సబ్ ఫీచర్

వ్యక్తిత్వంలో ఘనాపాటీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలనచిత్ర ప్రముఖుల గురించి, చాలామందికి కొన్ని విషయాలే తెలుస్తాయి. వారివారి వ్యక్తిత్వాలు, అంతర్గతంగా వుండే సాత్విక, చమత్కార ధోరణులూ చాలామందికి తెలియవు. ప్రముఖ నటుడు, గాయకుడు, దర్శక నిర్మాత అయిన చిత్తూరు వి.నాగయ్య గురించి కొన్ని విషయాలు- మద్రాసు శివార్లలో షూటింగ్ జరుగుతోంది. ఎండ తీవ్రంగా మాడుస్తున్నా ప్రేక్షకులు అలాగే నిలబడి షూటింగ్ చూస్తున్నారు. ఒంటి గంటయిందని భోజనాలకు బ్రేక్ చెప్పారు. అందరూ భోజనాలకు బయల్దేరుతూ వుండగా, ‘మరి వీళ్లందరి మాటా ఏమిటి- వీళ్లంతా ఎక్కడ భోంచేస్తారు?’అని అడిగారు ఆ చిత్ర దర్శకుడు ప్రేక్షకుల్ని చూపిస్తూ.. కంపెనీ మేనేజరు బిత్తరపోయి, ‘‘వాళ్ల సంగతి మనకేం తెలుసు- ఇళ్లకు పోతారు’’అన్నాడు. తమాయించుకుని అదేం మాట పొద్దుట్నుంచి మనతోపాటే ఎండలోనించుని షూటింగ్ చూస్తున్నారే, వాళ్లని మాత్రం ఎలా వదిలేస్తాం- వాళ్లకీ ఇంతోఅంతో భోజనాలు ఏర్పాటుచెయ్యండి. కనీసం సాంబారు అన్నం, పెరుగు అన్నం అయినా తెప్పించి అందరికీ ఇవ్వండి’’ అని ఆర్డర్‌వేశారు దర్శకుడు. ఆ ఆనతికి విస్తుపోయిన మేనేజర్ పాలించక తప్పలేదు. ఇది అబద్ధంకాదు. అతిశయోక్తికాదు- నిజం. షూటింగ్ చూడ్డానికి వచ్చిన జనం అందరికీ కూడా భోజనాలు పెట్టమని ఆదేశించిన ఆ దర్శకుడు- చిత్తూరు వి.నాగయ్య. ఆ చిత్రం ఆయన దర్శకత్వంలో నిర్మాణంలో తయారవుతున్న ‘త్యాగయ్య’.
ఐతే, ఆరోజుల్లో మరో నలభై ఏభై మందికి షూటింగ్ బృందంతోపాటు భోజనాలు పెట్టడం అన్నది ఏమంత ఖర్చు విషయం కాకపోవచ్చు ఐనా, అదే విశేషం. అంతకంటే అబ్బురం! నాగయ్యగారివి అలాంటి భావాలు. ఆయన రేణుకా ఆఫీసుని- సత్రం అనే వారు. సినిమాల్లో వేషాలకనో మద్రాసుకు ఇతర పనులకనో ఉత్తరాలు పట్టుకుని వచ్చినవాళ్లు, రేణుకా ఆఫీసులోనే బసచేసేవారు. ఆ ఆఫీసులో మెస్ వుండేది. అక్కడ నిత్యాగ్నిహోత్రం నిరంతర పాకశాస్ర్తియం! వంటవాళ్లకు విరామం వుండేదికాదు. భోజనాలవేళకు, ఇంతోఅంతో తెలిసినవాళ్ళు- తిన్నగా పాకశాలలోకి వెళ్ళిపోయి, ఆకువేసుకుని కూర్చుంటే భోజనం వడ్డించేవారని, ఆరగించి ఆ అభ్యాగతులు అక్కడే తమలపాకులు కూడా వేసుకుని వెళ్లేవారనీ ‘రేణుకావారి సత్రం’ గురించి- చెప్పుకుంటారు.
నాగయ్యగారి సంపాదనంతా చాలామట్టుకు అలాగే ఖర్చయిపోయింది. ఆయన నటుడుగా ఉచ్ఛస్థితిలో వున్నప్పుడు అడిగిన వాళ్లకు లేదనలేదు. పెళ్లికి తాళిబొట్టు ఇవ్వడం దగ్గర్నుంచి పిల్లల స్కూలు ఫీజులు కట్టడంవరకూ, ఆయనదే ‘బాధ్యత’. ఆయన కాంగ్రెస్‌పార్టీ అభిమాని. ఆ విధంగా పార్టీకి ఇచ్చిన విరాళాలు సరేసరి!
సినిమా, నాటకాల నటుల్ని అదోలా చూసే, ఆరోజుల్లో సినిమా నటుడికి సంఘంలో ఒక గౌరవస్థానం కల్పించినవారు నాగయ్య. ఆయన సన్నిహితులు, అభిమానులూ అంతా కళాశాల, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పెద్దపెద్ద ప్రభుత్వోద్యోగులూ, మద్రాసులో స్కూళ్లు, కాలేజీలు తెరచే కాలంలో నాగయ్య గారింటిముందు ఎంత సందడో! కాలేజీల్లో, స్కూళ్లల్లో సీట్లుకోసం సిఫార్సుల ఉత్తరాలకోసం ఒక సినిమానటుడి దగ్గరకి అంతమంది రావడం అన్నది- సామాన్యమైన విశేషం కాదు!
‘రామదాసు’ సినిమా తీసినప్పుడు ఆయనకి చాలా కష్టాలు తలెత్తాయి. ఆర్థికంగా బాగాదెబ్బతిని వుండడంతో, సినిమా అనుకున్నట్లుగా పూర్తికాలేదు. ఆయన మీద వున్న గౌరవాభిమానాలకొద్ది- అందరూ దాదాపు ఉచితంగానే పనిచేసినట్టుగా చేశారు. ఆ సినిమాలో కబీర్‌కి, మహమ్మద్ రఫీ చేత పాటలు పాడించాలనుకున్నారు నాగయ్య. కాని ఎలా? ఎలాగో ఆ కబురు చేరింది రఫీకి. అతనూ సహాయాలు అందించడంలో గట్టివాడే! నాగయ్యగారి నటన. స్థాయి, దాతృత్వగుణం- అన్నీ విని ఆయన స్థితి తెలుసుకుని, పైసా తీసుకోకుండా వచ్చి, కబీరుకి పాటలు పాడి వెళ్లాడు! ఆ గొప్పతనం నాగయ్యగారిది! ఆ గొప్పవాడికి ఉచితంగా పాడిన గొప్పతనం రఫీది!
డాక్టర్ రాధాకృష్ణన్ ఉప రాష్టప్రతిగా వున్న రోజుల్లో ఒకరోజు నాగయ్యగారు ఏదో పనిమీద ఆయన్ని చూడ్డానికి (మద్రాసులో) వెళ్లారు. ఇంట్లోకి ప్రవేశిస్తూ వుండగా అంత దూరంలో ఆయన్ని చూసి లేచి వచ్చి నమస్కరిస్తూ ‘‘దయచేయండి నాగయ్యగారూ’’అని ఆప్యాయంగా ఆహ్వానించారు ఉప రాష్టప్రతి. తనకోసం నిరీక్షిస్తున్న వాళ్లని ఆపి, నాగయ్యగారితోనే మాట్లాడారంటే- అంతటి పలుకుబడి సాధించిన ఆ గొప్పతనం ఆ సినిమా నటుడిది!
చాలామంది గొప్పవాళ్లలాగే, నాగయ్యగారి జీవితంకూడా చివర్లో ఇబ్బందుల్లోనే నడిచింది. అందుకే ‘‘ఉదర నిమిత్తం బహుకృతవేషం’’ అని, ఏ పాత్ర వచ్చినా, ఎంత ఇచ్చినా సరేనని అంగీకరించవలసి వచ్చింది. రాజకీయ నాయకుల శిలావిగ్రహాలే గాని నటులు విగ్రహాలు కనిపించని ఈ రోజుల్లో- ఆయన విగ్రహం పానగల్ పార్క్‌లో కనిపిస్తోందంటే- అది చాలు- ఆయన వ్యక్తిత్వం చెప్పడానికి.

-ఎ.సి.పుల్లారెడ్డి