సబ్ ఫీచర్

కళ్లకు కనిపించని ప్లాస్టిక్ కాలుష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్గాస్సో సముద్రం.. ఇది ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని ఒక ప్రాం తం. ప్రపంచంలోని మిగతా సముద్రాలకన్నా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే- ఏ దేశానికి చెందిన భూభాగమూ దీనికి తీరంగా ఉం డదు. అట్లాంటిక్ సముద్రంలో నాలుగు దిశల నుంచి వచ్చే ప్రవాహాలే సర్గాస్సో సముద్రానికి సరిహద్దులు. ఎడ్వర్డ్ జే-కార్పెంటర్ అనే ఆయన శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో మెరైన్ బయాలజిస్టుగా పనిచేశారు. ‘మెరైన్ మైక్రోబయాల్ ఎకోలజీ అండ్ ఫైటోప్లాంక్టన్’లో పరిశోధనలు చేశారు. పరిశోధనలో భాగంగా 1971లో సర్గాస్సో సముద్రంలో ఓడలో వెళ్తున్న ఎడ్వర్డ్ కార్పెంటర్ సముద్ర జలాలలో చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలు తేలియాడడం గమనించారు. అప్పటికే ఆయన తీర ప్రాంతానికి 550 మైళ్ళ దూరంగా సముద్రంలోకి వచ్చేశారు. చుట్టూ వందల మైళ్ళమేర సముద్రమే. అలాంటిది అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు తేలియాడుతున్నాయంటే సముద్రంలో ఇంకెన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయోనన్న ఆలోచన ఆయనను ఒక్కసారి దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎడ్వర్డ్ కార్పెంటర్ సముద్ర జలాలలో ప్లాస్టిక్ కాలుష్యం గురించి ప్రస్తావించి ఇప్పటికి దాదాపు ఏభై సంవత్సరాలు కావస్తోంది. మరి ఇనే్నళ్ళలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలాలలో ఎంత పెద్దమొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలిశాయో మన అంచనాలకు అందని విషయమే! ప్లాస్టిక్ కాలుష్యం అంటే ప్లాస్టిక్ సంచులు, సాఫ్ట్‌డ్రింక్ బాటిల్స్, మన కళ్ళకి కనిపించే ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలే గుర్తొస్తాయి. తీవ్రమైన ఎండ వేడిమికి కరిగి భూమిలోకి ఇంకిపోయే బాహ్యప్రదేశాలలోని ప్లాస్టిక్ వస్తువులు లేదా వ్యర్థాల గురించి గాని, గాలి దుమారంలో కొట్టుకువచ్చే ప్లాస్టిక్ పొడి (ఇది ప్లాస్టిక్ వస్తువుల అరుగుదల వల్ల వస్తుంది) గురించి గాని మనకి తెలియదు. ఇది మన కంటికి కనిపించని ప్లాస్టిక్ కాలుష్యమే. అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే మైక్రోప్లాస్టిక్, మైక్రోఫైబర్ వ్యర్థాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి గురించి ఇటీవల పర్యావరణ శాస్తవ్రేత్తలు పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల గురించి జరుగుతున్న పరిశోధనలు సముద్రాలలోనే కాదు, నదులు, సరస్సులు, భూమి పొరల్లోనే కాదు, చిన్నాపెద్దా జంతువుల శరీరాలలో కూడా ఈ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పర్యావరణ పరిశోధకులు అంటున్నారు. మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో వ్యాపించి ఊపిరి పీల్చినప్పుడు మనలోకి ప్రవేశిస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్ కాలుష్యం అంతటా వ్యాపించిందని టొరంటో విశ్వవిద్యాలయంలో మైక్రోప్లాస్టిక్ పరిశోధకురాలిగా పనిచేస్తున్న చెల్సియా రోచ్మన్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅవుతున్న ప్లాస్టిక్ ఉత్పత్తులలో 40 శాతం ఒకసారి వాడిపారేసే వస్తువులే (క్యారీ బ్యాగ్స్, స్ట్రాలు, డిస్పోజబుల్ గ్లాసులు మొదలైనవి) ఉంటున్నాయి. వీటినుండే మైక్రోప్లాస్టిక్, మైక్రోఫైబర్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఎంతగా విస్తరించిందంటే ఉత్తర ధ్రువం వద్ద గడ్డకట్టి ఉండే ఆర్కిటిక్ సముద్రంలోనూ వీటి అవశేషాలు ఉన్నాయి.
2015లో జరిపిన ఒక సర్వేలో తేలిందేమిటంటే బాహ్యప్రదేశాలలో డంప్ చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఒక్క శాతం మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే సముద్రాలలో కలుస్తున్నాయి. మిగతా 99శాతం మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు ఏమైపోతున్నట్లు? ఎక్కడ కలుస్తున్నట్లు?- అని మెలానీ బెర్గ్మాన్ ప్రశ్నిస్తున్నారు. ఈమె ఆల్ఫ్రెడ్ వెగెనార్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పోలార్ అండ్ మెరైన్ రీసెర్చ్‌లో మెరైన్ ఎకాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా మన కళ్లకు కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటి ప్రభావాన్ని గురించిన పరిశోధనలే ఎక్కువగా జరిగాయి. ఇప్పుడిప్పుడే మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల గురించి అధ్యయనాలు జరుగుతున్నాయి. అది కూడా సముద్రాలలోని ఉపరితల జలాలలోగల మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల గురించే. గడ్డకట్టిన ఆర్కిటిక్ సముద్రంపై కనుక దృష్టిసారించినట్లయితే వందనుండి వెయ్యిరెట్లు ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో మంచు కరగడం మొదలైతే ఆ వ్యర్థాలన్నీ బయటపడతాయన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్లాస్టిక్ కాలుష్యం పెరగడం వల్ల ఆ వ్యర్థాల నుండి వెలువడే విష రసాయనాలు పరిసరాలపై దుష్ప్రభావం చూపిస్తాయని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. మరో విషయంలో కూడా వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సుదీర్ఘకాలం అంటిపెట్టుకుని ఉండే బాక్టీరియా వల్ల కూడా హాని తప్పదు. ఈ వ్యర్థాలు ఏయే ప్రాంతాలకు (ముఖ్యంగా సముద్ర జలాల ద్వారా ఏ తీర ప్రాంతాలకు) వ్యాపిస్తాయో ఆ ప్రాంతాలకు బాక్టీరియా ద్వారా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయని అమెరికాలోని వుడ్స్ హోల్ వద్ద ‘సీ ఎడ్యుకేషన్ అసోసియేషన్’లో ఓషనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కారా లావెండర్‌లా అంటారు.
మొదటినుంచి శాస్తవ్రేత్తలు చెప్తున్నదేమిటంటే మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు నదీ జలాల ద్వారా సముద్రాలలో కలుస్తున్నాయని. అంటే నదులలోని స్వచ్ఛజలాలలో ఈ వ్యర్థాలు ఉన్నట్లే కదా! 2013 తరువాత సరస్సులలోని మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలపై కూడా దృష్టి పెట్టారు. నదులకు, జనసామాన్యానికి దూరంగా మలేసియాలోని పర్వతప్రాంత సరస్సులలో కూడా మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇక్కడి జలచరాల పొట్టలలో ఈ వ్యర్థాలను గుర్తించారు. ఓంటారియో (కెనడా)లోని వెస్టర్న్ యూనివర్సిటీలో పాట్రీసియా కోర్కోరన్ సెడిమెంటరీ జియాలజిస్టుగా పనిచేస్తున్నారు. సముద్రాలు, నదులు, సరస్సులలో ఏళ్ళతరబడి పేరుకుపోయిన మడ్డిని సేకరించి పరిశోధనలు చేసేవారు. కోర్కోరన్ పరిశోధనల్లో తేలిందేమిటంటే ఓంటారియోలోని సెయింట్ క్లెయిర్ సరస్సులో పెద్ద మొత్తంలో మైక్రోఫైబర్ వ్యర్థాలున్నాయని, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థజలాలు థేమ్స్, గ్రాండ్ నదుల ద్వారా ఈ సరస్సులో కలుస్తున్నాయని కోర్కోరన్ అంటారు.
భూమి పొరల్లో..
సముద్రాలు, నదులు, సరస్సులలోనే కాదు భూమిపొరల్లో, వ్యవసాయ క్షేత్రాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. భూముల్లో సారం పెంచేందుకు రైతులు వేరేచోట నుండి తెచ్చిన బురదను శుద్ధిచేసి కలుపుతారు. దీనివల్ల భూసారం పెరుగుతుంది. ఇలా తెచ్చిన బురదలో లెక్కలేనన్ని మైక్రోఫైబర్ వ్యర్థాలు ఉంటాయి. భూసారం పెంచేందుకు వేరే ప్రాంతం నుంచి తెచ్చిన బురదను ఉపయోగించడంవల్ల ఐరోపా, ఉత్తర అమెరికాలోని భూముల్లో ఏటా లక్షల సంఖ్యలో మైక్రోఫైబర్ వ్యర్థాలు చేరుతున్నాయని, ఇవి బయోడిగ్రేడబుల్ కానందువల్ల ఎనే్నళ్ళయినా అలాగే భూమిలో కలిసిపోకుండా ఉండిపోతాయనీ నార్వేజియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వాటర్ రీసెర్చ్‌లో రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్న లూకా నిజేట్టో అంటారు. ఎండలు బాగా కాసేటప్పుడు భూమిలో తేమని నిలుపుకునేందుకు పాత ప్లాస్టిక్ పట్టాలను కప్పి ఉంచుతారు. వీటి ద్వారా, ఇంకా అనేక విధాలుగా వ్యవసాయ భూములలో మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. 2014లో ఒక అధ్యయనం ప్రకారం చైనాలో వ్యవసాయ భూముల్లో తేమని కాపాడుకోడానికి ప్లాస్టిక్ షీట్లను కప్పడంవల్ల ప్రతి హెక్టారుకు 280 కిలోగ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయని మార్క్‌బ్రౌనీ అంటారు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ గురించి అధ్యయనం చేస్తున్న పర్యావరణవేత్త.
అనేకరకాలుగా వ్యవసాయ భూములలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటివల్ల వ్యవసాయ క్షేత్రాల తేమశాతంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వెలువడే రసాయనాలు వ్యవసాయ భూముల లోపలి పొరల్ని విషపూరితం చేస్తున్నాయి. భూమిలో ఇంకా లోతుకి చొచ్చుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాయి. పంటలకు దోహదపడే వానపాములు వంటి కీటకాల అస్తిత్వాన్ని కూడా ఈ వ్యర్థాలు దెబ్బతీస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా మన ఆహారోత్పత్తి వ్యవస్థకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది.
ఆరుబయట ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ చెత్తని డంప్ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. ఈ చెత్తనుండి వెలువడే మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో తేలియాడుతూ అన్నివైపులా విస్తరిస్తాయి. ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పారిస్‌కి చెందిన రేచిడ్ డ్రిస్, మరికొందరు కలిసి ఒక అధ్యయనం చేశారు. 2014లో యూనివర్సిటీలోని భవనాల పైకప్పుపై గల గొట్టాలపై గాలి ద్వారా వచ్చిపడే మైక్రోఫైబర్ వ్యర్థాలు మూడునెలల కాలంలో ఎంతమేరకు పేరుకుంటున్నాయో పరిశీలించారు. ప్రతిరోజూ, ప్రతి చదరపు మీటరుకు 118 మైక్రోఫైబర్ వ్యర్థాల వరకు పేరుకుంటున్నాయని. గాలిలో ప్లాస్టిక్ కాలుష్యం అంతగా వ్యాపించిందని గుర్తించారు. చాలామంది పరిశోధకుల అధ్యయనంలో గమనించిందేమిటంటే మైక్రోఫైబర్ వ్యర్థాలు ఇంకా విచ్ఛిన్నమై నానోప్లాస్టిక్ వ్యర్థాలుగా గాలిలో వ్యాపిస్తున్నాయని. ఇవి మనం ఊపిరి పీల్చినప్పుడు మన శరీరాలలోకి ప్రవేశించి, మన రక్తకణాలలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నానో ప్లాస్టిక్ వ్యర్థాలను గుర్తించి వేరుచేయగలిగే సున్నితమైన పరికరాలను శాస్తవ్రేత్తలు ఇంకా రూపొందించలేదు.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64790