సబ్ ఫీచర్

ప్రభుత్వ బడుల మూసివేత వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం క్రమంగా అదృశ్యమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 97 శాతం పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో ఉండగా, మిగిలిన స్కూళ్లు సైతం అదే బాటలోకి వెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సమాజం ఆంగ్ల మాధ్యమం మోజులోపడి తెలుగుకు తిలోదకాలు ఇవ్వడమే. ప్రభుత్వ విద్యకంటే ప్రైవేటు విద్య మెరుగ్గా ఉంటుందన్న సంకుచిత దృష్టి నుంచి తల్లిదండ్రులు బయటపడేలా ప్రభుత్వాలు చొరవ చూపాలి. 2018-19 జిల్లా పాఠశాల విద్య సమాచారం మేరకు భవిష్యత్తులో తెలుగు మాధ్యమం బోధించే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు ఉండకపోవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ బడులు 30,048, ప్రైవేటు స్కూళ్లు 10,549 ఉండగా, ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల సంఖ్య 30,27,459 (96.94%) తెలుగు మాధ్యమంలో 63,315 (2.06%) ఇతర మాధ్యమాల్లో 1 శాతం విద్యార్థులున్నారు.
తల్లిదండ్రులు వాస్తవాలను తెలుసుకోనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో చదివినా విద్యార్థులకు అంతగా ప్రయోజనం ఉండడం లేదని గ్రహించింది. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని భావించి, జాతీయ నూతన విద్యావిధానంపై రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్రం అడిగినప్పుడు, ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలనే అభిప్రాయాన్ని తెలంగాణ సర్కారు తెలిపింది. ఇటీవల జరిగిన కేంద్ర విద్యా సలహామండలి (కేబ్) సమావేశంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి పాల్గొని, ప్రైవేటు పాఠశాలల్లోనూ మాతృభాషను తప్పనిసరి చేయాలని సూచించారు. దక్షిణాదిలోనే ఆంగ్ల మాధ్యమానికి ఆకర్షితులౌతున్నారని, రాజస్థాన్‌లో 96% మంది మాతృభాషలోనే చదువుతున్నారని ఆయన వివరించారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని, ఈ విధానం ప్రైవేటు పాఠశాలల్లోనూ కొనసాగేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ ఉద్యమ కాలంలో కేజీ టూ పీజీ ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తామని తెరాస అధినేత హామీలు పలికినా, నేటికీ ఆ జాడ లేదు. పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యనందించాలనే కేంద్ర నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు పలికినప్పటికీ, ప్రైవేటు స్కూళ్లపై నియంత్రణ శూన్యం. తెరాస పాలకులు సర్కారీ బడులను, బడిబయటి పిల్లలను అంతగా పట్టించుకోవడం లేదు. విద్యాశాఖకు నిధులు పెంచేలా దృష్టిపెట్టడం లేదు. బడిబయటి పిల్లలను స్కూళ్లలో చేర్పించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 19వ స్థానంలో ఉన్నట్లు ‘నీతీ ఆయోగ్’ చెబుతోంది. ‘నీతీ ఆయోగ్’ క్వాలిటీ ఇండెక్స్‌లో 18వ స్థానంలో తెలంగాణ ఉండగా, కేరళ 82.2 శాతం స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో నిర్వహిస్తున్న ‘బడిబాట’ కార్యక్రమం ఓ తంతులా సాగుతోంది. స్కూళ్లకు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. మరోవైపు ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగింది. ప్రధానోపాధ్యాయులు లేని పాఠశాలల సంఖ్య ఎక్కువే. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో రాష్ట్ర విద్యాశాఖ చివరి స్థానంలో ఉంది. కేవలం 5.2 శాతం బడుల్లో కంప్యూటర్ ఆధారిత బోధన జరుగుతోంది. మరమ్మతులకు నిధులు లేనందున పాడైన కంప్యూటర్లు మూలకు చేరుతున్నాయి. 43.6 శాతం ఉన్నత పాఠశాలల్లో మాత్రమే సైన్స్, మాథ్స్, సోషల్ టీచర్లు ఉన్నారు. బీఈడీ కాలేజీల్లో అధ్యాపక ఖాళీల విషయంలో తెలంగాణ 19వ స్థానంలో ఉంది. విద్యారంగంపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ బడులకు విద్యార్థులను తల్లిదండ్రులు ఎలా పంపిస్తారు? ప్రభుత్వ పాఠశాలలకు దూరవౌతున్న విద్యార్థులను ఆకట్టుకోవాలంటే ప్రభుత్వ విద్యను రక్షించుకోవాలి.
గతంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషపై మమకారాన్ని చాటిన ముఖ్యమంత్రి కేసీఆర్ భాషా పండితుల, వ్యాయామ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆ నిర్ణయం నేటికీ అమలుకాలేదు. మాతృభాషలో బోధన జరపడమంటే పరభాషను నేర్చుకోవద్దని కాదు. ప్రాథమిక విద్యాబోధనను మాతృభాషలో తప్పనిసరి చేసి, ఉన్నత విద్యలో తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచినప్పుడే మేలు జరుగుతుంది. ఆ తర్వాత ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. రాజ్యాంగంలో పేర్కొన్నట్టు మాతృభాషలను రక్షించుకుంటూ అన్యభాషలూ నేర్చుకుందాం. న్యాయస్థానాల్లో తీర్పులు, వాదనలు మాతృభాషలోనే జరగాలని ఇటీవల రాష్టప్రతి చెప్పడం అభినందనీయం. అభివృద్ధి చెందిన జపాన్, చైనా వంటి దేశాల్లో మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. బడుగు వర్గాల ఆస్తి- సర్కారు బడి. ఏదో ఒక సాకుతో ప్రభుత్వ బడుల మూసివేతను ఆపాలి. విద్యావ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వాధీనంలో విద్యను ఉచితంగా అందించాలి. ప్రజలు ప్రభుత్వ బడుల సంరక్షణకు ఉద్యమబాట పట్టాలి. పిల్లలు రావడం లేదని బడులను మూసివేయరాదు. ఎలకలు చొరబడ్డాయని ఇంటిని తగలబెట్టుకుంటామా? సమస్య పరిష్కారానికి తగిన అధ్యయనం చేయాలి. కేజీ టూ పీజీ విద్యను కార్పొరేట్ రంగానికి అప్పగిస్తే ధనార్జనే ధ్యేయంగా చూస్తారు తప్ప మానవీయత జాడే ఉండదు. ప్రభుత్వ వైఖరి మారకుంటే- ప్రజలకు ఉద్యమాలే శరణ్యం.

-మేకిరి దామోదర్ 95736 66650