సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్యాన యోగం
ప్రార్థన నిన్ను దైవ పాదాల సన్నిధికి చేరుస్తుంది. కాని ధ్యానమో? దేవదేవునే నీవద్దకు దిగివచ్చేలా చేస్తుంది. నిన్ను ఆయన స్థాయికి తీసుకొని వెళ్లగలుగుతుంది. దైవం, నీవూ ఒక స్థాయికి వచ్చేలా, ఒకరు కిందికి మరొకరు పైకి రాకుండా- సమస్థితి కల్పిస్తుంది. బంధనాల నుండి ముక్తి సాధించుకొనే రాచమార్గం ధ్యానం. ప్రార్థనవల్ల కూడా అదే ఫలితాన్ని సాధించుకోవచ్చు. ఇంద్రియ నిగ్రహం సాధించి, ఏకాగ్ర చిత్తాన్ని అవలంబించినప్పుడే ధ్యానం సాధ్యం. అందుకు నీ స్వామి దివ్య రూపానే్న అంతఃకరణలో నిరంతరం నీవు నిలుపుకోవాల్సి వుంటుంది.
నీ దేవుడూ, నా దేవుడూ...!
గులాబీ వెంటనే ముల్లుంటుంది. జీవితంలోనూ వొడిదుడుకులు వస్తాయి. తప్పదు. అయితే క్రమశిక్షణతో మెలిగేవారిని మాత్రం నిరాశ కుంగదీయలేదు.
అయితే వచ్చిన చిక్కల్లా యిక్కడే. జనానికి గులాబీలు కావాలి గానీ వాటికి ముళ్లుండరాదు! జీవితమంటే వారి భావనలో నిరాటంకంగా వనవిహారంలా సాగిపోయే ఇంద్రియ లోలత్వం! అలా జరక్కపోతే? చిర్రెత్తిపోయి, అందర్నీ నిందిస్తారు. ఎవరికివారు తమ స్వార్థం చూసుకొంటుంటే, యిక సమాజం ఎలా ముందుకుపోతుంది? బక్కవాడెలా బతగ్గలడు?
అన్నిటికీ మూలం ఈ ఆబ గుణమే! అది చాలక, తమలోతాము కల్పించుకొన్న తేడాలు దేవుడిక్కూడా తగిలిస్తారు. ‘నీ దేవుడు, నా దేవుడు కాడు! నా దేవుడు, నీ దేవుడు కాడు’- అంటూ.
యాత్రలు దేనికి?
బదరీనాథ్, కేదారనాథ్, హరిద్వార్ మొదలయిన క్షేత్రాలకు గుంపులు, గుంపులుగా యాత్రికులు వెళుతుంటారు. తిరుపతి, కాశీ యింకా అనేక చోట్లకు కూడా జనం అసంఖ్యాకంగా వెళుతుంటారు. ఎందుకు? శాంతి, సౌభాగ్యాలను కోరుకుంటూ వారీ యాత్రలు చేస్తుంటారు. అయితే తమలో కలిగే పాశవిక ప్రవృత్తులను వారు వదలివేయగలుగుతున్నారా? ఇదే వారి యాత్రలకు గీటురాయి. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఎంతో శ్రమకోర్చి, ఎంతో సమయాన్ని వెచ్చించి వారు చేస్తున్న యాత్రలు సఫలం కావాలంటే విషయ వాంఛలను అరికట్టాలి. పాశవిక ప్రవృత్తులను తొలగించుకోగలిగితే, దైవ సాన్నిధ్యానికి చేరుకోగలుగుతారు.
వౌనం
నిజాయితీగా నడచుకోదలచినవారు ముందు వౌనాన్ని పాటించాలి. భగవంతుని పిలుపు నీకు వినపడాలంటే ముందు నీవు మాట్లాడటం ఆపి, వినాలి. చుట్టూ చెలరేగే వాసనలనే తరంగాలను శాంతింపచేయాలి. అన్నివేపులా వీస్తున్న విషయ వ్యామోహం అన్న తుఫాను ఆగిపోవాలి. నీవు నెమ్మదిగా మాట్లాడుతుంటే ఎదుటివాడికి అరవాలని అనిపించదు. కనుక మృదువుగా, నెమ్మదిగా మాట్లాడు. శబ్దాన్ని వృధాచేయకు. అది ఆకాశంనుండి అంటే దేవునినుండి ఉద్భవించేది.
అయితే, ఈనాడు కొంతమంది వౌనవ్రతమును పాటిస్తున్నారు. కాని, వాళ్ళకు దీని అర్థం తెలియదు. వౌనమంటే ఏమిటి? వాక్బంధనమా? కాదు; మనోవాంఛలను నిలుపుటయే వౌనం. కొంతమంది వౌనం పాటించేటప్పుడు తమకు కావల్సినవన్నీ వ్రాసి చూపుతుంటారు. నోటితో పలికితే వ్రత భంగమవుతుందని వారి భయం. ఇవన్నీ వేషములే! మనస్సులో వాంఛలు నింపుకొని నోటికి తాళంవేస్తే అది రోగమే కాని యోగం కాదు. అటువంటి వాటివల్ల ఆధ్యాత్మికాభివృద్ధి లభించదు.
ఖాళీకానిదే...?
కప్పునిండా నీరు ఉండగా దానిలో పాలు పోయగలమా? ముందు నీరు తీసివేస్తేనే తర్వాత పాలు పోయవచ్చు. అట్లే, హృదయమనే ‘కప్పు’లో నుండి దుర్గుణాలను ముందు తీసివేస్తేనే తర్వాత సద్గుణాలను నింపుకోగలరు. దుర్గుణాలను హృదయంలో ఉంచుకొని దైవ ప్రేమను నింపుకోవాలంటే ఎలా సాధ్యం? రెండూ కావాలనుకుంటే అది జోడు గుఱ్ఱాల స్వారీగా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
అయస్కాంతం
నరుడూ, నారాయణుడూ ఇనుప ముక్క, అయస్కాంతముల వంటివారు. భగవంతుని స్వభావం భక్తుని ఆకర్షించి దగ్గరకు చేర్చుకోవడం. మనిషిలోని జీవాత్మ పరమాత్మేకదా!
అయస్కాంతం ఇనుపముక్కను ఆకర్షించలేకపోతే, దాని శక్తి తగ్గిందనుకుంటారు మీరు. ఒకవేళ ఇనుప ముక్క తుప్పుపట్టినా, ఆకర్షణ తగ్గుతుంది. అది గ్రహించు. భగవంతుడు తన్ననుగ్రహించలేదని మానవుడు మాధవుని తప్పుపడతాడు కాని ముందు తన మనసు తుప్పును వదిలించుకోవాలని తెలుసుకోడు.
ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.