సబ్ ఫీచర్

మావోల పసలేని నినాదం మరోసారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝార్ఖండ్ శాసనసభకు ఈనెల 30 నుంచి వచ్చే నెల 20 వరకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. లతేహార్ జిల్లాలో భాజపా అగ్రనేత నడ్డా ఎన్నికల సభ ముగిశాక, పోలీసుల గస్తీ వాహనంపై మావోలు మెరుపు దాడి చేసి ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ సహా నలుగురు పోలీసులను హతమార్చారు. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో హోం మంత్రి అమిత్‌షా అదే రోజు ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న మావోయిస్టు గ్రూపును గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. ‘మధ్య జోనల్ కమిటీ’ పేర మావోలు కొన్ని కరపత్రాలను వదిలివెళ్ళారని, అందులో ఎన్నికల్ని బహిష్కరించాలన్న నినాదాలున్నాయని తెలుస్తోంది. రవీంద్ర గంజు అనే మావోయిస్టు నాయకుడు దాడిలో పాల్గొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై ప్రభుత్వం ఇప్పటికే రూ.15 లక్షల రివార్డును ప్రకటించింది. అతని భార్య కొన్ని నెలల క్రితం అరెస్టు అయ్యారని, వారి ఆస్తిని జప్తు చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. లత్‌హోర్ జిల్లా ఛంద్వా అటవీ ప్రాంతంలో మావోల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజున పలాము జిల్లా పిప్రాబజార్ ప్రాంతంలో మావోలు ఏకే 47 తుపాకీతో మోహన్ గుప్తా అనే మాజీ మావోయిస్టును ఇన్‌ఫార్మర్ నెపంతో చంపేశారు. దీంతో ఎన్నికల కమిషన్ స్పందించి ఐపీఎస్ అధికారి మృణాల్ కాంతిదాస్‌ను ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది. స్థానిక పోలీసుల సహాయంతో ఆయన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తారు. ఎన్నికలు సజావుగా కొనసాగేలా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ప్రతి ఎన్నికల సందర్భంగా బీభత్సం సృష్టించి వార్తల్లోకి ఎక్కుతున్నట్టుగానే ఈసారి కూడా మావోలు శాంతిభద్రతల్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నారు. వీరి దాడుల వల్ల ప్రాణనష్టం, విధ్వంసం తప్ప ఒరిగేదేమీ కనిపించడంలేదు.
చైనా నాయకుడు మావో జెడాంగ్ రాజకీయ, మిలటరీ ఆలోచనలను, సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి గెరిల్లా యుద్ధం ద్వారా ఈ రాజ్యాన్ని -ప్రభుత్వాన్ని కూల్చి ‘అధికారం’ చేపట్టాలన్నది మావోల కల. దశాబ్దాలుగా ఈ కలగంటున్నా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే వుంది. అయినప్పటికీ ఝార్ఖండ్‌లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి, కరపత్రాలు, పోస్టర్లు పంచి, తుపాకీ గుళ్లు కురిపిస్తున్నా పోలింగ్‌కు ఏర్పాట్లు సజావుగా కొనసాగుతూ ఉన్నాయి.
24 గంటల వ్యవధిలో రెండు చోట్ల ఏకే 47 తుపాకులతో విరుచుకుపడి అరడజను మందిని తూటాలకు బలిచ్చినా మావోల నూతన ప్రజాస్వామిక విప్లవం వైపు ఓ అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ప్రధాని మోదీ భాజపా అభ్యర్థుల గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఝార్ఖండ్‌లో రఘుబీర్‌దాస్ ప్రభుత్వం మావోలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను హోం మంత్రి అమిత్ షా ఎన్నికల సభల్లో శ్లాఘించారు.
గత సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల సందర్భంగా మావోలు ఇలాగే విధ్వంసానికి పాల్పడి హింసకు తెగబడ్డారు. కొందరిని కాల్చి చంపారు. ఎంత బీభత్సం సృష్టించినా చివరికి ఏం జరిగిందో, ఎన్నికలు ఎలా సజావుగా ముగిసి కొత్త ప్రభుత్వాలు ఎలా కొలువుతీరాయో తెలిసిందే. ఎన్నికలను బహిష్కరించాలని విధ్వంసం సృష్టించి, పోలీసులను, పౌరులను కాల్చి చంపితే చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కూలిపోతుందా?
ఇస్లామిక్ తీవ్రవాదులతో చెట్టాపట్టాల్!
ఇటీవల కేరళలో జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం అక్కడి ‘వాతావరణం’ వేడెక్కింది. ఆ ఘటనలో నలుగురు మావోలు మరణించిన సంగతి, కీలక మావోయిస్టు నేత దీపక్ గాయపడి, తమిళనాడులో అరెస్టయిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో కేరళలో ఇద్దరు సీపీఎం కార్యకర్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మావోలకు సహకరిస్తున్నారనేది ఆరోపణ. కాగా, కోజికోడ్ జిల్లా సీపీఎం నాయకుడు పి.మోహనన్ మావోలపై సంచలన ఆరోపణలు గుప్పించాడు. కేరళలోని ఇస్లామిక్ తీవ్రవాదుల నుంచి, వారి సంస్థల నుంచి మావోలు మద్దతు తీసుకుంటున్నారని, మావోలు- ఇస్లామిక్ తీవ్రవాదులు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు. దీంతో కేరళ రాజకీయం మరింత వేడెక్కింది. కేరళలో మావోయిస్టుల బలం-శక్తి అంతా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలేనని ఆయన బాహాటంగా ప్రకటించారు. మావోలు ప్రజాసంఘాల ముసుగులో పనిచేస్తున్నారని, వారికి ఇస్లామిక్ తీవ్రవాదుల నుంచి సహకారం, ఆర్థిక వనరులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సీపీఐ ఖండించడం గమనార్హం.
కేరళ పోలీసులు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఒక నివేదికను సమర్పించారు. మావోలు నాలుగు గెరిల్లాల దళాలను- నందుకుని, భవాని, సిరువాని, కబాని పేర్లతో నిర్వహిస్తున్నారని, కబాని దళాన్ని తిరిగి రెండుగా విభజించి పనిచేస్తున్నారని, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ఇవి అంతర్భాగమని పశ్చిమ కనుమల స్పెషల్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ దళాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
బిహార్‌లోని ఖైరా పోలీసుస్టేషన్ పరిధిలోని తారాతాండ్‌లో రవియాదవ్ (35) అనే మావోయిస్టును గ్రామస్థులు, కొందరు అనుమానితులు ఇటీవల కొట్టి చంపారు. చర్ఖాపత్తర్‌కు చెందిన రవియాదవ్ గతంలో మావోలతో కలిసి పనిచేశాడు. 2016లో బెయిల్‌పై విడుదలైన అతడిని ప్రత్యర్థులు హతమార్చి ఉంటారని పోలీసులు అంటున్నారు.
మావోలకు పట్టున్న ఛత్తీస్‌గఢ్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ సరిహద్దులోని దంతెవాడ అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పనిలో నిమగ్నమైన తొమ్మిది వాహనాలను మావోలు దగ్ధం చేశారు. నారాయణ్‌పూర్ జిల్లాలో రోడ్డు పనులు జరుగుతుండగా ఐదు వాహనాలను బుగ్గిచేశారు. ఒక కార్మికుడి మోటారు సైకిల్‌ను సైతం దగ్ధం చేశారు. సుకుమా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మండపారో అడవుల్లో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోలు ఇక్కడ డ్రోన్లు ఉపయోగిస్తున్న సమాచారం బహిర్గతమైంది.
హాంకాంగ్‌లో...
చైనా కమ్యూనిస్టు వ్యవహారాలను నిరసిస్తూ పూర్తిప్రజాస్వామ్యం కోసం హాంకాంగ్ ప్రజలు కొన్నినెలలుగా వీరోచిత పోరాటం చేస్తున్నారు. లక్షలాది మంది వీధుల్లోకొచ్చి పోలీసులతో, సైనికులతో తలపడుతున్నారు. ఇటీవల ఒకరిద్దరు అమరులయ్యారు. చైనా ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచేసేందుకు సిద్ధపడగా అమెరికా అధ్యక్షుడు అడ్డుకున్నారని వార్తలొచ్చాయి.
ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మాన్యత, మనుగడ ఉంటే, చైనాలోనూ ‘గుట్టు’గా ప్రజాస్వామ్య వీచికలు వీస్తుంటే ఇక్కడ భారతదేశంలో ఆ పద్ధతిలో, ప్రజాస్వామ్య విధానంగా ఎన్నికలు జరుగుతుంటే మావోయిస్టులు వ్యతిరేకిస్తూ, ప్రాణాలు తీస్తే, విధ్వంసం సృష్టిస్తే అదెలా సమకాలీన రాజకీయ పరిజ్ఞానం అవుతుంది? అదెలా ప్రజల మనోభావాలను గౌరవించినట్టవుతుంది? తాము పట్టిన కుందేలుకు మూడు కాళ్లుకాదు, నాలుగో కాలు ఉందని మావోలు ఎప్పుడు తెలుసుకుంటారో?

-వుప్పల నరసింహం 99857 81799