సబ్ ఫీచర్

మైక్రోప్లాస్టిక్‌తో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్ ఉత్పత్తులతో ప్రధానమైన సమస్య ఏమిటంటే అవి మనకి ఉపయోగంలో ఉండే సమయం కన్నా, వ్యర్థాలుగా మన చుట్టూ పేరుకుపోయే కాలమే ఎక్కువ. సౌందర్య సాధనాలలోని ‘మైక్రోబీడ్స్’ కొద్ది క్షణాలే మనకి ఉపయోగపడతాయి. కానీ ఆ తర్వాత వందల ఏళ్ల పాటు అవి వ్యర్థాలుగా భూమిలో పేరుకుపోతాయి. మనం వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల పరిస్థితి కూడా ఇంతే. భూగోళంపై ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలే పర్యావరణ కాలుష్యానికి హేతువులు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్నో అమాయక మూగజీవాల ప్రాణాలను బలిగొంటున్నాయి. సముద్రంలో డంప్ చేస్తున్న ప్లాస్టిక్ సంచులు, సీసామూతలు, టూత్‌బ్రష్ అవశేషాలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు తాబేళ్ళను, సాగర జీవాలను బలిగొంటున్నాయి.
కంటికి కనిపించని వ్యర్థాల మాటేమిటి?
సముద్రాల్లో పేరుకున్న వందల లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో అధిక భాగం మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలే. నీటిలో ప్లాస్టిక్ బీడ్స్ (పూసల వంటివి), ప్లాస్టిక్ ఫైబర్ (పీచులాంటి పదార్థం), ఒకటిన్నర సెంటీమీటర్ల కంటే చిన్నవిగా ఉండే ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి. నానోప్లాస్టిక్ వ్యర్థాలు మైక్రోప్లాస్టిక్ కన్నా వెయ్యి రెట్లు చిన్నవి. వీటికి మైక్రోస్కోప్‌ల ద్వారా గుర్తించడం కూడా చాలా కష్టం. సముద్రంలో నానోప్లాస్టిక్ వ్యర్థాలు లెక్కలేనంతగా పేరుకుపోయాయి. ఇవి మన తలవెంట్రుక మందం కన్నా సూక్ష్మంగా ఉంటాయి. మైక్రోప్లాస్టిక్ లేదా నానోప్లాస్టిక్ పదార్థాలను సౌందర్య సాధనాలలోను, మన ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే బ్రష్‌ల తయారీలోనూ వాడతారు. నిజానికి మైక్రోప్లాస్టిక్, నానోప్లాస్టిక్ వ్యర్థాల గురించి, అవి మన ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి చాలామందికి పెద్దగా తెలియదు. కంటికి కనిపించని ఈ వ్యర్థాలు మన శరీరాలను ఎలా ధ్వంసం చేస్తాయన్న విషయంపై ఇప్పుడిప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి.
రసాయనాలూ ప్రమాదకరమే
ఆధునిక మానవ జీవితంలో ప్లాస్టిక్ వినియోగం సర్వసాధారణమైంది. ప్లాస్టిక్ వస్తువుల వాడకంలో చాలా సౌలభ్యం ఉన్నందున నిత్యజీవితంలో మనం వాడే ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారవుతున్నాయి. నేటి మనిషికి ప్లాస్టిక్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమైపోయింది. ప్లాస్టిక్ వస్తువులు తేలికగా ఉంటూ, ఎక్కువ కాలం మనే్నందుకు వీటి తయారీలో కొన్ని రసాయనాలను చేరుస్తారు. నిత్యం ప్లాస్టిక్ వస్తువుల వాడకమే గతి అయిన మనిషికి వాటిలో ఉండే రసాయనాల దుష్ప్రభావానికి దూరంగా ఉండటం అసాధ్యమే.
అగ్నిప్రమాదాలను, అధిక వేడిమిని తట్టుకునేందుకు ప్లాస్టిక్ ఉత్పత్తులలో ‘్ఫ్తలేట్’, ‘బిష్ఫెనాల్‌ఎ’ వంటి రసాయనాలను కలుపుతారు. ఇలా చేయడంవల్ల ప్రారంభంలో చాలా ప్రయోజనకరంగా అనిపించినప్పటికీ తరువాత మన ఆరోగ్యంపై వీటి దుష్ప్రభావాన్ని గుర్తించసాగారు. ఎప్పుడూ ప్లాస్టిక్ వస్తువుల సామీప్యంలోనే ఉంటూ పనిచేసేవారి హార్మోన్లు దెబ్బతినడమే కాకుండా ఇది ఇలాగే కొనసాగితే క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇప్పటిదాకా ప్లాస్టిక్ వస్తువుల తయారీలో చేర్చబడిన రసాయనాల ప్రభావంపైనే దృష్టిపెట్టారు. ప్లాస్టిక్ ఉత్పత్తులవల్ల ఉత్పన్నమయ్యే ఇబ్బందులేమిటి? అన్నదానిపై ఇంకా దృష్టిసారించాల్సి ఉంది.
మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని ఎలా విషపూరితం చేస్తున్నాయన్న విషయంపై ఇటీవల చాలా పరిశోధనలు జరిగాయి. ఈ వ్యర్థాలవల్ల జలచరాలు అయిన చేపలు మొదలైన వాటి మనుగడే కాదు, అతి సూక్ష్మమైన (మైక్రోస్కోపిక్) జూప్లాంక్టన్ వంటి జీవజాలం కూడా దెబ్బతింటోంది. సముద్రపు పాచిలోను, జలచరాల నోటి ద్వారా ప్రవేశించి అవి పెట్టే గుడ్లలోకూడా మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా మనం తినే ఆహారంలో ఈ మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యర్థాలు జలచరాల మనుగడ, వాటి పునరుత్పత్తి, వాటి జీవన కాలపరిమితిపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. జలచరాల మనుగడ, వాటి ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నా అది మానవాళి మనుగడకు ఆధారమైన ఆహార వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
తమ పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు అంటారు. మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు క్షీరదాలపై చూపే దుష్ప్రభావం గురించి జరిగిన పరిశోధనలు చాలా తక్కువే. కానీ ఈ పరిశోధనల్లో వెల్లడైన విషయాలు దిగ్భ్రాంతిని కలిగించేవిగా ఉన్నాయి. ఈ వ్యర్థాల వల్ల క్షీరదాల కాలేయ వ్యవస్థ దెబ్బతినడంతోపాటు, వాటి జీవప్రక్రియలోనే అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు రక్తనాళాలలోకి కూడా చొచ్చుకుపోడవం వల్ల వాటినుండి వెలువడే రసాయనాల కారణంగా క్షీరదాల శరీరాలు విషపూరితం అవుతున్నాయి. ఫలితంగా అవి ఉత్పత్తిచేసే పాలు కూడా విష పూరితంగా ఉంటున్నాయి.
ఒక కొత్త ఔషధాన్ని తయారుచేస్తున్నప్పుడు దానిని మానవులపై ప్రయోగించి చూడడం ఎలా నేరమో, మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం విషయంలో మనుషులపై ప్రయోగాలు చేయడం కూడా నేరమే అవుతుంది. ఇప్పటిదాకా మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మానవుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయంపై ప్రత్యక్ష అధ్యయనం జరగలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల జల వనరులలోను (్భగర్భ జలాలు సహా) మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయని నిర్ధారణ అయ్యింది. దీని ప్రభావం వ్యవసాయ క్షేత్రాలపై బాగా ఉంది. ఫలితంగా మనం పండించే పంటలకు కలుషిత సారమే అందుతోంది. మనం పీల్చే గాలిలో కూడా మైక్రోప్లాస్టిక్ కణాలు వ్యాపించి ఉన్నాయి. ఇవి మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తరువాత మన రక్తనాళాలు, జీవన ప్రక్రియపై కూడా ప్రమాదకర ప్రభావాన్ని చూపుతాయి.
మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఏ వర్గాల ప్రజలు ఎక్కువగా ప్రభావితులవుతున్నారు? ఏ విధంగా నష్టం జరుగుతోంది? ప్లాస్టిక్ పదార్థాల పరిమాణం, ఆకారం లేదా వాటిలో ఉండే రసాయన పదార్థాలు- వీటిలో ఏది ఎక్కువగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది? మనుషులు ఎంత సమయం ప్లాస్టిక్ పరిసరాలలో ఉంటున్నారు? మనుషులు ఎదుర్కొంటున్న ఏ ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది? మానవుల జీవితంలోని ఏ దశలో ప్లాస్టిక్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది? మొదలైన ప్రశ్నలన్నింటినీ కూడా మానవుల ఆరోగ్యంపై ప్లాస్టిక్ ప్రభావం గురించి అధ్యయనం చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మానవుల ఆరోగ్యం విషయంలో మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు చూపే దుష్ప్రభావం సంగతి ఎలా ఉన్నా, పర్యావరణ కాలుష్యం విషయంలో వీటి పాత్ర కొట్టిపారేయడానికి వీల్లేదు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఇప్పటికైనా మనందరం మేల్కొని ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై, ప్లాస్టిక్ వ్యర్థాల విసర్జనపై తగిన నియంత్రణ పాటించాలి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తులను నిలిపివేయడం, లేదా వాటిని రీసైక్లింగ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థాయిలలోను పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి.
గత యాభై ఏళ్లకు పైగా రకరకాల ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవ జీవితాన్ని సుఖమయం, సౌకర్యవంతం చేసాయనడంలో సందేహం లేదు. ఆహార పదార్థాలను తాజాగా ఉంచేందుకు ఉపయోగించే ప్యాకింగుల దగ్గర్నుంచి కార్ల నుండి విమానాల వరకు అవసరమైన కీలకమైన విభాగాలన్నీ ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి. విద్యుత్ పరికరాల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించకుండా నిరోధించేందుకు, వైద్యరంగంలోనూ ఇంకా అనేక రకాలుగా ప్లాస్టిక్ వస్తువుల వాడకం వలన కలిగే ప్రయోజనాల్ని సౌలభ్యాన్ని ఎవరు కాదనలేరు. ప్లాస్టిక్ వినియోగం వల్ల చేకూరే ప్రయోజనాలు లెక్కకు అందనివిగానే ఉంటాయి. కానీ, ఆధునిక మానవుడికి వస్తు వినిమయం కన్నా వ్యర్థ విసర్జనం అలవాటుగా మారిపోయింది. దీనిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరంగా ఎన్నోరకాల అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి.
ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో అధిక భాగం వ్యర్థాలుగానే విసర్జింపబడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు చిన్నచిన్న ముక్కలై, చీలిక పీలికలై కంటికి కనబడని మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలుగా భూమి పొరల్లోనూ, గాలిలోనూ, జల వనరులలోనూ వ్యాపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే సంవత్సరాలలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం భూగోళాన్ని ముంచెత్తనుంది. ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తిచేసే పరిశ్రమల మీదికో లేదా ప్రభుత్వాల మీదికో ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తులు ఆపేయాలని లేదా వాటిపై నిషేధం విధించాలని బాధ్యత అంతా వారి మీదికే వదిలేసి ఊరుకుంటే సరిపోదు. ప్లాస్టిక్ వస్తువుల వినిమయంపై నియంత్రణ, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పట్ల తగిన శ్రద్ధ వహించే బాధ్యత మనందరిపైనా ఉంది. అప్పుడే ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడంలో ఒక్క అడుగైనా ముందుకువేయగలం.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690