సబ్ ఫీచర్

చుట్ట..చుట్టేశానంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాతో అసాధారణ జర్నీ -రావిది. ఆనాటితరం నుంచి ఈనాటి తరం వరకూ -సహచరులు, సమవుజ్జీలు, తదుపరి తరాలు.. ఇలా రావి జర్నీ అనంతంగా సాగుతూనే ఉంది. మహా ప్రయాణంలో ఎన్ని చెప్పుకున్నా.. తరగనన్ని ముచ్చట్లు. వెనె్నల అతిథిగా రెండువారాలు ఎన్నో ముచ్చట్లు చెప్పిన రావి -ఈవారం అరుదైన కొన్ని జ్ఞాపకాలనూ గుదిగుచ్చారు. అయితే ఆయనకవి జ్ఞాపకాలే.. కానీ వర్థమాన తరానికి అవి టెక్నిక్స్. పాఠాలు. పెద్దవాళ్ల దగ్గర ఎలావుండాలో నేర్పించే చమత్కారాలు కూడా. అవేంటో చూద్దాం.

నటుడనేవాడికి కెమెరా సెన్స్ ఎంతముఖ్యమో, మైక్ సెన్సూ అంతే ముఖ్యం. మైకులో మాట వినపడాలంటే దగ్గరకెళ్లి మాట్లాడాలి. అలాగని యాక్షన్ తగ్గకూడదు. కెమెరాకోసం ప్రత్యేకంగా వెళ్లకూడదు. ఈ టెక్నిక్స్ పెర్ఫెక్ట్‌గా తెలిసినోళ్లకే -చాన్స్‌లొచ్చేవి.
దాడుగుమూతలు చిత్రంలో నేను డాక్టర్‌ని. పేషెంట్ జమీందారు గుమ్మడి. ‘ఇంతమంది ఉంట్లో ఉన్నారు. ఒక్కరుకూడా ఆయన గురించి పట్టించుకోరా’ అంటూ చేతులూపుతూ నేను డైలాగ్ చెప్పాలి. కానీ డైలాగ్ చెప్తున్నపుడు -చేతులు కెమెరాలోకి రావడం లేదు. కారణం కెమెరా దగ్గరగా ఉండటం వల్ల. డైరెక్టర్‌కి విషయం అర్థమైంది. ‘నాటకాలనుంచి వచ్చినోళ్లు ఖచ్చితంగా నటిస్తారయ్యా’ అంటూ.. కెమెరాను వెనక్కి జరిపించాడు. కెమెరా వైడ్ తీసుకోవడంతో సీన్ బాగా వచ్చింది.
**
వేములవాడ భీమకవి సినిమా షూటింగ్ జరుగుతోంది. బాలకృష్ణ హీరో. ఊరివారంతా హీరోను వెలేస్తే, మేనమామగా నేనెళ్లి అక్కడున్నవారిని ఉద్దేశిస్తూ డైలాగ్ చెప్పాలి. పేజీ డైలాగ్ అది. ఓరకంగా కంఠతా పట్టేశాను. ‘ఎలా చేయాలో ఓ సలహా చెప్పండి’ అంటూ ఎన్టీఆర్‌ని అడిగాను. ‘మీ ఫ్లోలో మీరు చెప్పండి’ అన్నారాయన. నచ్చినట్టుగా డైలాగ్ చెప్పేశాను. అదే ఆయనకు బాగానచ్చింది. ‘వెరీ గుడ్ బ్రదర్! ఇలాగే చెప్పండి’ అని వెన్నుతట్టారు’- అని గుర్తు చేసుకుంటూ.. కెమెరా టెక్నిక్ అనుభవాన్ని వివరించారు రావికొండలరావు. ఎన్టీఆర్ రూపొందించిన 12 చిత్రాల్లో రావికి వేషం దొరికింది. తల్లా పెళ్లామా, వరకట్నం, కోడలు దిద్దిన కాపురం చిత్రాల్లోని రావి పాత్రలకు మంచి ఆదరణా లభించింది.
‘కోడలు దిద్దిన కాపురంలో సత్యనారాయణకు సత్యసాయిబాబా మేకప్ లాంటిదివేసి బాబాగా నటింపజేశారు. ఆ చిత్రానికి సెన్సారు బోర్డు సర్ట్ఫికెట్ ఇవ్వలేదు. దీంతో బొంబాయి సెన్సార్ బోర్డుకు తీసుకెళ్లి చూపాల్సి వచ్చింది. అక్కడ ‘ఎవరో బాబాను ఉద్దేశించి పాత్ర సినిమాలో ఉందటగా’ అని అడిగారు. దానికి సినిమా యూనిట్ ఒక నోట్ తయారుచేసింది. మీరన్నమాట నిజమే కావచ్చు కానీ, ఆ బాబాలాగా ఈ బాబా లేరు. ఆయన అంత హైట్ కాదు. మా సినిమాలోని పాత్రధారి చాలా హైట్. ఆయన కాషాయం ధరిస్తారు. మా సినిమాలో అలాంటి కాషాయ వస్త్రాలు లేవు. ఆయనలా ఈయన మాట్లాడరు’ అనే సారాంశం వచ్చేలా ఉండటంతో బొంబాయి కమిటీ సెన్సార్ సర్ట్ఫికెట్ ఇచ్చింది. ఇదే చిత్రాన్ని మొదట తమిళంలో ఎస్‌ఎస్ రాజేంద్రన్ రూపొందించారు. అదే చిత్రం మళ్లీ పెద్దకోడలు టైటిల్‌తో డబ్బింగ్‌గా వచ్చింది. దానికి రీమేకే కోడలు దిద్దిన కాపురం.. అంటూ గుర్తు చేశారు రావి.
సెట్‌లో వున్నపుడుగాని బయటగానీ ఎన్టీఆర్ ఏనాడూ ఒక జోక్ వేయరు. ఎవరన్నా వేసినా నవ్వడం అరుదు. ఆయన దృష్టంతా నటనపైనే ఉంటుంది. కులగౌరవం చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అందులో చుట్ట కాలుస్తూ మేడపైనుంచి కిందకు దిగాలి రావి. అసలే చుట్ట్భ్యాసం లేకపోవడం, దానికితోడు తెప్పించిన స్పెన్సర్ చుట్టలు పెద్దవిగా ఉండడంతో ఓ పట్టాన దాన్ని కాల్చడం ఇబ్బందైపోయింది రావికి. అయినా ప్రయత్నించారు. ‘ఓవైపు అలవాటులేని చుట్టకాల్చాలి. మరోవైపు మేడమెట్లు ఎంతదూరంలో వున్నాయో చూసుకుంటూ, దిగుతూ డైలాగ్ చెప్పాలి. ఎలా చేయగలనో ఏమో అనుకున్నాను. కానీ ఫస్ట్ టేక్‌లోనే ఓకె అయిపోయింది. ప్రొడక్షన్ అసిస్టెంట్ రమేశ్‌ను ఎన్టీఆర్ పిలిచి, ‘ఎన్ని చుట్టలు తెప్పించాం’ అని అడిగారు. ఆయన ‘అర డజన్ తెచ్చామండి’ అన్నారు. అయితే ఐదు చుట్టలు మిగిలాయి కదా, ఈ ఐదు చుట్టల డబ్బులు రావికొండలరావు అకౌంట్‌లో వెయ్యండి అని చమత్కరించారు ఎన్టీఆర్ అన్నారు. నేనేమన్నా తక్కువ తిన్నానా.. ‘అయ్యా మీ టైమ్, ఫిల్మ్ అన్నీ సేవ్ అయ్యాయి కదా. సహజంగా ఆరు టేకులు తీయాలని ఆరు చుట్టలు తెప్పించారు. కానీ ఐదు మిగిలాయి. కనుక టైమ్, ఫిల్మ్ అన్నిటికీ కలిపి మీరే నాకు ఎంతోకొంత ముట్టచెప్పాలి’ అనడంతో ఎన్టీఆర్ హ్హహ్హ అని నవ్వేశారు -అని గుర్తు చేసుకున్నారాయన.
మరోసారి వీరాభిమన్యు షూటింగ్ జరుగుతోంది. టైటిల్ రోల్ శోభన్‌బాబు. ఎన్టీఆర్ అందులో శ్రీకృష్ణునిగా నటించారు. షూటింగ్‌కు ముందే ఓసారి వచ్చి సెట్‌ను తేరిపార చూశారాయన. పెద్ద పెద్ద స్తంభాలతో సెట్ అద్భుతంగా ఉంది. సింహాసనం రాజసంతో తొణికిసలాడుతోంది. అయితే, స్తంభాలపైన, సింహాసనంపైనా ఏనుగు తలల బొమ్మలను అమర్చి అద్భుతంగా తీర్చిదిద్దారు ఆర్ట్ డైరెక్టర్ ఎస్.కృష్ణారావు. ఆయన అందరిలాగా ముందుగానే సెట్‌ను ఇలా వేయాలి, అలా వేయాలి అనుకోరు. అందరూ ముందుగా స్కెచ్‌లు వేస్తారు కానీ ఆయన స్కెచ్‌లు కూడా వేయరు. ఊరికే తన సహాయకులకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేస్తారు. వాహిని స్టూడియోలో ఇలాంటి పౌరాణిక జానపద సెట్‌లు వేయడానికి ఓ పెద్ద ఎక్విప్‌మెంటే వుండేది. కృష్ణారావు ఇలా చెప్పగానే అలా మోడల్స్ తయారైపోతూనే వుంటాయి. అలా వుండేది అప్పటి పనితనం. మళ్లీ వీరాభిమన్యు సెట్‌కొద్దాం. ఆ సెట్‌ను చూసిన ఎన్టీఆర్, ఏమిటండీ, అన్నీ ఏనుగు తలకాయలే కనిపిస్తున్నాయి అని అడిగారట. ఔనండీ.. ఇది హస్తినాపురం కదా. హస్తి అంటే ఏనుగు కాబట్టి, ఏనుగు తలకాలతో దర్బార్ సెట్ వేశాము అని చెప్పారు ఆర్ట్ డైరెక్టర్. వెంటనే ఎన్టీఆర్ అందుకుని, ఓహో హస్తినాపురం అంటే ఏనుగులతో వేస్తారా? మరి పెంటపాడు అంటే దేంతో వేస్తారు అని చమత్కరించడంతో సెట్‌లో వున్నవారంతా పగలబడి నవ్వేశారట. ‘‘నా జీవితంలో నేను తొలిసారిగా చూసిన ఆయన వేసిన పెద్ద జోక్ అదే అనుకుంటాను’’ అని గుర్తుచేసుకున్నారు రావి.
రావివారు దాదాపు 60 కథలుదాకా వ్రాశారు. అందులో సినిమాకు పనికొచ్చే కథలు వేరుగా ఉంటాయండి అని చెప్పుకొచ్చారు. సినిమాలు తీయడానికి అన్ని కథలూ పనికిరావు. మన మనసులో భావాలను అద్భుతమైన వర్ణనలతో చెప్పడం ఒకలాంటి కథ అయితే, సినిమాకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథనల్లడం ఓ పద్ధతి. అలా ఓసారి పెళ్లిపుస్తకం కథ సినిమా కోసమే రాసుకున్నారు రావి. డివిఎస్ రాజు ఆఫీసులో కూచొని సినిమా కోసమే రాసుకున్న కథ. అయితే మొదట కాల్షీట్లు ఉండడంతో దర్శకుడిగా వేజెళ్ళ సత్యనారాయణను నియమించుకున్నారు. హీరోగా కమల్‌హాసన్ అనుకున్నారు. ఆయన కాల్షీట్లు లేట్ అవుతున్నాయి. దొరకడంలేదు. దాంతో సినిమా వెనుకబడిపోయింది. అయితే ఎవరికిబడితే వారి దగ్గరకువెళ్లి నా దగ్గర సినిమా కథ వుంది, వినండి అని అడగడం రావివారికి సుతారం ఇష్టముండదు. అలా వెళితే వారు వినేవారు సరిగా వినరు. జడ్జిమెంట్ కూడా సరిగా చెప్పరు. కొంతమంది అడిగితే కథ చెప్పారు. అందరూ బాగుందన్నారు. కానీ ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రాలేదు. కె.వి.రావు అనే తరచుగా కలిసే ఓ మిత్రుడు ఓసారి ఓ వార్త చెప్పారు. బాపుగారు ఇపుడు ఏం చేస్తున్నారు అన్న రావివారి ప్రశ్నకు, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్‌తో ఓ చిత్రం తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని. అయితే కథ సరిగా కుదరలేదని తెలిసింది. వెంటనే రావి వారు ముళ్ళపూడి రమణని కలిశారు నాదగ్గరొక కథ ఉందంటూ. చెప్పమన్నారాయన. వినగానే చాలా బాగుందన్నారు. ఆయన వెళ్లి బాపుకు చెప్పారు. 15 రోజులపాటు కథపై చర్చలు జరిగాయి. మరికొంత ఫైన్‌గా రాసి ఇచ్చారాయన. మరో 15 రోజుల్లో సినిమా ‘పెళ్లిపుస్తకం’ సినిమా రూపొందించడానికి సిద్ధమైపోయారు అందరూ. మొదట పెళ్లిపుస్తకం అనే పేరు లేదు. ఆరుద్ర రాసిన పాటలో వచ్చిన మాటే పెళ్లిపుస్తకం. ఆ మాట బాగుండడంతో అదే సినిమాకు టైటిల్‌గా నిర్ణయించారు బాపు రమణ. ఆ సినిమా ఎంత విజయవంతమైందో తెలిసిందే. ఆ సంవత్సరం నంది అవార్డు ప్రకటించినపుడు పెళ్లిపుస్తకానికి ఉత్తమ కథ, ఉత్తమ మాటల రచయిత, ఉత్తమ దర్శకత్వం అవార్డులు వచ్చాయి. ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఆ అవార్డుల కార్యక్రమంలో రావికొండలరావు బాపు రమణల దగ్గరకెళ్లి, మీవల్లనే నాకీ అవార్డు వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తే, వారిద్దరూ కూడా అసలు మీరు కథ ఇవ్వకపోతే మాకీ మాటల రచయిత, దర్శకత్వపు అవార్డులు వచ్చేవా? మీకే మేము కృతజ్ఞతలు చెప్పాలని ఎదురుదాడి చేసినట్టుగా చెప్పారట. అది గుర్తుచేసుకుంటూ సాలోచనగా నవ్వుకున్నారు రావికొండలరావు.

-సరయు శేఖర్, 9676247000