సబ్ ఫీచర్

శతాబ్దపు కళామతల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరంశెట్టి కృష్ణవేణి.
ఎక్కడో పంగిడి పల్లెలో పుట్టిన ఆడబిడ్డ.
పుట్టినపుడే -ముఖంలోని ‘కళ’ను చూసి కళారంగమే తబ్బిబ్బయ్యింది. ఆ కళే తన తల్లిగా -ఆడబిడ్డ కూడా అడుగులేస్తూ.. కళా విభాగాలను ఔపోసన పడుతూ.. లేస్తూ.. పరిశ్రమకు చేరుకుంది. ఒడికి చేర్చుకున్న చిత్ర పరిశ్రమ ఆ బిడ్డకు తల్లయితే.. ఒడికి చేరిన ఆ బిడ్డే తరువాతి తరలాకు తల్లయ్యింది. అందుకే -పరిశ్రమలో ఎవరూ కృష్ణవేణి అని చెప్పరు. కృష్ణవేణమ్మ అనే సంబోధిస్తారు.
తొంభైఐదేళ్ల జీవన ప్రయాణాన్ని సులువుగా సాగించిన కృష్ణవేణమ్మ -ఈ ఏడాది ముగింపులో కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతోంది. 96వ పడిలో పడుతున్న కృష్ణవేణమ్మే -తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరం ఆస్తి. ఆ మేలిమి బంగారాన్ని కదిపితే -రాలే ముచ్చట్లన్నీ రత్నాలే. ఆ రత్నాలే ఈ వారం వెనె్నలకు ముచ్చట్లు.
కృష్ణవేణమ్మను పరిచయం చేసుకోవడం కంటే -ఆమె ఇండస్ట్రీకి పరిచయం చేసినవాళ్లను గుర్తు చేసుకోవడమే.. ఉత్తమమైన పరిచయమంటాడో పెద్దాయన. ఆమె గురించి క్లుప్తంగా చెప్పాలంటే -నాటకరంగానికి బాలనటి.
సౌత్ సినిమాల్లో వెలుగు వెలిగిన అద్భుత నటి. పాటలు, పద్యాలు తానే పాడుకోగల మేటి. శోభనాచల స్టూడియో అధినేత్రి. ఎన్నో చిత్రాలు తీసిన నిర్మాత. ఇలా చెప్పుకునేకంటే -తెలుగు పరిశ్రమకు గాయని లీల, గాయకుడు ఘంటసాల, నటసార్వభౌమ యన్టీ రామారావు, అరుదైన నటుడు ఎస్వీ రంగారావు, సంగీత దర్శకుడు ఆది నారాయణరావు, స్వరకర్త రమేష్‌నాయుడు, ఒకనాటి గ్లామర్ హీరో విజయకుమార్, తొలితరం హీరో సిహెచ్ నారాయణరావులాంటి మహామహులను వెండితెరకు పరిచయం చేసిన క్రాంతదర్శి.
**
ఆడది నడిబజారులో తైతక్కలాడుతోంది -అన్న అపవాదు వినిపించే ఆ రోజుల్లో కళారంగం వైపు ధైర్యంగా అడుగులేశారు కృష్ణవేణి. నాటకాలు, సినిమాలే జీవితాశయంగా వచ్చి -పరిశ్రమలో స్థిరపడి నిర్మాతగా అద్భుతమైన చిత్రాలనూ తెరకెక్కించిన సాహసి ఆమె. భారతదేశంలో చిత్ర పరిశ్రమ అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న సమయంలో -దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఏ భాషలోనూ స్వాతంత్య్రాన్ని ఆహ్వానిస్తూ ఆ వెలుగులను తెరకెక్కించిన దాఖలాలు లేవు. ఒక్క తెలుగు పరిశ్రమలోనే ‘మనదేశం’ అనే రాజకీయ చిత్రం వచ్చింది. స్వాతంత్య్ర వెలుగులు పంచింది. ఆ సినిమాతో అందరిచేతా ఔరా! అనిపించుకున్న సాహస వనిత -కృష్ణవేణి.
నటన, నేపథ్యగానం ఒక ఎత్తయితే, స్టూడియోను నెలకొల్పి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తూ, సాంస్కృతిక విలువలను కాపాడుతూ -తెరపై అద్భుతాలు చూపించారామె. చేసింది కొన్ని చిత్రాలే అయినా చరిత్రలో నిలబడిపోయిన సినిమాలవి. మనదేశం, గొల్లభామ, లక్ష్మమ్మ, పల్లెటూరి పిల్ల, ధర్మాంగద, పేరంట్రాళ్ళు, తుకారం, కచదేవయాని లాంటి చిత్రాల్లో నటించి మూడు దశాబ్దాల స్టార్ హీరోయిన్‌గా మన్ననలు అందుకున్న తొలితరం హీరోయిన్ కృష్ణవేణి. ఆకాలంలోనే అత్యధిక పారితోషికం (45వేలు.. ఇప్పుటి విలువ 45 కోట్లు అనుకోవచ్చు) అందుకున్న ఏకైక తారామణి ఆమె.
ఇప్పటితరానికి ఆమె ఎవరో తెలీకపోవచ్చు. ముందుతరాల్లో సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె అభిమానతారే. సుమారు 70 ఏళ్ల క్రితం ప్రజాభిమానాన్ని చూరగొన్న కృష్ణవేణి -95ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 96వ పడిలో పడుతున్న కృష్ణవేణి -వెనె్నలకు కొన్ని ముచ్చట్లు చెప్పటమే కాదు, తెలుగు తెరకు తెలీని కొన్ని రహస్య విషయాలనూ పంచుకున్నారు.
**
పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోని పంగిడిలో 1924 డిసెంబర్ 24న సిరంశెట్టి కృష్ణారావు, నాగరాజా దంపతులకు పుట్టిన సంతానం కృష్ణవేణి. బాల్యంలో సంగీతం అభ్యసించకున్నా -శ్రుతజ్ఞానంతో పాటలు, పద్యాలు అలవోకగా పాడేవారు. స్కూల్లో పాఠాలు చదువుతూనే ధ్రువుడు, ప్రహ్లాదుడు, లోహితాశ్యుడు లాంటి వేషాలతో రంగస్థలంపై మెరుపులు మెరిపించారు. ఊరి చుట్టుప్రక్కల ఎక్కడ ఏ నాటకం వేసినా అందులో కృష్ణవేణి ఉండాల్సిందే. అంతగా ఆమె పద్యాలు, పాటలు ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశాయి. నటనమీద ఆసక్తి పెరగడంతో -చదువుపై దృష్టితగ్గింది.
1936లో విడుదలైన ధ్రువ- సతీ అనసూయ చిత్రాన్ని దర్శకుడు సి పుల్లయ్య తెరకెక్కిస్తున్న రోజులవి. కేవలం పిల్లలతోనే సినిమా రూపొందిస్తున్నారు. అందుకోసం దాదాపు 60మంది పిల్లలకు శిక్షణనిచ్చి షూటింగ్ నిమిత్తం కలకత్తా తీసుకెళ్లారు. అందులో అందరినీ ఆకట్టుకునే వాచకం, అభినయం, అందం కలగలుపుగావున్న కృష్ణవేణినే అనసూయ పాత్ర వరించింది. కలకత్తాలో షూటింగ్. అక్కడ పిల్లలందరికీ చేదోడువాదోడుగా వున్న హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య సైదోడు. 60మంది పిల్లలకు షూటింగ్ రోజుల్లో చదువు సంధ్యలు అటకెక్కుతాయన్న భయంతో అక్కడే వారికి స్కూలు, ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి చదువులు నేర్పిస్తూ షూటింగ్‌లు చేస్తున్నారు. మధ్యమధ్యలో రేలంగి పిల్లలందరితో కలిసిపోయి వారిని నవ్విస్తూ, అప్పుడప్పుడు సినిమాలకు, జూలకు, మ్యూజియానికి తీసుకెళ్లేవారు. షూటింగ్ పూర్తయ్యాక మళ్లీ రాజమండ్రి వచ్చేశారు. అదే సమయంలో తండ్రి కాలంచేయగా, అమ్మమ్మ, బాబాయిల సంరక్షణలోనే కృష్ణవేణి బాల్యం గడిచింది. నటుడు సిఎస్‌ఆర్ ‘తుకారం’ (1937) చిత్రాన్ని రూపొందిస్తూ, అందులో హీరోయిన్ చెల్లెలిగా నటించడానికి కృష్ణవేణిని మద్రాస్ తీసుకెళ్లారు. ఆ సినిమా అనసూయ చిత్రం అందుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. అయినాకానీ కృష్ణవేణికి పాత్రతో మంచి గుర్తింపువచ్చింది. ఆ గుర్తింపుతోనే 1938లో ఎస్‌పి లక్ష్మణస్వామి కథానాయకుడిగా రూపొందించిన ‘కచ దేవయాని’ చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారు కృష్ణవేణి. ఆ చిత్రం ఆమెకు అద్భుతమైన స్టార్‌డమ్ తెచ్చింది. మళ్లీ రాజమండ్రికి వెళదామనుకునేలోపే మీర్జాపురం మహారాజా మేకా వెంకటరామయ్య అప్పారావు ‘మహానంద’ చిత్రాన్ని రూపొందించడానికి సంకల్పించారు. ఆ చిత్రంలో కథానాయిక కృష్ణవేణి.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మీర్జాపురం రాజావారు సి కృష్ణవేణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కృష్ణవేణి రెండో భార్య. ఆయన మొదటి భార్య పేరు రాణి లక్ష్మీ వెంకాయమ్మ రావుబహద్దూర్ (శ్రీ భూదేవమ్మ). ఆమె శంకు చక్రాలు భుజాలపై ముద్రించుకొని ‘సమాశ్రయణము’ పొందారు. ఓరకంగా ఇహలోక వాంఛలు వదిలేసి సన్యసించారు. అందువల్లనే రాజావారు కృష్ణవేణిని వివాహమాడాల్సి వచ్చిందట. వివాహం తరువాత రాణీ కృష్ణవేణమ్మగా, చలనచిత్ర నిర్మాతగా పరిశ్రమకు తన ప్రతిభను చాటుకున్నారు. తాము నెలకొల్పిన శోభనాచల స్టూడియో పేరున రూపొందించే చిత్రాల్లో నటించాలంటూ అప్పట్లోనే రాజావారు ఆంక్ష పెట్టడంతో, సొంత చిత్రాలకే పరిమితమయ్యారు కృష్ణవేణి. దాంతో ఇన్నాళ్లూ వచ్చిన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి వైవిధ్యమైన కథలతో రూపొందించే చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. మీర్జాపురం రాజావారు రూపొందించిన ‘్భజ కాళిదాసు’ (1940) చిత్రంలో అప్పటి హెమాహేమీలైన నటులు కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తిలాంటి వారితో సరిసమానంగా నటించి మెప్పించారు. అదే సమయంలో ఈస్టిండియా కంపెనీ రూపొందించనున్న వరవిక్రయం చిత్రంలో అవకాశమొచ్చింది. కానీ వివాహం తరువాత ఏర్పడిన సమస్యవల్ల ఆ కాంట్రాక్టు వదులుకోవాల్సి వచ్చింది. వరవిక్రయంలో ఒక నటి భానుమతి అయితే, మరోనటి కృష్ణవేణి కావాల్సి ఉంది. అయితే ఆ పాత్రలో తరువాత హిందీ నటి రేఖ తల్లి పుష్పవల్లి నటించారు.
జీవనజ్యోతి చిత్రంలో సిహెచ్ నారాయణరావు తొలిసారిగా కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం సొంత చిత్రం కావడంతో కథానాయికగా కృష్ణవేణి నటించారు. ఈ చిత్రం 1940లో విడుదలైంది. అప్పట్లోనే సాంఘిక చిత్రంగా మన్ననలు పొందింది. జానపద పౌరాణిక చిత్రాలు రాజ్యమేలుతున్న కాలంలో ఓ సాంఘిక చిత్రాన్ని రూపొందించడానికి గట్స్ కావాలి. అటువంటి ధైర్యాన్ని ఆకాలంలోనే చేశారు. కృష్ణవేణితోపాటుగా కమలా కోట్నిస్ కథానాయికగా నటించారు.
కృష్ణవేణి, కమలాకోట్నిస్ కథానాయికలు. ఇద్దరూ కాలేజీ స్టూడెంట్స్. ఇద్దరికీ వివాహమవుతుంది. కానీ కృష్ణవేణి భర్తను కోట్నిస్ ప్రేమిస్తుంది. ఆ మూడు పాత్రల మధ్య వచ్చే ఘర్షణ సారాంశమే చిత్ర కథ. తాళికట్టిన భార్యే తన జీవనజ్యోతి అని తెలుసుకుంటాడు నాయకుడు.
1941లో దక్షయజ్ఞం రూపొందించారు. అందులో సతీదేవిగా నటించారు. ఎన్టీఆర్ 1962లో నటించిన దక్షయజ్ఞం కథే ఇది కూడా. భీష్మ (1944) రూపొందించి అందులో అంబగా నటించారు. అందులో జంధ్యాల గౌరీనాథశాస్ర్తీ భీష్ముడిగా నటించారు. ఇది కూడా ఎన్టీఆర్ నటించిన భీష్మ కథనంతోనే ఉంటుంది. 1947లో రఘుపతి వెంకయ్యనాయుడు తనయుడు ఆర్‌ఎస్ ప్రకాశ్ దర్శకత్వంలో గొల్లభామ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంతో మోహినిగా తెలుగువారి ఆరాధ్య సీతమ్మగా పేరెన్నికగన్న అంజలీదేవిని పరిచయం చేశారు. ఇదే చిత్రాన్ని 1967లో పి పుల్లయ్య ఎన్టీఆర్, దేవిక, ఎల్ విజయలక్ష్మి, విజయనిర్మల, రేలంగి, నాగరాజులతో భామావిజయంగా రూపొందించి హిట్ అందుకున్నారు. గొల్లభామ చిత్రానికి కెమెరామెన్ కోట్నిస్. దర్శకుడికి, కెమెరామెన్‌కి పొరపొచ్ఛాలు రావడంతో నెగెటివ్‌ను లాబ్‌వారి లాలూచీతో ప్రింట్ సరిగా రాకుండా కడిగించారట. దీంతో రాజావారు కెమెరామెన్ కోట్నిస్‌ను ప్రాజెక్టునుండి తప్పించే ప్రయత్నం చేశారు. కానీ కోట్నిస్ ఛాలెంజ్ చేశారు. అది తన తప్పిదం కాదని, కావాలంటే మరోసారి షూటింగ్ చేసి లాబ్‌లో పరీక్షించమని సవాల్ విసిరారు. అందుకు ఒప్పుకున్న రాజావారు మళ్లీ షూట్ చేసి లాబ్‌లో పరీక్షిస్తే రషెస్ అద్భుతంగా వచ్చాయి. ఇదంతా దర్శకుడి నిర్వాకమని తరువాత అర్థమైంది. వెంటనే దర్శకుడిని మార్చేసి సి పుల్లయ్యకు ఆ బాధ్యతను అప్పగించారని కృష్ణవేణమ్మ గుర్తు చేసుకున్నారు. పుల్లయ్య అదే చిత్రాన్ని మళ్లీ మొదటినుంచీ రూపొందించి అద్భుత విజయాన్ని సాధించారు. ఆ చిత్రంలో కృష్ణవేణి ఆలపించిన పద్యాలు, పాటలు ఆ రోజుల్లో మారుమ్రోగాయి. ఆ గొల్లభామ చిత్రానికి కథానాయకుడు ఈలపాటి రఘురామయ్య.
మహానంద చిత్ర కథ:
ఈశ్వరుని భార్య పార్వతీ దేవి శాపవశాన వేశ్య ఇంట్లో జన్మిస్తుంది. శివుడితో గంగ, పార్వతి పాచికలాడే సమయంలో గంగ- గౌరీ సంవాదం భరించలేని శివుడు వారిద్దరినీ శపిస్తాడు. భూలోకంలో వేశ్య ఇంట ఇద్దరూ పుట్టి ఈతిబాధలు అనుభవించి మళ్లీ కైలాసానికి రమ్మంటాడు. తాను ఓ రుషిలా జన్మించి వారిద్దరినీ చేపట్టి శాపాన్ని తొలగిస్తానని చెబుతాడు. మానవకన్యగా పుట్టింది గౌరిదేవి అని తెలీక ఇంద్రుడు మోహించటం, శివుడు అతన్ని శపించటం, చివరికి కథ సుఖాంతమవుతుంది. ఈ కథనంతో రూపొందించిన మహానంద చిత్రం అప్పట్లో అద్భుత విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ సినిమా చూడ్డానికి అందుబాటులో లేదు. కనీసం ఈ సినిమా కథా కథనాలు కూడా చాలామందికి తెలీదు. కృష్ణవేణమ్మే ఈ కథను వివరించారు.
1947లో బ్రహ్మరథం, 1948లో మదాలస చిత్రంలో కథానాయికగా కృష్ణవేణి నటించారు. దేవలోకంలో వుండే నృత్యకళాకారిణి మదాలస. ఆమె నేపథ్యంలో సాగే కథనమే చిత్రం. ఇక 1949లో విడుదలైన మనదేశం చిత్రంలో కథానాయికగా అద్భుతమైన నటన ప్రదర్శించి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ఈ చిత్రంలోనే నటరత్న ఎన్టీఆర్ తొలిసారిగా వెండితెరపై మెరిసారు. 1949లోనే నాగేశ్వరరావు కథానాయకుడిగా అంజలిదేవిని రాక్షసి పాత్రలో నటింపజేసి కీలుగుర్రం చిత్రాన్ని రూపొందించారు కృష్ణవేణి. అప్పట్లో ఈ చిత్రం ఓ అద్భుతమైన జానపద చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంతోనే ఏఎన్నార్ జానపద కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను రంజింపచేశారు.
*
(మిగతా వచ్చేవారం)
*
* చిత్రం..సిరంశెట్టి కృష్ణవేణి.

-ఖర్ 9676247000