసినా వారంతా నిజాయితీగా పనిచేస్తారా? డబ్బు ఆశరేపుతుంది, స్వార్థం తరుముకొస్తుంది.
మన హీరోలు-హీరోయిన్లందరూ దాదాపు కోటీశ్వరులే.. కాదంటారా? ఒక్కొక్కరు ఒక జిల్లానే దత్తత తీసికుని అభివృద్ధిచేయగల ఆర్థిక స్తోమత-వనరులు వారివద్ద పుష్కలంగా వుండి కూడ ఎక్కడో చిన్న గ్రామాన్ని దత్తు స్వీకరించడం సబబుకాదనుకుంటాను. ‘మదర్‌థెరిసా’లా మానవత్వం - నిస్వార్థ సేవ తపన వీరికి వస్తుందా? వుంటుందంటారా? కోటీశ్వరుడు బిచ్చగానికి రూపాయి ధర్మం చేసినట్లు లేదా ఈ దత్తత కార్యం. టాలీవుడ్ అంతా కోటీశ్వర్ల మయమే, అయినా అందరూ కలిసి ‘హుదూద్’ బాధితులకు యిచ్చింది నాలుగు కోట్లు, ‘మేమున్నాం’ కార్యక్రమం వసూళ్లు ఏడు కోట్లు వెరసి 11 కోట్లు సిఎంగారికి అందించారంటే మెచ్చుకోవాలా? అందరూ కలసి కళ్లుమూసుకుని నిజాయితీగా తమను కోటీశ్వర్లుగా అందలం ఎక్కించిన ప్రజలకోసం వంద కోట్లు యివ్వగలిగే స్థోమత వుండి యివ్వలేకపోవడం విచారించతగ్గ విషయమే. మరికొందరు ‘పలానా సంస్థను స్థాపించాం. సమాజసేవ చేస్తున్నాం, చిన్నారులను- అనాథలను-వృద్ధులను ఆదరిస్తున్నాం, ఎందరికో కూడుగుడ్డ నీడ కల్పిస్తున్నాం. చదువుచెప్పిస్తున్నాం, ఆర్థిక సహకారం అందిస్తున్నాం’’అంటున్నారు సంతోషమే. హాలీవుడ్ కరాటే హీరో ‘జాకిచాన్’ తన సంపాదనలో 75 శాతం ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ సంస్థ’కు అందజేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన ‘హారిపొట్టర్’ ఏడు చిత్రాలకు కథలు రచించిన జె.కె.రౌలింగ్ ప్రపంచ చిన్నారుల ఆకలి మంటలు తీర్చేందుకు ఆ సంస్థకు కోట్ల విరాళాలు అందజేస్తూ ‘నేను పేదరికంలో జీవించాను. పేదరికమంటే ఏమిటో నాకు తెలుసంటూ సెలవిచ్చింది. సమాజసేవ, ధర్మనిరతి అంటే అలా వుండాలి.
హాలీవుడ్ సూపర్‌స్టార్ ‘ఎంజలీనాజోలి’ తన కుమారుల ఫొటోలను ‘టైమ్స్ మేగజైన్’లో ముఖ చిత్రంగా విడుదల చేసేందుకు అనుమతించినందుకు వారిచ్చిన పారితోషికం 40 మిలియన్ల డాలర్లను వెంటనే ‘బిల్‌గేట్స్ ఫౌండేషన్’కు అందజేసింది. అది మానవత్వమంటే.. సమాజసేవ అంటే. మన నటీనటులు తమకుతాము సెలబ్రిటీలం- లెజెండ్‌లం, గిన్నీస్‌బుక్‌లో పేరు నమోదుచేసికున్నాం. మా వంశం పలానా అంటూ డబ్బా కొట్టుకోవడం కాదు ముఖ్యం, సమాజసేవ చేస్తున్నామా? నిరుపేదలను ఆదుకుంటున్నామా? అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తున్నామా? తన తాహతెంత? తాహతుకుతగ్గ సేవానిరతి వుందా? కోట్లు సంపాదించుకుంటూ చిన్న గ్రామాన్ని దత్తుతీసికోవడంలో ధర్మం వుందా? భారతదేశపు సంపన్నులలో స్థానం మాత్రమే దత్తుతీసుకుంటే మేమెలా జిల్లా దత్తత తీసుకుంటాం అంటారా? డబ్బు ఈ దినం వుంటుంది రేపు పోతుంది మిగిలేది కీర్తి అది కలకాలం వుంటుంది.
పనిచేసేవారు చెప్పరు చేసి చూపిస్తారు. చెప్పేవారు పనిచేయరన్న సామెత వుందిగా. పేదరిక నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు, శరణార్థుల ఆదరణకు, అనాథ సంస్థలకు, వృద్ధుల ఆశ్రమాలకు, బాల బాలికల సంక్షేమానికి, సోమాలియా నిరుపేదల రక్షణకు అలా ప్రపంచవ్యాప్తంగా సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు ఎందరో ధర్మాత్ములు బిల్‌గేట్స్ స్థాపించిన ‘బిల్ అండ్ మిలిండాగేట్స్ ఫౌండేషన్’కు భూరి విరాళాలిచ్చి తమ ఉదారతను చాటుకుంటున్నారు. కాని అలా భూరి విరాళాలిచ్చిన ధర్మాత్ములలో మన దేశ కోటీశ్వర్లు ఒక్కరూ లేరన్నది అక్షర సత్యం. మనవారికి సంపాదనపై వున్న మక్కువ సమాజసేవపై వుండదన్నది పచ్చి నిజం.నిష్కళంకంగా గ్రామాలపై అభిమానం వుండి కృషిచేస్తాను, ప్రగతి సాధిస్తాను అనే నిజాయితీ వుండి గ్రామాలను దత్తత చేసుకుంటే అభినందనీయమే, హర్షించతగ్గ కార్యవౌతుంది. కోట్లుండి మండలాన్నో జిల్లానో దత్తత చేసికుని అభివృద్ధిచేస్తే బావుంటుంది. అంతేకాని చిన్న గ్రామాన్ని దత్తత చేసికోవడం వారి తాహతుకు చాలా చిన్నది. హర్షించదగ్గ కార్యం కాదు. ప్రార్థించే పెదవులకన్నా ఇతరులనాదుకునే హస్తాలనే భగవంతుడు యిష్టపడతాన్న మహాత్ముల మాటలోని నిజం గ్రహించాలి. నిజంగా సమాజసేవ చేయాలనుకున్న నటీనటులకు నమస్కరిద్దాం!

- మురహరి ఆనందరావు