సబ్ ఫీచర్

వాసంత మయూర ‘రూప’మ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసంత సమీరంలా.. నులివెచ్చని గ్రీష్మంలా.. సారంగ సరాగంలా.. అరవిచ్చిన లాస్యంలా, ఒక శ్రావణమేఘంలా -అంటూ దూరదర్శన్‌లో పాట మొదలైందంటే.. ఋతురాగాలు డైలీ సీరియల్ వచ్చేస్తున్నట్టే. ఈ పాట వింటూనే తెలుగు లోగిళ్లన్నీ ఎక్కడి పనులు అక్కడే వదిలేసి టీవీలకు అతుక్కుపోయేవి. తెలుగు చానెల్స్ ఇప్పుడొస్తున్న లెక్కలేనన్ని సీరియల్స్‌కు బీజం వేసింది -తొట్టతొలి సీరియల్ రుతురాగాలు. ఆ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి, తెలుగు తరాలకు ఎవర్‌గ్రీన్ నటిగా మదిలో నిలిచిపోయింది రూపాదేవి. ఉత్తమనటిగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కీర్తిపతాక ఎగరేసిన తరువాత -ఋతురాగాలు సీరియల్ చేశారు రూపాదేవి. ఆ సీరియల్‌తో తెలుగువాళ్లకు సొంత మనిషైపోయిన నటి -రూపాదేవి. ఈవారం వెనె్నల అతిథి ఆమె. నాలుగు భాషల్లోని సినీ ప్రస్థానంలో ఆమె జ్ఞాపకాల నుంచి మనకు కొన్ని ముచ్చట్లు.
తెలుగు సినీ చరిత్రలో కృష్ణుడు పాత్ర వేయాలంటే యన్టీఆరే గుర్తొస్తారు. కానీ ఆయనకంటే ముందు కృష్ణుడి పాత్రకు ప్రాణం పోసింది -ఈలపాటి రఘురామయ్య. ఆయన ఈలతోపాడే పద్యాలు అప్పట్లో బహుళ ప్రజాదరణ పొందాయి. అటు నాటకాలు, ఇటు సినిమాలు ఆయన కీర్తికి వనె్నతెచ్చింది ఈలపాట. ప్రపంచంలోనే అరుదైన కళగా గుర్తింపు పొందింది ఈలపాట. ఆయన తనయే రూపాదేవి. తల్లి అలనాటి కథానాయిక ఆదోని లక్ష్మి. నల్గొండలో జన్మించారు. ఏది వద్దనుకుంటామో అదే మనకు ఎదురవుతుంటుంది. సినిమా అవకాశాలపై ఎటువంటి ఆసక్తిలేని రూపాదేవి, తరువాత నటిగా ప్రవేశించి ఉన్నత శిఖరాలు అందుకోవడం ఓ వైవిధ్యమైన కథనమే! చిన్నప్పటినుంచీ చదువుపైనే ఆమె ధ్యాస. డిగ్రీ పూర్తి చేశారు. కళాకారులైన తల్లిదండ్రుల పుత్రిక కనుక ఆమెకు సినిమా అవకాశాలు తలుపులు తడుతూనే వున్నాయి. కానీ ఆవైపు ఆమె చూపు మళ్లలేదు. చెన్నై వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. అక్కడ పద్మాసుబ్రహ్మణ్యం వద్ద నృత్యం నేర్చుకున్నారు. వద్దన్నాకానీ అవకాశాలు తలుపు తడుతుంటే కాదనలేకపోయారు. తొలిసారిగా ఆర్ట్ ఫిలింగా యు విశే్వశ్వరరావు రూపొందించిన ‘మార్పు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ‘విశే్వశ్వరరావు నటన ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎప్పుడూ చెప్పేవారు కాదు. డైలాగ్ చెప్పి నటించమనేవారు. నేనూ కొత్త కనుక నాకు నచ్చినవిధంగా నటించేదాన్ని. సహజంగా నటించమని చెప్పేవారు. మొదటి సినిమానే 1978లో ఆర్ట్ సినిమాగా విడుదలై మంచి గుర్తింపు తెచ్చింది. జాతీయస్థాయిలో ప్రదర్శించిన అందరికీ నేనేంటో తెలిసింది’ అంటూ గుర్తు చేసుకున్నారు రూపాదేవి. ఆ తరువాత మళ్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటానికి వెళ్లిపోయారు. కానీ ఒక్కసారి నటిగా గుర్తింపు పొందాక దర్శక నిర్మాతలు వదిలిపెట్టరు కదా. వద్దు వద్దంటూ అనేక అవకాశాలు వదిలిపెట్టేసినా, చివరికి మంచి చిత్రం అని ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘నాలాగా ఎందరో’ సినిమా చేశారు రూపాదేవి. ‘ఆ సినిమాలో కల్యాణి పాత్ర నాకు బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా చేయక తప్పలేదు’ అంటారామె. ఆ సినిమాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డు తీసుకున్నారు రూపాదేవి. వెంటవెంటనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు వెల్లువెత్తాయి. తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ వెళ్లారు. తమిళంలో ‘ఒరు తలై రాగం’ చిత్రం శంకర్ కథానాయకుడిగా విడుదలై సూపర్‌హిట్ అయింది. దాదాపు ఏడాదిపాటు చెన్నైలో ఆడటంతో మంచి పేరు వచ్చింది. కన్నడంలో రాజ్‌కుమార్ కథానాయకుడిగా ‘హాలూ జైనూ’, ‘సమయద గొంబె’, ‘యాదివన్’, ‘మరియాదే మహల్’లాంటి హిట్ చిత్రాల్లో కన్నడంలో టాప్ హీరోలతో నటించడంతో స్టార్‌డమ్ వచ్చింది. ఓవైపు తమిళ, ఓవైపు కన్నడం చిత్రాల్లో బిజీగావున్నా, మలయాళ, తెలుగు భాషల్లోనూ నటించారు. ఉత్తమనటిగా ‘నాలాగా ఎందరో’ చిత్రానికి అవార్డు వచ్చిందని తెలిశాక మీ భావాలు ఎలా ఉన్నాయని అంటే -‘నేనప్పుడు ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. మా కొలీగ్ ఫోన్ చేసి చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. నేను కూడా బాగా నటించాను అన్న కాన్ఫిడెన్స్ పెరిగింది. దానికితోడు చిత్ర దర్శకుడు ఈరంకి శర్మ చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. మొదట ఆ చిత్రంలో ఎంపిక చేసినపుడు అనేకమంది నన్ను నిరుత్సాహపర్చారు. అంత గొప్ప పాత్ర నువ్వు చెయ్యగలవా? అంటూ ప్రశ్నించారు. కేవలం నా ఫొటోలు చూసే ఆయన నన్ను ఎంపిక చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో దాదాపు 20 రోజులపాటు షూటింగ్ చేశారు. అందరూ నన్ను నిరుత్సాహపర్చడం గమనించిన దర్శకుడు, ఓరోజు రెండు పేజీల డైలాగ్ సీన్ ఇచ్చారు. మరో నాలుగు రోజుల్లో షూటింగ్ వుందని, నీమీద నమ్మకం ఉంది కనుక నిన్ను నీవు నలుగురి మధ్యా నిరూపించుకోవాలి అని చెప్పడంతో నాలో పట్టుదల పెరిగింది. ఆరోజు కెమెరా మూవ్‌మెంట్స్ చెప్పి చేయమన్నారు. అంతే.. ఒకే షాట్‌లో రెండు పేజీల డైలాగ్ చెబుతూ ఓకె చేశాను. సింగిల్ టేక్‌లోనే ఓకె అయినందుకు అందరూ సంతోషించారు. అప్పుడే నాకు అవార్డు వచ్చినంత ఆనందం కలిగింది’’ అంటారామె. సినిమా విడుదలయ్యాక కూడా అనేకమంది తప్పక అవార్డు వస్తుందని చెప్పినమాట కూడా నిజమైందని గుర్తు చేసుకున్నారు. తెలుగులో కమర్షియల్ చిత్రాలవైపు పెద్దగా చూడలేదు. కారణం- తొలి చిత్రాలు ఆర్ట్ సినిమాలు అవ్వడంతో అలా పేరు పడిపోయిందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుదంటారామె. బి నరసింగరావు రూపొందించిన ‘రంగుల కల’ చిత్రంలోనూ మంచి పాత్రే. కానీ అది కూడా ఆర్ట్ ఫిల్మ్ కిందే జమైంది. నిజం చెప్పాలంటే తెలుగులో ఓ కమర్షియల్ చిత్రంలో హీరోయిన్ అవకాశం వచ్చింది. వారంలో షూటింగ్‌కు బయలుదేరాలి. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ షూటింగ్‌కు ఎక్కడకు వెళుతున్నారనేది వారు తెలియచేయలేదు. ఫోన్‌కోసం ఎదురుచూస్తున్నారు రూపాదేవి. అనుకోకుండా మరో తమిళ సినిమా అవకాశం కూడా అదే కాల్షీట్స్‌లో వచ్చింది. తెలుగు సినిమా మిస్ అవుతుందా? అన్న మీమాంశలోనే ఉండిపోయారు. తమిళంలో రూపొందిస్తున్న ‘ఒరు తలైరాగం’ చిత్రంలో సూటబుల్ పాత్ర అవ్వడంతో చేయాలన్పిస్తుంది. కానీ తెలుగు సినిమాకు కాల్షీట్లు ఇవ్వడంతో సందేహంలో పడిపోయారామె. కానీ ఎంతకీ తెలుగు సినిమా యూనిట్ సంప్రదించకపోవడంతో ఇక లాభంలేదని తమిళ సినిమానే చేయడానికి సిద్ధమయ్యారు. ఆ రెండు సినిమాలు ఆతర్వాత విడుదలయ్యాయి. రూపాదేవి నటించని తెలుగు సినిమా ఫ్లాప్ అయితే, అనుకోకుండా వచ్చిన తమిళ సినిమా ఒరు తలై రాగం సూపర్‌హిట్ అవ్వడం విచిత్రం.
‘నాలాగా ఎందరో’ షూటింగ్‌లో పరిచయమైన హీరో నారాయణరావు, బి నరసింగరావుకు పరిచయం చేయడంతో రంగుల కలలో నటించారు. ‘దర్శకుడు నరసింగరావు వర్క్ ఆఫ్ స్టైల్ సరికొత్తగా వుంటుంది. పాత్ర ఎలా వుండాలి అన్నది బొమ్మలువేసి మరీ ఆయన చూపేవారు. ఉదాహరణకు ‘దాసి’ చిత్రంలో ప్రధాన పాత్రకు ననే్న ఎంపిక చేశారు. కానీ ఆ తరువాత ఆ పాత్రకు నటి నల్లగా ఉండాలని, మొరటుగా కనిపించాలని అర్చనను ఎంపిక చేశారు. దొరసాని పాత్రకు నన్ను ఎంపిక చేశారు. కానీ నా పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఒప్పుకున్నాను. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ తదితర విషయాలన్నీ దర్శకుడు బొమ్మలు వేసి మరీ చిత్రీకరించేవారు. తలలో ఎటువంటి పూలుండాలి, చీరకు అంచులు, వేలు కదపడాలు, కనురెప్పలు ఆడించడాలులాంటి ప్రతి విషయం బొమ్మలు వేసి చూపేవారు. అది చాలా అద్భుతంగా స్క్రీన్‌పై పండేది’ అంటూ అప్పటి సంగతులను వివరించారు.

-సరయు శేఖర్, 9676247000