సబ్ ఫీచర్

చిరస్మరణీయ ఆంజనేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీత, ద్రౌపది వంటి పాత్రలు పోషించిన నటీనటుల నటనను గురించి చాలామంది చెప్పుకుంటారు. పత్రికలలో వ్యాసాలు కూడా వచ్చాయి. హనుమంతుడి పాత్ర బాగుందని అంటారు కానీ ఫలానా నటుడని చెప్పలేరు. ఎందుకంటే హనుమంతుడి వేషధారణలో వున్న నటుడిని గుర్తించటం కష్టం. శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడు అనగానే మనకు ఎన్టీఆర్ గుర్తొస్తారు. సీత అంటే అంజలీదేవి, ద్రౌపది అంటే సావిత్రి గుర్తొస్తారు. అలాగే హనుమంతుడు అంటే అర్జా జనార్దనరావే! రాజనాల, భీమరాజు, కామినేని ఈశ్వరరావు, అజిత్‌సింగ్ లాంటివారు హనుంమతుడి పాత్ర పోషించినా అర్జాకు వచ్చినంత పేరు రాలేదు. ఆయన ఆ పాత్రని 12 సార్లు పోషించారు. తెలుగు చిత్రాల్లో హనుమంతుడి పాత్ర అన్నిసార్లు పోషించిన నటులు మరెవరూ లేరు.
అర్జా జనార్థన్‌రావు తెరపై మొట్టమొదటగా కనిపించిన చిత్రం ‘మంచిమనిషి’ (1964). ఎన్.టి.రామారావుతో కుస్తీ పోటీలలో పాల్గొనే నటుడిగా నటించారు. పది నిమిషాలు మాత్రమే ఉండే పాత్ర అది. ఆయన ప్రతిభ గ్రహించిన ఎన్‌టిఆర్, తన స్వంత చిత్రం శ్రీకృష్ణావతారం (1967)లో భీముడి పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో ఒదిగిపోయారు జనార్థనరావు. శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరకు రాయబారానికి వెళ్ళబోయేటప్పుడు పాండవుల అభిప్రాయాలు అడుగుతాడు. భీముడు సంధికి అంగీకరించినట్లు చెప్పమంటే ‘అగ్నిహోత్రం చందనశీతలం అయిందే!’ అని ఎత్తిపొడుస్తాడు. ఆ సన్నివేశంలో భీముడిగా నటించిన జనార్థనరావు, దుర్యోధనుడు చేసిన అవమానాలు బలవంతాన దిగమింగి, అన్నగారి మాటకు ఎదురుచెప్పలేక సంధికి అంగీకరిచినట్లు చూపించిన హావభావాలు ప్రశంసనీయం.
ఆ మరుసటి సంవత్సరం వచ్చిన వీరాంజనేయ (1968) చిత్రంలో పోషించిన హనుమంతుడి పాత్ర జనార్థనరావు పేరుని శిఖరాగ్రాన నిలబెట్టింది. ఆంజనేయుడి పుట్టుకనుంచీ, దేవతలు వరాలు ఇవ్వటం, రాముడితో పరిచయం, సీతానే్వషణ, రాక్షసులతో యుద్ధం, శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావటం, రామాంజనేయుల యుద్ధం, వాల్మీకి ఆశ్రమంలో లవకుశుల జననం, కృష్ణుడు అర్జునుడికి ఆంజనేయుడి ప్రభావం నిరూపించటం, గానవిద్యలో నారద తుంబురులతో పోటీ, చివరకు చిరంజీవివి కమ్మని శ్రీకృష్ణుడు ప్రశంసించటంతో కథ ముగుస్తుంది.
1972లో బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో హనుమంతుడి పాత్ర పోషించిన జనార్థనరావుకి ఆ పాత్రలో ఆయనకు సాటిలేరని నిరూపించింది. రావణుడిగా నటించిన ఎస్‌విఆర్‌తో నువ్వా నేనా అన్న రీతిలో అభినయించారు. అశోకవనంలో సీతముందు విశ్వరూపం చూపించిన పంచముఖాంజనేయస్వామిగా దర్శనం ఇవ్వటం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంపూర్ణ రామాయణంకి నాలుగు నెలలముందు వచ్చిన శ్రీకృష్ణసత్యలో హనుమంతుడి పాత్ర వైవిధ్యమైనది. అందులోనూ జనార్థనరావే హనుమంతుడు.
బాపు దర్శకత్వంలోనే వచ్చిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం (1975)లో తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో ఆంజనేయుడికి యుద్ధం సంభవించినందుకు కుమిలిపోయే పాత్రలో జనార్థనరావు అద్భుతంగా నటించారు. ‘సాకేత సార్వభౌమా! శరణు శరణయా జానకి రామా! కరుణ చూపవా మారుతిపైన’’ అనే పాటలో కరుణరసం ఒలికిస్తూ కంటతడిపెట్టించారు. చిత్రం చివరలో యుద్ధ సన్నివేశంలో రామాంజనేయుల సంవాద పద్యాలు, శ్రీరాముడి విశ్వరూప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణలు. చాలా చిత్రాల్లో జనార్థనరావుకి ఘంటసాల నేపథ్యగానం అందించారు. కానీ ఈ చిత్రంనాటికి ఘంటసాల కన్నుమూయటంతో ఈలపాట రఘురామయ్య ఆంజనేయుడి పాత్రకి పాటలు, పద్యాలు పాడారు. అప్పటికి రఘురామయ్య నటించడం మానేశారు. ‘రామ నీలమేఘశ్యామా! కోదండరామా! రఘుకులాబ్దిసోమా’ అంటూ ఆయన శ్రావ్యంగా ఆలపించిన పాట పాపులర్ అయింది.
‘ముత్యాలముగ్గు’ (1975)లో హనుమంతుడి పాత్ర చిన్నదైనా గుర్తుండిపోయేది. అందులోనూ షరామామూలుగానే జనార్థనరావే హనుమంతుడు. నాయికకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, అమ్మాయి. అమ్మాయి కళ్ళకు హనుమంతుడు కనిపిస్తాడు, అబ్బాయికి కనిపించడు. ఒక సందర్భంలో ‘ఆంజనేయస్వామి చెప్పాడుగా అన్నయ్యా!’ అని అంటే, ‘‘చెప్పాడూ! అబ్బా..’’ అంటూ నుదురుకొట్టుకుంటాడు. దైవాన్ని నమ్మినవాళ్ళకు కనిపిస్తాడు, నమ్మనివాళ్లకు కనిపించడనే సందేశం అందించాడు దర్శకుడు. ఇంకో సందర్భంలో ఆ పాప ‘‘నీకేం తెలియదు స్వామీ! ఆనాడు కూడా చూసి రమ్మంటే కాల్చి వచ్చావు. సీతమ్మ కోప్పడిందా, లేదా!’’ అని అంటుంది. ‘‘నిజమే తల్లీ! నాకేమీ తెలియదు’’ అని అంతటివాడు కూడా అంగీకరిస్తాడు. జనార్థనరావు ఈ చిత్రంలో శాంతంగా, అమాయకంగా నటించారు. 1975 తర్వాత పౌరాణిక చిత్రాలు క్రమక్రమంగా తగ్గిపోయి సాంఘిక చిత్రాలు వెల్లువెత్తాయ. జనార్థనరావుకి అవకాశాలు సన్నగిల్లాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ శ్రీరామ పట్ట్భాషేకం (1978)లో అవకాశమిచ్చారు.
జనార్థనరావు ప్రతిభను గుర్తించి ఎన్టీఆర్ ఎంతో ప్రోత్సహించారు. తన స్వంత చిత్రాలలో ఐదుసార్లు (శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్ళామా, శ్రీకృష్ణసత్య, శ్రీరామపట్ట్భాషేకం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం) అవకాశం ఇచ్చారు.
పైన చెప్పినవే కాక హనుమంతుడి పాత్రలో కథానాయిక మొల్ల (1970), మాయామశ్చీంద్ర (1975), సూపర్‌మేన్ (1980), శ్రీ ఆంజనేయ చరిత్ర (1980), షర్డీ సాయిబాబా మహత్మ్యం (1985), త్యాగయ్య (1981) మొదలైన చిత్రాల్లో నటించారు.
ఇతర పాత్రల్లో ఉండమ్మా బొట్టుపెడతా (1968), ప్రేమ-పగ (1978), శంకరాభరణం (1980), మానవుడు దానవుడు (1972), సోగ్గాడు (1975), శ్రీ వేమన చరిత్ర (1986), ప్రేమతరంగాలు (1980), జగమొండి (1981), పులిబిడ్డ (1981) వంటి 50కిపైగా చిత్రాల్లో నటించారు జనార్థనరావు. షిర్డీ సాయిబాబా మహత్మ్యం (1985), వేమన చరిత్ర (1986) తర్వాత ఆయన నటించిన దాఖలాలు లేవు. సినీ ఆంజనేయుడిగా ప్రసిద్ధిపొందిన అర్జా జనార్థనారవు 2007 నవంబర్ 4న కన్నుమూశారు.

-గోనుగుంట మురళీకృష్ణ.. 9701260448