సబ్ ఫీచర్

‘కొలీజియం’ చెప్పిందే న్యాయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినపుడు అప్పటికే పుణ్యకాలం మిం చిపోయిందని ఒక్కోసారి కక్షిదారులు బాధపడుతుంటారు. ఆ బాధలు చెప్పుకోవడానికి వారి చుట్టూ ఎవరూ లేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో న్యాయం వెలువడే వేళకు వారు జీవించి లేకపోవచ్చు. న్యాయం జరగడంలో ఆలస్యమైతే- అసలు న్యాయం జరగలేదనే అర్థం చేసుకోవాలి. ఆలస్యం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. దాన్ని నివారించాలంటే వేగంగా కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించాల్సిందే. ఆ బాధ్యతను స్వచ్ఛందంగానా? నిర్బంధం చేయాలా?? అనేది న్యాయవ్యవస్థకే వదిలేయాలి. కేసుల పరిష్కారంలో ఆలస్యానికి కేవలం న్యాయస్థానాలను నిందించడం మనకు చాలా కాలంగా అలవాటైపోయింది. న్యాయవ్యస్థ, వౌలిక సౌకర్యాలు, సరిపడా న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది ఎంత కారణమో, దర్యాప్తు సంస్థలూ, కక్షిదారులు, న్యాయవాదులు, సమాజం కూడా అంతే కారణం. సకాలంలో న్యాయం అందలేదని కక్షిదారులు బాధపడినట్టే తమకూ న్యాయం జరగలేదని కొంత మంది న్యాయమూర్తులు బాధపడుతున్నారు. గతంలో ఈ బాధ అంతర్గతంగానో, కాగితాలకో పరిమితమయ్యేది. కానీ ఇటీవలి కాలంలో అది బహిరంగంగానే జరుగుతోంది. న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీని ఖరారు చేసే విషయాల్లో దేశంలో ఏక్కడో ఒక చోట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తనకు సరిపడా ప్రాధాన్యత కల్పించలేదనే బాధతో తమిళనాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ కమలేష్ తాహిరామణి చేసిన రాజీనామాను రాష్టప్రతి ఆమోదించారు. ఎంతో సీనియర్‌ను అయిన తనను చిన్న రాష్టమ్రైన మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేశారు.
మరోపక్క మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఏఏ ఖురేషీని తాజాగా త్రిపుర హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఖురేషీ వ్యవహారంపై గుజరాత్ న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసేవరకూ వెళ్లడంతో కొలీజియం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అంటే కొలీజియం సైతం విరుద్ధమైన నిర్ణయాలు తీసుంటోందని భావించవచ్చా? గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు మార్చాల్సి వచ్చింది. తాజా నిర్ణయం సరైనదే అయితే- గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా నిర్వచించాలి? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. న్యాయవ్యవస్థ కొలీజియం పద్ధతిని అనుకరించినా, అందులోనూ లోపాలున్నాయని వివిధ హైకోర్టులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఉదాహరణగా నిలుస్తాయి. జాతీయ న్యాయ నియామకాల సంఘం కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సైతం దీనిని అంగీకరించింది. కొలీజియం వ్యవస్థను ముందుకు తీసుకువచ్చిన జస్టిస్ జేఎన్ వర్మ సైతం కొలీజియం నిర్ణయాల్లో హద్దుకు మించిన గోప్యత సరికాదని స్పష్టం చేసింది. 2015 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోనూ కొలీజియం వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచాలని పేర్కొంది. న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులపై జరుగుతున్న అంతర్గత దర్యాప్తును మిగిలిన వ్యవస్థల మాదిరే బహిర్గత పరచాలనే భావన కూడా వ్యక్తమవుతోంది.
తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ సంజయ్‌కుమార్ విషయంలోనూ సరైన న్యాయం జరగలేదనే భావనతో న్యాయవాదులు నిరసనలు తెలిపారు. సంజయ్‌కుమార్‌ను కొలీజియం పంజాబ్ హైకోర్టుకు బదిలీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం జనవరిలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దినేశ్ మహేశ్వరిని నియమించడానికి ఏకంగా 32 మంది సీనియర్ న్యాయమూర్తులను ఉపేక్షించందనే ఆరోపణలు మరిచిపోకముందే మిగిలిన వారి నియామకాలపై గగ్గోలు మొదలైంది. ప్రభుత్వానికి రుచించని తీర్పు ఇవ్వని కారణంగానే జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా సీనియారిటీని ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని బహిరంగ చర్చే జరిగింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాతనే రాష్టప్రతి న్యాయమూర్తులను నియమించాలని రాజ్యాంగం చెబుతోంది. ఆర్టికల్ 124, ఆర్టికల్ 217లలో న్యాయమూర్తుల నియామకాల అంశం రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ప్రధాన న్యాయమూర్తిని రాష్టప్రతి సంప్రదించాలనే పేర్కొన్నారే తప్ప న్యాయవ్యవస్థ చేసే సిఫార్సులను తప్పనిసరిగా ఆమోదించాలనే నిర్ణయం లేదు. అయితే ఒకసారి కొలీజియం సిఫార్సులను తిరస్కరించినా, మరోమారు అవే పేర్లను కొలీజియం సిఫార్సు చేసినట్టయితే వాటిని రాష్టప్రతి ఆమోదముద్ర వేయడం అలావాటుగా ఇపుడిపుడే మారుతోంది. ఎస్‌సీ గుప్తా వెర్సస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం మాటకే ప్రాధాన్యత ఉందని స్పష్టం చేసింది. రెండో జడ్జీల కేసుగా పేరొందిన సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఇన్ రికార్డు వెర్సస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు 7-2 మెజార్టీతో పాత తీర్పును సవరించింది. సంప్రదించడం అనే మాటను సమ్మతించడంగా పేర్కొంది. న్యాయమూర్తులుగా నియామకం కావడానికి ఎవరు అర్హులో నిర్ణయించగల సామర్ధ్యం ప్రధాన న్యాయమూర్తికి సహజంగానే ఉంటుంది. గనుక ఆయన నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే కొలీజియంను సంప్రదించిన తర్వాతనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా నియమించాలని పేర్కొంది. మూడో జడ్జీల కేసులో 1998లోనే కొలీజియం కూర్పు ఎలా ఉండాలో సుప్రీం కోర్టు సూచించింది. 99వ రాజ్యాంగం ద్వారా కొలీజియంను రద్దు చేసి జాతీయ న్యాయ నియామకాల సంఘాన్ని తీసుకువచ్చింది. ఈ సంఘం వల్ల ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉంటుందని భావించిన సుప్రీం కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసి కొలీజియం వ్యవస్థనే కొనసాగించింది. కొలీజియం వ్యవస్థ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అదుపాజ్ఞల్లో కొనసాగుతుంది. ఎందుకంటే కొలీజియం సమావేశాలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. అదే హైకోర్టు కొలీజియంలకు సంబంధిత ప్రధాన న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తారు.
దీంతో కొలీజియం చెప్పిందే రాజ్యాంగమా? అంతా న్యాయమేనా? న్యాయం పారదర్శకంగానే ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నతమవుతున్నాయి. తీవ్రమైన కారణాలతోనే న్యాయమూర్తుల బదిలీలు జరిగాయని, సంస్థాగతమైన గోప్యత, సంస్థ ప్రతిష్ట దృష్ట్యా కారణాలను వెల్లడించడం లేదని, అనివార్యమైతే ఆ కారణాలను వెల్లడించేందుకు కూడా కొలీజియం వెనుకాడబోదని కూడా స్పష్టం చేసింది.
జస్టిస్ చార్లెస్ ఇవాన్స్ హ్యూస్ మాటల్లో చెప్పాలంటే ‘ప్రజలను రాజ్యాంగం శాసిస్తుంటే, న్యాయమూర్తులు చెప్పిందే రాజ్యాంగంగా చెలామణి అవుతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రాతిపదికగా న్యాయమూర్తులు నడుచుకోవాలా? న్యాయమూర్తులు చెప్పిందే రాజ్యాంగం కావాలా? ఇది కొంత చర్చనీయాంశం అయినా న్యాయమూర్తుల ఎంపికలోనూ, పదోన్నతుల్లోనూ, బదిలీల్లోనూ కొలీజియం నిర్ణయాలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. కొలీజియం నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడమో, అనివార్యమైన జాప్యం చేయడం ద్వారానో తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెబుతూనే ఉంది. మరోపక్క ప్రభావిత న్యాయమూర్తులు రాజీనామా చేసే వరకూ వ్యవహారం వెళ్తోందంటే ప్రకంపనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తూనే ఉంది.
ఈ సందర్భంగానే అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్సు చేసిన వ్యాఖ్యలను స్ఫురించుకోవాలి. ‘అన్యాయం జరిగినపుడే న్యాయం విలువ ఏమిటో తెలిసేది, విధేయతగా ఉండాల్సి వచ్చినపుడే ఎదుటివారి నమ్మకద్రోహం బాధ తెలిసొచ్చేది. మీ విజయం గానీ, ఇతరుల వైఫల్యంగానీ అర్హమైనదిగా భావించకుండా ఎపుడూ స్పృహలో ఉండాలి. ఓటమి వచ్చినపుడే గెలుపు అంటే తెలుస్తుంది, మనం ఓడిపోయినపుడే ప్రత్యర్థులు ఆనందించేది. ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలియాలంటే మనం ఒక్కో మారు ఓడిపోవల్సిందే అపుడే ఆనందం విలువ తెలుస్తుంది’ అని జాన్ రాబర్ట్సు పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం నెలకొల్పడానికి పటిష్ట యంత్రాంగాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఇప్పటికే గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కొలీజియం సమావేశ వివరాలు సుప్రీం కోర్టు, హైకోర్టులు తమ వెబ్‌సైట్‌లలో ఉంచాలని అంతా కోరుకుంటున్నారు. న్యాయమూర్తులను నియమించేముందు ప్రభుత్వ సిఫార్సుతో కాకుండా బహిరంగంగా అందుకు సంబంధించిన సమూహాలతో చర్చించి పారదర్శకంగా ఎంపిక విధానాన్ని అనుసరించడం ప్రస్తుత తరుణంలో అనివార్యం. వ్యక్తిత్వంపైనా, అభ్యర్ధుల చరిత్రపైనా ఏమైనా ఫిర్యాదులుంటే వాటిని నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలి. లోపభూయిష్ట నియామకాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం పాటించిన ప్రమాణాలు ఏమిటో బహిరంగపరచాలి. ఆ ప్రమాణాలకు వారు ఎంపిక చేసిన అభ్యర్ధులు ఎలా సరిపోతారో కూడా నిర్ధారించుకోగలగాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు సహా దిగువ కోర్టుల వరకూ న్యాయమూర్తులు, న్యాయాధికారుల ఆస్తుల వివరాలను వెబ్‌సైట్లలో ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. న్యాయవ్యవస్థ క్రియాశీలతను, స్వతంత్రతను పరిపుష్టం చేసినపుడే ప్రజాస్వామ్యం ఇనుమడిస్తుంది.

బీవీ ప్రసాద్ 99633 45056