సబ్ ఫీచర్

వీరేశలింగం శత వర్ధంతి మరిచారా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరేశలింగం శత జయంతికి (1948) నిజాం నవాబు మీర్ ఉస్మానలీఖాన్ భూమి విరాళం ఇచ్చాడనో, ఇవ్వబోతున్నాడనో ఆంధ్రపత్రికలో ఆ రోజుల్లో వార్త వెలువడింది. కాబట్టి ఆరోజుల్లో వీరేశలింగం తెలంగాణాలో కూడా విశ్రుతుడే అని తెలియటం లేదా! అప్పట్లో వీరేశలింగం శత జయంత్యుత్సవాలు ఆంధ్రదేశంలో ప్రతి నగరంలో జరిగాయి. బెంగుళూరు, చెన్నపట్నాలలో కూడా జరిగాయి. చెన్నైలోనైతే మూడు రోజులు జరిగాయి. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దిన పత్రికలు ఈ ఉత్సవాలకు విశేష ప్రాచుర్యం కలగజేశాయి. ఆయన ఆంధ్రదేశంలో ఎంత ప్రసిద్ధులో తెలంగాణాలోనూ అంతగానూ ప్రసిద్ధుడు. హైదరాబాదు నగరానికి ఆయన వచ్చినట్లు, అఘోరనాథ చటోపాధ్యాయ (కవికోకిల సరోజినీ నాయుడు తండ్రి) నివాస గృహంలో వీరేశలింగం ఆతిధ్యగౌరవం పొందినట్లు వీరేశలింగం స్వీయ చరిత్రలో ఉంది. సరోజినీనాయుడు పెళ్ళిచేసినవారు వీరేశలింగం దంపతులే. ఆమె పెళ్ళి చెన్నపట్నంలో జరిగింది. బ్రహ్మసమాజ మందిరంలో పీటలమీద కూర్చుని ముత్యాల గోవిందరాజులునాయుడు, సరోజినీదేవిల వివాహం జరిపించినవారు వీరేశలింగం, కందుకూరి రాజ్యలక్ష్మి దంపతులు. కులాంతర, రాష్ట్రాంతర, భాషాంతర వివాహం జరిపించటానికి అఘోరనాథ చటోపాధ్యాయకు ధైర్యం చాలినట్లు లేదు. అందునా హైదరాబాదు నగరంలో అనుకూల పరిస్థితులు అప్పట్లో లేవు అని తెలుస్తూనే ఉన్నది కదా! అందువల్ల చటోపాధ్యాయ మహాశయుడు వీరేశలింగం పంతుల సహాయం అర్ధించి ఉంటాడు. మద్రాసులో ఈ వివాహం జరిపించాడు వీరేశలింగం.
ఇంతేకాదు ఆంధ్రదేశంలోకన్నా కూడా అతిశయ గౌరవం వీరేశలింగానికి తెలంగాణాలో లభించిందనుకోవాలి. నల్లగొండ నుంచి షబ్నవసు వెంకటరామారావుగారనే మహితాత్ముడు, సంఘ సంస్కరణాభిలాషి, వీరేశలింగారాధకుడు ‘వీరేశలింగ కవి కంఠాభరణ గ్రంథ మాల’ పేరుతో పుస్తక ప్రచురణ సంస్థ నిర్వహించాడు. ‘నీలగిరి’ అనే మాసపత్రికను నడిపాడు. ఈ పత్రిక సంచికలు ఇప్పుడెక్కడైనా మచ్చుకైనా లభిస్తాయో లేదో తెలియదు.
వితంతు శరణాలయ నిర్వహణకు చందాలు సేకరించటానికి వీరేశలింగం నాగపూరు వెళుతూ సికింద్రాబాదుమీదుగా ప్రయాణం చేశాడు. అప్పుడు ఒకపూట సరోజినీ నాయుడింట్లో బసచేశాడు. అప్పుడా సరోజనమ్మ ‘మీ తాతగారు వచ్చారురా! నమస్కారం చేయండి’ అని తన పిల్లలకు ఆమె చెప్పి దండాలు పెట్టించిన వైనం వీరేశలింగమే స్వీయచరిత్రలో ప్రసక్తం చేశాడు. భారతదేశానికి రాజారామమోహనరాయలు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహదేవ గోవింద రనడే ఎటువంటివారో వీరేశలింగం కూడా అటువంటి వాడే. కలకత్తా నగరంలో వీరేశలింగం పేరిట ఒక వీధి (సారణి) ఉంది. వీరేశలింగాన్ని దక్షిణ హిందూ దేశ నిజసాగరుడని భూషిస్తారు. విద్యాసాగరుడితో వీరేశలింగానికి ఉత్తర ప్రత్యుత్తరాలున్నాయి. మరి వీరేశలింగం పంతులు శతవర్ధంతి సమధికోత్సాహంతో, కృతజ్ఞతా భావుకతతో రెండు రాష్ట్రాలు జరుపుకోవద్దా?

- అక్కిరాజు రమాపతిరావు