సబ్ ఫీచర్

‘ఇసుక పాదం’ మోపి.. ఇక్కట్ల పాల్జేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇసుక నుండి తైలమును పిండలేము. కానీ, ధనమును పిండవచ్చు’ అన్నది సర్వజనీన సామెతైతే, ‘ఇసుక పాదం’ మోపి అన్నార్తుల ఆకలి కేకలను ‘దండుపాళ్యం’ దొంగల్లా వినవచ్చు. అరచి యాగీ చేసినా.. ఏమీ ఎరుగనట్లు నటించనూ వచ్చు’ అన్నది కొత్త సామెత. ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడు ఇసుక కోసం బక్కజీవులంతా బజారుకెక్కారు. బడుగులంతా రోడ్లెక్కి ‘పని కల్పించండి ప్రభో’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పండుగ లేదు, పబ్బం లేదు. పిల్లలకు స్కూలు ఫీజు లేదు, పచ్చడి మెతుకుల్లేవు. ప్రభుత్వ ‘ఇసుక పాదాల’ కింద పడి సామాన్యులు నలిగిపోతున్నా కనికరించే నాథుడే లేడు.
నవ్యాంధ్రలో ప్రజలు కలలుకన్న ప్రభుత్వం కొలువుదీరగానే మొట్టమొదటిగా అమలులోకి తెచ్చిన విధానం ‘ఉచిత ఇసుక రవాణా రద్దు’. కొత్త ఇసుక పాలసీ తెచ్చేదాకా ట్రాక్టర్ ఇసుక కూడ తరలించవద్దు అన్నది సర్కారు వారి ఆదేశం. దీంతో గ్రామసీమల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ అసంఘటిత కార్మికులు పూర్తిగా ఉపాధిని కోల్పోయారు. తాపీమేస్ర్తిలు, కూలీలు, రాడ్ బెడ్డింగ్ వర్కర్లు, టైల్స్, మార్బుల్ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటింగ్ వర్కర్లు ఇలా ఒక పనిలో మరో పని ముడిపడి ఉన్న దాదాపు 36రకాల పనివారలు మొత్తం 20 లక్షల మంది కార్మికులు రోజువారీ ఉపాధి పనులకు దూరమయ్యారు. వీరంతా నాలుగు నెలలుగా రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా- అరెస్టులు తప్ప, వారి గొంతుక వినే నాయకుడే లేడు. కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా, వారికీ సమాధానం లేదు.
అప్పటి ప్రభుత్వం ఇసుకపై రాష్ట్రానికి వచ్చే రాబడి మొత్తాన్ని రూ.250 కోట్లుగా అంచనావేసి, సంక్షేమ పథకాల ఖర్చుతో పోల్చితే, ఈ కొద్ది రాబడి కోసం ఇసుక రీచ్‌ల దగ్గర అన్నిరకాల అక్రమాలకు కళ్ళెం వేయాలనే ఉద్దేశంతో ఇసుక విధానానే్న తొలిసారిగా ఉచితం చేసింది. దీంతో ఇసుక రీచ్‌ల దగ్గర నామమాత్రపు రుసుంతోనే రాష్ట్రంలో సామాన్యునికి తక్కువ ఖర్చుతో ఇసుక రవాణాకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఎవరు ఎక్కడికైనా ఇసుకను తీసుకువెళ్ళేవారు. నిర్మాణ పనులకు ప్రాథమికంగా ఇసుక కీలకం కాబట్టి, నిర్మాణ రంగానికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. అసంఘటిత కార్మిక లోకం ఏ ఒక్కరూ ఉపాధి లేక ఇబ్బందులు పడలేదు. ఉచిత ఇసుక విధానం వల్ల అప్పటి ప్రభుత్వానికి దమ్మిడీ ఆదాయం కూడా లేదు. ఐనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో భారీ ఇసుక దోపిడీ జరిగిందని, గత ప్రభుత్వంలోని నాయకులు రేవుల్లోని ఇసుకను బొక్కేశారని, కోట్లలో దోపిడీ జరిగిందనీ ఆరోపించారు. అలాంటి అక్రమాలకు వీలుల్లేకుండా కొత్త ఇసుక పాలసీ తీసుకువస్తామని చెప్పారు. ఏదైనా కొత్త విధానం తీసుకువచ్చే వరకూ- పాత విధానాన్ని అమలులో ఉంచి, కొత్త పద్ధతి రూపురేఖలు ఖరారుకాగానే కొద్దిరోజుల తేడాతో ప్రవేశపెడితే ఎలాంటి సమస్యలు వచ్చేవికావు. ప్రజలు కూడా హర్షించేవారు. కానీ, కొత్తవిధానం ఖరారు కాకముందే, ఇసుక సరఫరాను పూర్తిగా నిలిపేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ రంగానికి ఊపిరి సలపటంలేదు. ఈ రంగంపై ఆధారపడ్డ అశేష జనులు ఆకలి మంటలతో రోడ్డున పడ్డారు.
ఇటీవల ప్రభుత్వం ఇసుక కొత్త కొనుగోలు విధానం చేపట్టినా, పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. సామాన్యునికి ఇసుక భారంగానే ఉంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ ‘ఇసుక పాదం’పై కూలీనాలీ జనుల శాపనార్థాలు వాస్తవ పరిస్థితులకు సంకేతాలుగా నిలిచాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలు ఇసుక కొరతకు కొంత కారణమైతే, అందుబాటులోకి వచ్చిన ఇసుక సైతం బడాబడా బాబులకో, సంస్థలకో తప్ప, గ్రామీణప్రాంత ప్రజలకు అది దొరకని పరిస్థితి కొనసాగుతోంది.
హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఉపాధి కోసం సీమాంధ్రులు వలస పోక తప్పటం లేదు. ప్రభుత్వ కొత్త ఇసుక పాలసీలో- ఇసుక ధరలు సిమెంట్ ధరలతో పోటీపడుతున్నాయి. ఉచిత విధానంలో ట్రాక్టర్ ఇసుక (సుమారు 3 టన్నులు) రూ.800 నుంచి రూ.900లకు లభిస్తే, ఇప్పుడు కొత్త విధానంలో అదే ఇసుక రూ.2600నుంచి రూ.3000లకు పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు రూ.30వేలు నుంచి రూ.50వేలు. అక్రమంగానో, సక్రమంగానో చెన్నై వంటి ప్రాంతాలకు లారీ ఇసుక ఏకంగా ఒక లక్ష రూపాయలు పలుకుతోంది. ఇక కొత్త పాలసీవల్ల సామాన్యునికి ఒరిగిన మేలు ఏమిటి? ఇసుకను తేదేపా నాయకులు బొక్కారన్న విమర్శల సంగతి మాటేమో కానీ, బడుగుజీవుల జేబులకు చిల్లుల సంగతి ఏమిటి? దీనివల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? కొత్త ప్రభుత్వం సామాన్యుడి ‘పాపం’ మూటగట్టుకుందనే చెప్పాలి. పాత ప్రభుత్వ విధానం ఏదీ కనిపించకూడదు, వినిపించకూడదు అనే రాజకీయ కక్ష సాధింపు పద్ధతుల వల్ల ప్రజలకే కాదు, అంతిమంగా ప్రభుత్వానికీ చేటు కలుగుతుందని పాలకులు గ్రహించేది ఎపుడు?

-పోతుల బాలకోటయ్య 98497 92124