సబ్ ఫీచర్

మాట్లాడటం గొప్ప కళ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట వీపుకి చేటు చేయగలదని ఒక సామెత. ఇరుగు పొరుగువారితో, బంధువులతో ఆఫీస్‌లో పనులు చక్కబెట్టాలి అన్నా, నలుగురితో మెప్పు పొందాలి అన్నా మాట ముఖ్యం. మాటలు ఎప్పుడు కోటలు దాటకూడదు. దానివలన మనల్ని కోతల రాయుడు(రాలు) అంటారు తప్ప సీరియస్‌గా మనల్ని పట్టించుకోరు. అలాగే చాలామంది ముక్కుసూటిగా మాట్లాడతాము అని అనుకొని ఎదుటివారి మొహంమీదనే కర్కశంగా చెప్పేస్తుంటారు. అలా కూడా మంచిది కాదు. మాట్లాడటం రాదు వీరికి అని నిర్ణయించి వారు ఎప్పుడైనా ఎదురైతే పక్కకి తొలగిపోతారు.
మాట్లాడటం ఒక చక్కని కళ. కొంతమంది గంటలకొద్దీ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడుతుంటే, వీళ్ళు మనల్ని ఎప్పుడు వదలిపెడతారా అని అనుకుంటాం. సందర్భోచితంగా నలుగురికీ నచ్చేటట్లు ముచ్చటగా మాట్లాడటం నిజంగా ఒక కళ. మరికొంతమంది, తమకు తెలిసినది, మళ్లీ మళ్లీ ఎక్కడ పడితే అక్కడ, మాట్లాడేవాడికి అంతరాయం కలిగించి కూడా మాట్లాడుతుంటారు. అది కూడా సరికాదు..
ఇక సంభాషణలలో చాలా రకాలు ఉన్నాయి. హితభాషణం, మితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం- ఇలా చాలావిధాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే మనిషి వద్ద వుంటే అతని చెంతనే మనకు ఉండాలనిపిస్తుంది. హితభాషణం అన్నిటిలోకి చాలా కష్టమైన విధానం. అవతలివాడికి హితం చెప్పటం. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే, సలహాలు ఎవరూ సంతోషంగా స్వీకరించరు, ఎవరికైతే అవి అవసరమో, వారు తిరస్కరిస్తారు. మితభాషణం, క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో, అంతవరకే మాట్లాడటం మితభాషణం. అనవసరంగా, అతిగా మాట్లాడితే అపార్థాలు రావటానికి చాలా అవకాశాలు వున్నాయి. అందువల్ల బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకోవాలి. స్మితభాషణం మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడటం స్మితభాషణం. పళ్ళు కనపడకుండా నవ్వటమే ‘స్మితం’. అలా ఏ విషయాన్నయినా కూడా నవ్వుతూ చెప్పగలగాలి. ప్రియభాషణం, ప్రియభాషణలో కొన్ని అసత్యాలు ఉండే అవకాశంవుంది. అయితే కొన్ని సందర్భాల్లో అవి చాలా తప్పనిసరి. ఇతరుల మనసు బాధపెట్టకుండా ప్రియంగా మాట్లాడటం చాలా కష్టమైన పని. ఒక్కోసారి అవతలివారికి తెలిసిపోయే ప్రమాదం కూడా వుంది.
పూర్వభాషణం, దీనికి చక్కని సంస్కారం అవసరం. అవతలి మనిషితో ముందుగా మనమే మాట్లాడటమే పూర్వభాషణం. అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా, చిన్నవాడా అని చూడకుండా పలకరించటం చాలా గొప్ప సుగుణం. సంభాషణం ఒక గొప్ప భూషణం, ఎందుకంటే సంభాషణ బాగోలేకపోతే కింద పేర్కొన్న విధంగా మనం దేన్నైనా కోల్పోవచ్చు.
కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం. ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం. అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిస్తాం, స్నేహితులను కోల్పోతాం. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం. అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం. ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కాపాడుకుంటాం.
మాటలలో చాలా రకాలుంటాయి. మంచి మాటలు, చెడు మాటలు. చెడు మాటలు నాలుగు విధాలుగా ఉంటాయి. పారుష్యం అనగా కఠింనగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు. అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించినవారితో సమానమని వేదోక్తి. పైశున్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి. ఇతరులనుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి వుంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు. అసందర్భ ప్రలాపం, పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచి తూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్థంగా మాట్లాడకూడదు. ఎడతెగకుండా మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపుడుతుంది. ఇక చాలామంది మాట్లాడుతూ పోతూనే వుంటారు. ఎదుటివారు ఏమి చెప్పాలి అనుకుంటున్నది అస్సలు వినరు. తాము చెప్పిందే వేదం అనుకుంటారు. ఇలా ఎప్పుడూ చేయరాదు. ఎదుటివారు ఏమి చెప్తున్నారో కూడా వినరు. ఏదో పని ఉన్నట్టుగా బడబడా మాట్లాడేసి వెళ్లిపోతారు.
మాట లేకుంటే చోటే లేదన్నది ఓ సామెత. ఆ చోటన్నది ఊళ్లో అయినా.. ఎదుటివాళ్ల గుండెల్లోనైనా! మనిషి సంగతి చెప్పేది మాటే. ఉపాధ్యాయులనుంచి రాజకీయ నాయకుల వరకూ, సాహితీ ఉపన్యాసకులనుంచి కార్పొరేట్ బృంద నాయకులవరకూ ఏ రంగంలోనివారైనా సరే గెలవాలంటే ప్రసంగ కళమీద పట్టు సాధించాల్సిందే.
సంభాషించడం ఒక అందమైన కళ. మన సంభాషణ ఆసక్తికరంగా ఉంటేనే ఎదుటివారు మనతో సంభాషించటానికి ఇష్టపడతారు. లేదంటే మనతో సంబంధాన్ని, స్నేహాన్ని తుంచేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజూ మీరు మీతో మాట్లాడుతూ మీరు చేసే పనులను, ఫలితాలను చర్చించుకుంటూ మిమ్మల్ని మీరు బాగా తెలుసుకున్నపుడే ఎదుటివారితో బాగా సంబంధ బాంధవ్యాలని కొనసాగించగలరు.

-పుష్యమీ సాగర్ 9010350317