సబ్ ఫీచర్

మితిమీరిన వేగం ప్రాణాంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు విషాదం బారిన పడుతున్నాయి. భావి జీవితాన్ని చూడకుండానే యువకులు, పసివాళ్లు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం రహదారులు రక్తసిక్తం కావడానికి కారణాలేమిటి? ఇందులో వాహనచోదకుల బాధ్యత ఎంత? రోడ్ల నాణ్యతాప్రమాణాలు ఎంత? అనే ప్రశ్నలు వేసుకుంటే- మనకు నిరాశాజనకమైన జవాబులే వస్తాయి. రోజూ కొత్తగా వేలాది వాహనాలు రోడ్డుకెక్కుతున్నాయి. మరి ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు వహిస్తున్నారా? మితిమీరిన వేగం మృత్యువుతో చెలగాటం అని తెలిసి కూడా ఎందుకు వేగం పెంచి వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాలకు కారకులైన వారు ఇతరుల జీవితాలను సైతం బలితీసుకుంటున్నారు.
డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను నడపడంతో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలను నడిపేవారికి శిక్షలు వేస్తున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాలకు మరో ముఖ్య కారణం అతివేగం. సాధారణంగా కార్లు, బస్సులు, భారీ వాహనాలు త్వరగా గమ్యస్థానాలకు చేరాలనే తొందరలో వేగంగా నడుపుతుంటారు. డ్రైవర్లు నిబంధనలకు మించి వేగంతో వాహనాలను నడిపిస్తుంటారు. ఒక్కోసారి వాహనాలు గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ఈ క్రమంలో రహదారిపై ఏదైనా అడ్డుగా వచ్చినా లేదా ఆ సమయంలో డ్రైవర్ నిద్ర వచ్చినా, ఆదమరిచి ఉన్నా క్షణాల్లో ప్రమాదం జరుగుతుంది. తక్కువ వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగానే ఉంటాయి.
రోడ్డు ప్రమాదాలకు మరొక ముఖ్యకారణం సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం. భారీ వాహనాలు నడిపేవారు, ప్రయాణికులను తీసుకువెళ్లే రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్ వాహనాలను నడిపేవారు ఒక చేత్తో సెల్‌ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ మరో చేత్తో స్టీరింగ్ పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఎవరైనా అడ్డువస్తే తప్పించడానికి నానాతంటాలు పడి ప్రమాదానికి గురిచేస్తారు. ఇక, రద్దీ రోడ్లపైనా చాలామంది పాదచారులు నిర్లక్ష్యంగా నడుస్తుంటారు. పరిసరాలను గమనించకుండా రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదాలు జరుగుతాయి. ఆటోలు, కార్లు, జీపులు తదితర వాహనాలలో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్‌కే చోటులేనంతగా వాహనాలు కిక్కిరిసిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
మన దేశంలోని అనేక ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో క్రాసింగ్‌లు సరిగ్గా కనిపించక పోవడం, సిగ్నల్స్ లేకపోవడం, సూచిక బోర్డులు, హెచ్చరిక చిహ్నాలు ఉండకపోవడం, ఒక్కోచోట ఇరుకుగా రహదారులు ఉండడం, వంతెనలపై రెయిలింగ్‌లు దెబ్బతినడం, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు అవసరం ఉన్నచోట లేకపోవడం, రోడ్లు దెబ్బతిని గుంతలు పడడం, డివైడర్లు లేకపోవడం.. వంటి అనేక లోపాల వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో లారీలు, బస్సులు, కార్లను నడిపే డ్రైవర్లు నిద్రలేకుండా సుదీర్ఘంగా కొన్ని గంటలపాటు వాహనాలను నడుపుతుంటారు. దీంతో ఒక్కోసారి నిద్ర ఆవహించి ఆ మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాహనదారులు చిత్తశుద్ధితో నిబంధనలు పాటిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాల్ని నివారించవచ్చు. రోడ్లపై నడిచేటప్పుడు ఒకటికి రెండుసార్లు వాహనాలు వస్తున్నాయో, లేదో చూసుకుని రోడ్డు దాటాలి. పాదచారుల శ్రేయస్సు కోసం కూడళ్లలో రోడ్లపై సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాలి. ప్రమాదాలకు అవకాశం ఉన్న చోట విధిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాలి. పాదచారులు రోడ్డును దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలి. రహదారులపై వాహనాలు అతి వేగంతో వెళ్లకుండా రవాణా, పోలీసు శాఖల అధికారులు పర్యవేక్షించాలి. స్పీడ్ గన్స్‌తో ఎప్పటికప్పుడు వాహనాల వేగంపై నిఘా ఉంచాలి. అతివేగంతో వెళ్లే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటే కొంతవరకైనా రోడ్డుప్రమాదాలు తగ్గుతాయి. ప్రయాణికులు కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తపడాలి.
వాహనాల యజమానులు తమ డ్రైవర్లకు నిర్దిష్టమైనన్ని గంటలపాటు మాత్రమే వాహనాన్ని నడిపేలా చూడాలి. బలవంతంగా నిద్రను ఆపుకుని డ్రైవర్లు వాహనాలను నడపకూడదు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత డ్రైవింగ్‌ను కొనసాగించవచ్చు. వాహనాలను నడిపేవారు, రహదారులపై నడచి వెళ్లేవారు సెల్‌ఫోన్‌లో మాట్లాడకుండా ఉండాలి. అప్పుడే వారి దృష్టి రహదారి మీద ఉంటుంది. వాహన చోదకులు తన క్షేమంతో పాటు రోడ్లపై వెళుతున్న ఇతరుల క్షేమాన్ని గురించి కూడా ఆలోచించాలి. ముఖ్యమైన సమాచారం ఎవరికైనా సెల్‌ఫోన్ ద్వారా చేరవేయాలని అనుకుంటే కొంతసేపు వాహనాలను నిలిపివేయాలి. ఫోన్‌లో మాట్లాడక తిరిగి ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాలను కొంతవరకైనా తగ్గించవచ్చు. అధికారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. రహదారుల నిర్మాణంలో లోపాలు లేకుండా చూసుకోవాలి. ప్రతివారు తమ బాధ్యతని గుర్తెరిగి నిబంధనలను సరిగ్గా పాటించి వాహనాలు నడిపితే, తక్కువ వేగంతో ప్రయాణిస్తే అప్పుడు రోడ్డు ప్రమాదాలను కొంతవరకైనా నివారించవచ్చు. గమ్యం చేరుకోవాలన్న తొందరతో మితిమీరి వేగంతో ప్రయాణిస్తే- పొంచి ఉన్న మృత్యువు కాటేస్తుంది. దీన్ని నివారించాలంటే ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనల పట్ల, డ్రైవింగ్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వం, ప్రజలు కలసి పనిచేస్తేనే రోడ్డు ప్రమాదాల్ని నివారించే వీలుంది.

-పుష్యమీసాగర్ 90103 50317