సబ్ ఫీచర్

బ్యాంకులపై పాలకుల పెత్తనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూపీఏ ప్రభుత్వం 2008-09లో ప్రారంభించిన బ్యాంకుల విలీనకరణ ప్రక్రియను ఇపుడు మోదీ సర్కారు కొనసాగించడం విడ్డూరం. 2008-09లో స్టేట్ బ్యాంక్‌లో దాని రెండు అనుబంధ బ్యాంకులైన సౌరాష్ట్ర, ఇండోర్ స్టేట్ బ్యాంకులను విలీనం చేశారు. 2016-17లో మిగిలిన అనుబంధ బ్యాంకులైన బికనీర్, హైద్రాబాద్, మైసూరు, ట్రావన్‌కూర్ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేశారు. బ్యాంకుల విలీనాన్ని గొప్ప సంస్కరణగా చూపిస్తున్నారు. నరసింహన్ కమిటీ 1991లో చేసిన సిఫారసులను అమలుచేయటానికి రెండు దశాబ్దాలు పట్టింది. విలీన ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించకుండానే, ఆశించిన ప్రయోజనాలు నెరవేరాయో లేదో మదింపు చేయకుండానే మోదీ ప్రభుత్వం మరో పెద్ద విలీనీకరణ ప్రతిపాదనను చేసింది. పంజాబ్ నేషనల్, యునైటెడ్, ఓరియంటల్ బ్యాంకులను, కెనెరా, సిండికేటు బ్యాంకులను, ఆంధ్రాబ్యాంకు, యూనియన్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జాతీయ బ్యాంకులకు స్వంతదారైన ప్రభుత్వం తన అధీనంలోని పలు చిన్న బ్యాంకులను కలిపి, పెద్ద బ్యాంకులుగా మార్పుచేసేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన పనిలేదు. పెద్ద బ్యాంకులతో నిర్వహణ వ్యయం తగ్గి, అవి లాభాల బాట పడితే అంతకంటే కావలసింది లేదు. కానీ సాక్ష్యాధారాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. పెద్ద బ్యాంకులు అయినంతమాత్రాన నష్టపోకూడదన్న నియమేమీ లేదు. పెద్ద బ్యాంకులు బాగా పనిచేస్తాయని, మెరుగైన సేవలు అందిస్తాయని, నష్టపోవని చెప్పటానికి బలమైన సాక్ష్యాధారాలు లేవు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అనేక పెద్ద బ్యాంకులు ఘోరంగా నష్టపోవటంతో 2008లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 11 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 15న ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకులలో ఒకటయిన లెమాన్ బ్రదర్సు బ్యాంకు దివాలాతీసింది. 2008నుండి 2012 వరకు మొత్తం 465 బ్యాంకులు అమెరికాలో దివాలా తీసాయి. ఇవన్నీ మన ఎస్‌బీఐ కంటే పెద్దవి. అమెరికాలో బ్యాంకులు దివాలాతీయటానికి నియంత్రణ, పర్యవేక్షణ కొరవడటమే ప్రధాన కారణం.
రిజర్వు బ్యాంకు నియంత్రణ...
మన దేశంలో జాతీయ బ్యాంకులపై సరైన నియంత్రణ, పర్యవేక్షణ లేవు. బ్యాంకింగ్ రంగంపై అజమాయిషీ చేసే అధికారం రిజర్వు బ్యాంకుది. కాని రిజర్వు బ్యాంకు అధికారులను క్రమేపీ కత్తిరిస్తూ వచ్చారు. 1969లో 14 బ్యాంకులు, 1980లో 6 బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత పాలకుల, అధికార స్వామ్యం (బ్యూరోక్రసీ) అధికారాలు పెరిగి రిజర్వు బ్యాంకు స్థాయి సలహాఇచ్చే స్థాయికి పడిపోయింది. బ్యాంకులను జాతీయం చేశాక వాటి పర్యవేక్షణ అధికారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తన గుప్పెట్లో పెట్టుకొంది. బ్యాంకుల జాతీయకరణ చట్టం (1980), స్టేట్ బ్యాంకు చట్టం (1955), బ్యాంకింగ్ చట్టం (1970)లను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వమే నేరుగా జాతీయ బ్యాంకులపై విశేష అధికారాలను చెలాయిస్తున్నది. రిజర్వు బ్యాంకుకు జాతీయ బ్యాంకులపై ఉన్న నియంత్రణాధికారాలు నామమాత్రం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం సెక్షను 51 ప్రకారం కీలక నిర్వహణాంశాలపై రిజర్వు బ్యాంకులకు అధికారాలు లేకుండాచేశారు. జాతీయ బ్యాంకుల ఛైర్మన్లను గానీ, మేనేజింగ్ డైరెక్టర్లును గానీ, వారు అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డా రిజర్వు బ్యాంకు తొలగించలేదు. కనీసం డైరెక్టర్లను కూడా ఏమీ చేయలేదు. జాతీయ బ్యాంకుల విలీనప్రక్రియలో కాని, మూసివేసే ప్రక్రియలో కాని రిజర్వు బ్యాంకుకు ఎలాంటి పాత్రలేదు. జాతీయ బ్యాంకులకు రిజర్వు బ్యాంకు అనుమతుల అవసరమే లేనప్పుడు, వాటిని రద్దుచేసే అధికారం ఉండదని వేరే చెప్పనవసరం లేదు.
జాతీయ బ్యాంకులకు ప్రభుత్వమే మూలధనం సమకూర్చుతున్నది. వాటి పనితీరును ఆర్థిక మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తున్నది. అస్మదీయులను బ్యాంకులకు డైరెక్టర్లుగా నియమిస్తారు. బ్యాంకింగ్ రంగంలో అనుభవం లేనప్పటికీ తమవారినే బ్యాంకు ఛైర్మన్‌లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమిస్తారు. రాజకీయంగా పలుకుబడి కలవారికి, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు వారు రుణాలు మంజూరుచేస్తారు. ఫోన్ చేస్తే రుణాలు మంజూరుచేసే కొత్త పద్ధతి యూపీఏ హయాంలో మొదలయింది. ఒక పెద్ద ఆశ్రీత పెద్ద పెట్టుబడిదారీ వర్గాన్ని, వ్యవస్థను తయారుచేశారు. దాన్ని పెకిలించటం అంత తేలికైన విషయం కాదు. లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా ఈ ఆశ్రీత పెట్టుబడిదారీ వర్గం దోచుకుంటున్నది. ఇందుకు పాలకులు, అధికారస్వామ్యం సహకరిస్తున్నారు. యిచ్చిపుచ్చుకొనే పద్ధతిలోనే ఇదంతా నడుస్తున్నది.
1991లో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఎంత అధ్వాన స్థితిలో బ్యాంకులు నడుస్తున్నాయో చర్చలు నిర్వహించి చెప్పారు. సంస్కరణలతో ఎలాంటి మార్పులు రానున్నాయో చెప్పి ఆశలు రేకెత్తించారు. సంస్కరణలు ప్రవేశపెట్టి సుమారు మూడు దశాబ్దాలు కావస్తున్నది. ఈనాటి స్థితి 1991నాటి దుస్థితి కంటే ఏమాత్రమూ మెరుగ్గాలేదు. నిరర్థక ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయి. ఏటా కొన్ని వేల కోట్ల రుణాలు రద్దుచేస్తున్నారు. 1991నుండి ప్రభుత్వం బ్యాంకులను ప్రజాధనంతో ఆదుకుంటూనే వుంది. నష్టాలలో నడుస్తున్న బ్యాంకులకు అదనపు మూలధనాన్ని సమకూర్చుతూ ఎప్పటికప్పుడు జీవం పోస్తూనే ఉంది. 2008-09నుండి 2016-17 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.3.29 లక్షల కోట్లు మూలధనంగా జాతీయ బ్యాంకుల్లో పోసింది. 2019-20 బడ్జెట్‌లో ఏకంగా 70వేల కోట్లు జాతీయ బ్యాంకుల మూలధనం కేటాయించినా బ్యాంకుల పనితీరు మెరుగుపడలేదు.
వౌలిక సంస్కరణలు రావాలి..
2014లో బ్యాంకుల నిర్వహణను మెరుగుపర్చటానికి నాయక్ కమిటీ విలువైన ప్రతిపాదనలు చేసింది. అందులో కొన్నింటిని మాత్రమే ‘ఇంధ్ర ధనస్సు’ పేరుతో మోదీ ప్రభుత్వం అమలుచేసింది. ముఖ్యమైన ప్రతిపాదనలు అమలుచేయటానికి అధికారస్వామ్యం అడ్డుపుల్ల వేసింది. ప్రభుత్వం జాతీయ బ్యాంకులపై నియంత్రణాధికారాన్ని రిజర్వు
బ్యాంకుకు పూర్తిగా యిచ్చినప్పుడే పరిస్థితి మెరుగుపడుతుంది. ఎందరు ప్రధానులు, ఆర్థికమంత్రులు వచ్చినా, ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా బ్యాంకింగ్ రంగంలో తమ మితిమీరిన జోక్యాన్ని తగ్గించుకోవటానికి సిద్ధంగా లేరు. పాలకులు వారి ఆశ్రీత పెట్టుబడిదారుల కబంధహస్తాలనుండి బ్యాంకులను విముక్తిచేయాలి. వౌలికమైన సంస్థాగత సంస్కరణలను నాయక్ కమిటీ ప్రతిపాదించింది. ఒక బ్యాంకింగ్ పెట్టుబడి కంపెనీని ప్రారంభించి జాతీయ బ్యాంకుల నిర్వహణను ఆ కంపెనీకి అప్పగించటం ముఖ్యమైన ప్రతిపాదన. ఓనర్‌షిప్‌కు సంబంధం లేని అన్ని బాధ్యతలనుండి తప్పుకొని రిజర్వు బ్యాంకు నియంత్రణ కింద జాతీయ బ్యాంకులను పనిచేయనివ్వాలన్నది మరో ముఖ్యమైన ప్రతిపాదన. నిర్వహణ వ్యవహారాలలో, రుణ విధానాలలో చీటికీమాటికీ కేంద్ర ప్రభుత్వం జోక్యంచేసుకునే తీరు మారకపోతే, ఎంత మూలధనం సమకూర్చినా, ఎన్ని విలీనాలు చేసినా జాతీయ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయలేవు.

-డా.బి.సారంగపాణి