సబ్ ఫీచర్

పాత్రికేయ విలువలకు దర్పణం.. గాంధీజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మంచి వార్తాపత్రిక అంటే ఒక జాతి తనతో తాను మాట్లాడుకోవడమే’’ అంటారు ఆర్థర్ మిల్లర్. ఇందుకు చక్కని ఉదాహరణ మహాత్మా గాంధీ. ఆయన ఒక పాత్రికేయునిగా ఎలా సమాజంతో మాట్లాడుతూ ఉండేవారో అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. లండన్, దక్షిణాఫ్రికా, భారత్‌లలో ఎక్కడైనా, ఎప్పుడైనా గాంధీ పూర్తిస్థాయి పాత్రికేయునిగా జీవించారు. భారత స్వతంత్ర ఉద్యమ నాయకుడి కన్నా పాత్రికేయునిగా ఆయనకు వున్న అనుభవం ఇరవై ఏళ్ళు ఎక్కువ. గాంధీ 19 ఏళ్ల వయసులో ఉన్నత చదువులకై లండన్ వెళ్లినపుడు, అక్కడ పత్రికలను చూసి వాటి క్రియాశీల పాత్రకు ఆశ్చర్యపోయాడు. అక్కడ ‘వెజిటేరియన్’ పత్రికలో మూడేళ్ల కాలంలో 9 వ్యాసాలను ప్రచురించగలిగాడు. ఇవన్నీ ఆహారపు అలవాట్లు, భారతీయ సంప్రదాయ వంటకాలు, పండుగలు, పిండివంటలు మొదలైన వాటి గురించి రాసినవి.
పత్రికలతో గాంధీ ప్రయాణం దక్షిణాఫ్రికాలో ‘బోయర్ యుద్ధ’ సమయంలో భారత స్వయం సేవకుల బృందం నాయకుడిగా ఉండగా, యుద్ధ విలేకరిగా పనిచేయడంతో ప్రారంభమైంది. ఆ తరువాత బ్రిటీష్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ లేఖలు, వ్యాసాలు రాశారు. ప్రవాస భారతీయుల సమస్యలపై మొదలుపెట్టిన పోరాటం ఉద్యమ స్థాయికి వెళ్ళడంతో జూన్ 4, 1903న ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికను ‘నాటల్’ అనే పట్టణంలో ఆయన ప్రారంభించాడు. ఆయన తొలి సంపాదకీయం ‘మనం’ (అవర్ సెల్ఫ్స్). ‘ద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కొనే ప్రయత్నమే సత్యాగ్రహం’ అంటూ గ్రీన్ డాక్యుమెంట్- హరిత పత్రం-ను వెలువరించాడు. దీని మొదటి పేజీ రంగు ఆకుపచ్చ కావడంతో దానికి ఆ పేరు వచ్చింది. అప్పట్లో ఇంగ్లీషు, గుజరాతీ, తమిళ భాషల్లో వచ్చిన ఈ పత్రిక కోసం గాంధీజీ వ్యాసాలను రాస్తూ, తాను సంపాదించిన డబ్బును పత్రిక నిర్వహణ ఖర్చులకు వెచ్చించారు. చేతితో ‘బ్లాకుల’ను సర్దుకుంటూ ముద్రించే ప్రెస్‌లో గంటల తరబడి గాంధీ శ్రమించేవారని పోలక్ అనే సహచరుడు చెప్పేవారు. సహాయకులు, సేవకులు లేకున్నా సుమారు 11 ఏళ్లపాటు గాంధీజీ ఈ పత్రికను నిర్వహించారు. ప్రజాహక్కులు, పరిసరాల పరిశుభ్రత, పౌరుల బాధ్యత, వ్యక్తిగత క్రమశిక్షణ వంటి విషయాల్ని ప్రస్తావిస్తూ రాజకీయాలకు అతీతంగా వ్యాసాలు వ్రాసేవారు. ఆ వ్యాసాలను గోఖలే, దాదాభాయి నౌరోజీ, టాల్‌స్టాయ్ వంటి ప్రముఖులు ఎంతో ఆసక్తిగా చదివేవారట.
1916లో తన రెండవ కుమారుడు మణిలాల్‌ను పోలక్ వద్ద సహాయకునిగా పంపి ఇండియన్ ఒపీనియన్ పత్రికకు గాంధీ తన వంతు సాయం చేశాడు. మణిలాల్‌కు రాసిన ఉత్తరంలో- ‘ఎప్పుడూ సత్యాన్ని అనే్వషించు. అందుకు సహనాన్ని చూపించు. ఎవరిపట్లా దురుసుగా ప్రవర్తించకు. కోపానికి బానిస కావద్దు. పత్రికలో భాష సరళంగా, సున్నితంగా ఉండాలి. ఎప్పుడైనా తప్పులు రాస్తే క్షమించమని అడగడానికి వెనుదీయకు’ అని గాంధీ పేర్కొన్నారు. పాఠకుల హృదయాల్లోకి నేరుగా సత్యాలను వ్యాపింపజేయడానికి పత్రికలే సరైన మార్గమని ఆయన నమ్మారు.
1919 నుంచి 1931 వరకు ‘యంగ్ ఇండియా’, 1919 నుంచి 1947 వరకు ‘నవజీవన్’ పత్రికలను తన క్రియాశీలక కార్యక్రమాలను వివరిస్తూ సమర్థవంతంగా గాంధీ నిర్వహించారు. 1933లో ‘హరిజన్’ పత్రికను నెలకొల్పారు. ఆయన దృష్టిలో పత్రికా విలేకరి బాధ్యత అంటే- స్వరూప స్వభావాలలో మానవ నైజాన్ని అతి దగ్గరగా పరిశీలించి అధ్యయనం చేయడమే. తన స్వీయ చరిత్రలో పత్రికలను నడపడంలో తన లక్ష్యాలను ఇలా రాసుకున్నారు. అవి.. 1.ప్రజల భావాలను అర్థం చేసుకోవడం, వాటికి అక్షరరూపం ఇవ్వడం. 2.అవసరమైన కొన్ని ఆలోచనలను ప్రజలలో అంకురించేలా చేయడం 3. సమాజంలో, ప్రభుత్వ విధానాలలో లోపాలను ఎత్తిచూపించడం. ప్రజల కోసం పోరాడడంలో, ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో పత్రికలను చిత్తశుద్ధితో నడిపినట్టు గాంధీ జీవితాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.
బిహార్‌లో నీలిమందు రైతులు ‘చంపారన్’లో ప్రభుత్వ దోపిడీకి గురవుతున్న సంగతి తెలుసుకున్నపుడు గాంధీజీ అక్కడకువెళ్లి, పాత్రికేయ నైపుణ్యంతో అక్కడి సంఘటనలను ఉటంకిస్తూ పరిశోధనాత్మకమైన నివేదికను తయారుచేశారు. ‘యంగ్ ఇండియా’, ‘నవజీవన్’ పత్రికల్లో సమకాలీన సాం ఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యాసాలను, నివేదికలను ప్రజలకు అం దించేవారు. వార్తాకథనాలను సైతం రాసేవారు. 1921లో మొదటి సత్యాగ్రహం, 1919 నుంచి 1924 వరకు ఖిలాఫత్ ఉద్యమం, 1924లో గాంధీ అరెస్టు, హిందూ ముస్లింల మధ్య సంబంధాలు, 1930లో దండి సత్యాగ్రహం, 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, గాంధీజీ ఐరోపా పర్యటన.. ఇలాంటి ఎన్నో విషయాలు అపుడు పత్రికల్లో బహుళ ప్రాచుర్యంలో వుండేవి. వీటితో వ్యాపార ప్రకటనలను గాంధీజీ ఎప్పుడూ అనుమతించలేదు.
1910లో ‘పత్రిక చట్టం’ సవరించవలసినదిగా గాంధీ చేసిన పోరు పాత్రికేయ రంగంలో ప్రత్యేకమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ‘ప్రభుత్వం తన ఉనికి కోసం ఈ చట్టాన్ని సవరించాలి’ అని చెప్తూ, న్యాయం, సత్యం వంటి విలువలను కాపాడడానికి ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చేయాలన్నారు. హరిజన్, హరిజన బంధు, హరిజన సేవక్ పేర్లతో ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ భాషల్లో వెలువరిచిన పత్రికల్లో అంటరానితనం, గ్రామీణ పేదరికం సమస్యలపై ఆయన పోరాటం చేశారు. సత్యం కోసం దేనినైనా ఎదిరించే గాంధీ తత్త్వం పాఠకులను అబ్బురపరచేది. ఆయన ఏ దేశంలో ఉన్నా వ్యాసం గాని, సంపాదకీయం గాని పత్రికకు పంపడంలో ఆలస్యం జరిగేది కాదు. కుడిచేతికి నొప్పి పుట్టినపుడు ఎడమ చేతితో రాసేవాడు. ఆయన ఎడమ చేతితో రాస్తే చదవడానికి ఎక్కువ అనుకూలంగా వుండేది. జబ్బు చేసినపుడు సైతం వారానికి నాలుగు వ్యాసాలు రాసేవారు. ఎలాంటి లాభాలనూ ఆశించని పాత్రికేయత గాంధీ లక్షణం. పత్రికను నడపడం జీవనభృతి కోసం కాక, ప్రజల కోసం చేసే సేవగా, బాధ్యతగా భావించేవారు. ‘ప్రజా సంక్షేమం కోసం నడిపే పత్రిక నుంచి జీవన భృతిని ఆశించడం పెద్ద నేరం’ అనేవారాయన. పత్రికలు ప్రాథమికంగా ప్రజలను విద్యావంతులుగా చేసి, నడుస్తున్న చరిత్రతో మమేకం చేయాలని నమ్మిన మనిషి గాంధీజీ.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చెలరేగిన మతకలహాల నేపథ్యంలో ‘ఒక రాత్రి- ఒక గ్రామం’ నినాదంతో ఆయన నొక్కాలి పట్టణం (తూర్పు బెంగాల్), బీహార్, మద్రాసు, పళని, శ్రీనగర్-జమ్మూ, సిమ్లా ప్రాంతాల్లో శాంతియాత్రలు చేశారు. లాహోరు, రావల్పిండి పర్యటనలకు, ఢిల్లీ, డెహ్రాడూన్‌లలో జీవిత చరమాంకంలో రైలులో మూడవ శ్రేణిలోనే ఆయన ప్రయాణించారు. పర్యటనల్లో ఉన్నా సంపాదకీయాలు, వార్తాకథనాలు రాయడం ఆయన హృదయానికి దగ్గరైన పని. పత్రికలను గురించి గాంధీజీ ఒక ఉపన్యాసంలో-‘వార్తాపత్రికలను ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఇందులో ఉన్న శక్తిని విద్రోహ కలాపాలకు వాడినప్పుడు అది నేరమే. బాధ్యతను నిర్వర్తించడానికి సత్యానే్వషణ, సహనం చాలా ముఖ్యం’ అన్నారు.
సంచలన వార్తా కథనాల పట్ల గాంధీ తన నిరసనను తెలియజేసేవారు. మత విద్వేషాలను ప్రేరేపించేలా వార్తలు రాయకూడదని అనేవారు. 28మే, 1931న ‘యంగ్ ఇండియా’ సంచికలో ‘విషపూరిత వార్తాకథనం’ పేరిట వ్యాసం రాశారు గాంధీజీ. ‘వర్గ విభేదాలను పెంచే అవాస్తవాలను, రాజకీయ హింసను ప్రేరేపించే వ్యాసాలను నేను హత్యా కథనాలుగానే పరిగణిస్తాను. ఇలాంటివి ప్రచురిస్తే సమాజంపై తీవ్ర ప్రభావం వుంటుంది. దీన్ని ప్రోత్సహించకూడదు. విలేకరులకు నియంత్రణ, క్రమశిక్షణ అవసరం’ అని రాశారు. గాంధీజీ రచనలను ప్రజాహిత జర్నలిజం, శాంతికాముక జర్నలిజం, పురోగమన జర్నలిజం, నైతిక విలువలున్న జర్నలిజం అని మేధావులు భావిస్తారు. ‘ప్రజాస్వామ్యం సరిగ్గా పనిచేయాలంటే కావలసినది విషయ పరిజ్ఞానమొక్కటే కాదు, వౌలికమైన విజ్ఞానం అవసరం. పత్రికలు ప్రజలను ఎరుకగల వారిగా చేయాలి తప్ప దుష్ప్రభావాలకు లోను చేయకూడదు. పత్రికా విలేకరి ఏ వార్తను ప్రచురించాలి, ఏది ప్రచురించరాదు అనే విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలనేవారు. పాత్రికేయునిగా గాంధీ అనుసరించిన సూత్రాలు- నిబద్ధత, నిజాయితీ. ఈ రెండూ ఆయన ముందడుగుకు ఆనవాళ్ళు.

-కాళ్ళకూరి శైలజ 98854 01882