సబ్ ఫీచర్

రావి.. సినిమాకి తావి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా పుట్టినేడాదే ఆయనా పుట్టాడు. తెలుగు సినిమాతోనే ఎదుగుతూ వచ్చాడు. శ్రీకాకుళంలో రావి చిదంబరం, పార్వతమ్మలకు 1931, ఫిబ్రవరి 11నే పుట్టిన ఆ బిడ్డే -కొండలరావు. చిత్రంగా అదే ఏడాది తెలుగు సినిమా పుట్టింది.
శ్రీకాకుళం శివారులో.. డేరా హాలుకు -యోగి వేమన వచ్చాడు. వేమన ఇలా ఉంటాడా? అన్నట్టు అమాయకంగా గుడ్లప్పగించి చూడ్డమే ఆ కుర్రాడికి అప్పటికి తెలుసు. అర్థంకాకపోయినా ఎందుకో నచ్చింది. నాలుగైదుసార్లు చూశాడు. ప్రతిసారీ కొత్తగా అనిపించింది. ఒకరోజు తొలాట -యోగి వేమన చిత్రాన్ని మరోమారు చూస్తున్నాడాయన. ఇంతలో గాలి దుమారం టెంట్‌హాల్‌ని లేపేసింది. ప్రొజెక్టర్ గదే మిగిలింది. జనాలు చెట్టుకొకరు పుట్టకొరయ్యారు. అదీ సినిమాలా చూస్తూ అలాగే ఉండిపోయాడు కుర్రాడు. అతను -రావి కొండలరావు. లేచిన దుమారం డేరాను లేపేసింది కానీ, కుర్రాడి మనసులో సినిమాను బలంగా నాటేసింది. తెరకు ముందూ వెనుక గుట్టుమట్లు పట్టాలన్న పట్టుదల అక్కడ్నుంచే మొదలైంది. ఆ ఆలోచనల తోవలో నటన, రచన వెంటరావడంతో -జమిలి జీవితమైంది. మదరాసుకు నడిపించింది. విజయచిత్రకు ఎడిటర్ని చేసింది. పాతికేళ్లకు పైగా ‘చిత్ర’ను ‘విజయం’వైపు నడిపించి -సార్థకనామం చేశాడు సంపాదకుడు. సినిమా పత్రికంటే ఇదీ అని -పాఠకుల చేత అనిపించాడు. నటన కూడా నాటుకుందిగా.. చిన్న పాత్రలతో వెండితెరపై తళుక్కుమనడం మొదలెట్టాడు రావి కొండలరావు. పాత్ర చిన్నదైనా.. దాని ప్రభావాన్ని గొప్పగా చూపించాడు, చూపిస్తూనే ఉన్నాడు.
జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యంతో పని లేదన్నట్టు -రావి కొండలరావుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనేలేదు. కాకపోతే -ప్రతి కథనానికి ఫస్ట్ పాయింట్ కామన్ కనుక -పైన రాసుకున్న ఆ నాలుగక్షరాలు.. చెరుకుతోటలో నిలబడిన వాళ్లకు నాలుగు పంచదార పలుకులే అనుకోండి.
**
సినీ ప్రపంచానికి బాగా తెలిసిన కొండ గురించి ప్రత్యేకంగా ఏం రాయాలి? ఈ ప్రశ్న ఉద్భవించినపుడు -ముచ్చట్లేనన్న సమాధానం దొరికింది. అదీ -ఆయనతో మాట్లాడటం మొదలెట్టాక. ఆయన్ని కలిశాక నిజానికి అవే దొరికాయి. ఆ ముచ్చట్లలో సినిమా ఉంది తప్ప స్వగతం లేదు. ఆయన అనుభవ లోతుల్లోకి వెళ్లాలని ఎవరైనా ప్రయత్నిస్తే -ఆయనకు మహదానందమని అర్థమైంది. అందుకే.. ఆ లోతుల్లో దొరికిన కొన్ని ‘ఆణిముచ్చట్ల’ ‘కాణికబుర్ల’ను ఈవారమిచ్చే ప్రయత్నం చేశా.
అమ్మానాన్నలు తెలిసిపెట్టారో, ప్రపంచానికి తెలియజెప్పాలని పెట్టారో తెలీదు కానీ -నిజానికి ఆయన కొండే. ఆరంభంలో చెప్పుకున్నట్టు -తెలుగు సినిమాతోపుట్టి.. పెనవేసుకు ఎదిగిన ఎతె్తైన కొండ. ఒక్కసారి మొనకు చేరి -వలయాకార పల్లంలో పల్చబర్చుకున్న వింతలు చూస్తే.. కళ్లు నిండిపోతాయి. -ఎన్నో విషయాల మట్టిళ్లు. ఎనె్నన్నో సంగతుల పూరి గుడిసెలు. ఇంకెన్నో ముచ్చట్ల మహార్మ్యాలు. అవన్నీ -నిత్యయవ్వనంతో తొణికిసలాడుతుంటాయి. ఎందుకంటే -తనకు తానుగా ఎదిగిన 88ఏళ్ల పదునైన మొన చూపిస్తోన్న దృశ్యాలు కదా. అలానే ఉంటాయి!
88కి చేరారు. ఏంటి.. హెల్దీ సీక్రెట్? అన్న పొట్టి ప్రశ్నకు -కడుపొట్టి ఆన్సరిచ్చాడాయన -‘దురభ్యాసాల్లేవు’ అని! అందుకే 88ఏళ్ల పదునుతగ్గని మొన అన్నది.
**
మళ్లీ ‘చిత్ర.. విజయ’కు వద్దాం. విజయచిత్రలో వేల వ్యాసాలు రాసేసిన మస్తిష్కం మనతో ఉంది. ఆ వ్యాసాలపై డాక్టరేట్‌లు తెచ్చుకున్నోళ్లూ మనలో ఉన్నారు. ఎన్నో రాశాడు. ఏవేవో రాశాడు. రాసిందల్లా బంగారమైంది. పాత బంగారం వనె్నలీనుతూనే ఉంది. పడిలేచిన కెరటాలకు ప్రాణం పోశాడు. అవింకా -పడిపడి లేస్తూనే ఉన్నాయి. ఆయన రాసిన ఏ శీర్షిక తిరగేసినా ముచ్చట్లే ఉంటాయి. అవన్నీ పోగేసుకుని.. సంభాషణలు చేసుకుని.. సీన్లుగా రాసుకుని.. వందల సినిమాలు తీయతగినన్ని స్క్రిప్ట్‌లు చేయొచ్చనిపిస్తుంది. అందుకే ఆయన గురించి చాలామంది ఓ మాటంటుటారు. -కొండ చూపించే వలయాకార పల్లంలోకి ఓపిగ్గా దిగితే ఏరుకున్నోళ్లకు ఏరుకున్నన్ని ‘ఆపాత మధురాలు’ అని.
**
ఇప్పుడు -టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేద కళాకారులు, వృద్ధుల కోసం సహకారమందిస్తోంది. దీనికి బీజం ఎక్కడ పడిందో వెతుకుదాం. -‘అప్పట్లో మదరాసులో తెలుగు సినీరంగం ఉన్నప్పుడే ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ పుట్టింది. గుమ్మడి వెంకటేశ్వర రావు అధ్యక్షుడు. నాగభూషణం కార్యదర్శి. అందులో -నేనో సభ్యుడిని. నెలకోసారి -గెట్ టుగెదర్ అనేది ఉండేది. ఏదోకచోట కలిసి ఆటలు, పాటలు సాగించేవాళ్లం. ఆ రోజులే వేరు. అసోసియేషన్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్, భానుమతి తప్ప అందరూ మెంబర్లే. అయితే తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభోత్సవానికి మాత్రం ఎన్టీఆర్ హాజరయ్యారు. ఓసారి ఎంజీఆర్ తన గార్డెన్‌లోనే ‘మా గెట్ టుగెదర్’కు అనుమతిచ్చారు. చిత్రమేంటంటే -అనుమతితోపాటు అన్నపానాలూ పంపించారు. అదీ ఆయన దయార్ద్ర హృదయం’ అంటూ గుర్తు చేసుకున్నారు కొండలరావు.
ఇంకోసారి-
శివాజీ గణేశన్ తనింట్లో సినీ కళాకారుల సదస్సు నిర్వహించి నిర్వహణ బాధ్యత భుజానికెత్తుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నటీనటులు, టెక్నీషియన్లకు ఒప్పంద ప్రకారం చిత్ర నిర్మాత పారితోషికం ఇవ్వకుంటే -వారి తరఫున వకాల్తా పుచ్చుకునేది ఈయనే. అలా ఓసారి నటుడు కెకె శర్మ ఫిర్యాదు మేరకు సినిమా విడుదల ఆగిపోయింది. ఒప్పందం ప్రకారం ఆయనకివ్వాల్సింది ఆరొందలే. అయినా ఇక్కడ మొత్తం కాదు, మాట ముఖ్యం. అలా ఉండేది అప్పట్లో. నటుడు ప్రభాకర్‌రెడ్డి ఈ విషయంలో అంకితభావంతో పనిచేసేవాడు. మరోసారి ‘డబ్బెవరికి చేదు’ చిత్ర నిర్మాత అలాంటి ‘కలసిగట్టు’ అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. సినిమా పూర్తయ్యక లాబ్‌లోంచి ప్రింట్లు బయటకు వస్తున్నాయి. అప్పటికీ నటీనటులు, సాంకేతిక నిపుణులకు పైసా కూడా ఇవ్వలేదు. దీంతో అంతా జెమిని లాబ్‌కు వెళ్లారు. నిర్మాత ఎవరికీ పారితోషికం ఇవ్వనందున అసోసియేషన్ తరఫున పోరాడారు. చివరికి నిర్మాత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. పారితోషికాలు కొంతకొంత తగ్గించుకుని ఒడంబడిక ప్రకారం డబ్బు చెల్లించేలా మాట్లాడుకున్నారు. సమస్య పరిష్కారమైంది. ఉదాహరణకు -16వేలు తీసుకోవాల్సిన లైట్స్‌మెన్ 10వేలిచ్చినా సరే అన్నట్టన్న మాట. తలాకొంత పారితోషికాలు తగ్గించుకోవడంతో -నిర్మాత కూడా మర్యాదగా చెల్లించేసి ప్రింట్లు బయటకు తెచ్చుకున్నాడు. ‘యూనిటీ’ అంటే అలా ఉండేది. అందుకే సినిమా అంటే ఓ కుటుంబం అన్న మాటొచ్చింది. కానీ -ఇప్పుడలా అనిపించటం లేదు అంటూ పెదవి విరిచాడు పెద్దాయన. అప్పట్లో -ఒప్పందం ప్రకారం పారితోషికాలు ఇచ్చిపంపే ప్రసాద్, జగపతి, అన్నపూర్ణ, విజయ సంస్థలంటే నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎక్కడలేని గౌరవం.
**
గుమ్మడి నటుడు కాకముందు -చెన్నై చిత్ర టాకీసులో అపుడే విడుదలైన ‘షావుకారు’ సినిమా చూశాడు. సినిమా నుంచి బయటికొస్తూనే -టికెట్ క్యూలో నిలబడ్డాడు. మళ్లీ టికెట్ తీసుకుని సెకెండ్ షోకి వెళ్లాడట. తన జీవితంలో వరుసగా రెండుసార్లు చూసిన సినిమా అదేనని ఏదైనా సందర్భంలో గుమ్మడి మాటలు గుర్తుకొస్తే -ఇప్పటికీ ఆనందం ఆశ్చర్యం వేస్తుంటాయి అంటాడాయన. ఆ సినిమా విశేషమేమంటే -హరికథతో మొదలవ్వడం. బుర్రకథతో ముగియడం. ఆ సినిమాని నేనూ ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదంటారాయన. సరిగ్గా గమనిస్తే సినిమానిండా పడిగట్టు సంభాషణలుంటాయి. చక్కని మాటల్తో కథ చెబుతూ ప్రేక్షకుడిని రంజింపచేస్తే గొప్ప టెక్నిక్ అందులో అవలంభించారు. సినిమాలో డైలాగ్ ఎలాగుండాలి? మాటలెలా పలకాలి? అన్న అంశంపై చక్రపాణికి ఉన్నంత అథారిటీ మరెవరికీ లేదన్నది నా మాట. అంత సహజమవి. షావుకారులో హీరో రామారావు, జానకిలమధ్య ప్రేమే ఉంటుంది. కానీ వాళ్లెక్కడా మాట్లాడరు. స్క్రిప్ట్‌కి ట్రీట్‌మెంట్ అంత గొప్పది. ‘సత్యం వస్తున్నాడే’ అనంటే, జానకి ‘వస్తే నాకేంటి’ అంటుంది. ఆ మాటంటూ వెళ్లే ఆమె నడకలో అతనంటే ఎంతిష్టమో ప్రేక్షకులకు అర్థమవుతుంది. అదీ ట్రీట్‌మెంట్. అది చక్రపాణికే చెల్లింది. అలాగే మొదటి సీన్... హరికథ పాట సాగుతున్నపుడే మరోవైపు ఎస్వీఆర్, జీవీ సుబ్బారావుల సన్నివేశాన్ని చూపిస్తారు. ఓవైపు పాట, మరోవైపు సన్నివేశం- అలా అప్పటిదాకా ఏ సినిమాలో నేను చూడలేదు. ఆ పాట సినిమాలో లీలగా వినిపిస్తుంది. రికార్డ్‌లో మాత్రమే ఆ పాటను మనం చక్కగా వినగలం, సినిమాలో కష్టం. అందుకే అప్పట్లోని పత్రికలు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో సినిమా వార్తలు వుండేవి కావు. కానీ షావుకారు చిత్రం విడుదలయ్యాక ‘ఉత్తమ సామాజిక చిత్రం విజయవారి షావుకారు’ అంటూ శీర్షికపెట్టి సమీక్ష రాశారు. సినిమా వార్తలే రాయని ఆంధ్రపత్రికని ఆ సినిమా ఎంత ప్రభావితం చేసిందనేది ఇక్కడ విషయం. కానీ ఆ సినిమానికి లాభాలు రాలేదు. లాభాలు వచ్చినట్లయితే అలాంటి సినిమాలు మరికొన్ని విజయా సంస్థనుండి వచ్చేవి. లాభాలకోసం వెంటనే పాతాళభైరవి చిత్రాన్ని ప్రారంభించారు. దాంతో కోట్లు వచ్చిపడ్డాయి. అదేవిధంగా వాహినివారు కూడా మొదట ‘యోగివేమన’ చిత్రాన్ని తీస్తే సరిగా పోలేదు. ట్రాక్ మార్చి జానపద కథ తీసుకొని ‘గుణసుందరి’ కథ చిత్రాన్ని రూపొందించగా లాభాల బాట పట్టారు -అంటూ అప్పటి కాలమాన కబుర్లు గుర్తు చేశారు రావి కొండలరావు.
**
ఒకసారి తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలో అప్పటి సీఎం చెన్నారెడ్డి పాల్గొన్నారు. ఆయన హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని చెప్పి, ఇపుడు వనస్థలిపురంగా పిలవబడుతున్న ప్రాంతాన్ని బ్రహ్మానంద చిత్రపురిగా అభివృద్ధి చేయాలని చెప్పారు. కానీ తరువాత అక్కినేని నాగేశ్వరరావు ఆ ప్రాంతం ఊరికి చివరగావుందని, జూబ్లీహిల్స్‌లో స్టూడియో కట్టడానికి అనుమతి తీసుకున్నారు. ఆ తరువాతే అంతా స్టూడియోలు కట్టారని గుర్తు చేసుకున్నారాయన.
ఓసారి ఆకాశవాణిలో రేడియో నాటకం రికార్డింగ్‌కి వెళ్లారట రావి కొండలరావు. అక్కడ సూర్యకాంతం వుంది. వారంతా కలిసి ఎప్పుడూ నాటకాలు వేస్తూనే ఉండేవారు. అయితే ఆ రోజు ఆమె కళ్లకలకతో బాధపడుతూ, మరొకరికి ఆ ఇబ్బంది అంటించకూడదన్న ఉద్దేశంతో నల్లకళ్లద్దాలు పెట్టుకొచ్చారు. పైగా తన ఇబ్బంది ఎవరికీ తెలీకూడదు. అందుకే -రావికొండలరావును పిలిచి ‘కళ్లు కొంచెం బ్లర్ అవుతున్నాయి. స్క్రిప్ట్‌ను నువ్వు చదువు. నేను చెప్పేస్తా’ అన్నారట. అలా ఆయన చదివిన ప్రతి అక్షరాన్నీ పొల్లుపోకుండా తిరిగి చెప్పేశారట ఆమె. ‘ఆమె జ్ఞాపకశక్తికి జోహార్ అనక ఇంకేమంటాను’ అంటారు రావి కొండలరావు. మొత్తానికి పేజీ పేజీ చదువుకుంటూ కట్ చేస్తూ నాటకాన్ని పూర్తిచేయడం ఆమెకే చెల్లిందట. -‘మరోసారి ముహూర్తబలం షూటింగ్ జరుగుతోంది. గయ్యాళి భార్య సూర్యకాంతం భర్త పాత్ర నాదే. పాత్రపరంగా ఆమె ఏది చెబితే దానికి తలూపడమే నా పని. అక్కడ అమ్మాయికి సంబంధం వచ్చింది. అదీ సీన్. ఒక సూది పెట్టుకుని చిన్నగా నన్ను గుచ్చుతుంటుంది. గుచ్చినపుడల్లా అయితే.. ఓకె.. సరే.. సరే అంటూ ప్రతిదీ ఒప్పుకోవాలి. అదీ సీన్. ప్రతిసారి చిన్నగానే గుచ్చిన సూర్యకాంతం, ఓసారి బాగా గుచ్చేసింది. అక్కయ్యగారూ చంపేశారండీ అన్నాను. ‘అయ్యో తమ్ముడూ! చూసుకోలేదు నాయనా. బాగా గుచ్చుకుందా’ అంటూ తెగ బాధపడిపోయారు ఆమె. అలా సూర్యకాంతం భర్తగా పది పదకొండు సినిమాల్లో నటించిన జ్ఞాపకాలు గొప్పగా ఉంటాయి -అంటారు రావి కొండలరావు. ‘ఆమె తెరపై కనిపించిందీ అంటే ప్రేక్షకులకు పండగే. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి తగాదా పెట్టేస్తుంది అని ప్రేక్షకులకు నమ్మకం. కానీ చూసిన నటనే మళ్లీ కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆనందించేవారు. అటువంటి నటీమణి ప్రపంచంలో మరెక్కడా ఉండదని నా ఫీలింగ్ అంటారాయన.

వలయాకార పల్లంలో ఎన్ని ముచ్చట్లు ఏరుకోగలమో తెలీదు. వచ్చేవారం -మరికొన్ని ఆణిముచ్చట్లు ఖాయం.

-సరయు శేఖర్, 9676247000