సబ్ ఫీచర్

ఆటలే ఆరోగ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకు నేటితరం పిల్లలు ఎటువంటి శారీరిక శ్రమ చేయడం లేదు. ఉదయం బడికి వెళ్లేటప్పుడు నడవకుండా ఏదో ఒక వాహనంలో వెళ్లడం, సాయంకాలం మళ్లీ వాహనంలోనే ఇంటికి రావడంతో నడిచే పరిస్థితి లేదు. అలాగే వచ్చీరాగానే టీవీ, కంప్యూటర్, ఫోన్ ఆటలతో బిజీ.. ఇదీ నేటి పిల్లల దైనందిన జీవితం. ఇక వారి శరీరానికి వ్యాయామమెక్కడిది? ఆరుబయట ఆటలు ఆడుకునే ప్రస్తావన ఏది? పైగా అపార్ట్‌మెంట్ కల్చర్‌లో బయట ఆటలు ఆడుకునే ప్రస్తావన లేదు. ప్రైవేట్ స్కూల్స్‌లో కూడా పిల్లలకు సరైన ఆటస్థలం లేదు. ఫలితంగా పిల్లలకు అనేక రకాల అనారోగ్య సమస్యలు.. ఆటలంటే శరీరానికి వ్యాయామాన్ని, మెదడుకి ఆలోచనా శక్తిని పెంచే ఆటలే కానీ కంప్యూటర్ దగ్గర కూర్చుని ఆడేవి కాదు. మంచి ఆహారంతో పాటుగా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడానికి సహకరించే ఆటలు కూడా ఆరోగ్యానికి ముఖ్యమే.. పిల్లలకు కనీసం ఆడవిడుపు లేకపోవడంతో అటు మానసికంగా, ఇటు శారీరకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే పిల్లలకు శారీరక శ్రమ కలిగేలా ఆడించాలని చెబుతున్నారు నిపుణులు. నిత్యం అలుపెరిగేలా ఆటలు ఆడితేనే ఆరోగ్యంగా పెరుగుతారని చెబుతున్నారు. వీడియోగేమ్స్, కంప్యూటర్ గేమ్స్ కాకుండా రోజుకు కనీసం ఓ నలభై నిముషాలైనా పిల్లలకు శారీరకశ్రమ ఉండే ఆటలు ఆడించాలి. ఆటలతో పాటు వ్యాయామానికి కాసేపు సమయం కేటాయించాలి.
ఆటలు పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు వినోదం అందించడం లోనూ, బుద్ధి వికాసం కలిగించడం లోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడుతాయి. బడిలో ఆటల వల్ల పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందుతాయి. ప్రస్తుతకాలంలో పిల్లలు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎలాంటి వ్యాయామాలు చేయడం లేదు. దానితో వారు కొంత మందకొడిగా తయారవుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చాలా అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. నేటి పాఠశాలలు చదువు నేర్పడానికే పరిమితమవుతున్నాయి. పిల్లల మానసిక ఎదుగుదలకు, వికాసానికి విద్య ఎంత అవసరమో, వారి శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి ఆటల ద్వారా లభించే వ్యాయామమూ అంతే అవసరం. పిల్లలకు విద్యతో పాటు, క్రీడలలో కూడా పిల్లలకు తర్ఫీదును ఇవ్వాలి. అందుకోసం ప్రతి పాఠశాలలోనూ ఆటస్థలం ఉండాలి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆటలాడటం లేదు. ట్యూషన్‌కు వెళ్ళడం లేదా హోంవర్కులు చేయడం, తర్వాత టీవీ, కంప్యూటర్ ఆటలతో గడపడం సరిపోతుంది. దీనితో వారి శరీరానికి సరైన వ్యాయామం ఉండటం లేదు. ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు.
లాభాలు
* ఆటలు ఆడటం వల్ల పిల్లల శరీరానికి వ్యాయామం లభిస్తుంది. వారిలో చురుకుదనం, శారీరక, జ్ఞాపకశక్తి, దారుఢ్యం, ఏకాగ్రత కూడా పెంపొందుతాయి. నీరెండలో ఆడటం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా లభిస్తుంది.
* నడక, జాగింగ్, సరదా ఆటల వల్ల పిల్లల్లో ఎముకలు దృఢంగా తయారవుతాయి. చిన్నప్పటి ఆటలు జీవితంలో అనుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఆటల వల్ల వారి శరీరంలో చెడు కొవ్వు చేరకుండా ఉంటుంది.
* ఆటల వల్ల పిల్లల్లో ఆశావహదృక్పథం అలవడుతుంది. శారీరకంగా బలంగా ఉన్న పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడులో ప్రతిస్పందనల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది.
* ఆటల వల్ల ఊపిరితిత్తులు, కాలేయం, గుండె పనితీరు మెరుగవుతుంది. శరీరమంతా రక్తప్రసరణ జరుగుతుంది. కండరాలు బలపడతాయి. ఆటలు జీర్ణశక్తి పెంచుతాయి. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. శరీరంలో కోపతాపాల్లాంటి ఉద్వేగాలు బయటకు వెళ్లిపోతాయి.
* ఆటల వల్ల పిల్లల్లో పరిచయాలు పెరుగుతాయి. ప్రవర్తనలో సర్దుబాటుతత్త్వం అలవడుతుంది. జయాపజయాలు అలవాటుపడతాయి.
* అప్పుడప్పుడూ పెద్దలు కూడా పిల్లలతో కలిసి ఆడటం వల్ల పిల్లలకు, పెద్దలు మరింత దగ్గరవుతారు. వారి మధ్య అనుబంధం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
* ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచినవారిని ప్రోత్సహించాలి. విధ్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే వారు క్రమశిక్షణగల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.