సబ్ ఫీచర్

భారతీయ విద్యే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా సింగపూర్ ప్రసిద్ధి చెందినా, అక్కడి ప్రజలు మలేషియా నుండి తాగునీటిని రోజూ విమానాలలో తెచ్చుకుంటారు. ఎక్కడైనా మానవ జీవనం అభివృద్ధి సాధించాలంటే నీరు అతి ముఖ్యమైన వనరు. అటువంటి నీటి వనరులు సింగపూర్‌లో లేవు. అయినప్పటికీ అతి తక్కువ కాలంలో సింగపూర్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఇందుకు కారణం ఏమిటని సింగపూర్ ప్రధానిని ఒకరు ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన జవాబు- ‘విద్య’అని! విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ దేశం అత్యద్భుత ప్రగతిని సాధించింది.
బోధన చేసే ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? శ్రీరామకృష్ణ పరమహంస అంతేవాసి శిష్యుల గురించి వివరించిన ‘దైవంతో సహజీవనం’ పుస్తకంలో ఇలా పేర్కొన్నారు.
* బోధనను మనఃస్ఫూర్తిగా, నిజాయితీగా, ఒక సేవగా, పురోభివృద్ధికి తోడ్పడే ధార్మిక సాధనగా భావించాలి.
* బోధన అనేది లౌకిక వ్యవహారాలలో తనకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఆలోచనలను, కోరికలను మనసు నుండి తొలగించాలి.
* బోధించబోయే అంశం గురించి తీవ్రంగా ధ్యానం చెయ్యాలి.
* బోధనను భగవంతుని ముందుంచే పవిత్ర నివేదనగా భావించాలి.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకూ విద్యారంగం ఎన్నో మార్పులతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. చదువుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కేరళ నూరు శాతం అక్షరాస్యతను సాధించింది. ఆ దిశలో ముందుకు వెళ్లేందుకు మిగిలిన రాష్ట్రాలూ పోటీపడుతున్నాయి. అంతర్జాతీయంగా పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు అనుగుణమైన కొత్త విద్యలను మన దేశంలో ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్నాం. ఆ విద్యలనభ్యసించినవారు ఆయా రంగాలలో తగిన నైపుణ్యాన్ని సంపాదించడంపై ప్రభుత్వాలు శ్రద్ధ వహిస్తున్నాయి. ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామం.
నేడు వివిధ రంగాలలో నిపుణులకు, ప్రతిభావంతులకు కొదవలేదు. వివిధ రంగాలకు చెందిన పరిశోధకులున్నారు. మన విద్యావిధానం ఆయా రంగాలలో నిపుణులను తయారుచేసేందుకే రూపొందింది. సగటు మనిషిలో జాతీయ స్పృహను, దేశభక్తిని కలిగించేందుకు దోహదపడే విద్యావిధానాన్ని నేటికీ మనం రూపొందించుకోలేదు. దీనికి ఫలితం..? ఒకప్పుడు విశ్వగురువుగా సకల మానవాళికీ ధార్మిక జీవనమంటే ఏమిటో ఆచరణాత్మకంగా చూపిన మన దేశంలో- నేడు సమాజం పట్ల, దేశం పట్ల కనీస స్పృహ, బాధ్యత లేని సగటు మనిషులను చూస్తున్నాం. అనాదిగా వస్తూన్న మన సాంస్కృతిక జీవన వికాసం కోసం తమ సర్వస్వాన్నీ అర్పించిన మహనీయుల పేర్లు సైతం తెలియనివారు సామాన్య ప్రజల్లోనే కాదు, విద్యావంతుల్లోనూ పెద్దసంఖ్యలో ఉన్నారు. మహనీయుల గురించి తెలుసుకోవాలన్న ఆలోచన చాలామందిలో లేదు.
ఆల్రెస్ మాల్రాస్ ఫ్రెంచి తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు. మన దేశానికి స్వా తంత్య్రం రావడానికి పదేళ్లకు ముందు జవహర్‌లాల్ నెహ్రూ ఒక సమావేశంలో మాల్రాస్‌ను కలుసుకున్నారు. అప్పుడు మల్రాస్, నెహ్రూతో మాట్లాడుతూ, ‘మా దేశంలో ఆలోచనలకు కరవు వచ్చింది. మా ప్రజలు, ముఖ్యంగా యువత ఎటుపోతోందో అర్థంకాని పరిస్థితి. వారికి స్పష్టమైన ఆదర్శం లేదు. భారత్‌ను చూస్తే మనిషి జీవితాన్ని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే మహోన్నతమైన ఆలోచనల పరంపర వేల సంవత్సరాలుగా వుంది. అటువంటి ఆలోచనల పరంపరలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ప్రపంచమంతా అనుసరించదగ్గవి. ప్రస్తుతం మీ దేశం పరాయి పాలనలో వుంది. మీరు స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేస్తున్నారు. త్వరలోనే మీ దేశం స్వతంత్రమవుతుంది. తరువాత మీ దేశానికి అవసరమైన విధానాల రూపకల్పనలో ఆదిశంకరులవారి సిద్ధాంతాలకు చోటుకల్పించే ఆలోచన వుందా?’- అని అడిగారు. దానికి నెహ్రూ వద్ద ఏ సమాధానమూ లేదు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్లకు వేరొక సందర్భంలో నాటి సామ్యవాద నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మాల్రాస్‌ను కలిశారు. ‘స్వతంత్ర భారతదేశంలో ఆదిశంకరుల సిద్ధాంతాల ఆధారంగా మీ విధానాలను రూపొందించుకొన్నారా?’ అని ఆల్రెస్ ఆనాడు జయప్రకాశ్‌ను అడిగారు. అందుకు జయప్రకాశ్ వద్ద సమాధానం లేదు.
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులే గెలిచినా, ఆ గెలుపు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మళ్ళీ అలాంటి సంగ్రామమే జరిగితే తాము భారత్‌ను విడిచిపెట్టి వెళ్ళక తప్పదని వారు భావించారు. శతాబ్దాలుగా విదేశీయుల దురాక్రమణలకు గురౌతున్నా వాటన్నింటినీ తట్టుకుని భారతీయులు పోరాటాలు చేస్తున్నారంటే అందుకు కారణం తమ ధర్మాల పట్ల భారతీయుల్లోని అంతరిక నిష్ఠయేనని ఆంగ్లేయులు గుర్తించారు. ఇక్కడ తమ పాలన కొనసాగాలంటే మొదట భారతీయులలో తమ ధర్మసంస్కృతుల పట్ల ఉన్న అంతరిక నిష్ఠను దెబ్బతీయాలనుకున్నారు. అందుకు వారు విద్యారంగాన్ని ఎంచుకున్నారు. మెకాలే విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ధర్మసంస్కృతుల పట్ల భారతీయులలో ఏమాత్రం గౌరవభావం కలిగించని రీతిలో పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. తాను రూపకల్పన చేసిన విద్యావిధానాన్ని గురించి తన తండ్రికి వ్రాసిన లేఖలో లార్డ్ మెఖాలే ఇలా రాశారు. ‘్భరత్‌లో ప్రవేశపెట్టబోతున్న ఈ విద్యావిధానం ద్వారా తయారైనవారు వేషభాషలలో భారతీయులుగా ఉన్నా వారి మనస్సులూ, ఆలోచనలూ ఆంగ్లేయ భావజాలంతోనే నిండి ఉంటాయి. ఈ విద్యావిధానం ద్వారా రూపుదిద్దుకున్న హిందువులు హిందువులుగానే ఉంటారు. వారిని క్రైస్తవులు ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చినా మతం మార్చలేరు. కానీ తమ ధర్మ సంస్కృతులకు, దేశానికీ జరిగే అవమానాల పట్ల హిందువులలో కనీస స్పందన కూడా ఉండదు. తమపై జరిగే సాంస్కృతిక దాడులను ప్రతిఘటించాలన్న ఆలోచనే హిందువులలో ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ తత్త్వవేత్త విల్ డ్యురాంట్ బ్రిటిష్ వారి గురించి చెబుతూ- ‘ప్రపంచ చరిత్రలో అతి పెద్ద నేరం ఏదైనా ఉందంటే అది బ్రిటిష్‌వారు భారతదేశాన్ని పరిపాలించడమే’ అని అంటారు. ఏ దేశ నాగరికతనైనా, సంస్కృతినైనా నాశనం చేయాలంటే మూడు మార్గాలున్నాయి. 1. కుటుంబ వ్యవస్థని నాశనం చేయటం. 2. విద్యా వ్యవస్థని ధ్వంసం చేయటం 3. యువతరం తక్కువ స్థాయి వ్యక్తులను ఆదర్శంగా తీసుకునేలా చేయటం. మన దేశంలో ఈ మూడూ జరుగుతూ వచ్చేయి.
బానిసత్వం అంటే పీడనకు గురికావడం మాత్రమే కాదు, సుఖాలకు అలవాటుపడటం కూడా. పీడనకు గురైనవారు దాని నుంచి ఏదోఒక రోజు బయటపడడానికి పోరాడతారు. సుఖానికి అలవాటుపడ్డవాడు ఎలా పోరాడతాడు? సుఖాల నుండి బయటపడాలనే ఆలోచనే అతడికి ఉండదు కదా. అలాంటి వ్యక్తి బానిస్వంలో కొనసాగడంలోనే సంతృప్తి పొందుతాడు. ఈ బానిసత్వం భౌతికమైనదే కాదు. మానసికమైనది, బౌద్ధికమైనది కూడా. ఈ మూడు స్థాయిలలోనూ లభించే సుఖాలకు మనసు అలవాటు పడిపోతుంది. ఎవరైనా సరే భౌతికమైన బానిసత్వం నుండి బయటపడవచ్చు. మానసిక బానిసత్వం నుండి బయట పడటం చాలా కష్టం. అటువంటి మనస్తత్వమే బుద్ధిని బానిస భావజాలంలో కొనసాగేటట్లు చేస్తుంది. అలా బానిస భావజాలంలో మగ్గుతున్న బుద్ధిజీవులే మన విద్యావిధానం భారతీయకరణం కావడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన మెకాలే విద్యావిధానంలో భారతీయ ఆత్మ అనేదే లేదు. మనలోని జాతీయాత్మను ధ్వంసం చేయడానికే వారు ఆ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. అటువంటి విద్యావిధానం ఫలితాలు చేదుగానే ఉంటాయి. నేడు మనం నేర్చుకుంటున్న విద్య- మన దేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, అక్కడి న్యాయసూత్రాల ప్రకారం విచారించడాన్ని విద్యార్థికి నేర్పుతోంది. మనదైనదేదీ మనకు పరిచయం లేదు. పరిచయం అయినా నిరాదరణ దృష్టితోనే పరిచయం అవుతుంది. అడుగడుగునా మన భావాలను విదేశీ కొలబద్దతో కొలుస్తున్నాం. మనకు మన సంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాలు పరిచయం లేవు. పరిచయం వున్నా విదేశీయులు ఎలా పరిచయం చేశారో అలాగే పరిచయం మనకు.
‘ఇప్పుడిప్పుడే మనమొక జాతిగా రూపొందుతున్నాం’ అన్న భావం నరనరాల్లో జీర్ణించుకుపోయిన నాయకులు స్వాతంత్య్రానంతరం మన దేశానికి పాలకులయ్యారు. భారతీయత స్పర్శ ఏ మాత్రం లేని, పూర్తిగా పాశ్చాత్య భావాలతో కూడిన విద్యావిధాన రూపకల్పనకే వారు ప్రాధాన్యతనిచ్చారు. భారతీయత కనబడని విద్య మన ప్రజలకు అందించారు. ఫలితంగా మన సాంస్కృతిక విలువల గురించి, మన మహనీయుల గురించి ఏమీ తెలియని మేధావులు దేశమంతటా తయారయ్యారు. వీరు అన్ని రంగాల్లోనూ తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. దీని పర్యవసానంగా జాతీయ స్పృహ, గర్వదాయకమైన మన సంస్కృతి, చరిత్ర గురించి కొంచెం కూడా అవగాహన లేని తరాలను మనం తయారుచేసుకున్నాం. ఇక- పటిష్ఠమైన మన జాతి నిర్మాణం ఎలా సాధ్యవౌతుంది? ఇందుకు పరిష్కారం మనదైన విద్యావిధానాన్ని రూపొందించుకోవడమే.
(ముగింపు రేపు)

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690