సబ్ ఫీచర్

పట్టుదలకు ప్రథమ సారథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబ్థాన్ని నిశ్శబ్ధాన్ని ఔపోసన పట్టిన కళాకారుడు ఎవరైనా ఉన్నారా? అంటే -సారథి ఒక్కడే చెయ్యెత్తాలేమో! సహజమైన సినిమా ప్రక్రియకు సారథి పూర్తిగా భిన్నం. ఎందుకంటే -ఎక్స్‌ప్రెషన్‌కు సౌండ్ యాడ్ చేయడం నటనలో భాగం. కానీ -సౌండ్‌తో ఎక్స్‌ప్రెషన్‌ని ఏకోన్ముఖం చేయడం సారథికే తెలిసిన గొప్ప విద్య. అందుకే చిత్రమైన సినిమాటిక్ శబ్ధాలు -సారథినుంచే పుట్టుకొచ్చాయి.

కడలికి పుట్టినోడు.
కళామతల్లి ఒళ్లో పెరిగినోడు.
ఏమవుతాడు?
ఈవారం
వెనె్నల అతిధి -సారథి అవుతాడు.
**
పుట్టుకతో వంశపారంపర్య అంశగా వచ్చిన కళాప్రతిభ గురించి ఏమాత్రం తెలియని అబ్బిగాడు. బాల్యంలోనే -బడినుంచి ఇంటికొస్తూనే.. టీచర్లు, పిల్లల్ని అనుకరిస్తూ ఆరుగురు అక్కల్ని అలరించిన మైమ్‌గాడు. హరికథలు చెప్పుకునే తండ్రి -ఇదంతా గమనించాడు. కొడుకులోని కళాతృష్ణకు పదునెట్టాలనుకున్నాడు. నటుడిగా రాణించగలడని ఆశపడ్డాడు. అలా ఆశపడిన అయ్యే -వీరదాసు. అతని నమ్మకం వమ్ముపోలేదు. సరికదా.. అందరిలాంటి రొటీన్ ఆర్టిస్టు తన కడుపున పుట్టలేదన్న విషయం -సారథి ఎదిగిపోయిన తరువాతగానీ అర్థంకాలేదు.
**
18వ ఏటనే కొద్ది నాటకాల అనుభవంతో చెన్నై చెక్కేశాడు కడలి విజయసారథి. ఇక అక్కడినుంచి దాదాపు 16 ఏళ్లపాటు నిర్విరామ పోరాటం. చేతిలోవున్నది కేవలం కళమాత్రమే. అందుకే కళాకారులకు అందుబాటులో ఉండడానికి నాటకాలను ఎంచుకున్నారాయన. అప్పటికే దాదాపు 18సార్లు ఉత్తమ కమెడియన్‌గా అవార్డులు పొందిన ఆయన ప్రదర్శించే నాటకానికి మద్రాస్ ఆంధ్రా క్లబ్ చప్పట్ల మోతగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు పెరుగుతూనే వున్నారు ఆ నాటకాలకోసం. 60 ఏళ్ళ ముసలివాడిగా నటిస్తే, మహానటుడు ఎస్వీఆర్ వచ్చి ఆశ్చర్యపోయారట. ఏంటి, 20 ఏళ్ళ పిల్లాడివి.. ఇంత బాగా ఎలా చేశావు అంటూ మెచ్చుకుని ప్రతి నాటకానికి నీకు 500 రూపాయలు నా బహుమతిగా అందుతుంది అని ప్రోత్సహించారు. అలా తనలోని కళను నలుగురికీ పంచాలన్న సదాశయంతో నిరంతర పరిశ్రమతో సినీ స్వర్ణయుగ రథాన్ని తోలడానికి తానూ ఒక సారథిగా నిలవడానికి ఎంతో కష్టపడ్డానంటారు ఆయన.
పెనుగొండలో అమ్మ మహాలక్ష్మి, తండ్రి వీరదాసుల ముద్దుల కుమారుడిగా జూన్ 26, 1939లో జన్మించారు. బాల్యం నుండే పాటలు పాడుతూ, క్రికెట్ ఆడుతూ సరదా సరదాగా గడిపేశారు. తండ్రి కడలి వీరదాసు నాటక రంగంతోపాటుగా హరికథా గానంలో అందెవేసిన చేయి. సి కృష్ణవేణి కథానాయికగా రూపొందిన భీష్మ (1944)లో శంతన మహారాజుగా నటించారాయన. అటువంటి కళాకారుడి కడుపున జన్మించడమే తన పూర్వజన్మ సుకృతం అంటారాయన. కాలేజీ రోజుల్లో క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా వుండేవారు. అదేవిధంగా నాటకాల్లో కమెడియన్‌గా, హీరోగా.. ఏ పాత్రనైనా అవలీలగా ఆవాహన చేసుకుని నటించి చూపేవారు. తొలినాళ్ళల్లో తండ్రి శకుంతల నాటకం ఆడుతుంటే, శకుంతలగా అలనాటి నటి ఋష్యేంద్రమణి నటిస్తున్నారు. తొలిసారిగా ముఖానికి రంగు వేసుకుని సారథి బాలుడైన భరతునిగా నటించారు. క్రిష్ట్ఫోర్ ఆర్కెస్ట్రాలో అనేక వేల పాటలు పాడారు. ఘంటసాల స్వర గాంధర్వానికే అంకితమైనవాణ్ణి కనుక అందరిచేతా నా పాటకు చప్పట్లు మ్రోగేవి. మద్రాస్ వెళ్లిన తొలినాళ్ళల్లో కేవలం రెండు ఇడ్లీ, బకెట్ సాంబార్‌తో ఒకరోజంతా గడిపే రోజులు. ఇంటినుండి డబ్బులు అడగటానికి మొహమాటం. తండ్రి వీరదాసు హరికథా కాలక్షేపాన్ని అనేకసార్లు నటుడు కాకముందే చూసిన ఎన్టీఆర్ ఆయన్ను గురువుగా భావించేవారు. ఆ పరిచయంతోనే అప్పటికే ఓ హీరోగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ వద్దకు వెళ్లి తన కుమారుడు చిత్రసీమలో ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పిందే తడవుగా వెంటనే పిలిపించారాయన. తాను రూపొందిస్తున్న సీతారామ కళ్యాణం చిత్రంలో నలకూబరుని వేషాన్నిచ్చారు. ఇదే వేషాన్ని మాయారంభ చిత్రంలో ఎన్టీఆర్ ధరించడం విశేషం. నేను ఒకప్పుడు నటించిన ఈ పాత్రను నీకిచ్చాను, అంతకన్నా బాగా నటించాలి అని మంగళ తిలకాన్ని దిద్ది షూటింగ్ మొదలుపెట్టారాయన. విశేషమేమిటంటే.. ఆరోజు సారథి పదకొండు టేకులు తినడం. ఎన్ని టేకులైనా సరే.. డైలాగ్, ముఖంలో భావాలు పర్‌ఫెక్ట్‌గా రావాలని ఎన్టీఆర్ తపన. సహజంగా ఒక్క టేక్‌లోనే ముందుగా రిహార్సల్ చేయించి తీసుకోవడం ఆయన పద్ధతి. కానీ ఈసారి మాత్రం పదకొండో టేకు ఓకె చేశారు అని గుర్తుచేసుకున్నారు సారథి. నటుడు, దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావుతో కలిసి ‘దొంగ’ అనే నాటకాన్ని ప్రదర్శించారు ఆంధ్రా కల్చరల్ క్లబ్‌లో. దాని తరువాత పరీక్ష అనే నాటకాన్ని ప్రదర్శిస్తే, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనే్వషణ అనే నాటకం ప్రదర్శనకు ఎన్టీఆర్ వచ్చారు. సారథిని చూసి ఇతను తన చిత్రంలో నటిస్తున్నాడని మరోసారి పరిచయం చేశారు. 1960లో ఎస్వీఆర్ శంకరయ్య పాత్రలో ఒదిగిపోయిన సారథిని చూసి ‘‘ఓరి నీ దుంపతెగ.. ఇంత ముసలోడి పాత్ర ఎలా వేశావురా’’ అని మెచ్చుకోవడం తన జీవితంలో ఓ మరపురాని అనుభవం అంటారు సారథి. అదే ఎస్వీఆర్ తన దర్శకత్వంలో బాంధవ్యాలు చిత్రం రూపొందిస్తూ, ఓ కొడుకుగా పాత్రను ఇచ్చి నటింపజేశారు. హేమాంబరధరరావు దర్శకత్వంలో కథానాయకుడిగా ముగ్గురు మూర్ఖులు చిత్రంలో నటించారు. అత్తవారిల్లు చిత్రంలో రెండవ హీరోగా నటించారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో జయసుధ కథానాయికగా సారథి హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించారు కానీ అది ఆగిపోయింది. జీవితంలో ఇలా 18 సంవత్సరాలపాటు కాలం సాగిపోయింది. తొలినాళ్ళల్లో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు అందరూ తనతో చాలా స్నేహంగా ఉండేవారంటూ, అప్పుడప్పుడు తాను దర్శకత్వం వహించిన నాటకాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించేవారని చెప్పుకొచ్చారాయన. పరమానందయ్య శిష్యుల కథ, వెలుగునీడలు, ఆడబ్రతుకు, వీరాభిమన్యు, సింహాచల క్షేత్ర మహిమ, బ్రహ్మచారి, మాయని మమత, కనె్నమనసులు, సుమంగళి, భలేరంగడు, సంబరాల రాంబాబు, కోడలు దిద్దిన కాపురం, మరపురాని కథ, శారద, కృష్ణవేణి, అమరదీపం, గోరంత దీపం, మనవూరి పాండవులు తదితర 372 చిత్రాల్లో నటించారు. కానీ బ్రేక్ మాత్రం బాపు దర్శకత్వంలో రూపొందిన భక్తకన్నప్పలో రావుగోపాలరావు కొడుకుగా ‘కోకొపాయ్’ అన్న ఊతపదంతో సారథి స్టార్‌డమ్ ఎక్కడికో వెళ్లింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. అసలు ఆ పాత్ర ఎలా వచ్చిందీ అంటే, కన్నడంలో రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం చిత్రాన్ని దాదాపు 30సార్లు చూశారు సారథి. ఆ చిత్రానే్న మరోసారి తెలుగులో అందమైన రంగులలో తీర్చిదిద్దితే ఎలా వుంటుంది అన్న ఆలోచనకు రూపమే భక్తకన్నప్ప. ఆ కథను సిద్ధం చేసి తన స్నేహితుడైన కృష్ణంరాజుకు చెప్పారు. నిర్మాతలను సిద్ధంచేశారు. అద్భుత దర్శకుడు బాపు, గొప్ప గీతకారుడు రమణను కలిశారు. అంతా సిద్ధమైంది. చిత్రంలో రావుగోపాలరావు కొడుకుగా మొదట రాజబాబును ఎంపిక చేసి షూటింగ్ ప్రారంభించారు. ముత్తాయిగూడెం అడవుల్లో ఓ రోజు షూటింగ్ చేశాడు రాజబాబు. కానీ అనుకోని పరిస్థితుల్లో వేరే చిత్రంకోసం వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన రావాలంటే మరో 15 రోజులన్నా ఆగాలి. దాంతో ఆ పాత్రకు మళ్లీ పద్మనాభాన్ని ఎంచుకున్నారు. కానీ అదే సమయంలో పద్మనాభం పితృవియోగ దుఃఖంలో ఉండడంతో ఆ పాత్రను చేయలేకపోయారు. చివరికి ఆ పాత్ర సారథినే వరించింది. జేబులో వున్న బొమ్మను మరిచి ఇంకో బొమ్మ గురించి ఆలోచన ఎందుకు అంటూ సారథికే ఆ సారథ్యాన్ని అందించారు. ఇక ఆ పాత్రలో ఆయన కోకొపా అంటూ చేసిన అల్లరి అంతా ఇంతాకాదు. తండ్రిని వేళాకోళం చేస్తూ చూసిన చిలిపిచూపులు, చిలిపి నవ్వులు, చిలిపి కదలికలు చూసి బాపు మురిసిపోయారట. చిన్నపాత్ర అయినా అద్భుతమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా విడుదల కాకముందే తప్పక సారథికి బ్రేక్ వస్తుందని చెప్పినవాళ్ళు అనేకమంది. చిరంజీవి కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం గూఢచారి నెం1. ఆ చిత్రంలో పక్షితీర్థం అనే క్షేత్రం ప్రధాన ఇతివృత్తంగా వుంటుంది. అందులో పిట్టల భాష పద్ధతిలో మాట్లాడడానికి సరైన కళాకారుడు ఎవరు అని వెతికితే సారథే అని తేలింది. ఆ పాత్రలో జీవించారు ఆయన. జానపదబ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన అనేక జానపద చిత్రాలు మనకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆయన నష్టాలలో వున్నారు. జగన్మోహిని చిత్రాన్ని నరసింహరాజు కథానాయకుడిగా ప్రారంభించారు. ఆ చిత్రంలో ప్రధాన కమెడియన్ సారథి. దెయ్యంతో ఆయన పడిన అగచాట్లు, కాళ్ళు రెండూ పొయ్యిలో పెట్టి పాముల్ని, జర్రులను వేపుకునితిన్న దెయ్యం, సారథిని ఆడుకున్న కామెడీ అప్పట్లో సంచలనం రేపింది. ఆ సన్నివేశాలకోసమే ఒక్కొక్కరు నాలుగైదుసార్లు చూశారా చిత్రాన్ని. విఠలాచార్యకు ఒక మంచి పద్ధతి ఉంది. ఏ నటుడైతే అద్భుతంగా నటిస్తున్నాడో ఆ నటుడి పాత్ర మరికాస్త పెంచేస్తారు. ఎవరైతే సరిగా చేయడంలేదో ఆ పాత్రను చిలకగానో, పిల్లిగానో చేసేస్తారు. అలా రెండు మూడు సన్నివేశాల జగన్మోహిని సారథి సినిమా అంతా సాగేలా రూపొందించారు. తన జీవితంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, ప్రత్యగాత్మ, బి.ఎ.సుబ్బారావు, బాపు వంటి గొప్పవారే పూజ్యనీయులుగా ఉన్నారని గర్వంగా చెబుతారాయన. బాలుతో తొలిసారిగా ఓ డబ్బింగ్ చిత్రంలో పాట పాడించింది కూడా మేమేనంటారాయన. ఎంజిఆర్ కథానాయకుడిగా తమిళంలో రూపొందించిన ఓ చిత్రాన్ని శభాష్ రంగా అనే పేరుతో అనువదిస్తున్నారు. ఆ చిత్రంలో ఓ పాటను ఘంటసాల చేత పాడించాలని ప్రయత్నం. కాని సౌందర్యరాజన్‌లాగా పెద్దగా అరుస్తూ తాను పాడలేనని ఘంటసాలవారు చెప్పడంతో తొలిసారిగా బాలు చేత పాడించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే నిర్మాతగా మారి ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు, కృష్ణ దర్శకత్వంలో రిక్షావాలా, విధాత చిత్రాలను రూపొందించారు. తిరుపతిస్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ చిత్రం షూటింగ్‌లో ఏ రిహార్సల్స్ లేకుండా నటించమంటే నొచ్చుకున్నారాయన. ఇక కొత్త జనరేషన్ వచ్చింది అంటూ పక్కకు తప్పుకున్నారు. సినిమా స్వర్ణయుగంలో ఓ అద్భుతమైన నటుడిగా పలువురు గొప్ప నటీనటుల నటన, శ్రద్ధ, అంకితభావం, బాధ్యత వంటి గొప్ప విషయాలను దగ్గరనుండి చూసిన ఆయన ప్రస్తుతం ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఇంతకన్నా జీవితానికి ఇంకేం కావాలంటూ ఓ నవ్వు నవ్వి ముగించారాయన.

-సరయు శేఖర్, 9676247000