సబ్ ఫీచర్

పాటను వెతుక్కుంటూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసితనంలో.. పాటను వెతుక్కుంటూ ఒకడుగేసింది విజయలక్ష్మి.
ఆమె అమయకత్వానికి మురిసి.. విజయలక్ష్మిని వెతుక్కుంటూ వందడుగులు ఎదురొచ్చింది పాట.

తెలుగునాట రంగస్థలంపై ‘బావా ఎప్పుడు వచ్చితీవు’.. ‘జెండాపై కపిరాజు’.. అన్న పద్యాలు విననివారుండరేమో. తిరుపతి వేంకటకవులు రచించిన ‘పాండవోద్యోగ విజయాలు’ ప్రధానాంశాలుగా నాటకాల్లో ఈ పద్యాలు ప్రేక్షకాదరణ పొందాయి. వన్‌మోర్ అడిగించుకున్నాయి. జంట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్ర్తీ మనవరాలు.. పసితనంలో పాటను వెతుక్కుంటూ వెళ్లిన అమాయకురాలు.. ఈవారం మన వెనె్నల అతిథి. ఆమె ఎవరో కాదు -విజయలక్ష్మీ శర్మ.

దివాకర్ల శేషాద్రి, సీతారావమ్మల ముద్దుల పుత్రిక. మచిలీపట్నంలో పుట్టింది. ఆర్గురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ముల మధ్య ఎదుగుదల. చిన్నప్పడే రాగాలు తీస్తుంటే కూనిరాగాల విజయలక్ష్మి అన్న మురిపాన్ని చవిచూసింది. తాతగారు రచించిన ‘నానారాజా సందర్శన, దేవీభాగవతం, కలగూరగంప, పాండవోద్యోగ విజయాలు’ లాంటి గ్రంథాలన్నింటినీ ఆమె ఔపోసన పట్టారు. శ్రీ పాండురంగ మహత్మ్యం, భక్తపోతన, భక్తమార్కండేయలాంటి చిత్రాల్లో పాటలువింటూ పెరిగారు. ‘అమ్మ భక్తి చిత్రాలకు తీసుకెళ్లేది. తెర వెనుకనుంచి పాట వినిపిస్తుంటే, నేనూ ఎప్పటికైనా అలా తెరవెనుక నిలబడి పాడాలి అనుకునేదాన్ని. అప్పటి వయసుకు తగ్గ ఆలోచన అది. అనుకోవడమే తప్ప, ఎలా పాడాలో కూడా తెలీదు. ఆ ఆశతోనే.. స్కూలు, కాలేజీ వార్షికోత్సవాల్లో పాటలు పాడి ఇంటికొచ్చి అమ్మచేత తిట్లు తినేదాన్ని. స్వయాన బావగారైన హార్మోనిస్ట్ జి రామచంద్రరావు శిక్షణలో కొన్నాళ్లు సంగీతం నేర్చుకున్నా. రేడియోలో పాటలు పాడా. సంగీత బాణీలను కట్టే రామచంద్రరావు నేతృత్వంలో అనేక వందల కార్యక్రమాలలో ఏడేళ్లనుంచి పాడటం మొదలుపెట్టా’ అంటూ గుర్తు చేసుకున్నారు విజయలక్ష్మి.
‘సంగీతం మాస్టారు శిష్ట బ్రహ్మయ్య శాస్ర్తీ వద్ద అభ్యసించాలనుకున్నా. నేరుగా ఆయన దగ్గరికే వెళ్లా. ‘నాకు సంగీతం నేర్పిస్తానని మా అమ్మను ఒప్పించండి’ అంటూ అడిగాను. ‘నువ్వు సంగీతం నేర్చుకోవాలంటే, నేనొచ్చి అడిగడమేంటమ్మా’ అన్నారు గురువుగారు. ‘మీరడిగితేనే అమ్మనుంచి అనుమతి వస్తుంది’ అని చెప్పా’ అంటూ నవ్వేశారు విజయలక్ష్మి. అలా ఆయనవద్ద శిక్షణ పూర్తయ్యాక సుసర్ల శివరామ్ వద్ద మెళకువలు నేర్చుకుని, కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. అలా అనేక కార్యక్రమాల్లో పాడుతున్న సందర్భంలో ‘విధివిలాసం’ చిత్రాన్ని రూపొందిస్తున్న సివిఆర్ ప్రసాద్ ఈ కోకిల కంఠాన్ని విన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మ్యూజిక్ సిట్టింగ్స్‌కు పిలిపించి తొలిసారిగా మాస్టర్ వేణు దర్శకత్వంలో పాట పాడించారు. పాడిన విధానం నచ్చడంతో సినిమాలోని అన్ని పాటలు విజయలక్ష్మి శర్మ పాడేందుకు అవకాశం వచ్చింది. మ్యూజిక్‌లో డిప్లొమా ఉండటంతో మద్రాస్ కేంద్రీయ విద్యాలయంలో మ్యూజిక్ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌లోనూ పాటలు పాడినపుడు ఆమె పాటను ప్రేమించిన సీవీఎస్ శర్మ తరువాత ఆమెను వివాహమాడారు.
పెళ్లి తరువాత మద్రాసులో ఉద్యోగం చేస్తూ భార్యాభర్తలిద్దరూ కలిసి అనేకమంది సినీ దర్శకుల వద్దకెళ్లి అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. తన భార్య గొప్ప గాయని కావాలన్నది శర్మ ఆశయం. అలా ఓసారి యశోదకృష్ణ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగే సమయంలో ఎస్ రాజేశ్వరరావును కలిశారు. ఆయన దాదాపు పాటలన్నీ అయిపోయాయని, కానీ ‘ఎంత తీయనిది నీ కెమ్మోవి’ అనే ‘పొన్నలు విరిసేవేళలో’ అన్న పాటలో పంక్తిని సంగతులతోసహా పాడి వినిపించి అదేవిధంగా పాడమని పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఆమె నెగ్గడంతో -‘ఈ అమ్మాయితో రేపు పాడిస్తున్నాను’ అంటూ అక్కడే ప్రకటించేశారు. ‘సుశీల, వసంత తెలుసుగా. వాళ్లతో కలిసి పాట పాడాల్సి ఉంటుంది. జాగ్రత్త అంటూ ముందే హెచ్చరించారు రాజేశ్వర రావుగారు. అలా సుశీలతో కలిసి ఆ పాట పాడటం ఓ మధురానుభూతి’ అంటారామె. మాస్టర్ వేణుకి ఓ పట్టాన ఏదీ నచ్చదు. అలాంటిది ఆయనకు నా గాత్రం నచ్చి అన్ని పాటలూ విధివిలాసంలో పాడించటం కూడా ఆనందకరమైన విషయమంటారు విజయలక్ష్మి శర్మ.
సంగీత దర్శకుడు టి చలపతిరావు వద్ద అనేక చిత్రాలకు పాటలు పాడారు. ఆలుమగలు, అత్తవారిల్లు, గడుసమ్మాయి, కమలమ్మ కమతంలాంటి చిత్రాలుకాక జనం మనం, ధర్మవడ్డీ, యువతరం కదిలింది, సీతామహాలక్ష్మి, సిరిసిరిమువ్వ, మరో మాయాబజార్, సీతాపతి సంసారం లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ ఆపాత మధురగీతాలుగా శ్రోతల చెవులలో మారుమ్రోగుతూనే వుంటాయి. ఎస్ జానకితో కలిసి అనేక చిత్రాల్లో పాడిన పాటలతో సొంత అక్కయ్యలాగా ఆమె కలిసిపోయారు అంటూ చెబుతారు విజయలక్ష్మి. ‘మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా జానకి రావాల్సిందే. అలా మా ఆయన, వాళ్లాయన చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్కోసారి వారు మా ఇంటికి వచ్చి కూర్చుంటే రెండు మూడు రోజులైనా ముచ్చట్లు తీరేవికావు. అలా పగలు, రాత్రి చక్కగా సంగీతానికి సంబంధించిన సంగతులను చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవాళ్లం. ఆ రోజులు మళ్లీ రావు’ అంటూ గుర్తు చేసుకున్నారామె. సంగీతానికి, ఉద్యోగానికి న్యాయం చేయడం ఓరకంగా ఆమెకు కష్టమైంది. అయినా ఉద్యోగంలో సంతృప్తిపొందాను అంటారామె. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రెసిడెంట్ అవార్డు అందుకోవడం ఓ మధురానుభూతి అంటారామె. ఇక గానకోకిల, మధురగాయనిలాంటి అవార్డులు ఎన్నో వచ్చాయి. ఉద్యోగంలోనూ అనేక అవార్డులు రావడం ఆనందదాయకమంటారామె. దాదాపు రెండు వేల సినిమా పాటలు, ఐదువేల ఆధ్యాత్మిక గీతాలు పాడిన అనుభవం విజయలక్ష్మి శర్మది. పురుషోత్తమసాయి, వైఎన్ శర్మ, ప్రకాష్, ఆనంద్, ఎస్ జానకిల సంగీత దర్శకత్వంలో అనేక ఆధ్యాత్మిక గీతాలు ఆమెకు మంచి పేరుతెచ్చాయి.
‘ఓసారి ఓ పాట పాడటానికి నన్ను పిలిచారు. కానీ ఎల్‌ఆర్ ఈశ్వరిని అప్పటికప్పుడు పిలిపించి నేను పాడాల్సిన పాటను ఆమెతో పాడించి నన్ను ఇంటికి పంపడం బాధించింది. నాకు ఉద్యోగం ఉంది కదా, ఈ పాటలు పాడటం మానేద్దామనుకున్నాను ఒక్కోసారి. రమేష్‌నాయుడు, సత్యంలాంటి సంగీత దర్శకులవద్ద పనిచేయడం చాలా కష్టతరం. సరిగా పాడకపోయినా, సంగతులు పడకపోయినా విసుక్కునేవారు. ‘సరిగ్గా రాలేదమ్మా, ఎన్నిసార్లు పాడతారు, ఇది రికార్డింగ్ అనుకుంటున్నారా లేదా’ అని అరిచేసేవారు. అదే మహదేవన్‌గారైతే, ఆయన ఇచ్చిన పాటను ఇచ్చినట్టుగా పాడేస్తే ఒక్కమాట అనేవారు కాదు. చాలా కామ్‌గోయింగ్ హీమాన్. నాకు నచ్చిన సంగీత దర్శకులు పెండ్యాల. పాటలో ఏదైనా అపశృతి దొర్లితే మరొకసారి పాడమ్మా అంటూ అనునయంగా చెప్పి ఆయనకు కావాల్సిన విధంగా పాడించుకునేవారు. చలపతిరావు ఎక్కువ అవకాశాలు ఇచ్చినా, పెండ్యాలవారంటేనే నాకు ఎంతో అభిమానం, గౌరవం’ అంటూ తెలిపారు. ఓసారి కమలమ్మ కమతం చిత్రంకోసం బాలు, నేను కలిసి పాట పాడుతున్నాం. ‘ఈతచెట్టు ఇల్లుకాదు, తాడిచెట్టు తల్లికాదు’ అనే పాటలో బాలు అల్లు రామలింగయ్యకు పాడుతూ గొంతు మారుస్తూవుంటే, నేను నవ్వుతూనే వున్నాను. ఓరకంగా ఆ నవ్వులో పాట పాడలేకపోయాను అంటూ అప్పటి ముచ్చట గుర్తు చేసుకున్నారు. రవీంద్రభారతిలో ఓసారి టాలెంట్స్ గిల్ట్ అనే సంస్థ ద్వారా ఘంటసాల గారితో కలిసి స్టేజ్ ప్రోగ్రామ్ చేశారు ఆమె. ఆయనతో పాడుతుంటే అదో మధురానుభూతి. చాలా బాగా పాడుతున్నావమ్మా, చక్కగా ప్రయత్నించు అనేవారు ఘంటసాలవారు. ఇక నాకు ఒక్కర్తె కుమార్తె. ఆమె పెళ్లికి పరిశ్రమలోవున్న గాయనీ గాయకులు, సంగీత దర్శకులు వచ్చి ఆశీర్వదించడం నా జీవితంలో ఓ మధురమైన ఘట్టం. నాకు గొప్ప పేరు రాలేదని బాధ ఎప్పుడూ లేదు. అలాంటి గొప్పవారితో కలిసి పని చేశానన్న ఆనందమే నన్ను ఇప్పటికీ నడిపిస్తుంది. నా జీవితానికి అది చాలు అనిపిస్తుంది. భర్త దూరమయ్యాక ఎవరినీ వెళ్లి కలవడానికి ఇష్టపడలేదు. ఓ రకమైన నిరాశక్తతలో మునిగిపోయారామె. ప్రస్తుతం సర్వీస్ టు హ్యుమానిటీ పేరిట మెంటల్లీ ఛాలెంజ్‌డ్ పిల్లలను తీసుకొని వారికి సంగీతం నేర్పిస్తున్నాను. వారిలో ఒకరికి ప్రెసిడెంట్ అవార్డు కూడా రావడం ఆనందదాయకం. ఇంతకన్నా ఇంకేం కావాలంటూ ముచ్చట్లు ముగించారామె.

-సరయు శేఖర్, 9676247000