సబ్ ఫీచర్

పత్రికలు ప్రజల గొంతుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రికల్లో, టీవీ చానళ్లలో, ఇతర ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు కానీ పోస్టింగులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను తప్పు పట్టేలా ఉండకూడదట. అలావుంటే మీడియాపై కేసులు పెడతారట. ప్రాసిక్యూట్ చేసి శిక్షలు కూడా విధిస్తారట. ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో సారాంశం. ఇలా ప్రజాస్వామిక మీడియాను కట్టడి చేయాలని, అణచి వేయాలని, పాదాక్రాంతం చేసుకోవాలనీ ఉవ్విళ్ళూరే ప్రభుత్వాధినేతల ఆశలకు ఇలాంటి జీవోలు చివరికి అడియాసలనే మిగులుస్తాయి. దేశంలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ పత్రికలపై ‘అప్రకటిత’ యుద్ధాన్నో, ప్రకటిత యుద్ధాన్నో ప్రకటించడం ప్రభుత్వాధీశులకు కొత్తేమీ కాదు. అలనాడు ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ, బీహార్‌లో జగన్నాథ మిశ్రా, రాజస్థాన్‌లో వసుంధరా రాజె, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మీడియాపై ఏదో ఒక రూపంలో కత్తులు దూసినవారే.
ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థను నాలుగో మూలస్తంభం (్ఫర్త్ ఎస్టేట్)గా చెబుతూనే, అక్షరాలను బోనెక్కించే రాజనీతిజ్ఞతను గతంలో చాలామంది ప్రభుత్వాధినేతలు ప్రదర్శించారు. నియంతల కాలం నాటి పద్ధతులను అమలు చేసేందుకు సాహసించారు. వీరికి అక్షరాలంటే ఎందుకంత ఉలుకు? దమ్మున్న అక్షరాల్ని చూస్తే ఎందుకు జడుపు? ఏవి ఆధార వార్తలు? ఏవి నిరాధార వార్తలు? ఏవి నిజమైన కథనాలు? ఏవి అసత్య కథనాలు? వీటిని ఎవరు నిర్ణయించాలి? పాలకులా? పాలితులా? ఉదాహరణకు- భవన నిర్మాణ రంగ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ఆత్మహత్యకు ఇసుక రద్దు పాలసీ కారణమైతే, పత్రికలో రాయకూడదా? బాధితులు వాపోతున్నా, వారి తరఫున ప్రశ్నించకూడదా? రక్షక భట నిలయంలో రక్షకులే అమాయకున్ని భక్షిస్తే, ఆ బాధ్యత రక్షకులదే అని అనకూడదా? బాధితుల పక్షాన నిలవకూడదా? రైతు కన్నీటి వ్యధనో, అణగారిన కులాల వ్యధనో, అందుకు కారణమైన ప్రభుత్వ పెద్దనో ప్రజలముందు పెట్టకూడదా? అన్యాయం జరిగినోళ్ళు, అక్రమాలు చూసినోళ్ళు వారి ఆవేదనల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టింగుల రూపంలో తమ ఆవేదన వినిపించకూడదా? ఐతే, సదరు ప్రభుత్వం ఏమి చేసినా, ఏ పాలసీ ప్రకటించినా ‘శభాష్’ అంటూ తోకలూపాలా? అధికారిక పత్రికలా మీడియా వంత పాడాలా? ప్రభుత్వం చెప్పే అసత్యాల నియంత్రణకు రాజ్యాంగ, రాజ్యాంగేతర సంస్థలు ఏవీ లేవా? ప్రెస్ కౌన్సిళ్ళు, మానవ హక్కుల కమిషన్లు, పరువు నష్టం దావాలు, చీటింగ్ కేసులు ఈ పరిధిలోనివి కావా? అలాంటి సందర్భాలలో కేసులు వేయలేదా? ఐనా కొత్త ఉత్తర్వులు ఎందుకు? దీని వెనుక చిదంబర రహస్యం ఏమిటి?
ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాల్ని ప్రజల పక్షాన ప్రశ్నించటం పత్రికల ప్రాథమిక హక్కు. ఈ హక్కును కాపాడాల్సిందిపోయి కాలరాయాలనుకోవటం హిట్లరిజం. ఇలాంటి పోకడలకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇటీవల వేదికలయ్యాయి. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం, ఏపిలో జగన్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ప్రయత్నాలను ప్రారంభించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కెసిఆర్ రెండు చానళ్ళను నియంత్రిస్తే, ఇటీవల జగన్ ఏపిలో రెండు చానళ్ళపై వేటు వేశారు. ఉమ్మడి ఏపిలో వైఎస్ కొన్ని పత్రికలను ప్రజలకు దూరం చేయాలని చూశారు. ఎంతోమంది రాజకీయ పార్టీలు పత్రికలను, టీవీ చానళ్లను నడుపుతున్నాయి. తాజాగా పాలకులు పత్రికలమధ్య, చానళ్ళమధ్య, పాత్రికేయుల మధ్య చీలికలు కూడా తెచ్చారు. అనారోగ్యకర పోటీతోనే పాత్రికేయ వ్యవస్థకు పగుళ్లొచ్చాయి. తాజా జివోపై అక్షర యోధులు కొందరు సన్నాయి నొక్కులు నొక్కటానికి కారణం ఇదే. అధికార లాంఛనాలతో అధికార పార్టీ గొంతుక వినిపించేదీ ఇందుకే. ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలు ప్రభుత్వాల పనితీరుల్లోని తప్పొప్పులను నిర్ణయిస్తారో, వారే పత్రికల్లోని తప్పొప్పులనూ నిర్ణయిస్తారు. నిరాధార వార్తల్ని తిరస్కరిస్తారు. ఆధార సహితంగా వార్తలను అందించే పత్రికల్ని ఆదరిస్తారు. పత్రికలంటే ప్రజల వాణి. ప్రజల గొంతులే పత్రికలు. ప్రజలు ప్రశ్నించినంతకాలం పత్రికలు ప్రశ్నిస్తాయి. ప్రజలు ప్రభుత్వాలను హర్షించినంతకాలం పత్రికలు హర్షిస్తాయి. ఈ సత్యం వీడి అక్షరాల్ని చిదిమిపెట్టాలనుకుంటే అవి గోడకు కొట్టిన బంతుల్లా లేస్తాయి. ప్రజల ఏజెండాలను జెండాలుగా మోస్తాయి. ప్రభుత్వాలను గద్దెలనుండి కిందకు దింపి ప్రజలకు నచ్చిన ప్రభుత్వాలను అధికార పీఠంపైకి ఎక్కిస్తాయి. అక్షరాలకు అందలం ఎక్కించడం తెలుసు.. ఆంక్షల సంకెళ్లను తెంచుకోవడమూ తెలుసు..

-పోతుల బాలకోటయ్య 98497 92124