సబ్ ఫీచర్

అల్లరి దేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్రలతో పేరు తెచ్చుకున్న నటులు -ఎందరో ఉంటారు. పాత్రలకే పేరు తెచ్చిన నటులు -కొందరే ఉంటారు. పాత్రనీ నటుడినీ వేరుగా చూడలేని పరిస్థితిని ఏ ఒకరిద్దరో కల్పిస్తారు. ఆ ఒకరిద్దరిలో -ఈవారం మన అతిథి కూడా ఉంటారు.
కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని, కాళిదాసుగా ఏఎన్నాఆర్‌ని కాకుండా మరెవరినైనా ఊహించగలమా? శకునిగా సీఎస్సాఆర్, యముడిగా కైకాల.. ఇలా పాత్రలకు పేరు తెచ్చిన నటుల్ని వేళ్లపైనే లెక్కపెట్టొచ్చు. అదీ సినిమా స్వర్ణయుగపు కాలానికి వెళ్తేనే. ఆ తరానికీ ఈ తరానికీ అనుసంధానంగా -పాత్ర నటుడూ ఒకటైపోయి.. దేవుడి పాత్రలకు ఏకైక దిక్కైపోయిన అల్లరి పిల్లాడు -ఈ వారం వెనె్నల అతిథి. తాత స్వాతంత్య్ర సమరయోధుడైతే.. మనవడు ఏకంగా భక్తి చిత్రాలకు భగవంతుడైపోయాడు. ఆ నట దేవుడే -టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు.. ఈ వారం వెనె్నల అతిథి విజయ్‌చందర్.
కటి భాగానికి జీర్ణ వస్త్రం చుట్టుకుని.. భారమైన శిలువను భుజాన మోస్తూ.. దైన్య స్వరంతో -‘నాయనలారా! నా కోసం ఏడవకండి.. మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి’ అంటూ కరుణార్థ హృదయాన్ని కళ్లలో చూపించినపుడు -ఏసు మనముందున్నాడా? అన్న భావనే కలుగుతుంది. అది కరుణామయుడు చిత్రంలో.
చుట్టూవున్న భక్తులు చెప్తున్నది వింటూనే.. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ.. స్వగతంగా తనలో తనే మాట్లాడుకుంటూ.. -తాత్యా.. అక్కడో అవ్వ నన్ను చూడ్డానికి వచ్చి భక్తులను తోసుకుని రాలేక అవస్థ పడుతుంది. తీసుకురా..’ అన్నపుడూ -ఇంతకంటే సహృదయుడైన సాయి ఉంటాడా? అనిపిస్తుంది. శ్రీ షిర్టీ సాయిబాబా మహత్మ్యం సినిమాలో.
అక్కడ ఏసు.. ఇక్కడ సాయి.. కలగలిపి విజయ్ చందర్. -పాత్రని, పోషించిన నటుడినీ వేరుగా చూడలేమని చెప్పడానికి ఈ రెండు సన్నివేశాలు చాలవూ.

స్వాతంత్య్ర సమరయోధుడు, నిలువెత్తు తెలుగు ఆస్తి.. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకి విజయ్‌చందర్ మనవడు. ప్రకాశం పంతులు పుత్రిక పుష్పావతి, వెంకట్రావుల దంపతుల ముద్దుల తనయుడు. కాకినాడ నివాసులైనా -విజయ్‌చందర్ పుట్టింది మద్రాసులో. ఇంట్లో గారాబం కారణంగా చదువువైపు దృష్టి మళ్లలేదంటారు ఆయన గురించి తెలిసిన వాళ్లు. ఆయన ప్రయాణం ఎటు మళ్లాలో పుట్టినపుడే రాసిపెట్టివుంది కనుక -ఆయన అటువైపే అడుగులేశాడు అంటారు ఆయన గురించి తెలిసిన తాత్వికులు. బాల్యాన్ని బాల్యంలా ఎంజాయ్ చేసే అదృష్టం ఆయనకు దక్కింది. అందుకే ‘ఆట పాటలతో గడిపేసిన ఆ రోజులే నాకు నచ్చుతాయి’ అంటారు విజయ్‌చందర్. పిల్లాడి అల్లరి భరించలేక అమ్మ -మేనమామవున్న మద్రాసుకు పంపించేశారు. అప్పటికే వయసు పెరగటంతో -కేసరి హైస్కూల్‌లో ఫస్ట్ ఫారమ్‌లో చేరారు విజయ్‌చందర్. పెరుగుతున్న వయసులో అల్లరీ శృతిమించటంతో -మేనమామకూ బరువయ్యాడు విజయ్‌చందర్. మళ్లీ కాకినాడకే చేరాల్సి వచ్చింది. మెక్లారిన్ హైస్కూల్‌లో ఏడు నుంచి ఎస్సెస్సెల్సీ వరకూ వంటబట్టించుకున్నారు. ఇంటర్మీడియెట్ పీఆర్ గవర్నమెంట్ కాలేజీ. ఇక్కడే విజయ్‌చందర్ లైఫ్‌లో ఫస్ట్ టర్న్. తాత నాయకత్వ లక్షణాలు అంకురించి -విద్యార్థి నాయకుడిగా ఎన్నికల గోదాలోకి దిగారు. ‘నేను బహు సిగ్గరి. ఆడపిల్లలంటే మరీ ముడుచుకుపోతాను. అప్పటి వరకూ ఎంత అల్లరి చిల్లరిగా తిరిగినా -ఓటు వేయమని అడగడానికి సిగ్గుపడేవాడిని. నేలచూపులు చూస్తూ ఓటడిగితే -ఎదురుగా ఉన్నవాళ్లు ఎవర్ని అడుగుతున్నావ్? అంటూ ఆట పట్టించేవారు’ అంటూ చిర్నవ్వుతో గుర్తు చేసుకున్నారు విజయ్‌చందర్.
**
విద్యార్థి దశలో 9వ తరగతిలో ఉన్నపుడే ‘లోభి’ నాటకాన్ని తొలిసారి ప్రదర్శించారు. అలా మొదలైన స్టేజి పెర్ఫార్మెన్స్ -ఇంటర్మీడియెట్, డిగ్రీ చేసేటప్పటికి నాటకాలు ప్రదర్శించే స్థాయికి చేరింది. డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారు. నాలుగైదు ఉద్యోగాలు అందుబాటులోకొచ్చాయి. ‘మొదట ఎలక్ట్రిసిటీలో ఉద్యోగం. అది వదిలేసి మిలటరీలో ఇఎంఇలో కొన్నాళ్లు, తరువాత స్టేట్ బ్యాంక్ హైదరాబాద్‌లో గన్‌ఫ్రౌండ్రీ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తించా. అలా ఒకటిన్నర ఏడాది బ్యాంక్ ఉద్యోగం చేశా’ నంటారాయన. కాకినాడలో నాటకాలు ఆడే సమయంలోనే రాఘవ కళాసమితి ద్వారా ఏడిద నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పనిచేశారు. అప్పట్లో హరనాథరాజు, ఐఆర్ రాజు, జెవి సోమయాజులు తమ్ముడు రమణమూర్తి ఆయనతో కలిసి నాటకాలు వేసేవారు. ‘రూమ్‌నెంబర్’ అనే నాటకంలో ఆడవేషం కూడా వేశానని గుర్తు చేసుకున్నారు. ‘నాటకాలు వేస్తుండగానే కృష్ణ నటించిన గూఢచారి 116 సినీ జీవితానికి ప్రేరణ ఇచ్చింది’ విజయ్‌చందర్‌కు. ఇక్కడి నుంచి మరో ఫేజ్ మొదలైంది ఆయన లైఫ్‌లో. ‘ఓ ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో మద్రాసు వెళ్లాను. అక్కడ మాధవయ్య, వీర్రాజు అనే మేకప్‌మెన్లు ఇద్దరూ క్షణం తీరికలేనంత బిజీగా ఉండేవారు. అప్పట్లో నటీనటులంతా వాళ్ళిద్దరి దగ్గరే మేకప్ చేసుకొని షూటింగ్‌లకు వెళ్లేవారు. నిజంగా అక్కడో క్యూలాగ ఉండేది’ అంటూ తొలి రోజుల ముచ్చట్లు గుర్తు చేసుకున్నారు. ‘వారిద్వారా నేనూ నటుడిని అవుదామన్న ఆలోచనకు వచ్చాను. నటుడిని అంటే విమర్శిస్తారన్న భయంతో నిర్మాతనంటూ పరిచయం చేసుకున్నా. అప్పట్లో నటుడిగా వచ్చానంటే -ఎందుకయ్యా, చాలామంది నటులున్నారు. నువ్వేం చేస్తావ్? అనేవారు. పోనీ నిర్మాతగా వచ్చానంటే, ఎందుకయ్యా నష్టపోతావు. ఒడ్డూ పొడుగూ బానే ఉన్నావుగా, నటించొచ్చుకదా అనేవారు’ అంటూ అప్పటి రోజుల్ని విశే్లషించారు విజయ్ చందర్.
మాధవయ్య, వీర్రాజుల ఇంటి ఆవరణలోనే నటీనటుల కోసం బాడ్మింటన్, షటిల్‌కాక్ కోర్టు ఉండేవి. అక్కడికి నాగేశ్వర్రావు, సావిత్రి, విశ్వనాథ్‌లాంటివారు వచ్చి సాయంత్రం ఆటలు ఆడేవారు. నేనూ అక్కడ ఉండటంతో దర్శకుడు విశ్వనాథ్ కంట్లోపడ్డాను. ఆయనే నన్ను వెన్నుతట్టి నటుడిగా పనికొస్తానని నమ్మకం కలిగించారు. విశ్వనాథ్ ప్రోత్సాహంతో సినిమాల్లో నటించడానికే మొగ్గుచూపా. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘బుద్ధిమంతుడు’ చిత్రంలో ‘్భమీద సుఖపడితే తప్పులేదురా’ అన్నపాటలో నేనూ నాగేశ్వరరావు స్నేహితులుగా నటించా’ అని గుర్తుచేసుకున్నారాయన. అదే విజయ్ చందర్ తొలి సినిమా. దేవదాస్ కనకాలతోపాటు ఆయన కూడా కనిపిస్తారు ఆ పాటలో. అయితే ‘నాకు హిందీ హీరో షమీకపూర్ అంటే ఇష్టం. ఆయనలాగే మూమెంట్స్ ఇచ్చేవాణ్ణి. గిటార్ పట్టుకొని ఆ పాటలో నేను మూమెంట్స్ ఇస్తుంటే మేకప్‌మెన్ తంగప్ప మాస్టర్ అక్కినేని నాగేశ్వర్రావుకు చూపారట. ‘అంగ్‌పార్ ఇవన్’ అంటే నాగేశ్వర్రావు నన్ను చూసి మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఆయనకు దగ్గరయ్యాను. ఇలా వేషాలకోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆదుర్తి సుబ్బారావు దగ్గరవుండే నారాయణ వచ్చి ఓ కబురు చెప్పాడు. ఆయన రూపొందిస్తున్న చిత్రంలో చిన్న వేషం ఉందని, దర్శకుడు రమ్మన్నారని చెప్పారు. నేను వెళ్లా. అక్కడ కె విశ్వనాధ్, ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, చెరువు ఆంజనేయశాస్ర్తీ లాంటి మహామహులున్నారు. ఏదైనా ప్రశ్న అడుగుతారేమో అనుకున్నాను. కానీ ననే్నమీ అడగలేదు. ఇలా చూసి ఓకె వెళ్లమన్నారు. బయటికివచ్చాక నన్ను చూసి నారాయణ ‘తంతే బూరెల బుట్టలో పడ్డావు పో’ అన్నారు. విషయం ఏమిటీ? అని అడిగాను. హైదరాబాద్‌లో నెలా పదిహేను రోజులపాటు షూటింగ్‌వుంటుంది. బట్టలన్నీ సిద్ధం చేసుకున్నావా? అన్నాడాయన. విషయం ఏంటో చెప్పండి అని అడిగాను. ఆదుర్తి- అక్కినేని కాంబినేషన్‌లో రానున్న ‘మరో ప్రపంచం’ చిత్రంలో నీకు హీరో వేషం అని చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. చాలా సంతోషమనిపించింది.
గండిపేట దగ్గరలోని చిన్న చిన్న కొండలమధ్య చిత్రాన్ని రూపొందించారు. అప్పుడు యువతరానికి ప్రతీకలుగావున్న మేము, దాదాపు ఐదారుగురు నటీనటులు ఉండేవాళ్లం. అందులో నటి లక్ష్మీప్రసన్న, మాడా వెంకటేశ్వరరావు లాంటివాళ్లం ఉండేవారం. అసలు ఆ టీమ్‌తో పని చేయడమే అదృష్టం. ఒక్కొక్కరం పోటీపడి నటనలో, మేకప్‌లో మా ప్రతిభ చూపే ప్రయత్నం చేసేవాళ్లం. జీవితంలో అలాంటి చిత్రంలో నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అదే చిత్రంలో నాగేశ్వరరావు, సావిత్రి, జమున, గుమ్మడి లాంటివాళ్లతో కలిసి నటించడం కూడా మరచిపోలేని విషయం అన్నారు విజయ్ చందర్.
హీరో కాంతారావు తనయుడు రాజా మంచి నటుడు. ఒకానొక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావుని నిలబెట్టి మరీ డైలాగ్ చెప్పి శభాష్ అనిపించుకున్నవాడు రాజా. ప్రజల పేర్లల్లోవున్న రెడ్డి, నాయుడులాంటి కులాల ప్రసక్తి లేకుండా కొత్త ప్రపంచం యువతతో రూపొందించాలన్న ఆదుర్తి- అక్కినేనిల ఆలోచన నిజంగా చాలా గొప్పది. ఒకరకంగా ఈకాలంలో రావలసిన చిత్రమిది. అప్పటికే వాళ్లు ఎంత అడ్వాన్సుగా ఆలోచించారో కదా అనిపిస్తుంది. అసలు ఇప్పటి పిల్లలకు మరో ప్రపంచం చిత్రంతోపాటుగా నేను రూపొందించిన ఆంధ్రకేసరి చిత్రాలు చూపించాలి. ఈ చిత్రాలతోపాటు మా పిన్నిగారు టంగుటూరి సూర్యకుమారి నటించిన ‘రైతుబిడ్డ’ చిత్రం కూడా చూపాలని నా కోరిక. మరోప్రపంచం చిత్రం విడుదలయ్యే సరికి.. అందరూ నన్ను కౌబాయ్ హీరోగా పిలిచేవారు. ఎందుకంటే రౌడీరాణి, బస్తీ బుల్‌బుల్, సిఐడి రాజు, మావూరి మొనగాళ్లు లాంటి కౌబాయ్ చిత్రాలు చేయడంతో అలాంటి పేరొచ్చింది. నాకు ప్రేరణనిచ్చిన కృష్ణతో కలిసి ‘మావూరి మొనగాళ్లు’ చిత్రంలో నటించడం మరింత ఆనందాన్నిచ్చింది. సుపుత్రుడు, కెఆర్ విజయ కథానాయికగా దేవి లలితాంబ చిత్రాల్లో విలన్ వేషాలూ వేశాను.
(మరిన్ని ముచ్చట్లు వచ్చేవారం)

-సరయు శేఖర్, 9676247000