సబ్ ఫీచర్

చైనాకు చెంపపెట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా పాలకులకు హాంకాంగ్‌లో చెంపదెబ్బ తగిలింది. మూడు మాసాలుగా హాంకాంగ్ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘వివాదాస్పద ఖైదీల తరలింపు బిల్లు’ను ఎట్టకేలకు ఉపసంహరించుకుంటున్నట్టు హాంకాంగ్ సిఈఓ కారీలామ్ ప్రకటించారు. దాంతో ప్రజల బలమేమిటో నియంతృత్వ చైనా పాలకులకు తెలిసొచ్చింది. అయినప్పటికీ ‘డ్రాగన్’ బుసలు కొడుతూ ఉంది. అంతకన్నా పెద్దఎత్తున హాంకాంగ్ ప్రజలు బుస కొట్టారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా వీధి పోరాటాలకు దిగారు. సాధారణ పోలీసులను, సాయుధ పోలీసులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఎక్కడా తగ్గలేదు.. మొక్కవోని ధైర్యంతో చైనా ఎత్తుగడలను చిత్తుచేశారు. మూడు మాసాలపాటు వీరోచిత పోరాటం చేశారు. బారికేడ్లను తగులబెట్టారు, విమానాశ్రయంలోకి చొచ్చుకువెళ్ళారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించారు.
వారాంతాల్లోనైతే హాంకాంగ్‌లో ‘నేల ఈనిందా..?’ అన్నంతలా జనం రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. టియర్ గ్యాస్, జల ఫిరంగులను, లాఠీలకు ఎదురొడ్డి నిరసన గళమెత్తారు. ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. వాణిజ్యం దెబ్బతిన్నది. స్టాక్ మార్కెట్‌పై ఉద్యమప్రభావం పడింది. అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయి. ఓ రకంగా చెప్పాలంటే హాంకాంగ్ నగరాన్ని నిరసనకారులు, ప్రజాస్వామ్యవాదులు స్తంభింపజేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. రోడ్డుపై సామాగ్రిని పోగేసి దగ్ధం చేశారు. నిషేధాజ్ఞల్ని ధిక్కరించారు, కర్ఫ్యూను ఖాతరుచేయలేదు. ఆందోళనకారులు అగ్గిబరాటాలై చెలరేగిపోయారు, కొందరు రాడికల్స్ ప్రభుత్వ కార్యాలయాలపై పెట్రోలు బాంబులు విసిరారు. వీధుల్లోని గోడల నిండా నినాదాలు, ప్రజాస్వామ్య ఆకాంక్షలు వెల్లువెత్తాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే చైనా చేతిలో ‘కీలుబొమ్మ’గా ఉన్న అధికారుల- పాలకుల నియంత్రణ నుంచి ఉద్యమం ఎప్పుడో దాటిపోయింది. ఒక దశలో తియన్మన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మిలటరీ ట్యాంకులతో అణచివేసినట్టు హాంకాంగ్ ఆందోళనను అణచివేసేందుకు ప్రణాళికలు రచించినా, సరిహద్దుల్లో భారీఎత్తున సైన్యాన్ని మోహరించినా హాంకాంగ్ ప్రజల ఉద్యమానికి అనూహ్యమైన స్పందన లభించడం, పెద్దఎత్తున ప్రజలు వీధుల్లోకి రావడం.. పూర్తి కమ్యూనిస్టు పాలనలో హాం కాంగ్ లేకపోవడం.. నియంతృత్వ ఉక్కుపాదం బలంగా మోపేందుకు ఆస్కారం లేకపోవడంతో దశలవారీగా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, నిరసనకారులు నీరసించిపోయేలా ఎత్తుగడలు వేసినా అవేవీ ఫలించలేదు. చాలామంది హాంకాంగ్‌లో మారణహోమం జరుగుతుందేమో, తియన్మాన్ స్క్వేర్‌లో మాదిరి వేలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమోనని భయపడ్డారు.
పరిస్థితులు అలాగే కమ్ముకొచ్చాయి. వీధి పోరాటాల్లో పెట్రోలు బాంబులు విసరడం, బ్యారికేడ్ల దగ్ధకాండ, కీలకమైన ప్రజారవాణాను, చివరకు విమానాశ్రయాన్ని స్తంభింపజేయడాన్ని చైనా పాలకులు సహించలేరన్న భావన అందరిలో ఏర్పడింది. ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను తట్టుకోలేక ఒక దశలో హాంకాంగ్ సిఈఓ కారీలామ్ తన పదవికి రాజీనామా చేస్తానని అంతర్గత సమావేశాల్లో ప్రకటించింది. ఆ సంగతి బయటకు లీకయింది. చివరికి చైనా ‘బాసులు’కొంత మెత్తబడ్డారని వినికిడి. ఆమె రాజీనామాను వెనక్కి తీసుకునేలా దొడ్డిదారిన వత్తిడి తెచ్చారు. మొత్తంమీద కారీలామ్ రాజీనామా చేయడం లేదని బహిరంగంగా ప్రకటింపజేశారు. ఆమెకు మద్దతును ప్రకటించారు. అయితే పరిస్థితిలో మార్పుతీసుకురావాలని, హాంకాంగ్‌లో ఇదే పద్ధతిలో ఆందోళన కనిపించరాదన్న ‘షరతు’ విధించారని వినికిడి.
వచ్చేనెల హాంకాంగ్‌లో వార్షిక ఉత్సవాలు జరగనున్నాయి. వీటిని అక్కడి ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ అలజడి ఆలోపుగానే ముగించాలన్న ఆతృత ఆమెలో కనిపించింది. తన ‘దేశ’ప్రజల ‘శాపనార్థాలు’వినకుండా ఉత్సవాలను సజావుగా నిర్వహించుకునే వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఆమె కసరత్తు చేస్తోంది. ప్రజలు మాత్రం ఇప్పుడు కేవలం ఖైదీల తరలింపు బిల్లు ఉపసంహరణ, లారీకామ్ రాజీనామా డిమాండ్లను అధిగమించి హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యం కోసం నినదిస్తున్నారు. సంపూర్ణ స్వేచ్ఛ-స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం కావాలని విస్తృతమైన అవగాహనతో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. దీంతో హాంకాంగ్ ప్రజల ఉద్యమస్వరూపం పూర్తిగా మారింది. ఈ విషయాన్ని పసిగట్టిన చైనా పాలకులు- ఇటు లారీక్యామ్ పరిస్థితిని అంచనావేసి తాత్కాలిక ఉపశమనం కోసం ‘బిల్లు’ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటింపజేసినా ఆందోళనలు ఆగేలా కనిపించడం లేదు. విశాలమైన విస్తృతమైన 21వ శతాబ్దపు ప్రజల ఆకాంక్ష అయిన ప్రజాస్వామ్యం కోసం వారు మరింతగా పట్టుబట్టే అవకాశాలే హెచ్చుగా కనిపిస్తున్నాయి. అక్టోబరు ఉత్సవాల దృష్ట్యా ఈ ఆందోళన కొంత వెనుకంజవేసినా అనంతరం ‘‘ప్రజాస్వామ్య ఉద్యమం’’ చివరికంటా కొనసాగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
అటు మెయిన్‌లాండ్ చైనాలోనూ ప్రజాస్వామ్య గళాలు వినబడుతూనే ఉన్నాయి. మరింత పారదర్శకత, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విధానాలు రావాలని, కావాలని కోరుతున్నారు. తియన్మాన్ స్క్వేర్ యోధుల వారసులు ఇంకా కనిపిస్తున్నారు. ‘నియోరిచ్’గా ఎదిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమల వారు, ప్రవాస చైనీయులు తమతమ స్థాయిల్లో ఈ ఆకాంక్షల్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు హాంకాంగ్‌లో ప్రజలు టియర్ గ్యాస్, జల ఫిరంగులను లెక్కచేయలేదు. రేపు తుపాకీ గుళ్ళను సైతం లెక్కచేయబోమని ఆందోళనకారులంటున్నారు. ప్రదర్శనలు జరపరాదని నిషేధాజ్ఞలు విధించినా బేఖాతరు చేస్తూ, తెగించి సాయుధ బలగాలపై పెట్రోలు బాంబులు, ఇతర వస్తువులు విసిరారంటే వారి మనోధైర్యం ఏమేరకు పెరిగిందో ఇట్టే ఊహించవచ్చు. ప్రతిపాదిత బిల్లును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నామని కొన్న వారాల క్రితం అధికారులు ప్రకటించినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. పైగా మరింత రెచ్చిపోయారు. రోడ్ల మీదకు వచ్చి, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వీధి పోరాటాలు చేశారు. ఆకాశంలో హెలికాప్టర్లు తిరుగుతూ హెచ్చరికలు చేసినా జనం తగ్గలేదు.
హాంకాంగ్‌కు సంపూర్ణ స్వేచ్ఛ కల్పించాలని 2014నుంచి కొందరు పోరాడుతున్నారు. ఐదు సంవత్సరాల ఆ ఆందోళన సైతం ఇప్పుడు ‘అంబ్రెల్లా మూవ్‌మెంట్’ (గొడుగు ఉద్యమం)గా కొనసాగుతోంది. హక్కుల సంఘాల వాళ్లు మరింత మెలకువను ప్రదర్శించి చైనా పాలకుల ఎత్తులను చిత్తుచేయాలని, సంఘటితంగా నిలిచి ఉద్యమించాలని పిలుపునిస్తున్నారు. అరెస్టయిన వారిని విడుదల చేయాలని, ‘దొమీలు’గా చిత్రించకుండా వాటిని ‘ర్యాలీలు’గా పరిగణించాలని, క్రూరంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపించాలని, హాంకాంగ్ ప్రజల ప్రజాస్వామిక డిమాండ్‌ను గౌరవించాలని ప్రజాస్వామ్యవాద ఉద్యమ నాయకులు గట్టిగా గళమెత్తుతున్నారు. ఈ ఉద్యమానికి ‘క్లాడియామో’లాంటి మహిళలు నాయకత్వం వహించడం విశేషం.

-వుప్పల నరసింహం 99857 81799