సబ్ ఫీచర్

వర్సిటీల్లో అవస్థల తిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించి యూ నివర్సిటీల్లో విద్యను అభ్యసించడానికి విద్యార్థులు ఉత్సాహపడుతున్నా, వారి ఆకాంక్షలకు భిన్నంగా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. విద్యారంగంలో వివక్షను నిరసిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా మారి విద్యార్థులు లాఠీదెబ్బలు, రబ్బర్ బుల్లెట్లకు సైతం లెక్కచేయకుండా పోరాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య ఎంతో అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్సిటీలు బాగు పడతాయని అందరూ ఆశించారు. విద్యార్థులు ఆశించిన మార్పు జరగకపోగా, వర్సిటీల్లో అధ్వాన పరిస్థితి రాజ్యమేలుతోంది.
గత ఐదు సంవత్సరాలలో తెలంగాణలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో కనీసం అటెండర్ స్థాయి పోస్టులను కూడా భర్తీచేయలేదంటే అతిశయోక్తి కాదు. విశ్వవిద్యాలయాలకు బోధన, పరిశోధన రెండు కళ్లు లాంటివి. ఇందులో ఏ ఒక్కటి సరిగా లేకున్నా వర్సిటీల్లో విపరిణామాలు తప్పవు. విశ్వవిద్యాలయాల్లో ఇటీవల విద్యా ప్రమాణాలు గణణీయంగా తగ్గాయని చెప్పవచ్చు. బోధన, బోధనేతర సిబ్బంది కొరత చాలా ఉంది. విద్యార్థులు నాణ్యమైన బోధన అందుకోలేకపోతున్నారు. అన్ని వర్సిటీల్లోనూ అధ్యాపక ఖాళీలు చాలా ఉన్నాయి. వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాల నుండి పదవీ విరమణలు జరుగుతున్నాయే తప్ప- నూతన నియామకాలు జరగటం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ వర్సిటీలో 1,270 మంది అధ్యాపకులు అవసరం కాగా, ప్రస్తుతం 490 మంది అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. 774 మంది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని ఖాళీలు పెట్టుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీల్లో ప్రధానమైన విభాగాల్లో ఎన్నో ఖాళీలు ఉన్నాయి. మంచి ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలని కలలు కంటాడు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం ఏ మాత్రం న్యాయం చేయడం లేదు. ఇక, కాకతీయ యూనివర్సిటీలో ప్రస్తుతం 390 మంది అధ్యాపకులు అవసరం ఉండగా, 140 మంది మాత్రమే పనిచేస్తున్నారు. తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలుగు విశ్వవిద్యాలయం, జెఎన్‌టీయూ సహా అనేక యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వారి సంఖ్య కంటే ఖాళీల సంఖ్య ఎక్కువగా కనబడుతోంది. అధ్యాపకులు లేని కారణంగా విద్యార్థులు తమ చదువులను మధ్యలో ఆపివేసే పరిస్థితి ఉంది. ఖాళీలను భర్తీచేసేందుకు యూనివర్సిటీ అధికారులు కాం ట్రాక్టు పద్ధతిలో అతిథి అధ్యాపకులను నియమించే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని సంవత్సరాల నుండి పదవీ విరమణలు జరుగుతున్నాయి. నూతన నియామకాలు ఎక్కడా జరగడం లేదు. అనుభవం కలిగిన అధ్యాపకుల సేవలను కోల్పోవడం జరుగుతోంది. బోధనేతర సిబ్బందికి సంబంధించి వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. పది మంది చేసే పని ఒక్కరే చేసే పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో విశ్వవిద్యాలయాల్లో పరీక్ష పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలే దీనికి నిదర్శనం. విద్యార్థులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు అధ్యాపకుల, సిబ్బంది జీతాలకే సరిపోని పరిస్థితి ఉంది. వర్సిటీల్లో నూతన హాస్టళ్ల నిర్మాణం జరడం లేదు. విద్యార్థులకు వౌలిక సదుపాయాలు లేవు. పాతకాలపు ల్యాబ్‌లను వాడడం అనివార్యమవుతోంది. సైన్స్ విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక వారు బయటికి వెళ్లి పరిశోధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ నిజాం కట్టిన భవనాల్లోనే విద్యార్థులు నివసిస్తున్నారు. వర్షం వస్తే నయాగరా జలపాతాన్ని తలపించే విధంగా హాస్టల్ గదులు కనబడతాయి. అమ్మాయిలకు సంబంధించిన చాలా హాస్టళ్లలో భద్రత కొరవడింది. పలు చోట్ల యూనివర్సిటీ స్థలాలను కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి విశ్వవిద్యాలయాల్లో చదువుకొంటున్నారు. కానీ వారు ఆశించినంత నేర్చుకోలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ప్రస్తుత సమయంలో మనం మాత్రం అధ్యాపకులను నియమించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన పాలకులు నేడు వాటిపై కనె్నత్తి చూడని పరిస్థితి ఉంది. అధ్యాపకులు లేని కారణంగా ఆ ప్రభావం పరిశోధనలపై కూడా పడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలలో అధ్యాపకుల పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందే నియామకాలు జరుగుతుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలోని విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు పదవీ విరమణ చేసి సంవత్సరాలు గడుస్తున్నా, కొత్త నియామకాలు జరగనందున విద్యార్థులు చదువులో రాణించలేక పోతున్నారు. ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా పాలక మండలి లేదు. దీంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఉన్నత విద్యలో ప్రభుత్వం విఫలమైంది. యూనివర్సిటీలపై పెట్టుబడి కేవలం మానవ వనరుల అభివృద్ధి కోసం జరిగే పెట్టుబడిగా భావించాలి. యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకురావడం హాస్యాస్పదం. తక్షణం యూనివర్సిటీల అభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి, అన్ని యూనివర్సిటీలకు నిధులు పెంచాల్సిన అవరం ఉంది. విద్యార్థులు ఆందోళనలకు దిగకముందే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం సమంజసం.

-చింత ఎల్లస్వామి (ఏబీవీపీ నేత, తెలంగాణ)