సబ్ ఫీచర్

‘దక్కన్ దారి’ వదిలి దండకారణ్యానికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వంద సంవత్సరాల్లో ‘దక్కన్’ (హైదరాబాద్, దాని పరిసర ప్రాం తాలు) రూపాంతరంపై ఇటీవల కొన్ని ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. వివిధ మాధ్యమాల ద్వారా ఈ పరిణామాలను ప్రజల దృష్టికి కొందరు తీసుకొచ్చారు. 1920 ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక-వ్యాపార, కుటీర పరిశ్రమల నుంచి ఇప్పుడు బహుళ జాతి సంస్థల కేంద్రాలు, ఐటీ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక అంశాలను తిలకిస్తే దక్కన్.. తెలంగాణ ఎంతగా మారింది!- అని ఆశ్చర్యం, ఆనందం, అనిర్వచనీయ సంతోషం కలుగుతుంది.
ఈ వంద సంవత్సరాల్లో జరిగిన ఆవిష్కరణలకు సాక్షిగా హైదరాబాద్... దక్కన్ ప్రాంతం నిలిచింది. ఈ ఆవిష్కారాలు, ఫ్యాక్టరీలు- కార్యాలయాలు, ప్రజలకవసరమైన వస్తూత్పత్తి తీరు ప్రజల్ని ‘మరో మెట్టు’పైకి తీసుకెళ్ళాయి. ఇదో నిరంతర ప్రక్రియ. తరం తరువాత తరం ఒక్కో మెట్టు ఎక్కుతున్న వైనం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దాని ఆనవాలు మాదాపూర్, మణికొండ, బంజారా-జూబ్లీహిల్స్‌లో దర్శనమవుతోంది. దీని ప్రభావం భౌగోళికంగా ఆ ప్రాంతాలకేగాక మొత్తం దక్కన్‌పై కనిపిస్తోంది.
వంద సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వం కొన్ని కుటుంబాల ఆధ్వర్యంలో కొనసాగే పరిశ్రమలకు మద్దతునిచ్చింది. ఆ రకంగా కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు వరకు ఈ వాతావరణమే కనిపించింది. కొన్ని కుటుంబాలు తమకు ఆసక్తిగల రంగాలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టి వాటిని ‘కుటుంబ సంస్థలు’గా నడిపారు. అందులో ‘దక్కన్ బటన్ ఫ్యాక్టరీ’ ఒకటి. మరొకటి జిందా తిలిస్మాత్, ఖార్ఖానా జిందా తిలస్మాత్ పేరు ప్రజల్లో ఇప్పటికీ నానుతోంది. దీని ఉత్పత్తులు దూరప్రాంతాలకు సైతం అందాయి. అన్ని నొప్పులకు- జలుబుకు జిందా తిలిస్మాత్ సంజీవిని అన్న భావన ప్రజల్లో బలంగా కలుగజేసింది. హకీం/ వైద్యుడు అనే మాట కొన్ని దశాబ్దాలు (శతాబ్దాలన్నా అతిశయోక్తి కాదు) ప్రజల నాలుకలపై వినిపించేది. అలాంటి వైద్యులు చాలాచోట్ల దవాఖానాలు (క్లినిక్‌లు) నడిపారు.
ఖార్ఖానా, హకీం.. గుత్తేదారు, చౌకీదారు, దఫ్తర్, దఫేదార్, తాతీల్ (సెలవు) ఇట్లా అనేక ఉర్దూ పదాలు తరచూ వినబడుతూ ఉండేవి. నుమాయిష్ (ఎగ్జిబిషన్) అనే పదం సంతోషాన్ని మోసుకొచ్చేది. సరికొత్త ప్రపంచానికి, మరో ప్రపంచానికది మారుపేరు. గ్రామీణులకదో మాయా ప్రపంచమే.
ఇక ‘ఆల్విన్ ఫ్యాక్టరీ’ దక్కన్‌లో సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇదొక మెటల్ వర్క్స్‌గా ప్రారంభమై పుష్పక్ స్కూటర్‌ను, డబుల్ డెక్కర్ బస్సులను తయారుచేసింది. ఆరోజుల్లో డబుల్ డెక్కర్ బస్సు లండన్‌లో కనిపిస్తే ఆ తరువాత హైదరాబాద్‌లో దర్శనమిచ్చాయి. అనంతరం చేతి గడియారాలను, రిఫ్రిజిరేటర్లను తయారుచేసింది. ఆరోజుల్లో ఈ ఉత్పత్తులను ప్రజలు అపురూపంగా చూశారు. ఓ రకంగా ఆరోజుల్లో హైదరాబాద్ లండన్‌తో పోటీపడింది. పబ్లిక్ గార్డెన్స్, రైల్వేస్టేషన్లు, సిమెంట్ రోడ్లు, నీటి ఫౌంటెన్లు, డబుల్ డెక్కర్లు... ఇలా ఎన్నో ఎనె్నన్నో రూపాలు.. దృశ్యాలు ఆ విషయాన్ని తెలియజేశాయి.
ఆసుపత్రులు, అబ్జర్వేటరీలు, ప్రకృతి చికిత్సాలయాలు, డీబీఆర్ బిల్లు, నక్కాశీ చిత్రకళ... నిర్మల్ పెయింటింగ్స్... ఇట్లా జీవితంలోని అన్ని పార్శ్వాలలో అంతకుముందు లేని ఓ ‘మెరుపుదనం’ స్పష్టంగా కనిపించింది.
దేశానికి స్వాతంత్య్రం రావడం, ‘నిజాం ప్రభుత్వం’ భారత ప్రభుత్వంలో విలీనం కావడంతో ‘దక్కన్’ ముఖచిత్రం మరో రకంగా రూపాంతరం చెందసాగింది. అప్పటివరకున్న కుటుంబ వ్యాపారాలు కాస్త ప్రైవేట్ సంస్థలుగా, సరికొత్త రంగాల్లోకి చొచ్చుకుపోసాగాయి. సరికొత్తతరం తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాటి ప్రమాణాలతో పోలిస్తే భారీఎత్తున పెట్టుబడులతో పరిశ్రమలు, సిమెంట్, రసాయన, భవన నిర్మాణ రంగాల్లోకి ప్రవేశించారు. కొత్త ఉపాధి, కొత్త ఆలోచనలు, సరికొత్త స్వేచ్ఛ-స్వాతంత్య్రం తొంగి చూసింది. స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాలకు దక్కన్‌లో.. హైదరాబాద్ శివారు కుషాయిగూడలో ఇసిఐఎల్ ఏర్పడింది. దీంతో సరికొత్త ‘విప్లవం’ వెలుగుచూసింది. కార్ఖానాలు, ఫ్యాక్టరీల స్థానే ‘వైట్‌కాలర్ జాబ్స్’ రావడం ప్రారంభమైంది.
ఎలక్ట్రానిక్స్ రంగం దక్కన్‌లో ప్రవేశించి 50 ఏళ్ళు పూర్తయింది. స్వర్ణోత్సవం జరుపుకుంది. ‘ఈసీ టెలివిజన్’ దక్కన్‌లోనే తయారైంది. దక్కన్ రేడియో అప్పటికే ‘ఆకాశవాణి’గా మారింది. 1970ల నుంచి దక్కన్ చరిత్ర సరికొత్త రూపం తీసుకుంది. ప్రపంచంతో పోటీపడేలా పరుగును ప్రారంభించింది. వౌలాలీ, బాలానగర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో మధ్య-చిన్న తరహా, కుటీర పరిశ్రమల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కొత్త ఉపాధిమార్గాల దారులు తెరుచుకున్నాయి. కొత్త సంస్కృతి ప్రవేశించింది. ప్రైవేట్ రంగం మరింత పుంజుకుంది. పబ్లిక్ సెక్టార్‌లోనూ అనేక భారీ పరిశ్రమలు రావడంతో పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి పారిశ్రామికంగా కొత్త ఎత్తులకు దక్కన్ ప్రాంతం చేరుకుంది. విద్యాలయాలు పెరిగాయి, వౌలిక సదుపాయాలు ఎంతోకొంత పెరిగాయి, అక్షరాస్యత పుంజుకుంది. కొత్త తరాలు కొంగొత్త ఆశలతో తమతమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించసాగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విస్తృతి పెరిగింది. చైతన్యం హెచ్చింది. వైద్య కళాశాలలు పెరిగాయి... మొత్తం వ్యవస్థలో ‘కుదుపు’ చోటు చేసుకుంది.
1990 దశకం తరువాత దక్కన్ ‘దశ’ తిరిగింది. కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హైదరాబాద్‌ను తాకడంతో సరికొత్త విప్లవం రెక్కవిప్పింది. దాని కొనసాగింపుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి ప్రపంచస్థాయి సంస్థల కార్యాలయాల ఏర్పాటు, కార్యక్షేత్రాలను నెలకొల్పడంతో మొత్తం దక్కన్ ‘దృశ్యం’మారిపోయింది. అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సంస్థలు సైతం భారీఎత్తున పెట్టుబడులు పెట్టి దక్కన్ నుంచే ప్రపంచానికి సరకుల, సాఫ్ట్‌వేర్ సరఫరాచేసేందుకు పూనుకున్నాయి.
ఈ గుణాత్మక, వేగవంతమైన పరిణామాన్ని పట్టుకుని ప్రజల్ని ముందుకు నడిపించడంలో అటు కమ్యూనిస్టులు, ఆ పాయలోంచి వచ్చిన నక్సలైట్లు- మావోయిస్టులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల్ని ముందుకు నడిపించడంలో ముందుండాల్సిన ప్రజల పక్షపాతం వహిస్తామని చెప్పుకునే వీరు ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ దగ్గరే ఆగిపోయారు. ఆ వైఫల్యాలను ‘విశే్లషించు’కోవడంతోనే కాలమంతా గడుపుతున్నారు. అంతేగాని మారిన కాలాన్ని, విప్లవాత్మక మార్పులను, ప్రజల ఆకాంక్షల్ని వారు పట్టించుకున్న పాపాన పోలేదు.
స్టార్టప్స్, ఇంక్యుబేటర్లు, ఏంజిల్స్, ఇన్నోవేషన్స్, యాప్స్, వెబ్‌సైట్స్, 4జి, 5జి సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్, ఏఐ, ఐఓటి, స్మార్ట్ఫోన్, మెట్రో రైలు,ప్రపంచస్థాయి సౌకర్యాలు.. ఇవేవీ వారిని కదిలించలేక పోతున్నాయి. ఇప్పటికీ మొద్దునిద్రలో మగ్గుతున్నారు. ఘనీభవించిన ‘్భవజాలం’తోనే పొద్దుపుచ్చుతున్నారు. ఇంతకన్నా విడ్డూరం ఇంకేమైనా ఉంటుందా?
విచిత్రమేమిటంటే దక్కన్‌లో ‘పుట్టి’ దండకారణ్యానికి పాకిన మావోయిస్టులు ఇప్పటికీ చైనా విప్లవం- అది ఇటీవల జరుపుకున్న 70వ వార్షికోత్సవం... తమ పూర్వపు పార్టీ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకోవాలని అటు ప్రజలకు- ఇటు తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అశేష ప్రజలకు పట్టని భావజాలంతో ‘లాంగ్‌మార్చ్’చేస్తామని కలలుకంటున్నారు. ప్రజల భావనలకు- వారి భావజాలానికి ‘మ్యాచ్’కావడం లేదని, ‘సింక్’కుదరడం లేదని, సాయుధ పోరాటంవల్ల సాంకేతిక పరిజ్ఞానం పేదల దరిచేరడం లేదని, అది చేరనంత కాలం ప్రజలు వెనకబడే ఉంటారని వారు గ్రహించలేక పోతున్నారు. ఇలాగే కొనసాగితే వారికి ‘గ్రహణం’పట్టడం ఖాయం. ఆ గ్రహణం పూర్తిగా మింగేయకముందే మావోయిస్టులు మేల్కొంటే మంచిది!

-వుప్పల నరసింహం 99857 81799