సబ్ ఫీచర్

సిరి’స్వరము నీవె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణను వేణువు స్వరంలో వినిపించటం వాళ్లకే సాధ్యమైంది. తీగ రాగంలోని మధురిమలను మది భావనలోకి తీసుకురావడం వాళ్లకే చెల్లింది. బాణీలకే సరికొత్త బాణీకట్టడం -ఆ అన్నదమ్ములకు అలవాటైంది. వాళ్లే రాజన్ -నాగేంద్ర. ఎనె్నన్నో జన్మల బంధం నీదీ నాదీ -అంటూ అన్నదమ్ములిద్దరూ కలిసే సంగీత ప్రయాణం చేశారు. ఇప్పుడు తమ్ముడు నాగేంద్ర మనకందనంత సుదూర తీరాలకు వెళ్లినా.. ‘రాజన్-నాగేంద్ర’ ముద్రను తన హృదిలోనే చూపిస్తున్నారు రాజన్. సినీ సంగీతానికి ఒకనాటి పెద్దన్న రాజన్ -ఈ వారం వెనె్నల అతిథి. ఆయన సినీ సంగీత మహా ప్రయాణంలో నాలుగు ‘స్వరపుష్ప జ్ఞాపకాలు’ మనకోసం.

‘అందాల నా కురులతో వింజామరలు వీచనా..
ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు/ అందుకో చేయందుకో.. మరి ఆ వైపు చూడకు..
ఎనె్నన్నో జన్మల బంధం నీదీ నాదీ/ ఎన్నటికీ మాయనిమమత నాదీ నీదీ/ ఒక్క క్షణం నినువీడి నే నుండలేను..
సిరిమల్లె నీవె/ విరిజల్లు కావె/ వరదల్లె రావె/ వలపంటి నీవె..
మల్లెలు పూచే/ వెనె్నల కాచె.. ’’

ఇలాంటి సుస్వర గీతాపుష్పాలను పూయించిన సంగీత దర్శకులు -రాజన్ నాగేంద్ర. హిమాలయ పర్వతాల పైనుంచి మంచుకరిగి సుగంధ ద్రవ్యాలను తాకుతూ భూమిపైకి వచ్చిన నది ఎంత సుగంధమో.. ఎంత పరిమళమో అంతకన్నా ఎక్కువగా తమ పాటల్లో పరిమళాలను వెదజల్లిన సంగీత ద్వయం వాళ్లు. రాజన్-నాగేంద్ర అన్న పేరు సినిమా టైటిల్స్‌లో సంగీతం అన్న పేరుకింద కనిపించిందీ అంటే.. అందులో వీనుల విందైన సంగీతంతోపాటు హృదయాన్ని పరవశింపజేసే పాటలుంటాయని వందశాతం గ్యారెంటీగా చెప్పొచ్చు. అంతగా సంగీత ప్రపంచంలో తమదైన ముద్రవేసిన ఆ ఇరువురి ప్రయాణం సామాన్యమైనదేం కాదు. అందరి మెప్పు పొందాలంటే దేవుడికైనా తరంకాదు అన్న మాటను వీరిద్దరూ అబద్ధమని తేల్చేశారు. పాట విన్న ప్రతి ఒక్కరూ నాదస్వరం విన్న ఫణిలా తలలూపాల్సిందే. అంత గొప్పగా లలితము, అద్భుతము, ఆనందము వాళ్ల బాణీల్లో ఒదిగిపోయాయి. ఎవ్వరు విన్నా ఎచటినుండి వీచెనో ఈ రాగ మలయమారుతం అని పాట ఎత్తుకోవాల్సిందే. ఎవరి చేతనైనా సరే తాళం వేయించగల బాణీలు వాళ్లవి. అందులో రాజన్-నాగేంద్ర జంట సంగీత దర్శకుల్లో నాగేంద్ర ఇంద్రలోకంలో తమ బాణీలు వినిపించడానికి వెళ్లిపోతే, ఇక్కడ సంపెంగ స్వరాలు అందించడానికి మనతోనే ఉన్నారు రాజన్.
**
1933లో అమ్మయ్యమ్మ, రాజప్ప దంపతులకు మైసూరు వద్ద శివరాంపేటలో జన్మించారీయన. మధ్యతరగతి కుటుంబమైనా -చిన్నప్పటి నుంచీ సంగీత ప్రపంచంలోనే పెరిగారు. తండ్రి నిశ్శబ్ద చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ సంగీతం సమకూర్చేవారు. అప్పటినుంచే సంగీత వాద్య పరికరాలపై పట్టు కుదిరింది రాజన్‌కు. తండ్రి వాయించే హార్మోనియం, పిల్లనగ్రోవి రాగమే ఆయన హృదయంలో నిండిపోయాయి. వాటితోపాటుగా వయొలిన్‌ను చిన్నప్పుడే వంటబట్టించుకున్నారు రాజన్. తమ్ముడు నాగేంద్ర జల తరంగిణిలో నాదాలను ఆవిష్కరించేవారు. ‘మైసూరులోని చౌడయ్య రామమందిరంలో భజనలకు పాటలు పాడుతూ సంగీతం అందించడమే చిన్ననాటి అద్భుతమైన ఘటన’ అంటారాయన. అలాగే మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో మనసుకి ఆనందాన్నిచ్చే సంగీతాన్ని వినిపించేవారట. వయొలిన్‌లో స్టేట్‌లెవెల్ కాంపిటీషన్‌లో చిన్నతనంలోనే డిస్టింక్షన్ ర్యాంక్ సాధించారు రాజన్. అప్పటినుండి అనేక ఆర్కెస్ట్రాలలో ఒకవైపు పాటలు పాడుతూ సంగీతాన్ని అందించేవారు. ముఖ్యంగా జయమారుతి ఆర్కెస్ట్రాలో సంగీత ప్రియులకు రాజన్ చిరపరిచితులే. చిన్నతనంలోనే సంగీతంపై పట్టు ఏర్పడటంతో ‘శ్రీనివాస కల్యాణ’ చిత్రంలో హిందూస్తానీ గాయకులు అమీర్‌భాయ్‌తో కలిసి సినిమాకోసం పాట పాడారు. నిర్మాత హెచ్‌ఆర్ పద్మనాభ శాస్ర్తీ, రేడియోలో మ్యూజిక్ ఆర్టిస్టు పి కళింగరావు -ఈ అన్నదమ్ములిద్దరినీ సంగీత స్రష్టలుగా తీర్చిదిద్దారు. దాదాపు 1950నుంచి 90ల వరకూ వారి హవా అటు కన్నడ, ఇటు తెలుగులో సాగింది.
చిన్నప్పటి నుంచే వయొలిన్ వాయిస్తూ ట్యూన్‌లు కట్టడం కూడా అలవాటు చేసుకున్నారు రాజన్. ‘మా తమ్ముడు మైసూరు ఆర్కెస్ట్రాలో పాడేవాడు. అది చూసి దర్శక నిర్మాత బి విఠలాచార్య అవకాశమిచ్చారు. అలా తొలిసారిగా కన్నడ చిత్రం ‘సౌభాగ్యలక్ష్మి’కి సంగీతం అందించాం. ఆయనే తెలుగులోనూ తొలి అవకాశమిచ్చారు. నవగ్రహ పూజామహిమ చిత్రానికి మమ్మల్ని ఎంచుకున్నారు’ అంటూ గుర్తు చేసుకున్నారు రాజన్. ‘నవగ్రహ పూజామహిమ రికార్డింగ్ జరుగుతోంది. జీవనమే పావనం.. అన్న పాటను లీల, ఘంటసాల ఆలపించాలి. ఘంటసాల రికార్డింగ్ థియేటర్‌కు వచ్చారు. రావటంతోనే సంగీత దర్శకులు ఎవరంటూ విఠలాచార్యను అడిగారు. ఆయన మా ఇద్దర్నీ చూపించారు. ఈ కుర్రాళ్ళా? అంటూ ఆశ్చర్యపోయి.. పాట పాడేదిలేదంటూ బయటకు వెళ్లిపోయారాయన. ఇంత చిన్న కుర్రాళ్లేం బాణీ కడతారులే అన్నది ఆయన ఉద్దేవం కావొచ్చు. కానీ విఠలాచార్య ఆయన్ను వదల్లేదు. ఒక్కసారి వినండి. నచ్చితే పాడండి లేకపోతే లేదు అని రికార్డింగ్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాణీ విన్న వెంటనే ఘంటసాల పాడటానికి సుముఖత వ్యక్తం చేశారు’ అంటూ రాజన్ చిన్నగా నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకవైపు కన్నడ చిత్రాలతో, మరోవైపు తెలుగు చిత్రాలతో దాదాపు 400 చిత్రాల్లో 2వేల పైచిలుకు పాటలకు బాణీలు అందించి ప్రతీ పాటా ఆణిముత్యంగా తీర్చిదిద్దారు రాజన్-నాగేంద్ర. ‘మేము తెలుగువాళ్లమే. నాలుగు తరాల క్రితమే మా పూర్వీకులు మైసూరు వలస వచ్చి సెటిలయ్యారు. తెలుగు భాష ఎంత బాగుంటుంది అన్న మాట నా మదిలో ఎప్పుడూ మెదలాడేది. ఇంత తియ్యని భాషకు అంత తియ్యగా బాణీలు అందించాలి అనుకునేవాడిని. మీరుడుగుతున్నట్టు నా పాటల్లో ప్రత్యేకంగా ఏ రాగమూ ఉండదు. కేవలం సస్వర సరిగమలతోనే కర్ణాటిక్, హిందూస్తాన్ మేళవింపుతో బాణీ కట్టేవాళ్లం. ఎక్కడికెళ్లినా ఆ ఏడు స్వరాలే ఉంటాయి. అన్ని రకాల పాటలకు కంపోజ్ చేయాలని చాలా కోరికగా, కసిగా పని చేసేవాడిని. ప్రేక్షకులకు ఏదినచ్చితే అదే బెస్ట్ అన్నది నా అభిప్రాయం’ అంటారు రాజన్. రాజన్-నాగేంద్ర సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహణ్యం ఎన్నో పాటలు పాడారు. ఆయనకు నచ్చిన అన్ని ట్యూన్‌లనూ తెలుగులోకి తీసుకువచ్చి పాటలుగా తీర్చిదిద్దారు. గాయకులతో పాటలు పాడించడం కూడా ఓ వైవిధ్యమైన ప్రక్రియే. గాయకుల యొక్క స్థాయిలను తెలుసుకొని వారు ఏ రసంలో పాడగలరో అర్థం చేసుకొని అలాంటి పాటలను వారిచేత పాడించాలి. మన పాటకు తగినట్టుగా మెలోడీగా, ఫోక్ స్టైల్‌లో భావాలను కంఠంలో పలికించాలి. అలాంటి గాయకులను మాత్రమే తన పాటలకు అనుగుణంగా ఎంపిక చేసుకునేవారాయన. ‘బాలు ఎప్పుడూ మంచి పాటలు పాడాలని తపిస్తారు. అలాగే ఎస్ జానకి, పి సుశీల, వాణీజయరాం లాంటి గాయకులు నా బాణీలకు తమ గొంతుతో అద్భుతమైన గుర్తింపు తెచ్చారు. అగ్గిపిడుగు చిత్రానికి ఎన్టీఆర్, కృష్ణకుమారిలపై ‘ఏమో ఏమో ఇది/ నాకేమో ఏమో ఐనది’ అన్న పాట కంపోజ్ చేయాలి. నేను సినిమా కథ ముందు తెలుసుకుంటాను. ఆ తరువాత పాటల సీక్వెన్స్ గురించి దర్శక నిర్మాతలతో చర్చించాను. అక్కడ ఎన్టీఆర్ ఏదో మాట చెప్పినట్టు ఉండాలి. అలాగే పాట పాడినట్టూ ఉండాలి. అదే సిట్యుయేషన్ అని నాకు చెప్పారు. దానికి తగ్గట్టుగా ఆ పాటకు బాణీని కట్టాము. ఇప్పటికీ ఎక్కడకెళ్లినా మాకు ఆ పాటనే వినిపిస్తారు. అదీ మా గుర్తింపు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు రాజన్. ఎన్నో రికార్డింగ్స్, మరెన్నో అనుభవాలు. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి పదిన్నర, పదకొండు వరకూ రికార్డింగ్స్ సాగేవి. అనుకున్న విధంగా వచ్చేదాకా రాజన్ ఓ పట్టాన ఓకె చేసేవారు కాదు. అలా దాదాపు ఒక్క పాటకి 20, 25 టేక్స్ తీసుకునేవారు. అందులో బెస్ట్‌గా వున్నదాన్ని మాత్రమే నిర్మాతకిచ్చేవారు. అలా రోజుకు రెండు పాటలు మాత్రమే రికార్డింగ్ చేసేవారు. ఏ పాట అయినా ఆయనకు నచ్చితేనే శ్రోతల దగ్గరికి వచ్చేది. తమిళ, మలయాళ భాషల్లో రెండేసి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి మెప్పించారు. తెలుగులో పంతులమ్మ చిత్రానికి 1979లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడి కేటగిరిలో అందుకున్నారు. కన్నడలో దాదాపు మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు తీసుకున్నారు. ఇప్పటి చిత్రాలలో డాన్సులు, ఫైట్‌లలో ఎలా మార్పులు వచ్చాయో సంగీతంలోనూ వచ్చాయి. ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. అయితే మంచి పాటలు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. కొత్త సింగర్స్ ఎలా పాడుతున్నారో ఈమధ్యకాలంలో నేను వినలేదు. భార్య రమాదేవి కాలం చేసి ఏడాది అయింది. కొడుకు అనంతకుమార్. ఆయనకు ఇద్దరు కొడుకులు. కూతురు రాజశ్రీ. పెళ్లిచేశాం. ఆమె బెంగుళూరులో సెటిలైంది. ప్రస్తుతం నేను మా అబ్బాయి దగ్గరే ఉంటున్నాను. నా గురించి అన్నీ అతనే చూసుకుంటాడు. యోగా, ఎక్స్‌ర్‌సైజ్ చేస్తాను. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తా. ఇక మర్చిపోలేని అనుభవం అంటారా.. ఇన్ని పాటల బాణీలే నా ఆస్థి అనుకుంటాను అంటూ గుర్తు చేసుకున్నారు.
‘మాకు పాటల రచయిత వేటూరి అంటే చాలా ఇష్టం. ఆయన్ను ఓ మంచి పాట ఇవ్వండి అని అంటే, ఆయన ఓ మంచి బాణీ ఇవ్వండి అని బదులిచ్చేవారు. ఆవిధంగా మేము ఇచ్చిన బాణీలకు అద్భుతమైన సాహిత్యాన్ని జత చేసి ఇచ్చేవారాయన. అలా మేము చేసిన పాటలన్నీ సూపర్‌హిట్లు అయ్యాయి’ అంటూ ముగించారాయన.

-సరయు శేఖర్, 9676247000