సబ్ ఫీచర్

‘క్లీన్ టెక్నాలజీ’తో ఉపాధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరస్పర ప్రయోజనాలను ఆశిస్తూ తెలంగాణ, అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఒక ఒప్పందం ఇటీవల కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా క్లీన్ టెక్నాలజీ (పరిశుభ్రమైన సాంకేతికత), వాణిజ్యం, విద్య, వ్యాపార రంగాల్లో ఉభయ ప్రాంతాలు పరస్పర ప్రయోజనం పొందేలా ఈ ఒప్పందం కుదిరింది. సోలార్ విద్యుత్‌లో ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ ఈ సందర్భంగా చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన భారత కేంద్రం గుర్‌గావ్ (్ఢల్లీ)లో రాబోతోందని, ఇది కీలకమైనదిగా తాము భావిస్తున్నామని మర్ఫీ తెలిపారు. తన పర్యటనలో వివిధ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడుతున్నానని, న్యూజెర్సీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానని, ముఖ్యంగా ఉద్యోగావకాశాలు కల్పించే వీలుగా పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు.
జిల్లాల్లోనూ టీ-హబ్‌లు!
వచ్చే మార్చి నాటికి రూ.276 కోట్ల వ్యయంతో రూపొందిస్తున్న టీ-హబ్-2 పూర్తవుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఈ ‘హబ్’లో వెయ్యికి పైగా స్టార్టప్ సంస్థలు పనిచేసేందుకు అవకాశముందని, రెండువేల మందికి ఉపాధి లభించే వీలుందని, టీ-హబ్ మొదటి దశ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్’ను ఏర్పాటు చేశామని, కరీంనగర్‌లోనూ త్వరలో టీ-హబ్ ప్రారంభించనున్నామని, అలాగే ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ టీ-హబ్‌లను ఏర్పాటుచేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఐటీ రంగం వృద్ధిలో మేటి
2019 సంవత్సరం సామాజిక- ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో1,500 ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. వాటిలో దాదాపు ఐదున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. దాదాపు లక్షా పదివేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఇది జాతీయ వృద్ధిరేటు కన్నా ఎంతో ఎక్కువ.
ఇన్ఫర్మేటికా
క్లౌడ్ డేటా సేవలు-నిర్వహణ అందించే ‘ఇన్ఫర్మేటికా’ తన హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరిస్తోంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా ఎనలటిక్స్ అంశాలలో ఈ సంస్థ సేవలను అందించనున్నది. ఐసిఐసీఐ బ్యాంకు లాంటి పెద్ద సంస్థలు ఈ ఇన్ఫర్మేటికాకు ఖాతాదారులుగా ఉన్నాయి.
స్థానిక భాషలో స్వర సహాయకుడు
2017 సంవత్సరంలో అమెజాన్ సంస్థ భారత్‌లో ప్రవేశపెట్టిన స్వర సహాయకుడు (వాయిస్ అసిస్టెంట్) ‘అలెక్సా’ ఇంతవరకు ఆంగ్ల భాష ఆదేశాలను అర్థం చేసుకుని సహకరించేది. ఇప్పుడు ‘అలెక్సా’ హిందీ, హింగ్లీషు (హిందీ యాసగల ఆంగ్లం)ను సైతం అర్థం చేసుకుని సహాయపడుతుందని అమెజాన్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నది. తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల పాటలను, ప్రాంతాల పేర్లను అలెక్సా పలకగలదు. ‘స్థానిక పౌరుడిగా’ అలెక్సా ఎదగాలన్నదే తమ ధ్యేయమని అమెజాన్ వెల్లడించింది. భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతీయ భాషలను అలెక్సాకు జతపరుస్తామని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దేశంలోని వివిధ అంశాలపై జ్ఞానవంతమైన సమాచారాన్ని అలెక్సా అందిస్తోంది. అద్భుతంగా మాట్లాడుతుంది. హిందీ, హింగ్లీషును అర్థం చేసుకుని ఆదేశాలను పాటించే సౌలభ్యం ఏర్పడటంతో అలెక్సా చాలామందికి మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది సంగీతాన్ని వినిపిస్తుంది, వార్తలను, కథలను, తాజా వాతావరణ స్థితిగతుల్ని అడిగిన వెంటనే వినిపించడం దీని ప్రత్యేకత. సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానానికిదో మచ్చుతునక. సాంకేతిక ప్రియులు దానికిప్పుడు ప్రణమిల్లుతున్నారు.
డ్రైవర్ లేని స్వదేశీ కార్లు
మన దేశంలోనూ డ్రైవర్ రహిత కార్ల తయారీ జరగనున్నది. ‘విప్రో’ ఐటి విభాగం, భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సంస్థ(ఐఐఎస్‌సీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. జీపీఎస్, రాడార్, సోలార్ సిగ్నల్స్ ఆధారంగా డ్రైవర్ లేకుండా నడిచే కార్ల తయారీకి ఒప్పందం కుదిరిందని విప్రో అధ్యక్షుడు అజీమ్‌ప్రేమ్‌జీ ఇటీవల బెంగళూరులో చెప్పారు.
60 స్వదేశీ సూపర్ కంప్యూటర్లు
వచ్చే మూడు సంవత్సరాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో 60 సూపర్ కంప్యూటర్లను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని సీ-డాక్ రూపొందించనున్నది. ఈ సంవత్సరానికి ఆరు సూపర్ కంప్యూటర్లను సిద్ధం చేసి, అవసరమైనచోట వినియోగించనున్నట్టు శాస్త్ర సాంకేతిక రంగాల శాఖ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తెలిపారు. దీంతో దేశం, ప్రపంచం ఎటువైపు పరుగులు పెడుతున్నదో స్పష్టంగా అర్థమవుతుంది.

-వుప్పల నరసింహం 99857 81799